Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెలిదండ అంటే విప్లవ ఉద్యమాలకు పూదండ. అది నాటికి, నేటికి వామపక్ష ఉద్యమాల ఖిల్లా. ఆ దండలో దారంలా ఉద్భవించిన విప్లవయోధుడు కామ్రేడ్ మేదరమెట్ల సీతారామయ్య (ఎం.ఎస్). ఆయన పేరు వింటేనే శత్రు శిభిరం గడగడలాడేది. కమ్యూనిస్టు ఉద్యమంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ప్రజలతో మమేకమవుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడుగా, సీపీఐ(ఎం) హుజూర్నగర్, కోదాడ ఉమ్మడి తాలూకా కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, గ్రామ సర్పంచిగా, సింగిల్‌విండో చైర్మన్‌గా అనేక బాధ్యతలు నిర్వహిస్తూ 7.10.1997లో అనారోగ్యంతో మృతి చెందాడు. నేడు ఆ విప్లవ యోధుని 25వ వర్థంతి.
తెలంగాణలో ప్రజావ్యతిరేకమైన నిజాం సైన్యాలను, నెహ్రు సైన్యాలను ఎదురించి, పీడిత ప్రజల విముక్తికై కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కామ్రేడ్ సీతారామయ్య ప్రత్యక్షంగా పాల్గొ న్నారు. విప్లవం కోసం ప్రాణా లను తృణప్రాయంగా భావించే సాహసం, ప్రజల కోసం పని చేయడం అత్యున్నత కర్తవ్యమనే విశ్వాసం, స్వప్రయోజనా లను ప్రక్కకు పెట్టి ప్రజల కోసం పని చేయాలనే త్యాగ నిరతి, ఆటుపోట్లు ఎన్ని వచ్చినా వెనుతిరగక ప్రజా ఉద్యమాల్లో ప్రజల పక్షాన కొనసాగే చైతన్యం మొదలైన ఉత్తమ లక్షణాలు కలిగిన వ్యక్తిగా కమ్యూనిస్టు ఉద్యమం ఆయనను తీర్చిదిద్దింది.
కామ్రేడ్ మేదరమెట్ల సీతారామయ్య 1924లో రైతు కుటుంబంలో జన్మించాడు. 15 సంవత్సరాల వయస్సు నుంచే పాటలు పాడటం, నాటికలు వేయడంతో పాటు రామాయణం, భారతం, భాగవతం చదివేవారు. తన 18వ యేటనే వెలిదండ గ్రామంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. వెలిదండ గ్రామ ప్రజల మీద పటేలు వక్కవంతుల కోటయ్య, మట్టయ్యల కుటుంబం చేసే అక్రమాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పేదల పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తి కామ్రేడ్ ఎం.ఎస్.
వెలిదండ నిజాం సంస్థానంలో భాగంగా జాగీర్ధారీ పాలన కింద ఉండేది. వెలిదండ గ్రామానికి పక్కనే బ్రిటిష్ పాలన క్రింద ఉన్న మునగాల పరగణా జమీందారీ గ్రామాలు ఉండేవి. జమీందారీ, జాగీర్ధారీ గ్రామాల్లో సాధారణంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులతోపాటు వారి స్వంత అవసరాల కోసం కూడా నిర్భంధపు పన్నులు వసూలు చేసేవారు. వెలిదండ గ్రామంలో కూడా పటేలు, పట్వారీల వెట్టిచాకిరీ, దోపిడీ, దౌర్జన్యాలు సాగుతూ ఉండేవి. ఆ గ్రామంలో రైతుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, ప్రజలకు భూతగాదాలు పెట్టి కేసుల్లో ఇరికించడం, అప్పులిచ్చి హెచ్చు వడ్డీరేట్లు గుంజటం, పేదల భూములను తాకట్టు పెట్టుకోవడం, భూమి శిస్తులను అధికంగా విధించడం, జరిమానాలు విధించడం, కట్టకపోతే ఇండ్లను జప్తు చేయడం చేసేవారు.
ఈ తరుణంలో కామ్రేడ్ ఎం.ఎస్ గ్రామంలో ఆంధ్రమహాసభ కార్య కలాపాలను చాపకింద నీరులా వ్యాపింప చేశాడు. పటేల్, పట్వారీ ఆగడాలను ప్రతిఘటించాడు. సీతారామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడు తున్నాడని పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. గ్రామానికి వచ్చిన పోలీసులు సీతారామయ్యతో పాటు కొంత మంది యువకులను అరెస్టు చేసి కోదాడ, సూర్యాపేటకు తరలించి, ఆ తర్వాత హైదరాబాద్ జైల్లో నిర్భంధించారు. వీరిపై కేసు ఏమిటో తెలియకుండానే, విచారణ జరపకుండానే 9 నెలలు జైల్లో నిర్భంధించారు. కామ్రేడ్ సీతారామయ్య జైలు జీవితాన్ని అనుభవిస్తూనే కమ్యూనిస్టు రాజకీయాల వైపు ఆకర్షితుడైనాడు. మార్క్సిజం, రష్యా విప్లవం, సోషలిస్టు రాజ్యాంగం గురించి, చైనాలో విస్తరిస్తున్న విప్లవం గురించి జైల్లో తెలుసుకున్నాడు. 9 నెలల నిర్భంధం తర్వాత సీతారామయ్య జైలు నుండి తిరిగి వెలిదండ వచ్చే సరికి ప్రక్కనే ఉన్న మునగాల పరగణా గ్రామమైన కొక్కిరేణిలో కమ్యూనిస్టు పార్టీ సెంటర్ ఏర్పాటు చేసి నడుపుతున్నారు. పరగణా గ్రామాలు కాబట్టి అక్కడ కమ్యూనిస్టు పార్టీపై నిషేధం లేదు. జైలు జీవితం అనంతరం ఆ గ్రామంలోకి వచ్చి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం చాలా చురుగ్గా పనిచేసాడు. ఆయన నేతృత్వంలో దోపిడీ, దౌర్జన్యాలు, వెట్టిచాకిరీ, లంచగొండితనం, లెవీ ధాన్యానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రచారం చేసేవారు. పోలీసు క్యాంపులున్న గ్రామాల్లో కార్యకర్తలు రహస్యంగా ఆంధ్రమహాసభ కరపత్రాలు పంపిణీ చేసేవారు. రాత్రిపూట గ్రామాల్లో ఎర్రజెండాలు కట్టేవారు. ఈ కార్యక్రమాల్లో యువకులు, స్త్రీలు కూడా చురుగ్గా పాల్గొనేవారు. గెరిల్లా పోరాటంలోనూ ప్రజలు భాగస్వాములైనారు. ఆ పోరాటంలో సీతారామయ్య ముఖ్యమైన పాత్ర పోషించాడు. సీతారామయ్య నాయకత్వంలో దళాలు బొత్తలపాలెం, బక్కవంతుల గూడెం, వెలిదండ, కొక్కిరేణి, రంగాపురం, జెర్రిపోతులగూడెం, మఠంపల్లి గ్రామాల్లో ఉన్న శతృవులను తరిమికొట్టారు. పోలీసు, మిలటరీ క్యాంపులపై దాడి చేసి ఆయుధాలను సేకరించడంలో ఎం.ఎస్ దళం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా అడ్లూరు వద్ద గల అచ్చంపేట పోలీసు స్టేషన్‌పై దాడి చేసి 74షార్ట్ గన్నులు, రైఫిల్స్, వెయ్యి తూటాలను సేకరించుకొని కాలినడకన కృష్ణానది దాటి ఆయుధాలతో మహబూబ్‌నగర్ చేరుకున్నారు.
గుంటూరు జిల్లాలో ఏలంపేట పోలీసు స్టేషన్, కర్నూలు జిల్లాలో పుల్లంచెర్వు పోలీసు స్టేషన్ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు క్యాంపు, కర్నూలు జిల్లా గడివేముల పోలీసు స్టేషన్, మిర్యాలగూడెం దగ్గర సుబ్బారెడ్డిగూడెం మిలటరీ క్యాంపులపై దాడులు చేసి ఆయుధాలు సేకరించేవారు. దళానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కామ్రేడ్ సీతారామయ్య దళ సభ్యులలో మరింత పట్టుదలను పెంచి నిలబెట్టేవాడు. నిరాశ, నిస్పృహలకు తావు లేకుండా చేయగలగడం ఆయన ప్రత్యేకతగా ఉండేది. ఆయన భార్య అనసూయ పాత్ర కూడా అద్వితీయం. కామ్రేడ్ సీతారామయ్య తీవ్రమైన నిర్భంధం, ప్రతిఘటనతో రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. ఆ కాలంలో సీతారామయ్య భార్య అనసూయ రంగాపురంలోని తన తల్లిగారి ఇంట్లో ఉండేది. వారి కుటుంబం పైన కూడా తీవ్రమైన నిర్భంధం వచ్చింది. అనేక సార్లు పోలీసులు, మిలటరీ ఆ ఇంటిని దోపిడీ చేశారు. అనసూయతో పాటు వారి అమ్మ ఎర్రమ్మ అమ్మమ్మ రాఘవమ్మను కొట్టి అనేక చిత్రహింసలకు గురి చేశారు. తలవెంట్రుకలు తీసి గుండు కొట్టించారు. అయినా అనసూయలో ధైర్యం సడలలేదు. పోరాటం వలన వచ్చిన నిర్భంధం, ఆర్థిక ఇబ్బందులను ఎన్నడూ లెక్కచేయలేదు. అన్నింటికి మించి కమ్యూనిస్టు రాజకీయాలు పరిచయం కావడంతో కారుచీకట్లో కాంతిరేఖలా సీతారామయ్య కు ఎల్లవేళలా అండగా నిలవడమే కాదు, నేటికీ అదే ధైర్యసాహసాలతో ఆమె ముందుకు సాగడం స్ఫూర్తిదాయకం. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)లో కామ్రేడ్ ఎం.ఎస్ చురుకైన పాత్ర పోషించారు. హుజూర్నగర్ ప్రాంతంలో సీపీఐ(ఎం) పార్టీపై తీవ్రమైన నిర్భంధం కొనసాగింది. పొనుగోడు గ్రామంలో అందె నర్సయ్య, సుందరి బస్వయ్య హత్య, యాతవాకిళ్ళలో పున్నంరాజు హత్య, మల్లారెడ్డిగూడెంలో కందుల గుర్వారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి హత్య, వెలిదండలో ఈసారపు వీరయ్య హత్యలతో పాటు వివిధ గ్రామా ల్లో భూస్వాములు, గుండాల దాడులు నిరంతరం కొనసాగేవి. ఆ నిర్భందం నుంచి గ్రామాలను కాపాడటంలో కామ్రేడ్ సీతారామయ్య ప్రముఖమైన పాత్ర పోషించారు. అనేక గ్రామాల్లో ప్రజా సమస్య లపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ ప్రభుత్వ, బంచరాయి, పోరంబోకు భూములను పేదలకు పంపిణీ చేశారు. లింగగిరిలో కౌలుదారీ హక్కుల కోసం జరిగిన పోరాటంలో, అగ్రహారంలో జరిగిన భూ పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.
కామ్రేడ్ సీతారామయ్య పార్టీని నిర్మించడంలో అనేక నిర్భంధాలను అధిగమించి ఉద్యమ పురోగతికి కృషి చేశాడు. కాంగ్రెస్ గుండాల దారుణాలను, హత్యా రాజకీయాలను ఎదుర్కొంటూనే కార్యకర్తలకు రక్షణ కల్పిస్తూ తన ఇల్లునే విప్లవ కేంద్రంగా మార్చాడు. ఆయన పేరు వింటేనే శతృవులకు గుండెల్లో గుబులు పుట్టేది. దేనికీ వెన్నుచూపని ధైర్య సాహసాలకు తోడు ఆయన నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత, ఆయన త్యాగనిరతి నేటి యువతరానికి ఆదర్శం.
- ములకలపల్లి రాములు
సెల్:9490098338