Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిష్యుడు: కుడి ఎడమైతే పొరపాటు లేదోరు. ఓడిపోలేదోరు.. అనేది పాత దేవదాసు సినిమాలో ఘంటసాల పాట గురువుగారు. ఇప్పుడేమో ప్రపంచమే కుడి ప్రక్కకు ఒరిగిపోతున్నదని చాలామంది ఆందోళన పడుతున్నారు. దీని అర్థం ఏమిటో కొంచెం వివరించరా...
గురువు: కుడి ఎడమైతే పర్వాలేదు గాని, ఎడమ కుడి అయితేనే ప్రమాదం. రాజకీయాల్లో మితవాదులను కుడివైపువారని (రైటిస్టులు), అతివాదులను వామపక్షీయులని (లెఫ్టిస్టులు), పలకడం జననానుడి. ఫ్రెంచి విప్లవ కాలం నుండి ఇది వస్తున్నది. స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం కోరుకునేవారు లెఫ్టిస్ట్లయితే, ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యక్తివాదం, జాతీయవాదం, సంప్రదాయ యధాతధ స్థితిని (దోపిడి, వివక్ష, ఛాందసత్వం మొదలగువాటితో సహా) కోరుకునేవారు రైటిస్టులయ్యారు. ఈ రెండు వాదాలు ప్రపంచమంతటా ఉన్నవే. అయితే ఇప్పుడు ఇటలీ నియంత ముస్సోలినీ వారసురాలు జార్జియా మెలోని ఎన్నిక కావడంతో మితవాదులది పైచేయి అయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
శిష్యుడు: అంటే ప్రపంచం వెనక్కి నడుస్తుందా...?
గురువు: అదే పొరపాటు. 'ప్రజలే చరిత్ర నిర్మాతలు' అని మార్క్స్ ఏనాడో చెప్పాడు. ఎప్పటికైనా ప్రజలు ఉద్యమాలతో, తిరుగుబాట్లతో, విప్లవాలతో తమకు అనుకూలమైన వ్యవస్థను ఏర్పరుచుకుంటారు. అయితే రైటిస్టులు ఒక్కోసారి నయా ఫాసిస్టులుగా మారి ప్రజా జీవితాలపై ఉక్కుపాదం మోపుతారు.
శిష్యుడు: తొండ ముదిరి ఊసరవెల్లిగా మారుతుందన్నమాట.
గురువు: బాగా చెప్పావు. అయితే ఇది వ్యక్తికే, వ్యవస్థకే పరిమితం కాదు. రాజ్యపాలనలో చొరబడి రాక్షసబల్లిగా మారి ప్రాణాంతకమవుతుంది.
శిష్యుడు: కొంచెం వివరించండి..
గురువు: ఆర్థిక అంతరాలు పెరుగుతున్న కొద్దీ, వ్యతిరేక దిశలో పేదరికం, నిరుద్యోగం ప్రబలుతుంది. అవినీతి, ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుతుంది. అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొంటుంది. ప్రజాజీవితం కకావికలం అవుతుంది. పాలకులు ప్రజలకిచ్చిన వాగ్దానాలు సిగ్గులేకుండా వమ్ము చేస్తారు. ప్రజల గోడు పట్టించుకోకుండా అణచివేత చర్యలు ముమ్మరం గావిస్తారు. అంతే కాదు, ప్రజల మధ్య చీలికలు తెచ్చి పబ్బం గడిపేందుకు విద్వేష భావాల విషాన్ని చిమ్ముతారు. బతుకు తెరువుకై వలస వచ్చినవారిని, మైనారిటీలను, బడుగుజాతి ప్రజలను హీనంగా చూస్తూ హత్యలకు, మారణహౌమాలకు ఏమాత్రం వెనుకాడరు. గుజరాత్ నరమేధం పాఠం అదే.
శిష్యుడు: గురువుగారూ మీరు చెపుతున్న వన్నీ అక్షరం అక్షరం మన ప్రధాని మోడిగారి పాలనలో అమలు జరుగుతున్నవే కదా...
గురువు: 'బలవంతుడు బలహీనుల దుర్భలగావించిరి. నరహంతుకులే ధరాధిపతులై చరిత్ర ప్రసిద్ధికెక్కిరి' అని మహాకవి శ్రీశ్రీ చెప్పలేదా...
శిష్యుడు: నిశితంగా పరిస్థితిని పరిశీలిస్తుంటే భయం వేస్తుంది గురువుగారూ...
గురువు: భయపడాల్సిన పనిలేదు. బాధల్లోని ప్రజానీకం గురించి అదే శ్రీశ్రీ ఇలా చెప్పాడు. 'అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం.. ఇది ప్రజా సహజ గుణం.
శిష్యుడు: నిజమా...?
గురువు: నిజమే. కావాలంటే అదే గుజరాత్లో జరుగుతున్న ప్రజా తిరుగుబాటు గురించి చెపుతాను విను.
మాల్దారీలనే పశువుల పెంపకందార్లు అక్కడి బీజేపీ పాలకులకు ముచ్చెమటలు పట్టించారు. వారు పెంచుకునే పశువులు, మేకలు, గాడిదలు పట్టణ, నగర ప్రవేశం చేయరాదని అడ్డుకుంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ బిల్లును రూపొందించింది. అదిగాని చట్టంగా మారితే తమ వృత్తి జీవనానికే ప్రమాదమని వారు ఆందోళన చెందారు. ఆ బిల్లు ప్రకారం వారి పశువులు, పెంపుడు జంతువులు రోడ్లపైకి రావాలంటే లైసెన్స్ తీసుకోవాలి. వాటి మెడకు ట్యాగ్ తగిలించాలి. లేకుంటే వాటి యజమానికి ఐదేండ్లు జైలు శిక్షతో పాటు ఐదులక్షల రూపాయల జరిమానా కూడా.
శిష్యుడు: ఏంటి పశువు రోడ్డుమీదకొస్తేనే ఇంత పెద్ద శిక్షా. మరి గోమాతే మా దేవత అని బీజేపీ వారు గుండెలు బాదుకుంటారే...!
గురువు: వారు చెప్పేదొకటి, చేసేది ఒకటి. ఆ భాగోతం కూడా విను. గోస్వస్థత, గోరక్షణ కోసం ఎప్పుడో కేటాయించిన రూ.500కోట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడీ బిల్లుతో ఆ మాల్ దారీలు అందరూ ఆగ్రహౌదృగ్యులయ్యారు. యూపీ, రాజస్థాన్ ప్రాంతాల నుండి తరలివచ్చినవారు తరతరాలుగా గిర్ అభయారణ్యాన్ని ఆవాసంగా చేసుకుని అక్కడ బతుకుతున్నారు. ఆ మైదాన అడవుల్లో పశువులు పెంచుకుంటూ పాల ఉత్పత్తులు విక్రయించుకోవడం వారి జీవన విధానం.
భేషరతుగా బిల్లును తక్షణం ఉపసంహరించుకోమని డిమాండ్ చేస్తూ మాల్దారీలు ఉప్పెనలా ఆందోళనకు దిగారు. అహమ్మదా బాద్, గాంధీనగర్ ముఖ్యనగరాలతో పాటు అనేక పట్టణాలను దిగ్బంధనం చేశారు. పాలవిక్రయాన్ని స్వచ్ఛందంగా నిలిపివేసారు. రాకపోకలు స్తంభింపచేశారు. ఎక్కడికక్కడ పాలు నేలపాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. పాలు లేక సామాన్య జనంలో అసహనం పెరిగింది. అధికారులు, పోలీసులు విస్మయానికి గురయ్యారు. ఇకప్పుడు గత్యంతరం లేక పాలకులు పరుగున అసెంబ్లీని సమావేశపర్చుకుని చర్చలేకుండానే ఆ బిల్లును వెనక్కి తీసుకున్నారు.
శిష్యుడు: భలే.. భలే.. అదీ తడాఖా... మాల్దారీలకు జై.
గురువు: చూశావా శిష్యా! నిజమా..? అని అడిగిన నువ్వే జై కొడుతున్నావు. అమానుష లాభాల దోపిడీకై ఉద్భవించిన పెట్టుబడిదారీ వర్గం తనకు గోరీకట్టే కార్మిక వర్గాన్ని కూడా సృష్టించుకుంటుందని మార్క్స్ తెలిపినట్లు నయా పాసిజాన్ని అంతం చేసే నవ మానవుడూ ఉద్భవిస్తాడు. 'నేనెదిగిన మట్టి నాది / నాదేయని ఘోషిస్తా / నా రక్తం ధారపోసి / నవలోకం స్థాపిస్తా' అని ప్రజాకవి అనిసెట్టి ప్రకటనలా పిడికిలెత్తి ప్రతినబూనతాడు.
- కె శాంతారావు
సెల్: 9959745723