Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడేదో స్టైల్‌గా పేరు మారింది గాని
లేకుంటే
వీళ్ల పేరు గ్రామసేవకులే!
ఆయన దేశానికే సేవకుడు(ట)!
వీళ్లు గ్రామానికి సేవకులు!!
తేడా రెండే అక్షరాలు
కాని ఎంత ఫరకుంది?!
పెండ్లాం పిల్లలు లేనాయన ఉండెతందుకు
రూ.360కోట్లతో కొత్తబంగ్లానట!
అవును! ఆయన దేశానికే 'సేవకుడు' కదా మరి!
ఆమాత్రం బంగ్లా ఉండక్కల్లేదా?
కాలికి బలపం కట్టుకుని ఎనిమిదేండ్లలో
అన్నన్ని దేశాలు తిరిగి పొగేసుకున్న
తెలివంతా ఏంగాను?!
చూసొచ్చినవన్నీ అమలు చేయొద్దా?
వీళ్లూ ఏదో ఒక సేవకులే కదా!
కొంపా గోడు లేకున్నా చాకరీ చేయాల్సిందేనా?
కిరాణం దుక్నపోడు ఉద్దెరిస్తలేడు.
దసరా రోజూ పస్తులుండాల్సిందేనా?
వీళ్లు చేసిన 'పాపాల' వల్లేనట!
ఒక కాషాయసామి చెప్పిండు!
ఒకరో ఇద్దరో ''పాపాత్ము''లు కాదు
కుటుంబాలకు కుటుంబాలే!
తక్కువలో తక్కువ లక్షమందిమి!
ఒక ''సేవకుడి'' భార్యనైనందుకు
మరో సేవకుడి బిడ్డనైనందుకు
మా ఆయన
మా నాయన
రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మినందుకు
మందుల్లేక, దావఖానాలో
షరీకయ్యే స్తోమతు లేక
మేము చావాల్సిందేనా?
ఇప్పటికి డెబ్బయి పీనుగుల్లేచినాయి
మా యిండ్లలో!
పోరగాండ్లు ఊడబొడుస్తారని కాన్వెంట్
చదువుల్లో చేర్పిస్తిమి
దానికోసం నెలనెలా అప్పుల కిస్తీలు! ఉద్యోగం
పర్మినెంటని!
పేస్కేలని!
ప్రమోషన్లని!
నిండు సభలో చేసిన వాగ్దానం కదా! నమ్మకేం చేస్తారూ?
చదువుల్లేనోల్లకు పదవోన్నతులంటే...
ఏ పోస్టులో నుండి ఏ పోస్టులోకి?
ఆలోచన చేసే తెలివియాడుంది?
మా ఆయనకు!
మా నాయనకు!
పర్మినెంట్ అయితే... ఇగ వాటా బందీగాండ్ల నొదిలించుకుంటే...
మంచిదనుకున్నాడు.
అందర్నీ ఒకేసారి వదిలించుకోవాలనుకున్నాడు
వాళ్ళంతా పాలోళ్ళే! నిన్నటిదాకా వాటా బందీ చేసినోళ్ళే!
హఠాత్తుగా
'రుణశేషం, శత్రుశేషం'' మిగలరాదని మా పంతులుగారి మాట యాదికొచ్చినట్లుంది.
అందర్నీ వదిలించుకోవడమే 'ధర్మం' అన్నాడు మావూరు ఎమ్మెల్లే
ఎవరికెంతియ్యాలో తానే 'తస్వియ' చేయనీకి
రెడీ అయ్యిండు.
పది'ల' కారాలన్నడు. ఇచ్చాం!
అప్పిచ్చిన షావుకారి ఊరుకుంటాడా?!
ఆడు మా ఎమ్మెల్యేకి బినామీ అని వూరంతా పెచారం!
ఆసుపత్రి ఖర్చు, పోరగాండ్ల సదువులకి, వాటా బందీ వదిలించు
కోవడానికి చేసిన అప్పు
పాపం పెరిగినట్లు పెరిగిపోతోంది!
మిత్తి కట్టుడుకే
గుడ్లు ఎల్లకొచ్చినాయి
ముందు ఎడ్లనమ్మినం
వున్న చెలక అమ్మేసినం.
పుస్తెలమ్మినం!
అత్తమ్మకి ముసిలోల్లకిచ్చే పించనొస్తలేదు.
కాళ్లూ చేతులు సరిగాలేని నా కొడుక్కి వికలాంగుల పించనొస్తలేదు
ఎందుకంటే మా ఆయన గవర్మెంట్ ఉద్యోగినట!
మేసేప్పుడు దున్నల్లో
దున్నేప్పుడు దూడల్లో అన్నట్టు లేదా?
అప్పులోల్లు వెంటబడ్తే మందు డబ్బాలే
నాపెనిమిటి లాంటి వాల్లకు దిక్కయితున్నాయి.
చచ్చేం సాధిస్తాం? మర్లబడ్దామని ఎన్నిసార్లు చెప్పినా ఇన్లే!
ఆషాలు ఎర్రజెండాలు పట్టుకుని
వందరోజులు పోట్లాడలేదా?
అని సమ్జాయించినా విన్లే.
గీయనకు మందుడబ్బానే ముద్దయింది!
తెలంగాన్లో పుట్టినోల్లం!
రజాకార్లను తరిమినోల్లం!
అవసరమైతే ఒకడుగు వెనక్కి తగ్గయినా పోరాడాలే!
సమయం చూసి కొట్టాలే!