Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకానొక కాలంలో ఓ రాజుకు ఓ అనుమానం వచ్చిందట. అదేమంటే ఆహార పదార్థాల్లో తీయనైనది ఏది అని. ఎటూ రాజు కాబట్టి తన ఆస్థానంలో కవులకు, పండితులకు కొదవ ఉండదు. తనను పొగడడానికి వందిమాగధులు కూడా ఉంటారు. అలా ఎందుకుంటారు అన్న ప్రశ్నలు మనం అడుగరాదు. ఎందుకంటే అతను రాజు కాబట్టి. తాను వాడేది ప్రజల డబ్బు కాబట్టి. ప్రజలంటే తానే కాబట్టి. తానంటే ఏ ఒకరో ఇద్దరో స్నేహితులు కాబట్టి. ఇక్కడ రాజు అనుమానం గురించి చెప్పుకోవాలి కాబట్టి మళ్ళీ సబ్జక్టులోకి వద్దాం. ప్రపంచంలో దొరికే, చేసే ఆహార పదార్థాల్లో తీయనిది ఏది? ఒకరు లడ్డు తీయనైనది అన్నారు. వెంటనే ఇంకొకరు లేచి మొన్న రాజుగారు ఇచ్చిన విందులో భక్ష్యం తిన్నాను అదెంత తీయగా ఉందో, నా జీవితంలో అంతకంటే తీయనైనది నేను చూడలేదు అన్నాడు ఇంకొకాయన. రాజు మొహంలో వెలుగు రావడం మామూలే. అంతకంటే వెలుగొచ్చే మాట ఇంకొకాయన చెప్పాడు. ఆరోజు మొదట లడ్డు తిన్నాను, తరువాత భక్ష్యం, తరువాత పాయసం తాగాను. రెండు తీపి పదార్థాలు తిన్న తరువాత కూడా పాయసం తీయగా అనిపించిందంటే పాయసమే తీయనైనది అన్నాడు. ఇంకో రాజభక్తుడు లేచాడు, ప్రపంచంలో అన్నింటికన్నా తీయనైనది రాజుగారి మనస్సు అనేశాడు. అఫ్కోర్స్ అతని మెడలో ఓ బంగారు నగ వచ్చి పడింది ఆటోమేటిక్కుగా. రాజు మొహం వెలుగులతో నిండిపోయింది కాని సరైన సమాధానం రాలేదని ఆ మొహంలో ఏదో మూలలో తెలిసిపోతోంది. ఇక లాభం లేదని బాగా తీయనైన విషయం కాబట్టి వంటవాళ్ళను పిలిచి అడగండి మహారాజా అని ఎవరో సలహా ఇచ్చారు. వాళ్ళు ఎన్నో వంటలు వండి ఉంటారు, ఎందరో తిండి ప్రియులను చూసి ఉంటారు అని చెప్పుకొచ్చారు.
వంటల శాఖలో బాగా సీనియర్ సభ్యున్ని ప్రవేశపెట్టండి అన్నాడు రాజు. అతడిని పిలిపించారు. ఆయన రానేవచ్చాడు. ప్రపంచంలో తీయనైనది ఏదో చెప్పి మా అనుమానం తీర్చాలి అని అడిగాడు రాజు. అప్పుడు ఆ సీనియర్ ఒకటే మాట చెప్పాడు, ప్రపంచంలో అతి తీయనైనది అంటూ ఏదీ లేదు మహరాజా అదంతా మన నాలుకలో ఉంటుంది. అంతే తప్ప పదార్థంలో లేదు, ఒక్కొక్కరి జిహ్వ ఒక్కో రుచిని ఇష్టపడుతుంది. ఒక్కో సమయంలో ఒక్కో తీపి పదార్థం అమృతంలా తీయగా అనిపిస్తుంది. అదే పదార్థం మరోసారి అంత తీయగా అనిపించకపోవచ్చు. కాబట్టి మీ ప్రశ్నకు సూటిగా ఒకే ఒక్క సమాధానం చెప్పడం కష్టం మహరాజా. ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే మన్నించండి అన్నాడు అతి వినమ్రంగా. రాజుకు ఈ సమాధానం నచ్చింది. మీరు మామూలు వంటవాడిలా లేరు. ఇంకా ఏదో దాస్తున్నారు, మొత్తం విషయం చెప్పండి. తీపి విషయం ఈరోజు పూర్తిగా తెలిసిపోవాలి అన్నాడు రాజు.
ఇక తప్పదని చెప్పడం మొదలుపెట్టాడు సీనియర్ వంటమనిషి. రాజా మీకు అధికారం ఉన్నప్పుడు అది తీపిగా అనిపించక పోవచ్చు. కానీ ఇంకో రాజ్యాన్ని జయించాలన్న కోరిక ఉన్నప్పుడు అదే అతి తీయగా ఉంటుంది. జయించి వచ్చాక ఆ తీయదనం నిలబడదు. ఇంకో విషయం, మీరు ఏ దేశంపై దాడి చేస్తున్నారో ఆ రాజుకు తన దేశాన్ని మీ పరం కాకుండా నిలబెట్టుకోవడమే అతి తీపి విషయంగా అనిపిస్తుంది. మీరు గెలిస్తే అది అతనికి చేదు విషయం, లేదా మీరు వాళ్ళపై దాడికి పోకపోవడం కూడా తీపి విషయమే. మీ విషయానికి వచ్చేటప్పటికి మొత్తం అటువి ఇటుగా, ఇటువి అటుగా మారిపోతాయి. కాబట్టి ఒకరికి తీపి పదార్థం ఇంకొకరికి చేదుగానో వగరుగానో కూడా ఉంటుంది. అదే మధుమేహం ఉన్నవాళ్ళు తీయగా ఉన్న పదార్థం తింటే వాళ్ళకు విషం కింద లెక్క. కారం బాగా ఇష్టపడేవాళ్ళకు పక్కనోడు తీయగా ఉందని జుర్రుకొని తింటున్నా పెద్దగా పట్టదు. కాబట్టి తీపి లేదా ఏదైనా రుచి అన్నది మనిషిని బట్టి, అతని పరిస్థితిని బట్టి ఉంటుంది అని చెప్పేసరికి రాజుకు ఎందుకో అనుమానం వస్తుంది. ఈయన నా ఆస్థానంలో ఉండే కవిలాగా అనిపిస్తున్నాడే అని ఇతను మారు వేషంలో ఉన్న మన కవీంద్రుడే కదా! అని కవుల వైపు చూస్తాడు. నిజంగానే అక్కడ ఒక ఖాళీ ఉంది. అప్పుడు ఆ కవి క్షమించండి మహారాజా మన మంత్రివర్యులు చెప్పిన సలహా ప్రకారం నేనే ఈ వేషంలో వచ్చాను అని అసలు వేషంలోకి వస్తాడు. భళా కవివర్యా భళా అంటాడు తాను రాజు కాబట్టి.
కట్ చేస్తే జా'తీయ' రాజకీయాల గురించి ఇప్పుడు జరుగుతున్న చర్చకు పైన చెప్పుకున్న కథకు దగ్గరి సంబంధం ఉందని తెలిసిపోతుంది. అధికారం అన్నది ఓ తీపి వంటకం. దాన్ని పెంచుకొనేవాడి నాలుక ఇంకా ఇంకా కావాలంటుంది. ఎటువంటి పోటీ లేదనుకొని అధికారాన్ని అనుభవించేవాడికి ఇంకొక పార్టీ పోటీ రావడం ఒక చేదు విషయం. అందుకే చేదుకు చేదే మందు అనే విధంగా తిరగబడతాడు. నీవు నన్ను ప్రాంతీయం, కుటుంబ పాలన అంటూ ఉంటావు కాబట్టి నేనూ జాతీయం అంటాను. అసలు జాతీయం అన్న పదమే అందరినీ కలిపేది. అటువంటిది నీవు అందరినీ విడదీయడానికి నీ అధికారాన్ని ఉపయోగిస్తావా అని రివర్సు గేరులో పోతాడు. చెప్పు తినెడి అన్నట్టు నీకు మా గౌరవం గురించి మాట్లాడే హక్కు లేనెలేదు, మన ఆత్మ గౌరవాన్ని ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళదగ్గర పెట్టి మంటగలిపావో అప్పుడే నీపై ప్రజలకు నమ్మకం పోయింది అని ఘాటుగానూ తిడతాడు. ఇది రాజకీయం... ఎంత ఘాటుగా, ఎంత చేదుగా ప్రజల్లో చెబితే నీవు అధికారానికి అంత దగ్గరగా పోతావు అన్నది ఒక సూత్రం. అయితే అది ఎప్పుడూ పనిచేస్తుందనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ గమనిస్తుంటారు. వాళ్ళకు ఏది తీపిగా కనిపిస్తుందో పసిగట్టడం కష్టం.
ఇక చరిత్రలో నువ్వు తీయగా మిగిలిపోవాలంటే మాత్రం మంచిపనులు చేయాలి. ప్రజలను వేరు చేసే మాటలు తీయగా ఉన్నాయని నీకు భజన చేసేవాళ్ళకు అనిపించవచ్చు. కాని వాటిని అందుకునేవాళ్ళలో రకరకాల రుచులు పసిగట్టగల వాళ్ళు ఉంటారన్న విషయం తెలుసుకోవాలి. అసలు చరిత్రనే మార్చి చేదు విషయాలను తీపిగా మారిస్తే పోలా అన్న ఆలోచన నీకు వచ్చి నీవు ఆ పనిమీదే ఉండొచ్చు. దాన్నీ గమనించేవాళ్ళు ఉంటారు. తిరగబడేవాళ్ళూ ఉంటారు. ఖబడ్దార్ అని చెప్పేవాళ్ళూ ఉంటారు. కాబట్టి చేదు నిజాల్ని పక్కనబెట్టి నీవు చేసే పనులే తీయనైనవని అనుకోవడం నీ మూర్ఖత్వం. నీవు చెప్పే మాటలను అమాయకంగానో, లేదా ఇంకో కారణం చేతనో నిన్ను నమ్మారని అవే తీపి మాటలని నువ్వు నమ్మడం తాత్కాలికం. నిజమైన తీపి ఎవరి దగ్గర ఉంది అని ప్రజలు తెలుసుకొనే రోజు తప్పక వస్తుంది. అధికారమనే తీపి పదార్థం తినడానికి నీవు నానా గడ్డీ తినవలసి రావడం నీ నైజాన్నే చూపిస్తుంది. అలా కాకుండా మంచి మార్గంలో కూడా వస్తున్న వాళ్ళను అందరూ చూస్తుంటారు. నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుందని చెప్పేది అందుకే. మొదట మంచిని నమ్మరు, తరువాత నిన్ను నమ్మరు. నిలకడ మీదే అన్నీ అర్థమవుతాయి. జాతీయత అని తియతియ్యగా చెప్పే మాటల వెనుక నిజాయితీ ఎంత అన్నది ముఖ్యం. విభజించి పాలించు అన్న తెల్లోడి తెలివిని నీవు నేర్చుకుంటే సరిపోతుందనుకోవచ్చు. వాడు రాజుల మధ్య అవి సృష్టించాడు. నీవు ప్రజల మధ్య ఆ పని చేయాలని చూస్తున్నావు. అది బెడిసికొట్టే తీయటిరోజు దగ్గరలోనే ఉంది. దానికి చరిత్రే సాక్ష్యం. నీవు చరిత్ర మార్చడం కాదు, చరిత్రలో లేకుండా పోతావు. అందుకే తీయనైన, నిజమైన జాతీయత అందరూ కలిసి ఉండడంలో ఉందన్న విషయం తెలుసుకుంటే మంచిదని, ప్రజలు అదే కోరుకుంటున్నారనీ తెలుసుకో.
- జంధ్యాల రఘుబాబు
సెల్:9849753298