Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సెప్టెంబర్ 23న రూపాయి విలువ డాలర్‌తో పోల్చుకున్నప్పుడు అతి తక్కువకు పడిపోయింది. కొన్ని వారాలపాటు డాలర్‌కు రూ.79 లేదా రూ.80 మధ్య మారకపు రేటు కొనసాగిన తర్వాత ఏకంగా రూ.81 దాటేసింది. రిజర్వుబ్యాంక్ దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలను మార్కెట్లోకి అదనంగా విడుదల చేసినప్పటికీ, రూపాయి విలువ పతనం ఆగలేదు. గత సంవత్సరం అక్టోబర్‌లో మన విదేశీమారకపు నిల్వలు గరిష్ట స్థాయికి పెరిగాయి. కాని, ఆతర్వాత దాదాపు 9000 కోట్ల డాలర్ల మేరకు విదేశీ నిల్వలు కరిగిపోయి, ఈ సెప్టెంబర్ 23 నాటికి 55,000 డాలర్ల నిల్వ మాత్రం మిగిలింది. విదేశీ మారకద్రవ్యాన్ని వివిధ కరెన్సీలలో దాచుకుంటారు. ఆ విధంగా కొంత యూరోల రూపంలో దాచినది ఉంది. యూరో విలువ కూడా డాలర్‌తో పోల్చినప్పుడు తగ్గింది. ఆ విధంగా కూడా మన విదేశీ కరెన్సీ నిల్వల విలువ డాలర్‌తో పోల్చినప్పుడు తగ్గింది. రూపాయి విలువ పడిపోకుండా నిలబెట్టడానికి మార్కెట్లోకి డాలర్లను ఎక్కువగా విడుదల చేసింది ఆర్బిఐ. అయినా కూడా రూపాయి విలువ పడిపోయింది.
రూపాయి విలువ పడిపోయింది గనుక మన దిగుమతులు మరింత ప్రియం అవుతాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షల వలన పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయి. దానికి తోడు రూపాయి విలువ పడిపోయినందువలన పెట్రో దిగుమతులకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. దాని వలన పెట్రోలు డీజిల్, వంటగ్యాస్ ధరలు మరింత పెరుగుతాయి. అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఈ ద్రవ్యోల్బణం విదేశీ మార్కెట్లో రూపాయి విలువ మరింత పడిపోడానికి దారితీస్తుంది. ఆ విధంగా ద్రవ్యోల్బణం-దాని నుండి రూపాయి విలువ పతనం-దాని వలన మళ్ళీ ద్రవ్యోల్బణం- రూపాయి విలువ మరింత పతనం-ఈ విధమైన వలయం సంభవిస్తుంది. ఈ వలయాన్ని బద్దలు చేయడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ కార్మికుల వేతనాలను తగ్గించడానికి పూనుకుంటుంది. అంటే ధరలు పెరిగిన మేరకు వేతనాలు పెరగకుండా చూస్తుంది. వీలైతే అసలు వేతనాలు ఏమాత్రమూ పెరగకుండా జాగ్రత్తపడుతుంది. మొత్తం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమనే ప్రహసనం అంతా చివరికి కార్మికుల వేతనాలను పెరగకుండా చూడటం అనే దానిపైనే కేంద్రీకరిస్తుంది. రూపాయి విలువ పడిపోవడం అనేది కార్మికుల మీద మరింత పెద్ద దాడిగా పరిణమిస్తుంది.
రూపాయి విలువ పతనం కారణంగా దిగుమతులకు చెల్లించవలసిన మొత్తం ఏ మేరకు పెరుగుతుందో, ఆ మేరకు ఇటు కార్మికుల వేతనాలను పెంచకుండా నిలిపివేయడం వలన ద్రవ్యోల్బణం పెరగకుండా నిలిచిపోతుంది కదా అని వాదించవచ్చు. ఒకవేళ ఆ విధంగా జరిగినప్పటికీ, రూపాయి విలువ పడిపోతున్న వైనం స్పెక్యులేటర్లలో మరింత పతనం జరిగే అవకాశం ఉందన్న అంచనాకు దారితీస్తుంది. ఆ అంచనాలకు అనుగుణంగా వారు పెట్టుబడులు పెడతారు. వారి అంచనాలు వాస్తవ రూపం ధరించడం కోసం ఏం చేయాలో అదంతా వారు చేసి రూపాయి విలువ మరింత పడిపోయేందుకు దోహదం చేస్తారు. మరోపక్క ఆర్బీఐ వద్ద నున్న విదేశీ నిల్వలు కరిగిపోతున్నాయన్న సమాచారం స్పెక్యులేటర్ల అంచనాలకు బలం చేకూరుస్తుంది. ఆ విధంగా రూపాయి విలువ పడిపోవడం దాని విలువ మరింత పడిపోతుందన్న అంచనాకు, ఆ అంచనా ఫలితంగా వాస్తవంగా రూపాయి విలువ మరింత పడిపోడానికి దారితీసే మరో వలయం మొదలవుతుంది. ఈ రెండు వలయాలూ అంతిమంగా కార్మికుల మీద తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి.
ఒకవేళ ఏదైనా తాత్కాలిక పరిణామం కారణంగా రూపాయి విలువ పడిపోతే, తిరిగి కొద్దికాలంలోనే మళ్ళీ కోలుకుని పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం రూపాయి విలువ పతనానికి కారణాలు వ్యవస్థీకృతమైనవి. దీర్ఘకాలిక స్వభావం కలిగినట్టివి. మొదటి కారణం: విదేశీ వ్యాపారంలో పెరుగుతున్న లోటు. రెండవది: దేశం నుండి బైటకు సంపద (డాలర్లలోకి, డాలర్‌తో పోల్చితే స్థిరంగా ఉండే ఆస్థుల రూపంలోకి) ప్రవహించడం.
విదేశీ చెల్లింపుల లోటు పెరిగిపోడానికి కారణం విదేశీ వ్యాపారంలో ఎగుమతులకన్నా దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడం. మన ఎగుమతులు పెరుగుతున్న వేగంతో పోల్చినప్పుడు దిగుమతులు ఇంకా వేగంగా పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం నుండి మన ఆర్థికవ్యవస్థ బాగా వేగంగా కోలుకోవడమే దీనికి కారణం అని మన ప్రభుత్వం సమర్థించుకుంటోంది. కాని ఇది పూర్తిగా నిరాధారం. కరోనా రాకమునుపు సాధారణ పరిస్థితి ఉన్న సంవత్సరం 2019-20తో పోల్చి 2022-23 (ఇది కూడా సాధారణ స్థితి ఉన్న సంవత్సరమే) మొదటి త్రైమాసికపు ఫలితాలను పోల్చి చూస్తే 2019-20లో వాణిజ్య లోటు 4శాతం ఉంటే అది ప్రస్తుతం 5.3కు ఎగబాకింది. ఈ కాలంలో జీడీపీ నామమాత్రంగా, అంటే 2.8శాతం మేరకు వృద్ధి నమోదు చేసింది. దీనిని బట్టి దిగుమతులు ఎగుమతులకన్నా ఎక్కువ వేగంగా పెరిగిపోవడానికి కారణం దేశ ఆర్థిక పరిస్థితి వేగంగా వృద్ధి చెందడం కాదని స్పష్టం అవుతోంది. మన ఎగుమతులకు అంతర్జాతీయంగా డిమాండ్ తగినంతగా వృద్ధి చెందకపోవడమే అసలు కారణం.
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగిపోయినందు వలన వాణిజ్యలోటు పెరిగిపోయిందని ఇంకో కారణం చూపిస్తున్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు ఎక్కువగా పెరిగినది ఏప్రిల్-జూన్ మాసాల మధ్య కాలంలో. ఆ కాలంలో వాణిజ్య లోటు 2260 కోట్ల డాలర్లు. ఆ తర్వాత జులై-ఆగస్టు కాలంలో పెట్రో ఉత్పత్తుల ధరలు పెద్దగా పెరగలేదు. కాని వాణిజ్యలోటు 2870 కోట్ల డాలర్లకు పెరిగిపోయింది. అందువలన మన వాణిజ్యలోటు పెరిగిపోడానికి కారణం మనం దిగుమతి చేసుకునే ఏదో ఒక సరుకు ధర పెరిగిపోవడం కాదు. దీని మూల కారణం మన ఆర్థిక విధానంలోనే ఉంది.
ఇక రెండో అంశం: మన దేశం నుండి ద్రవ్య పెట్టుబడి బైటకు పోవడం. చాలాకాలం దాకా అమెరికన్ ఫెడరల్ రిజర్వు బోర్డు (మన ఆర్బీఐ వంటిది) అక్కడ వడ్డీ రేట్లను దాదాపు సున్నా దగ్గర ఉంచింది. దానితోబాటు గవర్నమెంట్ బాండ్లను తిరిగి కొనసాగింది, తద్వారా మార్కెట్లోకి అదనపు డాలర్లను విడుదల చేసింది. 'హౌసింగ్ బబుల్ ' బద్దలైన ప్రభావం వలన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో పడింది. ఆ పరిస్థితి నుండి బైటకు తేవడానికి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ప్రేరణ కలిగించడానికి ఆ విధంగా చేసింది. కాని పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చిపడ్డ డాలర్లు ఎక్కువ వడ్డీ వచ్చే మూడో ప్రపంచ దేశాలకు తరలిపోయాయి. వాటిలో భారతదేశం కూడా ఒకటి. ఇలా అదనపు డాలర్లు రావడం వలన వాణిజ్యలోటును భర్తీ చేసుకోవడం మన దేశానికి తేలిక అయింది. మన దేశం నుండి బైటకు పోయిన ద్రవ్య పెట్టుబడి కన్నా మన దేశంలోకి వచ్చిన ద్రవ్య పెట్టుబడి ఎక్కువగా ఉండేది. అందువలన వాణిజ్య లోటును భరించడంతోబాటు తగినంత విదేశీ మారక నిల్వలను కూడా పోగేసుకోగలిగాం.
కాని ఇప్పుడు తమ దేశంలో వడ్డీ రేట్లను అమెరికన్ ఫెడరల్ రిజర్వు బోర్డు పెంచింది. తద్వారా అక్కడి ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి పూనుకుంది. ఎప్పుడైతే అమెరికాలో వడ్డీరేట్లు పెరిగాయో, ఆ వెంటనే మూడో ప్రపంచ దేశాలకు తరలిన డాలర్లు రివర్స్ డైరెక్షన్లో అమెరికాకు తిరిగి ప్రవహించడం ప్రారంభమైంది.
సరిగ్గా ఇదే సమయంలో మన వాణిజ్య లోటు మరింత పెరిగిపోతున్నది. ఆ లోటును భర్తీ చేయగల డాలర్ పెట్టుబడులు ఇదివరకటి మాదిరిగా ఇప్పుడు రాకపోగా తిరిగి వెనక్కి పోతున్నాయి. దానికి ద్రవ్యోల్బణం, రూపాయి మారకపు రేటు పడిపోవడం తోడయ్యాయి. మాంద్యంలో నుండి బైటకు రాలేని ఆర్థిక వ్యవస్థ, భారీగా పెరిగిన నిరుద్యోగం ఎటుతిరిగీ ఉండనేవున్నాయి. ఈ లక్షణాలు రాబోయే కాలంలో మరింత తీవ్రంగా ప్రకోపిస్తాయి.
పెట్టుబడిదారీ వ్యవస్థను ఏదోవిధంగా సమర్థించడానికి ప్రయత్నించే ఆర్థికవేత్తలు అసలు కారణాలను మరుగుపరచడానికి, ముఖ్యంగా వర్గదోపిడీ మరింత పెరుగుతుందన్న వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి నానారకాల సాకులనూ వెతుకుతారు.
సరుకుల ధరలను నియంత్రించకుండా మార్కెట్ శక్తులకే వదలిపెడితే, అంతిమంగా మార్కెట్లో అది ద్రవ్య ప్రవాహాన్ని సమతుల్య స్థితికి తెస్తుందని, రూపాయి మారకపు రేటు కూడా పడిపోకుండా స్థిరపడుతుందని వారంటారు. కాని ఆ విధంగా మార్కెట్‌కు వదిలివేయడానికి సంపన్న పెట్టుబడిదారీ దేశాలు సిద్ధంగా ఉండవు. ప్రపంచం మొత్తం మీద పెట్టుబడిదారులూ సిద్ధంగా ఉండరు. తమ సంపదలను స్థిరమైన కరెన్సీగా ఉండగల అవకాశం ఉన్న డాలర్ల రూపంలోనే వాళ్ళు దాచుకుంటారు. ఒకసారి వడ్డీ రేట్లు అమెరికాలో పెరిగాక ఆ డాలర్లు అమెరికా వైపే ప్రవహిస్తాయి. దానిని నివారించాలంటే అంతకన్నా ఎక్కువ ఆకర్షణీయంగా ఉండే విధంగా మన దేశమూ వడ్డీ రేట్లను చాలా ఎక్కువగా పెంచవలసి వస్తుంది. అదే గనుక జరిగితే, అప్పుడు మార్కెట్లో పెట్టుబడులు పెట్టేబదులు ఆ ధనాన్ని దాచుకోవడం పెరుగుతుంది. అభివృద్ధికి కావలసిన పెట్టుబడులు కరువై, వృద్ధి దెబ్బ తింటుంది.
అందుచేత మూడో ప్రపంచ దేశాల్లో వాణిజ్యం మీద, పెట్టుబడుల ప్రవాహం మీద ప్రభుత్వం నియంత్రణ కలిగివుండాలి. కాని నయా ఉదారవాదం ఏ విధమైన ప్రభుత్వ నియంత్రణనూ అంగీకరించదు. మనదేశ ఆర్థిక వ్యవస్థను మన ప్రభుత్వం నియంత్రించలేని అశక్తత దాపురించిందని, దానికి కారణం ఈ నయా ఉదారవాద విధానాలేనన్న ప్రాథమిక సత్యం ఇప్పుడు అందరి కళ్ళ ముందూ కనిసిప్తోంది.
- ప్రభాత్ పట్నాయక్
స్వేచ్ఛానువాదం