Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట పోరాట రూపం. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లేది పాటే. నాటి తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని నేటి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు పాటే పోరుకెరటం అయినది. అలాంటి పాటల ప్రవాహానికి బలాన్ని బలగాన్ని సమకూర్చిన వాగ్గేయ కారుడు సుద్దాల హనుమంతు. అణచివేతను మౌనంగా భరిస్తున్న పీడిత వర్గాలను పోరాటం వైపు నడిపించిన పాటల సేనాని ఆయన. బాంచెన్ దొర కాలు మొక్కుతా అన్న వారితో బందూకులను పట్టించిన పాటలు ఆయనవి. హరికథ, బుర్రకథ, యాక్షగానాలతో బూజు పట్టిన నిజాం నిరంకుశ పాలకుల కోటగోడలను కూల్చివేసిన జనగీతమయ్యాడు. సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా పాటలు పాడుతూ దొరల ఆగడాలను పల్లెసుద్ధుల రూపంలో చెబుతూ ప్రజలను చైతన్యపరిచాడు.
నిజాం నిరంకుశ పాలనపై రణభేరి మ్రోగించిన ప్రజా కవి...
బతికినంత కాలం ప్రజల బాణీలోనే పాటలందించి తన జీవితాన్ని అంకితం చేసిన సుద్దాల హనుమంతు 1910 సంవత్సరంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో లక్ష్మీ నరసమ్మ బుచ్చి రాములు దంపతులకు జన్మించారు. 14ఏండ్ల వయసులోనే అతని పాటలు తెలంగాణలోని గడపగడపను పలకరించి గుండె గుండెను తట్టి లేపాయి. పుట్టిన ఊరు వదిలి హైదరాబాదులో వ్యవసాయ శాఖలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ నైజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో హనుమంతు ముందుకు సాగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని తెలియడంతో అధికారులు ఆయనను ప్రశ్నించడంతో స్వేచ్ఛ లేకుండా ఆత్మాభిమానం చంపుకుని ఉద్యోగం చేయడం ఇష్టంలేక రాజీనామా చేసి తన ఊరు సుద్దాలకు వచ్చాడు. పాటలతోనే నిజాం రాక్షస పాలనపై రణభేరి మ్రోగించాడు. 1944లో 11వ ఆంధ్ర మహాసభ భువనగిరిలో జరిగింది. దానికి వాలంటరీగా పని చేశాడు. ఆంధ్ర మహాసభలో నాయకుల ప్రసంగాలతో హనుమంతు పోరాటమార్గాన్ని ఎంచుకుని తన కలానికి గలానికి పదునుపెట్టాడు. ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపునందుకుని ప్రతి గ్రామంలో సంఘం పెట్టడానికి ప్రజలను చైతన్యవంతం చేశాడు. నిజాం పాలనుకు వ్యతిరేకంగా జరిగిన (1946-51) తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంతు కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక దళానికి నాయకత్వం వహించాడు. వేలాది ప్రదర్శనలు ఇచ్చిన హనుమంతు ఆ రోజులలో తెలంగాణ ప్రజలకు చైతన్య దీపంగా వెలిగాడు. ఆయన పాటలు జనం నాలుకల మీద నాట్యం చేసేవి. నాటి తెలంగాణ పోరాటంలో హనుమంతు రాసిన పాటలు పాడని గ్రామంలేదు. ప్రజల భాషలో యాసలో శైలిలో ప్రజా పయోగమైన ఎన్నో పాటలు రాసి పాడి పలు ప్రదర్శనలు ఇచ్చారు. హనుమంతు బుర్రకథ చెబితే గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమవుతుందని, ఫిరంగిలా పేలుతుందనే చైతన్యం ఆనాటి ప్రజల్లో ఉండేదట.
ఆయన పాట అణిచివేతపై ధిక్కారస్వరం...
''పల్లెటూరి పిల్లగాడ పసులగాచే మొనగాడా'' అనే పల్లవితో పడుకున్న పాట వినపడగానే హనుమంతు నిలువెత్తు విగ్రహం ఎదుట నిలిస్తుంది. అప్పటికప్పుడు ఉద్యమ అవసరాల నిమిత్తం అశువుగా పాడడం ప్రజా కవి హనుమంతు యొక్క ప్రత్యేకత.
''వెట్టిచాకిరి విధానమో రైతన్న
ఎంత జెప్పిన తీరదో కూలన్న''
అంటూ దుర్మార్గమైన వ్యవస్థను సుద్దాల హనుమంతు తన పాటల్లో వర్ణించాడు.
''పల్లెటూరి పిల్లగాడ!
పసులగాసే మొనగాడా!
పాలు మరిసి ఎన్నాళ్ళయిందో''
అంటూ వెట్టి చాకిరీతో నలిగిపోతున్న తెలంగాణ బాల్యాన్ని హనుమంతు ప్రపంచానికి పరిచయం చేశాడు. ''సంఘం వచ్చిందరో రైతన్న మనకు బలం తెచ్చిందిరో కూలన్న'' అంటూ హనుమంతు పాడుతూ ఉంటే నిర్బంధంలో ఉన్న ప్రజలకు ఎక్కడలేని ధైర్యం వచ్చేది. ఎయే దొర కబంధ హస్తాల్లో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో వివరాలను సేకరించి దొరల భూఆక్రమణలను పల్లె సుద్ధుల రూపంలో చెబుతూ ప్రజలను చైతన్యపరిచాడు. రాజంపేట మండలం రేణిగుంటలో కమ్యూనిస్టు గ్రామసభలో మాభూమి నాటకం గొల్ల సుద్దుల ప్రదర్శనలు చేస్తున్న సమయంలో నిజాం మూకలు వస్తున్నాయని బాల కళాకారులు ఇచ్చిన సమాచారాన్ని తెలుసుకున్న సమయంలో చెట్టుకొక్కరు పుట్టకొకరు పారిపోతున్న క్రమంలో ఓ ముసలావిడ కర్రను హనుమంతు తీసుకొని భూమిపై కర్రను కొడుతూ ''వేరు వేరు దెబ్బకు దెబ్బ'' అంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపి నిజాం సైన్యాన్ని ఊరి పొలిమేర వరకు తరిమికొట్టిన ఘటన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకఘట్టం. పాటకు నిలయమైన పోరాటానికి నిలువెత్తు రూపమై తెలంగాణ సాయుధ పోరాటంలో చెరగని ముద్ర వేసిన హనుమంతు క్యాన్సర్ వ్యాధితో 1982 అక్టోబర్ 10న తన జీవన ప్రస్థానాన్ని ముగిం చాడు. ఒక చరిత్ర మట్టిలో కలిసింది. దాన్ని జాగ్రత్తగా భావితరాలకు అందించా ల్సిన బాధ్యతను మనం అందిపుచ్చు కోవాలి. ఇక్కడి నేల పోరాటాన్ని మట్టి మనుషుల ఆరాటాన్ని భావితరాలకు తెలియజేయాలి.
(అక్టోబర్ 10 సుద్దాల హను మంతు వర్థంతి సందర్భంగా)
- అంకం నరేష్
సెల్:6301650324