Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిమాసాలుగా చెబుతున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్ఎస్)ని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)గా మార్చు తున్నట్టు ప్రకటించారు. ఆ మేరకు తమ రాష్ట్ర సమావేశంలో ఆమోదించిన తీర్మానం ఇప్పుడు ఎన్నికల సంఘం ముందుంది. ఆ ప్రక్రియ ఎన్ని రోజులు తీసుకుంటుందో తెలియదు, ఈలోగావచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం పాతపేరుతోనే పాల్గొంటున్నారు. అత్యంతకీలకమైన ఈ ఉపఎన్నికలో ఉభయ కమ్యూనిస్టుపార్టీల మద్దతుతో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే అంచనాలున్నాయి. మరోవైపున బీజేపీ సామదానభేద దండోపాయాలన్ని ప్రయోగిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్‌షాలతో సహా ప్రత్యక్షపాత్ర వహిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితంతో పాటు బీఆర్ఎస్ ప్రభావంపైనా తెలుగురాష్ట్రాలలో విపరీతమైన ఆసక్తి నెలకొన్నది. దక్షిణ బారతదేశంలో బలంగా కాలూనాలని చూస్తున్న బీజేపీకి ఇది మొదటి సవాలుగా మారనున్నది.
టీఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ దిశగా
ఒక ప్రాంతీయ పార్టీ పేరు మార్చుకుని జాతీయ పార్టీగా మారడం అరుదైన విషయమే. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టుపార్టీలను మాత్రమే జాతీయ పార్లీలుగా పరిగణించడం కద్దు. నాలుగు రాష్ట్రాలలో ఆరుశాతం ఓటింగు లేదా పార్లమెంటులో మూడు రాష్ట్రాల నుంచి రెండు శాతం సీట్లు(4) మూడు రాష్ట్రాలలో ఆరుశాతం ఓట్లు, కాదంటే నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన వాటిని జాతీయపార్టీలుగా పరిగణించడం జరుగుతుంది. ఒక సారి వచ్చే గుర్తింపును తదుపరి రెండు ఎన్నికలలో ఒకసారైనా నిలుపుకోగలిగితే హోదా కొనసాగుతుంది. లేదంటే రద్దవుతుంది. తెలంగాణలో ఎలాగూ అవసరమైన సీట్లు తెచ్చుకోగల బీఆర్ఎస్ మరో రెండు రాష్ట్రాలలో ఆరుశాతం ఓట్లు తెచ్చుకోగలిగితే జాతీయపార్టీ కావచ్చు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అవతరించి, తెలంగాణ సాధనను పూర్తిచేసి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్కు ఆ అవకాశం ఏ మేరకు ఉంటుందని ప్రతివారూ లెక్కలు వేస్తున్న స్థితి. తెలంగాణ సెంటిమెంటు ప్రధానంగా విజయం సాధించిన టీఆర్ఎస్ రాష్ట్రం పేరు స్థానే బీఆర్ఎస్గా మారితే ఆ సెంటిమెంటు ఏమవుతుందనే సందేహం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నేతలలోగాని ప్రజలలోగాని ఏ సెంటిమెంటు ఉన్నా అదొక్కటే ఎల్లకాలం అలాగే ఉంటుందని అది మాత్రమే గెలిపిస్తుందని ఎవరూ అనుకోరు. కేసీఆర్ కూడా రాష్ట్ర ఏర్పాటు దిశలో అడుగులు వేస్తున్న కొద్దీ తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోతుందని, గెలవడానికి తగు ఎత్తుగడలు అనుసరిస్తుందని సూటిగానే ప్రకటించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న టీడీపీ, జాతీయంగా బలహీనమైన కాంగ్రెస్ ఎంఎల్ఎలను సామూహికంగా తమలో కలుపుకున్నారు. బీజేపీ కూడా ఈ క్రమంలో బలహీనపడిపోయినా 2019 పార్లమెంటు ఎన్నికలలో ఉభయులూ పార్లమెంటు స్థానాలు సాధించి అధికార పోరాటం తీవ్రంచేశారు. అందులోనూ మోడీ నాయకత్వం కేంద్రీకరించి తెలంగాణ శాఖకు మద్దతునివ్వడం, దుబ్బాక ఉపఎన్నిక, జిహెచ్ఎంసి ఫలితాలు వారిలో ఆశలు పెంచాయి. టీఆర్ఎస్లో చర్యకు గురైన ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి హుజూరాబాద్‌లో విజయం సాధించడం మరింత ప్రచారం తెచ్చింది. ఆ తర్వాత నాగార్జునసాగర్‌లో ఓడిపోయినా మునుగోడులో కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఎన్నికల ముందు సవాలుగా తయారైంది.
ఏపీ, తెలంగాణ, ఇతర చోట్ల..
ఇదే కాలంలో దేశంలో మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడలు రాష్ట్రాల హక్కులపై దాడి, నిధుల నిరాకరణ మతతత్వ రాజకీయాలు ముదిరిపోవడంతో కేసీఆర్ వాటిని నిశితంగా విమర్శించడమే గాక నికరంగా ఎదుర్కొవడం వాతావరణాన్ని మార్చివేసింది. ఆయన తమతో మంచిగా ఉన్నప్పుడు కొంత ఉపేక్షా భావం చూపిన కేంద్రం ఇప్పుడు అడుగడుగునా కక్షగట్టి వ్యవహరించడం మొదలు పెట్టింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాజకీయంగా బీజేపీతో మంచిగా ఉండటమే గాక పాలనాపరంగా రాష్ట్రానికి రావలసిన వాటికోసం కూడా గట్టిగా పోరాడని స్థితి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతసారి బీజేపీతో కలసి అధికారం చేసి ఆఖరులో వ్యతిరేకించినా ఓటమి తర్వాత మళ్లీ మౌనం దాల్చారు. ఇప్పటికే జనసేనతోకలసి ఉన్న బీజేపీతో జట్టుకట్టే అవకాశం గురించి టీడీపీ నిరంతరం కథనాలు ఇస్తూంది. బీజేపీ వాటిని తోసిపుచ్చుతూ ఆయనపై ఆయన పార్టీపై తీవ్ర విమర్శలే చేస్తూన్నా టీడీపీ స్పందించడానికి సంకోచిస్తోంది. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిధులు, రెవెన్యూలోటు ఇలా చాలా విషయాల్లో కేంద్రం సహయ నిరాకరణ చేసినా రెండు ప్రధాన పార్టీలు నోరెత్తని దుస్థితి. బీజేపీ మతరాజకీయాలపై ఏకపక్ష పోకడలపై మాట్లాడింది అసలే నాస్తి. ఆలయాల సమస్యలతో సహా బీజేపీ తీవ్ర వివాదాలు సృష్టిస్తున్నా వీటిలో మార్పులేదు. మూడు ప్రాంతీయ పార్టీలూ బీజేపీకి లోబడి వ్యవహరిస్తుంటే వామపక్షాలు మాత్రమే పోరాడుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలతో సహా కీలక సందర్బాలలో మోడీకి మద్దతిచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ కూడా బీజేపీపై పోరాటం కన్నా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వంపైనే దాడి కేంద్రీకరిస్తున్న స్థితి.
ఈ నేపథ్యంలో కేసీఆర్ బీజేపీ వినాశక విధానాలపై గట్టిగా నిలబడటం, ఆ దిశలోనే జాతీయ పార్టీగా మారడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఉభయ కమ్యూనిస్టుపార్టీలూ ఈ ఏర్పాటును స్వాగతించాయి. దీనికన్నా ముందు దేశంలో వివిధ రాష్ట్రాలు పర్యటించి వచ్చిన కేసీఆర్ ప్రయత్నాలకు సానుకూలత లభించింది. అయితే బీజేపీ వ్యతిరేకకూటమి ఎలా ఏర్పడుతుంది, దానికి నాయకత్వం ఎవరిది వంటి ప్రశ్నలపై అనేక సందేహాలు వ్యక్తమైనాయి. బెంగాల్లో మమతాబెనర్జీ, ఢిల్లీలో కేజ్రీవాల్, బీహార్‌లో నితిష్‌కుమార్ వంటివారు కూడా నాయకత్వం కోసం లేదా ప్రధాని స్థానం కోసం ఆశిస్తున్నట్టు అర్థమైంది. వీరిలో మమతపై ఈడీ దాడులు జరిగాక ఆమె ఆరెస్సెస్ కీర్తనలు మొదలుపెట్టారు. నితిష్ కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతూ తనది మరో మార్గమన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్సీపీ శరద్‌పవార్ తమకు నాయకత్వ ఆశలు లేవన్నారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముందునుంచీ ఎన్నికల తర్వాతే ప్రధాని పదవి లేదా కూటమి వంటివి చర్చకు వస్తాయని స్పష్టంగా చెబుతూనే ఉన్నారు. అనంతర పరిణామాలతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం విపరీత స్థాయికి చేరిన మోడీ సర్కారు నిరంకుశ పోకడల ప్రతిఘటన, సమాఖ్య తత్వం లౌకికతత్వం కాపాడుకోవడం కీలకమనే కోణంలో కేసీఆర్ ప్రయత్నాలు ఆహ్వానించ దగినవిగా మారాయి.
బీఆర్ఎస్ విస్తరణ, అవకాశాలు
కేసీఆర్ జాతీయ పార్టీ అంటున్నంత మాత్రాన దేశమంతా ఆ పార్టీ ఉన్నఫలాన విస్తరించడం జరగదు. వాస్తవిక, రాజకీయ సాంకేతిక దశలు ఉన్నాయి. కేసీఆర్ తొలి ప్రాధాన్యత తెలంగాణ కాగా అక్కడ బలం నిలబెట్టుకోవడంపైనే తదుపరి పాత్ర ఆధారపడి ఉంటుంది. స్వయాన కేటీఆర్ సమయం పడుతుందని స్పష్టత ఇచ్చారు. ఒకప్పటి నైజాం సంస్థానంలో భాగాలుగా ఉన్న నైజాం, కర్నాటక, మహరాష్ట్రలోని మరాట్వాడా ప్రాంతాలు తమ తొలి కార్యక్షేత్రంగా ఉంటాయని వారు చెబుతున్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి స్వయంగా ఈ సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పూర్వపు నిజాం ప్రాంతంలో పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తుందని, రాష్ట్ర శాసనసభలో తమకు మద్దతునిస్తుందని కుమారస్వామి ప్రకటించారు. మహారాష్ట్రలో శివసేన స్పందించలేదు గానీ బీజేపీ వ్యతిరేక శక్తిగా ఉంది. మరాట్వాడాలో పోటీకి బీఆర్ఎస్ తప్పక ప్రయత్నిస్తుంది.
వీటన్నిటినీ మించి పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీలో కేసీఆర్ ఏం చేస్తారనేదానిపై చాలా చర్చ నడుస్తున్నది. గత విభజననాటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఏపీలో ఆదరణ పొందడం కష్టసాధ్యమనే బలమైన అభిప్రాయం ఉంది. జగన్, కేసీఆర్ ప్రభుత్వాలకు గతంలో సాన్నిహిత్యం ఉన్నా ఇటీవల వివిధ ద్వైపాక్షిక సమస్యలు పరిష్కారం గాక ప్రతిష్టంభన కొనసాగుతోంది. పరస్పర విమర్శలు కూడా చూస్తున్నాం. వైసీపీ బీజేపీతో కలసి పోటీ చేయదుగాని మోడీ విధానాలపై పోరాటం దాని ఎజెండాలో లేదు. ఏమైనా బీఆర్ఎస్వల్ల తమకేమీ నష్టం లేదని వైసీపీ నేతలు మంత్రులు ప్రకటించారు. తమకు రాష్ట్రమే ముఖ్యమని కూడా స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీఆర్ఎస్పై వ్యాఖ్యానం దాటేస్తే కొందరు నాయకులు మాత్రం తీవ్రంగానే స్పందించారు. మరికొందరు ఇతరులు కూడా విభజన ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట్లాడిన తీవ్ర పదజాలాన్ని గుర్తుచేస్తున్నారు. ఏమైనా కాలం గడిచే కొద్ది ప్రజలు రెండుచోట్ల రాజకీయంగా వాస్తవికంగా ఆలోచిస్తారు గాని వాటిలోనే చిక్కుకుని ఉండకపోవచ్చు. కేసీఆర్ ఈ కసరత్తులో భాగంగా ఉండవల్లి అరుణకుమార్ వంటివారిని పిలిపించుకుని మాట్లాడారు. అయినా ఆయన ఇప్పుడు ప్రత్యక్ష పాత్ర వహించే అవకాశం ఉండకపోవచ్చు. టీడీపీలో కేసీఆర్ తమ పూర్వ సహచరులను కొందరిని కూడగడుతున్నారని కథనాలు ఉన్నాయి. ఏపీలో పెద్ద సభ జరుపుతారని వార్తలు వచ్చినా తమ తొలి ప్రాధాన్యతల్లో ఏపీ లేదని బీఆర్ఎస్ నేతలు చెప్పేశారు. చంద్రబాబు తెలంగాణలో తలదూర్చినప్పుడు తామెందుకు ఏపీ రాకూడదని కూడా కొందరు ప్రశ్నించారు. తమిళనాడు నుంచి విఎంసి ఎంపి వచ్చి పాల్గొనగా ఆ పార్టీనే విలీనం చేస్తారని ముందు సూచనలు వచ్చాయి. అదే జరిగితే అక్కడ డిఎంకె కూటమిలో చేరినట్టవుతుంది. ఇతర ప్రాంతీయపార్టీలేవీ కోరి బీఆర్ఎస్ను ఆహ్వానించవనేది స్పష్టమే.
దేశంలో మొత్తం 100స్థానాల్లో బిఆర్ఎస్ పోటీ పెడుతుందని ఒక వార్త కాగా యాభై స్థానాలపై కేంద్రీకరిస్తుందని మరోలెక్క. కేసీఆర్ హిందీలో బాగా మాట్లాడటం ప్రజలను ఆకట్టుకుంటుందని ఆయన సన్నిహితుల మాట. కొందరు రైతు ప్రతినిధులను ఆహ్వానించిన కేసీఆర్ వారి సహాయంతో ఉత్తరాదిన ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ ముందు ముందు తేలాల్సిందే. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే ప్రయత్నాలలో కాంగ్రెస్ స్థానముంటుందా అనేదానిపై కూడా బీఆర్ఎస్ దాటేస్తున్నది. కాంగ్రెస్‌నేతలు టీఆర్ఎస్ను బీజేపీ బిటీం అంటు పార్టీ ఏర్పాటును తెలంగాణ అస్తిత్వ హత్యగా కొట్టిపారేశారు. బీజేపీ కూడా ఇదేవిధంగా మాట్లాడింది. త్వరలోనే కేసీఆర్ కుటుంబ సభ్యులతో సహా ఈడీ దాడులను ఎదుర్కొవలసి ఉంటుందని గట్టి సూచనలిస్తున్నారు. ఈదాడులకు గురవుతున్న వారిలో ఇరురాష్ట్రాల సంస్థలూ ఉన్నాయి. కనుక రాబోయే రోజులలో రాజకీయంగా తీవ్ర పరిణామాలే చూడటం అనివార్యం కావచ్చు.
- తెలకపల్లి రవి