Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన పాటల్ని ఎవరో ఎత్తుకెళ్లారు
మనదైన ఆటను, పాటను మననుండి
మనకు తెలియకుండానే
మటుమాయంచేసి కళ్ళ ముందే
మనకు దూరంచేసి
పబ్బం గడుపు కుంటూ
అందాల అద్దాల పంజరంలో
బందీని చేస్తున్నారు !
పచ్చటి అడవిలో నునువెచ్చగా
పూసిన తంగేడు పరిమళం
చేను గట్టెంటా విరిసిన
గునుగు పూల గుబాళింపులు
ముద్ద బంతుల అందాలతో
ఆడపడుచులు నెత్తికెత్తుకున్న
అడవితల్లి కొలువైన బతుకమ్మను
రంగుల ప్లాస్టిక్ పూల అలంకరణతో
పల్లెలు, బస్తీలు, గుడులు దాటించి
ఇండియా గేట్, దుబారు దేశాలకు
కోట్ల ప్రజల సొమ్ముతో
ఉత్సవాలు చేస్తూ
బడుగు బతుకును ప్రతిబింబించే
మన బతుకమ్మను హైజాక్ చేసే
కుతంత్రాన్ని పసిగట్టలేరా ?
సగటుమనిషిని దోపిడీ చేస్తూ
మనిషి మనుగడను సందిగ్ధంచేసే
మాయదారి వర్గాలే
మనలను, మన అస్తిత్వాన్ని
మన జీవన సంస్కృతిని దోచేసి
తైతక్కలాటలతో లేని ప్రేమను
ఒలికిస్తూ జరిపే నయాసాంస్కృతిక
దాడిని కనిపెట్టి జాగరూకులవాలి!
గడీలను కూల్చి గడప గడపను
పలకరించిన స్వేచ్ఛా బతుకమ్మను
పల్లె పల్లెలో వాడ వాడలో
మన ఆడపడుచులు గుంపుగా
కలిసి ఆడుతూ పాడే పల్లెపాటలు
పద్మ, మంగ్లీల జానపదాలు
చిత్తు చిత్తూల బొమ్మలాటలు
ఉయ్యాల పాటల సొబగులను
దొరసానమ్మలు దొంగిలించి
పండుగను, బతుకమ్మను
రాజకీయ రంగులతో రంగరించి
వాసనలేని కాగితప్పూలతో
'జాగతి' కొప్పులో తురుముకుని
బతుకమ్మ చీరల సారెలంటూ
ఆడబిడ్డల ఓట్ల బేరసారాలా ?
పాటను, ఆటను, పడతులను
మోసంచేస్తున్న నయా సంస్కృతిని
బడుగు,బహుజన బతుకమ్మలంతా
చప్పట్ల హౌరుతో నిలదీయాలి !
మన మూలాలకు జీవమైన
మన పాటను, సంస్కృతిని
కలుషితం కానివ్వక
మననుండి మాయం చేసే
విద్రోహాన్ని వివరిస్తూ జనాన్ని
జాగతం చేయాల్సిందే !
మాటా, పాటా, ఆటా,
ప్రతి జాతి అస్తిత్వాలు
వారి సంస్కృతికి పునాదులు
పల్లె పాట ఆత్మను రెహ్మాన్,
మీనన్లు ఒడిసి పట్టలేరని
ఇక్కడి మట్టి వాసనలు
ఒళ్లంతా పులుముకున్న
మాపల్లె పడుచుల శ్వాసలోనే
పాటైనా ఆటైనా ప్రాణం
పోసుకుంటుందని తెలపాలి !
ఇంటింటిలో జీవన పరిమళాలు
గుబాళిస్తూ నవవసంతం వెల్లివిరిసే
బతుకు పండించే బతుకమ్మ కావాలి!
- డా. కె. దివాకరా చారి,
సెల్:9391018972