Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెప్టెంబర్ 22న ఇటలీలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో... ముస్సోలినీ ఫాసిస్టు పార్టీలో నేరుగా మూలాలు కలిగి ఉన్న పచ్చి మితవాద 'ఇటలీ సోదరుల పార్టీ' (బ్రదర్స్ ఆఫ్ ఇటలీ ఫ్రాటెల్లీ డి ఇటాలియా) మెజారిటీ ఓట్లు, సీట్లు సంపాదించి అధికార పగ్గాలు చేపట్టడానికి సిద్ధమైంది. ఆ పార్టీ నాయకురాలు జార్జియా మెలోనీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని దేశాధ్యక్షుడు సెర్జియో మట్టరెల్లా పిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అక్టోబర్ నెలాఖరులో మెలోనీ అధికార పగ్గాలు చేపడితే ఆమె ఇటలీకి ఎన్నికైన మొదటి మహిళా ప్రధాని అవుతారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత మొట్ట మొదటి సారిగా పచ్చి మితవాద ఫాసిస్టు తరహా పార్టీ అధికారం చేపట్టినట్లు.
తీవ్రమైన ఆర్థిక సామాజిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇటలీలో ప్రజా పోరాటాల వెల్లువను నివారించేందుకుగాను అమెరికా, ఐరోపా యూనిన్ల చొరవతో నాలుగేండ్ల క్రితం ఏర్పడిన మారియో డ్రాఘీ ప్రభుత్వం అర్థంతరంగా కూలిపోవడంతో ఈ ఎన్నికలు అవసరమైనాయి. ఎన్నికల్లో మెలోని పార్టీకి 26శాతం ఓట్లు, ఆమె నేతృత్వంలోని మధ్యేవాద మితవాద సంఘటనకు 44శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో మెలోని నాయకత్వంలోని ఇటలీ సోదరుల పార్టీకి వచ్చిన ఓట్లు 4శాతం మాత్రమే. ఫాసిస్టు మూలాలున్న ఈ పార్టీ ఓట్ల శాతం ఒక్కసారిగా 4 నుండి 26శాతానికి పెరగడం ఎన్నికల పరిశీలకులెవరినీ ఆశ్చర్యపరచలేదు. కారణం, దేశార్థిక సుస్థిరత పేరుతో డ్రాఘి నేతృత్వంలో ఏర్పడిన జాతీయ ఐక్య ప్రభుత్వంలో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ చేరిపోగా ఒక్క మెలోనీ పార్టీ మాత్రమే బయట ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించింది. అంతకు ముందు ఐరోపా సెంట్రల్ బ్యాంకు అధిపతి అయిన డ్రాఘీని ఐఎంఎఫ్, ఐరోపా సెంట్రల్ బ్యాంకులు కలిసి ఇటలీ ప్రధానిగా నిలిపాయి. నాడు పార్లమెంటులో ప్రాతినిధ్యం కలిగిన మితవాద, అతివాద పార్టీలన్నీ ఈ ప్రభుత్వంలో భాగస్వాము లైనాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇటలీలో పెట్టుబడిదారుల మధ్య సర్దుబాటు చేస్తూ, కార్మికవర్గంపై భారాలు మోపడం కోసం సామ్రాజ్యవాదులు ఈ ఏర్పాటు చేశారు.
డ్రాఘీ ప్రభుత్వం అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి చెప్పిన పద్ధతుల్లో పరిపాలన సాగించింది. పొదుపు చర్యల పేరుతో కార్మికుల ఉద్యోగాలకూ, సంక్షేమ పథకాలకూ కోత పెట్టింది. ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులు, సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ధరలు, ముఖ్యంగా ఇంధనం, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకాయి. నిరుద్యోగం అధికారిక అంచనాల ప్రకారమే 8.4శాతానికి చేరింది. ఐరోపా సగటు నిరుద్యోగం కన్నా ఇది రెండు శాతం అధికం. నిజానికి నిరుద్యోగిత పాలకులు చెప్పేదానికన్నా ఎక్కువగా ఉంది. అధికార గణాంకాల ప్రకారం దేశంలోని 34లక్షల మంది ప్రజల ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఎప్పుడు పోతాయో తెలియని అనిశ్చితి. దీంతోపాటు కరోనా మహమ్మారి తాకిడికి తల్లడిల్లిపోయిన ఐరోపా దేశాల్లో ఇటలీ మొదటి స్థానంలో ఉంది. కరోనా కాలంలో 56లక్షల మంది ఇటాలియన్లు నిష్టదారిద్య్రంలోకి దిగజారిపోయారు. ద్రవ్యోల్బణం 8శాతానికి చేరుకోగా ఇంధన ధరలు 50శాతం వరకు పెరిగాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇటలీ ప్రజల్లో అసంతృప్తి మరింత తీవ్రమైంది. కార్మికవర్గం పోరుబాట పట్టింది. ఉద్యోగాల కోత, చాలీచాలని వేతనాలు, అధిక పనిగంటలకు నిరసనగా సమ్మె పోరాటాలు వెల్లువెత్తాయి. రైల్వేలు, విమాన రవాణా, టెలికమ్ రంగాలతోపాటు కార్ల పరిశ్రమ, ఇతర పరిశ్రమల్లో పని స్తంభించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రెండు సార్లు ఇటలీ కార్మికవర్గం సార్వత్రిక సమ్మె నిర్వహించింది.
కార్మికుల్లోనూ, ప్రజల్లోనూ పెరిగిన అసంతృప్తి పచ్చి మితవాత నినాదాలతో ప్రజల ముందకు వచ్చిన ఇటలీ సోదరుల పార్టీకి సానుకూలంగా మారింది. సహజంగానే ఆర్థిక సంక్షోభాన్ని ఉపయోగించుకుని ప్రపంచ వ్యాపితంగానూ, ఐరోపాలోనూ మితవాద శక్తులు పెద్ద ఎత్తున బలాన్ని పెంచు కోవడం, అనేక చోట్ల అధికారంలోకి రావడం జరుగుతోన్న కాలమిది. ఇటలీలో మరింత తీవ్రంగా ఉన్న సంక్షోభం మెలోనీ నేతృత్వంలోని మితవాద పార్టీకి, దాని నాయకత్వంలో ఏర్పడిన మూడు పార్టీల సంఘటనకు బాగా కలిసివచ్చింది. నిజానికి దుర్భర జీవన పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇటలీ కార్మికవర్గం ఈసారి ఎన్నికల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదు. అందుకే ఇటలీ చరిత్రలోనే అత్యంత తక్కువ ఓటింగు జరిగింది.
ఎన్నికలకు దారితీసిన పరిణామాలు
ఇటలీలో ఏడాదికో, రెండేండ్లకో ప్రభుత్వాలు పడిపోవడం సర్వసాధారణం. అందువల్ల ఇవి ప్రపంచంలోనూ, ఐరోపాలోనూ పెద్ద వార్తలుగా కనిపించవు. కానీ డ్రాఘీ ప్రభుత్వం కూలిపోవడం మాత్రం పెద్ద చర్చనీయాంశం అయింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇటలీకి 2600కోట్ల యూరోల ఆర్థిక సహాయ ప్యాకేజీపై పార్లమెంటులో జరిగిన ఓటింగు డ్రాఘీ రాజీనామాకు దారితీసింది. ఇటలీ ప్రభుత్వం చెత్తను కాల్చి బూడిద చేసే ప్లాంటును నెలకొల్పాలన్న షరతు ఈ ప్యాకేజీలో ఒక భాగంగా ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంలో రెండవ అతి పెద్ద పార్టీ అయిన 5స్టార్ మూవ్ మెంట్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో డ్రాఘీ రాజీనామా చేశారు.
రుణ ప్యాకేజీపై పాలక సంఘటనలో శిగపట్లు ప్రభుత్వం సంక్షోభంలో పడడానికి కారణమైనప్పటికీ అసలు కారణం ఇంకా లోతైనది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఇటలీ సమాజం నిట్టనిలువునా అనేక చీలికలు పేలికలైంది. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రజల విశ్వాసం కోల్పోయాయి. అందుకే అక్కడ నిత్యం ఉద్రిక్తత, ఘర్షణలు జరుగుతూ వస్తున్నాయి.
2021 ఫిబ్రవరిలో డ్రాఘీ ఇటలీ ప్రధాని బాధ్యతలు స్వీరించారు. అంతకు ముందు మూడేండ్ల పాటు 5స్టార్ మూవ్మెంట్ అధ్యక్షుడు గుస్సెప్పె కాంటే ప్రధానిగా కొనసాగారు. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత ఇటలీలో 5స్టార్ మూవ్మెంట్ ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవించింది. 2018 ఎన్నికల్లో ఈ పార్టీ మట్టో సిల్వినీ నాయకత్వంలోని లెగా పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకు ముందు ఈ రెండు పార్టీలకు ఒకటంటే మరోదానికి అస్సలు పడదు.
కరోనా మహమ్మారి సందర్భంగా ప్రజల ప్రాణాలు రక్షించడంలో ప్రధాని కాంటే ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. ఉత్తర ఇటలీలో ఆసుపత్రులు రోగులతో నిండిపోయి, రాత్రిపూట మిలిటరీ ట్రక్కుల్లో వందలాది శవాలను తరలిస్తున్న దృశ్యాలు ఇటలీ ప్రజలనే కాదు మొత్తం ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ పరిస్థితుల్లో కాంటె ప్రభుత్వం రాజీనామా చేసింది. దాంతో పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీలు కలిసి ఐరోపా సెంట్రల్ బ్యాంకు అధిపతిగా పనిచేసిన 74ఏండ్ల డ్రాఘీని ప్రధానిగా చేసి అవన్నీ ప్రభుత్వంలో చేరిపోయాయి. ఇటలీని తీవ్రమైన సంక్షోభం నుండి గట్టెక్కించ డానికి తమకున్న మార్గం ఇదొక్కటేనని అవి తలిచాయి. మెలోని నేతృత్వంలోని ఇటలీ సోదరుల పార్టీ మాత్రం అధికారానికి బయట ఉండిపోయింది. అంతకు ముందు డ్రాఘీ ఐరోపా సెంట్రల్ బ్యాంకు ఛైర్మన్‌గానే కాకుండా ప్రపంచ బ్యాంకులోనూ, అమెరికాకు చెందిన గోల్డ్ మాన్ శాచ్ లోనూ అనేక బాధ్యతలు నిర్వహించారు. ఐరోపా సెంట్రల్ బ్యాంకు అధిపతిగా ఆయన తీసుకున్న పొదుపు చర్యలు కార్మికవర్గ జీతాలకూ, ఉద్యోగాలకూ ఎసరుపెట్టాయి.
డ్రాఘీ ప్రభుత్వ నయాఉదారవాద విధానాలు కార్మికులను, ప్రజలను మరింత దుర్భర దారిద్య్రంలోకి నెట్టాయి. మరోవైపు గతంలో కొంత స్వతంత్రంగా వ్యవహరించిన ఇటలీని డ్రాఘీ పూర్తిగా అమెరికా, ఐరోపా దేశాల కూటమికి సామంత రాజ్యంగా మార్చేశాడు. ఉక్రెయిన్ యుద్ధం సాకుతో రష్యాపై నాటో విధించిన ఆంక్షలకు మద్దతివ్వడంలో డ్రాఘీ అత్యుత్సాహం చూపించాడు. కానీ వాస్తవానికి రష్యాపై ఆంక్షల వల్ల ఐరోపాలో అధికంగా నష్టపోయేది ఇటలీనే. ఎందుకంటే ఇతర ఐరోపా దేశాలకాన్నా ఎక్కువగా ఇటలీ రష్యా ఇంధనం, చమురుపై ఆధారపడి ఉంది. ఇటలీ ఇంధన అవసరాల్లో 40శాతం వరకు రష్యా నుండి దిగుమతి అవుతుంది. ఆంక్షల వల్ల ఐరోపా మొత్తంగా, ముఖ్యంగా ఇటలీలో ఇంధనం ధరలు విపరీతంగా పెరిగాయి. పుండు మీద కారం చల్లినట్లు అసలే ద్రవ్యోల్బణం, అధిక ధరలతో బాధపడుతున్న ప్రజలకు ఈ ధరల భారం భరించలేని విధంగా దెబ్బతీసింది. రష్యా నుండి ఇంధన దిగుమతులు దాదాపు ఆగిపోవడంతో రానున్న శీతా కాలం ఇటలీ వాసులకు చాలా గడ్డు కాలం అని పరిశీలకులు చెబుతున్నారు.
దమనకాండ వైపు మొగ్గు
డ్రాఘీ ప్రభుత్వం సుస్థిరత తెస్తుందన్న ఇటలీ పాలక వర్గాల ఆశలు ఫలించలేదు. డ్రాఘీ తన పాలనా కాలంలో ఇటలీ ఆర్థిక వ్యవస్థను అమెరికా కనుసన్నల్లో నడపడానికి అన్ని విధాలా కృషి చేశాడు. అమెరికా యుద్ధ సన్నాహాల్లో ఇటలీని ప్రధాన భాగస్వామిని చేశాడు. సంక్షోభ భారాలను కార్మికవర్గం మీదకు నెట్టడానికి అన్ని రకాల చర్యలూ తీసుకున్నాడు. అన్ని పార్టీలనూ ప్రభుత్వంలో చేర్చుకోవడం ద్వారా ప్రజల్లో అసంతృప్తిని చల్లార్చడానికి ప్రయత్నించాడు. ఇన్ని చేసినా కార్మికవర్గంలో అసంతృప్తిని అణచివేయలేక పోయాడు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రభుత్వం పట్ల ఈ అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. మొదటిది, ఈ ఎన్నికల్లో ఓటింగు శాతం రికార్డు స్థాయిలో పడిపోయి 63.91శాతం నమోదయింది. 2018 ఎన్నిలకన్నా ఇది 9శాతం తక్కువ. రెండవది, గత ప్రభుత్వంలో భాగం పంచుకున్న పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో ఓట్లు కోల్పోయాయి. గతంలో అధికారం చెలాయించిన 5స్టార్ మూవ్మెంట్ ఓటింగు శాతం 32.7 నుండి ఒక్కసారిగా 15.1శాతనికి పడిపోయింది. డెమోక్రటిక్ పార్టీ మాత్రమే తన పాత ఓటింగు-సుమారు 19శాతం నిలుపుకుంది. లెగా పార్టీ ఓటింగు 17.4శాతం నుండి సగానికి సగం పడిపోయింది. ఇతర అన్ని పార్టీల ఓటింగ్ తగ్గింది. ప్రతిపక్షంగా వ్యవహరించిన మెలోనీ పార్టీ మాత్రం ఓటింగు శాతాన్ని 4.4 నుండి 26.2కు అంటే ఆరు రెట్లకు పైగా పెంచుకుని అధికార పగ్గాలు చేపట్టింది.
మెలోనీ - ఆమె పార్టీ
రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిస్టుల కూటమిలో భాగంగా ఉన్న ఇటలీ నియంత బెనిటో ముస్సోలినీకి రాజకీయ వారసురాలు మెలోనీ. ముస్సోలినీ చనిపోయిన తరువాత ఆయన పార్టీ కార్యకర్తలు యుద్ధానంతరం స్థాపించిన నయా- ఫాసిస్టు ఉద్యమం నుండి ఇటలీ సోదరుల ఉద్యమం పుట్టు కొచ్చింది. ఇతర ఐరోపా నయా-నాజీల మాదిరిగానే ఈమె పార్టీ కూడా మహిళల హక్కులను, స్వలింగ సంపర్కులకు ప్రత్యేక రక్షణలనూ వ్యతిరేకిస్తుంది. వలస ప్రజల పట్ల, ముస్లిం మైనారిటీల పట్ల విద్వేషాన్ని ప్రదర్శిస్తుంది. తెల్లజాతి దురహం కారాన్ని ప్రదర్శిస్తుంది. ఐరోపా యూనియన్ను వ్యతిరేకిస్తుంది.
గతంలో ఈ పార్టీని వ్యతిరేకించిన ఇటలీ పెట్టుబడిదారీ వర్గం, దాని మీడియా ఈ ఎన్నికల్లో ప్లేటు ఫిరాయించి మెలోనీ, ఆమె పార్టీ పట్ల సానుభూతి ప్రదర్శించింది. మెలోనీ కూడా గతంలో ఇచ్చిన ఫాసిస్టు తరహా నినాదాలను ఎన్నికల్లో తగ్గించారు. రష్యా పట్ల గతంలో ఉన్న సానుకూల వైఖరిని మార్చుకుని అమెరికా సామ్రాజ్యవాదులకు అనుకూలంగా మాట్లాడ్డం మొదలు పెట్టారు. ఇతర మితవాద పార్టీల మాదిరిగానే కార్మికులు, సామాన్య మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే నినాదాలతో ప్రాబల్యం సంపాదించిన ఇటలీ సోదరుల పార్టీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత తన గళం మార్చింది. అంతకు ముందు స్వదేశీ నినాదాలిచ్చింది. బడా కార్పొరేట్లకు వ్యతిరేకం అంది. రష్యా-ఉక్రెయిన్ వివాదంలో నాటోతో వెళితే ఇటలీకి నష్టం అని పేర్కొంది. కానీ ఎన్నికల తరువాత మెలోనీ ఉక్రెయిన్‌కు అనుకూలంగా మాట్లాడ్డం ప్రారంభించారు. నాటో సైనిక సన్నాహాలకు స్వాగత వచనాలు పలుకున్నారు.
దేశంలో ఒకవైపు తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, దానికి కార్మికవర్గం నుండి వస్తున్న ప్రతిఘటన ఇటలీ పాలక వర్గాలను తీవ్రంగా కలవర పెడుతున్నాయి. పాలక వర్గాల సంక్షోభాన్ని నివారించి కార్మికవర్గంపై భారాలు నెట్టే పని చేయగలిగినంత వరకు డ్రాఘీ ప్రభుత్వం వారికి సేవలు చేసింది. ఇక దానికా శక్తి లేనప్పుడు కార్మిక అశాంతిని అణచివేసే శక్తి వారికి కావలసి వచ్చింది. అన్ని చోట్ల మాదిరిగానే మితవాద శక్తులతో తమ పని జరుగుతుందని ఇటలీ పాలక వర్గాలు గ్రహించాయి. కనుకనే ఈ ఎన్నికల్లో నయా-ఫాసిస్టులకు మద్దతిచ్చాయి. ముందు ముందు మరిన్ని దుర్భర భారాలను మోయడమా లేక ఐక్య పోరాటాలతో తీవ్రమైన అణచివేతను ఎదుర్కొని ముందుకు పోవడమా, రెండే మార్గాలు ఇటలీ కార్మికవర్గం ముందున్నాయి.
- ఎస్ వెంకట్రావు