Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల పార్లమెంట్ వ్రాత పూర్వకంగా యిచ్చిన సమాధానంలో కేంద్ర ఆర్థిక మంత్రి రూపాయి విలువ పతనానికి అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులలో మార్పులు, అంతర్గత కారణాలే ప్రధానమని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు అంచనాలను 7.2శాతం నుంచి 7శాతానికి కుదిస్తూ, ఇటీవలే రిజర్వ్ బ్యాంకు కూడా విధాన ప్రకటనను వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంట్‌ఖాతా లోటు దేశ స్థూల జాతీయోత్పత్తిలో మూడుశాతం వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని కూడా అంచనా.
సంస్కరణల ప్రభావంతో, ప్రపంచీకరణతో అనుసంధానమైన స్వేచ్ఛా వాణిజ్యం, నియంత్రణ లులేని అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి ప్రవాహ ప్రహసనంతో రెండు దశాబ్దాలకు పైగా డాలర్ మారకంగా ఉన్న దేశ కరెన్సీ రూపాయి విలువ క్షీణదిశలోనే కొనసాగు తోంది. ఇటీవల అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అంతర్జాతీయ కరెన్సీలయిన బ్రిటిష్ పౌండ్, జపనీస్ యెన్, యూరో వంటి కరెన్సీల పతనంతో పోల్చినప్పుడు మన దేశ కరెన్సీ రూపాయి పతనమవుతున్న శాతం తక్కువగానే ఉన్నదని ప్రభుత్వం సమర్థించు కోవడం ఆశ్చర్యకరం.
రూపాయి విలువ మార్కెట్లో యూఎస్ డాలర్ డిమాండ్, సప్లరును బట్టి ఆధారపడి ఉంటుంది. సంవత్సరంలోనే డాలర్ 6.5శాతం మేర తరుగుదలను నమోదుచేసింది. దేశం యొక్క దిగుమతులు ఎగుమతుల విలువ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు దేశీయ కరెన్సీ రూపాయి విలువ తగ్గుతుంది. మనదేశ ఎగుమతులు రూపాయి విలువ పడిపోవడాన్ని నిరోధించే స్థాయిలో లేవు. అంతర్జాతీయంగా డాలర్ విలువ బలపడడం, క్రూడాయిల్ ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రష్యా- ఉక్రేయిన్ యుద్ధ నేపథ్యం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితులు, వ్యవస్థలో ద్రవ్యలభ్యత పరిమాణం గణనీయంగా క్షీణించడం, వాణిజ్యలోటు రూపాయి పతనానికి కొన్ని కారణాలు.
ఒకదేశపు కరెన్సీ విలువ క్షీణించడం అంటే ఆ మేరకు ప్రజలు డబ్బును నష్టపోవడమే. మారకపు విలువలో మార్పులు జరిగినప్పుడు ఒకదేశపు కరెన్సీ విలువ తగ్గి మరొక దేశపు కరెన్సీ విలువ పెరగడం వంటి పరిణామాలకి ఆస్కారం ఏర్పడుతుంది. దేశానికి విదేశీ మారకం కొరత ఏర్పడితే అది కరెన్సీ సంక్షోభంగా ప్రతిబింబించినా వాస్తవానికి సరుకుల, వస్తూత్ప త్తులకు సంబంధించింన సంక్షో భమే దానిలో ఇమిడి ఉంటుంది. ఎగుమతులు పెంచుకోవడం, దిగుమతులపై నియంత్రణను విధించడం, డబ్బు విలువను తగ్గించుకోవడం వంటి చర్యలు చేపట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి.
100 డాలర్లుగా ఉన్న బ్యారెల్ క్రూడాయిల్ ధర ఉక్రేయిన్ యుద్ధ అనంతరం 122డాలర్లకు చేరింది. దేశానికి అవసరమయ్యే ముడి చమురు వినియోగంలో 80శాతం దిగుమతులమీద ఆధారపడటంతో పాటుగా, మొత్తం దిగుమతులలో 27శాతం ముడి చమురుగా ఉన్నది. దీనితో పాటుగా ఇతర లోహాలు, ఎలక్ట్రానిక్ పరికరాల వంటివి ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్నది. బలహీన రూపాయి, అధిక ముడిచమురు ధరలు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పెంచుతాయి. విదేశీ సంస్థాగత మదుపరులు షేర్మార్కెట్ల నుండి నిధులను ఉపసంహరించు కుని, డాలర్లను తరలించడం కూడా రూపాయి పతనాన్ని ప్రభావితం చేస్తోంది. సరుకుల ఉత్పత్తితో కూడిన పరిశ్రమలను స్థాపించడం, మాన్యుఫ్యాక్చ రింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాలలో పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించడం కాలంతో, కష్టంతో కూడుకున్న పని. దీనికి భిన్నంగా ఫైనాన్స్ పెట్టుబడి రూపంలో దేశంలోని స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడులనుపెట్టి స్పెక్యులేషన్‌కు పాల్పడి లాభాలను శరవేగంగా సముపార్జించి విదేశాలను తరలించడమే సులువైన మార్గం. ఇదే ప్రస్తుత విదేశీ పెట్టుబడుల వికృతరూపం.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీరేట్లు పెంచడంతో యూఎస్ డాలర్ సూచిక 1శాతం మేరకు పెరిగి 20ఏండ్ల గరిష్ట స్థాయికి చేరి పెట్టుబడి ప్రాతిపదికగా ఆస్తుల విలువ పెరిగింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్య పరిస్థితుల స్థాయిని మించి, ఒక్క రోజులోనే 2509 కోట్ల మేరకు దేశ స్టాక్ మార్కెట్లో అమ్మకాలకు పాల్పడటం వంటి సంఘటనలు పొంచివున్న చెల్లింపుల సంక్షోభానికి సంకేతాలు. కేవలం సంవత్సర వ్యవధిలోనే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెష్టర్లు మార్కెట్లో షేర్లు అమ్మి తరలించిన విదేశీ పెట్టుబడుల విలువ 28.4 బిలియన్ డాలర్లు. ఏప్రియల్ నెల నుండి ఇప్పటివరకు విదేశీ మారక నిల్వలలో 67శాతం క్షీణత ఆందోళనకరం.
ప్రస్తుతం ఒక డాలర్ కొనుగోలు చేయాలంటే 81 రూపాయిలు అవసరపడు తుంది. ఆర్థిక వేత్తల అంచనాల ప్రకారం భవిష్యత్తులో డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పతనాన్ని చవిచూడనున్నది. రూపాయి పతన నిరోధానికి రిజర్వ్ బ్యాంక్, ఇతర అజమాయిషి సంస్థల జోక్యం అనివార్యం. స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల ద్వారా కేవలం లాభాల స్వీకరణకు నిర్వహిస్తున్న స్పెక్యులేషన్‌పై నియంత్ర ణలు అవసరం. అనవసర వస్తువుల దిగుమతులు, బంగారం దిగుమతులపై ఆంక్షలు అనివార్యం అవుతాయి. రూపాయి పతనం వలన దిగుమతి దారులు నష్టపోయినప్పటికీ, ఎగుమతిదారులు లాభపడ తారనే అంశాన్ని ప్రస్తావించే మేధావులు గుర్తెగాల్సిన విషయం దేశీయంగా దిగుమతుల మీద ఆధారపడటం. ఎగుమతి ఆధారిత పరిశ్రమ లైన ఐటి, ఫార్మా, టెక్స్టైల్ వంటి కొన్ని పరిశ్రమలు డాలర్ బలపడటం వలన లాభాలు స్వీకరించే పరిస్థితులు మొత్తం ఆర్థిక చిత్రంలో రేఖా మాత్రమే.
వృద్ధిరేటులో క్షీణత తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితు లతో కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థలో రూపాయి విలువ క్షీణత కొనసాగటం ఆర్థిక విధాన రూపకర్తలకు అదనపు సవాలే. ద్రవ్య లభ్యత, కరెన్సీ క్షీణత, పడిపోతున్న విదేశీ రిజర్వ్‌లు వంటి అంశాలపై రిజర్వ్ బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ తీసుకునే నిర్ణయాల ప్రభావంపై ఆర్థిక వ్యవస్థ గమనం ఆధారపడి ఉంటుంది.
ఒక దేశంలో కరెన్సీ విలువ తగ్గినప్పుడు ఆ తగ్గిన విలువ ఎవరికీ చేరకుండా ఆవిరయిపోదు. ఆ మేరకు విలువ బదిలీ అవుతుంది. కరెెన్సీ విలువ క్షీణించిన దేశంతో వ్యాపారం చేసి, లాభాల రూపంలో తరలించే విదేశానికి ఆ విలువ చేరుతుందనేది ప్రస్ఫుటం. డాలర్ ఇండెక్స్ 20ఏండ్ల గరిష్ట స్థాయికి చేరి, బాండ్స్‌పై రాబడిరేటు పెరిగి 14 ఏండ్ల అత్యధిక రిటన్ ఇచ్చే పరిస్థితికి అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాలు, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ వైపు పెట్టుబడులు ఆకర్షించే పరిణామాలు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. వీటి ప్రభావమే మన దేశ కరెన్సీ పతనానికి ముఖ్య కారణం.
ప్రపంచీకరణ పరిభాషలో విదేశీ పెట్టుబడులు అంటే ఏ విధమైన ఆంక్షలు లేకుండా, యధేచ్ఛగా లాభాల స్వీకరణకు పాల్పడడానికి, పెట్టుబడుల మీద స్వల్పకాలిక లాభాల తరలింపునకు, పెట్టుబడిని ఆశించిన, ఆహ్వానించిన దేశాల ప్రయోజనాలను విస్మరించి తాము నిర్ణయించు కున్నట్టుగా పెట్టుబడులను ఉపసంహరించు కోవడానికి, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయడానికి అవకాశం ఇచ్చే సాధనంగా మారి దేశాల ఆర్థిక సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకం చేసే ప్రక్రియగా రూపాంతరం చెందింది.
పెట్టుబడి ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణలు, వ్యవస్థీకృత సర్దుబాట్లు పేరుతో అమెరికన్ ఆర్థిక వ్యవస్థకి అనుసంధానంగా ఇమిడిపోవడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో డాలర్ పెట్టుబడికి ఊతం ఇచ్చేందుకు ఉపసంహరించిన నియంత్రణలు, కల్పించిన ప్రోత్సాహకాలను పునపరిశీలించుకోవాల్సిన తరుణమిది.
డాలర్ ఇబ్బందిని ప్రపంచ ఇబ్బందిగా, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ లోటును ప్రపంచ లోటుగా భావించే భావన నుంచి రక్షణాత్మకవ్యూహం అనివార్యం. దేశీయ పొదుపునకు ప్రోత్సహించడం, దాన్ని పెట్టుబడులుగా పెట్టి వృద్ధి సాధించడం ప్రాధాన్యత కల్పించవలసిన అంశం. దేశీయ పొదుపు పెట్టుబడికి, విదేశీ పెట్టుబడులు ప్రతరతత్యామ్నాయం కావనే సూక్ష్మమైన సూత్రాన్ని సంగ్రహించాల్సిన సమయమిది.
- జి. కిషోర్‌కుమార్
సెల్:9440905501