Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్య పతనం అంచుకు చేరింది. అధ్యాపకులులేక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు కునారిల్లు తున్నాయి. మౌలిక వసతులు, వనరుల కొరతతో కనీస వసతులు కొరవడి భూత గృహాలను తలపిస్తున్నాయి. లక్ష్యాలు ఆదర్శాలు కాగితాలకే పరిమితమై క్షేత్రస్థాయి పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. రేపటి ఉపాధ్యాయులను తయారు చేయుట, పరిశోధనలకు మద్దతు, ప్రాథమిక విద్య వ్యాప్తి, వయోజన విద్య, జాతీయ సాక్షరత మిషన్ మొదలైన కార్యక్రమాల అమలు సరిగా జరగకపోవడం వల్ల జిల్లా విద్యా శిక్షణ సంస్థల ప్రమాణాలు అంతకంతకు పతనమవుతున్నాయి. తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టి సంస్కరణలకు శ్రీకారం చుట్టకపోతే కోల్పోయేది ఉపాధ్యాయ విద్య మాత్రమే కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కూడా. పతనం అంచులో ఉన్న ఉపాధ్యాయ విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలంటూన్న వ్యాసం ఇది.
శిథిలమవుతున్న శిక్షణ...
పాఠశాల విద్యలో విద్యా ప్రమాణాలు మెరుగుదలకు వివిధ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా శిక్షణ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో 1989లో జిల్లా స్థాయిలో జిల్లా విద్యా శిక్షణ సంస్థలను ప్రారంభించినది. దేశంలో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున డైట్ కళాశాలలను నాటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల పరిధిలో 10 డైట్ కళాశాలలు ఉన్నాయి. చాత్రో పాధ్యాయులకు నిరంతర శిక్షణ, మూల్యాంకనం, పరిశోధన, ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు మొదలైన విధులతో ఏర్పడిన డైట్ కళాశాలల్లో ప్రస్తుతం అధ్యాపకులులేక ఉపాధ్యాయ విద్య శిక్షణ శిథిలమవుతున్నది. రాష్ట్రంలో నల్గొండ, ఖమ్మం జిల్లా డైట్ లలో తెలుగు ఆంగ్ల మధ్యమాలు ఉండగా మిగిలిన డైట్ లలో వీటితో పాటు ఉర్దూ మాధ్యమం కూడా ఉంది. రాష్ట్రంలో నల్లగొండ ,ఖమ్మం డైట్ లలో ఒక ప్రిన్సిపాల్ తో పాటు 23మంది చొప్పున అధ్యాపకులు ఉండాలి. మిగిలిన ఎనిమిది విద్యా శిక్షణ సంస్థల్లో ఒక ప్రిన్సిపాల్, 28మంది అధ్యాపకులు ఉండాలి. రాష్ట్రంలో 10 డైట్ కళాశాలలో మొత్తం 280 అధ్యాపక పోస్టులు ఉండగా ప్రస్తుతం 17 మంది అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారు. నిజామాబాద్ డైట్ లో 29 మంది అధ్యాపకులకు గాను ఒక ప్రిన్సిపాల్ మాత్రమే ఉన్నారు. ఉర్దూ మీడియంలో అధ్యాపకులే లేరు. మహబూబ్ నగర్ జిల్లా డైట్లో 29 మంది అధ్యాపకులకు గాను ఐదుగురు అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. వీరిలో ముగ్గురు డిప్యూటేషన్ వేరేచోట పనిచేస్తుండగా ఇద్దరి అధ్యాపకులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. మెదక్ కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపాల్, ఒకే ఒక్క అధ్యాపకుడు ఉన్నారు. వరంగల్ కళాశాలలో అధ్యాపకులు ఎవరూ లేరు. హైదరాబాద్ కళాశాలలో అధ్యాపకులులేరు రెగ్యులర్ ప్రిన్సిపాల్ మాత్రమే ఉన్నారు. వికారాబాద్ కళాశాలలో అధ్యాపకులు ఉండగా ప్రిన్సిపాల్ లేరు. నల్లగొండ కళాశాలలో ఒకే ఒక్క అధ్యాపకుడు ఉండగా ప్రిన్సిపాల్ లేరు. కరీంనగర్ కళాశాలలో ప్రిన్సిపల్ లేకపోగా ఉన్న ముగ్గురు అధ్యాపకుల్లో ఒకరు జగిత్యాల డీఈఓగా పనిచేస్తున్నారు. అదిలాబాద్ కళాశాలలో ప్రిన్సిపల్ లేకపోగా ఇద్దరు అధ్యాపకులు ఉన్నారు వీరిలో ఒకరు నిర్మల్ డీఈఓగా ఉన్నారు. ఖమ్మం కళాశాలలో ఇద్దరు అధ్యాపకులు ఉండగా ఒకరు భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీలు రిటైర్డ్ అధ్యాపకులతో పాఠాలు బోధిస్తున్నప్పటికీ సరైన శిక్షణ అందక ఉపాధ్యాయ విద్య పడకేస్తున్నది. అలాగే ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న పది డైట్ కళాశాలలో ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నారు. సరిపడినంత సంఖ్యలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేవు. కొన్నిచోట్ల ఉన్న వసతి గృహాలను బోధనేతర సిబ్బంది లేక మూసివేశారు.
తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం
ఏకీకృత సర్వీస్ రూల్స్‌కు మోక్షం లభించకపోవడంతో డైట్ కళాశాలల్లో ఈ పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం ఈ సమస్య హైకోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉంది. దీన్ని సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. అలాగే ప్రయివేట్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో బోధన సిబ్బంది తక్కువగా ఉంటే వాటి గుర్తింపు రద్దు చేసే యస్‌సిఇఆర్‌టి (ూజజు=ు) డైట్ కళాశాలల దుస్థితిని మాత్రం పట్టించుకోవడం లేదు. చీజుజు నిబంధనల ప్రకారం బోధన సిబ్బందిని నియమించాలి. అర్హులైన అభ్యర్థులు దొరకనట్లయితే పదవి విరమణ చేసిన వారి సేవలను ఉపయోగించుకోవాలి. కానీ చాలా చోట్ల అలా జరగడం లేదు. డైట్లలో అధ్యాపకులు లేక జిల్లా స్థాయిలో శిక్షణ పరిశోధన మందగించినది. గత పది ఏండ్లలో డైటు కళాశాలలు ఎస్సీఆర్టీకి సమర్పించిన పరిశోధక అంశాలు చాలా తక్కువ. పరిశోధనలు పక్కన పెడితే గత 10ఏండ్లలో డైట్లలో అధ్యాపకులులేక చదివిన ఛాత్రోపాధ్యాయులు ఏలా శిక్షణ పూర్తి చేశారన్న ప్రశ్నలకు సరైన సమాధానం లభించదు. ప్రాథమిక విద్య ప్రాధాన్యత ఎనలేనిది. జాతి పురోగతికి అది ఆయువు పట్టు. ఇంతటి కీలక రంగంలో ఉపాధ్యాయులను తయారుచేసే జిల్లా విద్యా శిక్షణలలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపడాలంటే పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది నియామకం అవసరం. తగిన మౌలిక వసతులు వనరులను సమకూర్చాలి. అ దిశగా అడుగులు వేయడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం. అప్పుడే ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి.
(నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా)
- అంకం నరేష్
సెల్:6301650324