Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవాధారాలైన భూజలవాయువులు కలుషి తమయ్యాయి. ప్రపంచమే పెద్ద చెత్తబుట్టయింది. సమాజం వ్యర్థాల ఊబిలో కూరుకు పోయింది. వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్య. నేడు సమ్మిళిత ప్రగతిలో చైనా ప్రపంచంలో ముందుంది. వ్యర్థాల ఉత్పత్తిలోనూ ప్రథమ స్థానమే. 145కోట్ల జనాభాతో వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగానికి పోరాడుతోంది. అందులోనూ మొదటి స్థానంలో నిలిచింది.
అల్‌జజీరా సాప్తాహిక టెలివిజన్ కార్యక్రమం '101 ఈస్ట్'లో 4ఏండ్ల క్రితం చైనా వ్యర్థాల సమస్య, నిర్వహణ వెలుగు చూశాయి. చెత్త చెదారాల నిర్వహణను చైనా ఆధునీక రించింది. ఊటలూరే విశాల పల్లపు ప్రాంతాలతో, అపాయ కర పెరళ్ళతో, వ్యర్థాల పునర్వినియోగ కేంద్రాలతో నిర్వహణ ప్రణాళికలు రచించింది. పారిశుద్ధ శ్రామికులకు ప్రత్యామ్నాయ ఉపాధులు కల్పించింది. పర్యావరణ సమస్యలను పరిష్కరించు కుంది. పారిశుద్ధ కార్మికులు గుంపులుగా గుమిగూడి రోజూ దేశ రాజధాని బీజింగ్ నగర వీధులను శుభ్రపరుస్తారు. 2.2కోట్ల నగరవాసుల వ్యర్థాలను సేకరిస్తారు. వాంగ్ జిండాంగ్ లాంటి చెత్తను సేకరించేవారికి ఉపాధి,కుటుంబానికి జీవనాధారం లభిస్తున్నాయి. వాంగ్, భార్య, 11ఏండ్ల మేనల్లుడు మెంగ్నాన్తో పాటు నివసిస్తున్నాడు. ఆ పిల్లవాని పోషణకు, చదువుకు ఎన్ని కష్టాలైనా భరిస్తాడు వాంగ్. తాను సేకరించే పాత సీసాలకు వచ్చే డబ్బు వాంగ్ కుటుంబ పోషణకు, మెంగ్నాన్ చదువుకు సరిపోతుంది. అయితే దేశం ప్రకటించిన 'వ్యర్థాలపై యుద్ధం' చెత్తచెదారాలు ఏరుకొని బతికేవారి ఉపాధిని మార్చేస్తోంది. ఈ పారిశుద్ధ సైన్యంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
తమ వ్యర్థాలను పునర్వినియోగానికి వీలుగా వేరుచేసి ఉంచమని చైనా వినియోగదారులను ఆదేశించారు. ఒకసారి వాడిపారేసే ప్యాకేజీల పరిమితికి పలు ప్రతిపాదనలు చేశారు. ''నగరాలలో సామూహిక వ్యర్థాలను కాల్చి వేస్తారు. 2020కు గృహ వ్యర్థాలను కూడా కాల్చివేసే ప్రణాళికను ప్రభుత్వం పూర్తిచేసింది. 2017 మార్చిలో 46 నగరాలలో చెత్త వేర్పాటును తప్పనిసరి చేసింది. ప్రజా వ్యవస్థలు, వ్యాపార సంస్థలు వ్యర్థాలను అపాయకరమైన, వంట వ్యర్థాలు, పునర్వినియోగ పదార్థాలుగా వేరు చేయాలి. 2017 నవంబర్‌కు 12నగరాలు ఆ మేరకు నిబంధనలు సవరించి చట్టాలు చేశాయి. 24నగరాలు ఈ కార్యక్రమాల నిర్వహణకు పలు ప్రణాళికలు రచించాయి'' అని గృహ నిర్మాణ, పట్టణ, గ్రామీణ అభివృద్ధిశాఖా మంత్రి వాంగ్ మెంఘుయి అన్నారు. టాంగౌ జిల్లా ప్రజా సంస్థలలో, 2,500 రెస్టారెంట్లలో వ్యర్థాల వేర్పాటు పనులు ప్రవేశపెట్టారు. ఈ ప్రదేశాలలో వేరుచేసిన ఆహారపదార్థాల వ్యర్థాలను ప్రత్యేకంగా నిర్మించిన వాహనాలలో పారిశుధ్య కంపెనీలు తీసుకుపోతాయి. ఆహార వ్యర్థాలలో ఇతర వస్తువులను కలిపితే నిర్వాహకులు జరిమానా విధిస్తారు. శిక్షిస్తారు. నివాస సమూహాలు కూడా ఈ పద్ధతులను పాటించేటట్లు ప్రోత్సహించారు. నివాస ప్రదేశాలలో ఈ ప్రక్రియలు అమలు చేసినందుకు ప్రోత్సాహకాలు చెల్లిస్తారు. 2017 అక్టోబర్‌కు షాంఘైలో 40లక్షల నివాస సముదాయాలు ప్రోత్సాహకాలు పొందాయి. ఆ డబ్బులతో నిత్యావసారాలు సమకూర్చుకున్నాయి. షాంక్జి రాష్ట్రం తైయువాన్ నగరంలో మేధోపర వస్తు వ్యర్థాల నిర్వహణ డబ్బాలను స్థాపించారు. ప్లాస్టిక్ సీసాలు, కాగితం వస్తువులకు వేరు వేరు బార్కోడ్లు అతికించి వ్యర్థాల డబ్బాలలో పడేస్తారు.
చైనా, విదేశాల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను అధిక మోతాదులో దిగుమతి చేసుకునేది. వాటిని పునర్వినియోగాలుగా మార్చేది. ప్లాస్టిక్, కాగితాలు, వస్త్రాల ముడిపదార్థాలు, రసాయనాలు మొదలగు 24రకాల విదేశీ వ్యర్థాల దిగుమతిని చైనా 2017లో నిషేధించింది. 2018 జనవరిలో ప్లాస్టిక్ దిగుమతులు, పునర్వినియోగ ప్రక్రియలపై పరిమితులు విధించింది. పూర్తి నిషేధానికి దారితీసింది. ఫలితంగా నెదర్లాండ్స్ లాంటి దేశాలు వ్యర్థాల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పరిపాలన, ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణ, నాణ్యతా పర్యవేక్షణ మంత్రిత్వ శాఖలు దిగుమతుల క్రమబద్దీకరణ, అక్రమ రవాణాల నిరోధంలో కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. వ్యర్థాల మార్పు సౌకర్యాలను, నిర్వహణ పద్ధతులను చైనా మెరుగుపరిచింది. వ్యర్థాలను నిరపాయకర వనరులుగా మార్చుతోంది. మధ్య చైనా రాష్ట్రం హునాన్‌లో వంట వ్యర్థాలను క్రమబద్దీకరిస్తారు. చితక్కొడతారు. జల్లెడ పడతారు. యంత్రాలతో నొక్కుతారు. వ్యర్థాల నుండి నూనె, నీళ్ళను, అవశేషాలను వెలికితీస్తారు. ఆధునిక పద్ధతులతో వ్యర్థపదార్థాల నూనెను మిశ్రమ పారిశ్రామిక చమురుగా, బయో డీజల్గా మార్చుతారు. వ్యర్థ జలాలను గాలి లేకుండా మురిగించి సామాన్య వ్యర్థాల స్థాయికి చేర్చుతారు. శుద్ధిచేసి సహజ వాయువులుగా మార్చుతారు. ఈ మురుగు వాయువులు విద్యుదుత్పత్తికి ఉపయోగపడతాయి. వ్యర్థాల అవశేషాలను పెంపుడు కీటకాల ఆహారంగా, పశువుల మేతగా వాడతారు. అనగా వంటగది వ్యర్థాలు అపాయరహితంగా ఉపయోగ పడుతున్నాయి. మధ్య చైనా రాష్ట్రం హుబీలోని సోంగ్జి సిమెంట్ బట్టీలో గృహ వ్యర్థాలను ఉపయోగించే ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టులో వ్యర్థాలను మండే పదార్థాలు, మండని పదార్థాలు, లోహాలుగా విడగొడతారు. మండే పదార్థాలను సిమెంట్ తయారీలో ఇంధనాలుగా వాడతారు. మండని పదార్థాలు సిమెంటు ముడిపదార్థాలుగా ఉపయోగ పడతాయి. లోహాలు పునర్వినియోగించ బడతాయి. చైనా పట్టణాలు, నగరాలలో ఎలెక్ట్రానిక్ వ్యర్థాలు ఎక్కువ. పారిశ్రామిక, ఘనరూప వ్యర్థాలను పునర్వినియోగాలుగా మార్చుతున్నారు. గ్రామీణ ప్రజలను వ్యర్థాల నిర్వహణలో చైతన్యపరు స్తున్నారు. గ్రామీణ ప్రాంతాల జల కాలుష్యాన్ని సమర్థవంతంగా నిర్మూలిస్తున్నారు. కొన్ని వ్యర్థాలను ఎరువుగా ఉపయోగిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మానవవిసర్జితాలను ఎరువుగా, మూత్రాన్ని ఎరువుగా, మందుల్లో వాడతారు.
పర్యావరణ, ఆరోగ్య సమస్యలను అధిగమించి, ఆర్థిక, సామాజిక ప్రగతి సాధించాం. 2019 నాటికి వ్యర్థాలన్నిటినీ వనరులుగా మార్చే పథకాలు రూపొందించామని చైనా పర్యావరణ, పరిరక్షణ అధికారి గుయో జింగ్ పేర్కొన్నారు.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్:9490204545