Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి ప్రభావం నుంచి కోలుకోకముందే అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్భణం అనివార్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంధ్యంవైపు, మరింత నిరుద్యోగితవైపు నెడుతున్నది. ఇలా విశృంఖలంగా పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని నియంత్రించటానికి సాధనంగా పెట్టుబడిదారీ ప్రపంచంలోని కెంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటమో లేక పెంచబోవటమో చేస్తున్నాయి.
అయితే ప్రపంచంలోని అన్ని కేంద్ర బ్యాంకులకు ప్రమాణాలను నెలకొల్పే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బోర్డు మరోవిధంగా చెబుతోంది. వాస్తవ ఆర్థిక వ్యవస్థపైన తాను నిర్దేశించే వడ్డీరేట్ల పెరుగుదల ప్రభావం నామమాత్రంగానో లేక మహా అయితే తాత్కాలికంగా కొద్దిపాటి ప్రభావం మాత్రమే ఉంటుందని, దీనితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునే ప్రక్రియ ఏమాత్రం బలహీనపడదని ఫెడరల్ రిజర్వ్ బోర్డు భావిస్తోంది. అయితే ఇటువంటి నిర్ధారణకు ఆధారమైన హేతువు మౌలికంగా లోపభూయిష్టమైనది. అది ఎలానో చూడండి.
నగదు వేతనం పెరగటంవల్లనే అమెరికాలో వర్తమాన ద్రవ్యోల్భణం ఏర్పడిందని, దానితో ప్రజలు ద్రవ్యోల్భణం ఏర్పడుతుందని ఆశిస్తున్నారని, వడ్డీ రేటును పెంచటంద్వారా ద్రవ్యోల్భణం పెరగదని ప్రజలు భావించేలా చేయటంతో నగదు వేతనం పెరుగుదలతో ఏర్పడిన ద్రవ్యోల్భణం తగ్గుతుందని అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమీ పోవెల్ వాదిస్తున్నాడు. ఆవిధంగా ఆశించిన ధరల క్షేత్రానికి, వాస్తవ ధరల క్షేత్రానికి మార్గానికి అన్ని సర్దుబాట్లు పరిమితం చేయబడినందున ఉత్పత్తి, ఉద్యోగితకు చెందిన వాస్తవ ఆర్థిక వ్యవస్థ ఎటువంటి మాంధ్యాన్నీ ఎదుర్కోదు. అయితే ఈ వాదనంతా పూర్తిగా తప్పని ఒక సాధారణ వాస్తవం తెలియజేస్తుంది: కార్మికుల నగదు వేతనాలు ద్రవ్యోల్భణం పెరుగుదలకంటే తక్కువగా ఉండటంతో వాస్తవ వేతనం క్షీణిస్తుంది. కాబట్టి అమెరికాలో ద్రవ్యోల్భణం పెరుగుదలకు కారణం నగదు వేతనాల వత్తిడి అని వాదించటం పూర్తిగా తప్పు. అదేవిధంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో వివిధ రకాల సరుకులు కొరత ఏర్పడిందని, ముఖ్యంగా చమురు, ఆహార ధాన్యాల కొరత ఏర్పడి ద్రవ్యోల్భణం సంభవించిందనే సాధారణ వివరణ కూడా ఆమోదయోగ్యమైనది కాదు. యుద్ధంవల్ల అటువంటి కొరత ఏర్పడవచ్చు. కానీ ఇంతవరకు అటువంటి కొరత ఏర్పడలేదు. నిజానికి యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో అటువంటి సరుకుల సరఫరా క్షీణించిదనటానికి సాక్ష్యం ఏమీలేదు. కాబట్టి యుద్ధంవల్ల ఏర్పడిన కొరతవల్లే ద్రవ్యోల్భణం ఏర్పడిందనటం, ఖచ్చితంగా అమెరికా విషయంలో వాస్తవం కాదు.
లాభాల పరిమాణం స్వచ్చంధంగా పెరగటంవల్ల వేతనాల కంటే ధరలు వేగంగా పెరిగాయి. అలా ధరలు పెరగటం కారణంగా అమెరికాలో ద్రవ్యోల్భణం ఏర్పడింది. సరుకుల కొరత ఏర్పడినప్పుడు లాభాల మోతాదు పెరుగుతుందంటారు. అయితే ఇక్కడ ధరలు పెరిగిన వివిధ రకాల సరుకులకు ఎటువంటి కొరతా ఏర్పడలేదు. కరోనా మహమ్మారితో సరుకుల సరఫరాలో కొంత అంతరాయం జరిగింది. దానితో కొన్ని సరుకుల్లో ఏర్పడిన తక్షణ కొరత కారణంగా ధరలు పెరగవలసిన దానికంటే ఎక్కువగా పెరిగాయి. వేరే మాటల్లో చెప్పాలంటే అమెరికాలోని వర్తమాన ద్రవ్యోల్భణం వెనుక స్వయంచాలకంగా లాభాల మోతాదును పెంచే స్పెక్యులేటివ్ ప్రవర్తన ఉంది.
స్పెక్యులేటివ్ ప్రవర్తన కేవలం వ్యాపారుల, బ్రోకర్ల లక్షణం తప్ప తయారీదార్లకు(మాన్యుపాక్చరర్స్)కు అటువంటి స్వభావం ఉండదనే భావన ఉంది. అయితే దీనికి ఆధారం లేదు. బహుళ జాతి కంపెనీలు ధరలు నిర్ణయించటం వెనుక కూడా స్పెక్యులేటివ్ ప్రవర్తన ఉంటుంది. ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద ఆర్థిక వ్యవస్థను స్పెక్యులేషన్ ప్రేరిత ద్రవ్యోల్భణం దెబ్బతీయటానికిగల కారణం అందుబాటులోవున్న పరపతి. ఇది ఇప్పటిదాకా అవలంభించిన సరళ ద్రవ్య విధానం పర్యవసానం. ''పరిమాణాత్మక సడలింపు(క్వాంటిటేటివ్ ఈజింగ్)'' విధానంతో ఫెడరల్ రిజర్వ్ ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థలో నగదును చొప్పించటంవల్ల స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను దాదాపు వడ్డీలేకుండా అందించటం జరుగుతోంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో అవసరానికి మించిన లిక్విడిటీ సృష్టించబడుతుంది. ఇది స్వయంచాలకంగా లాభాల మోతాదు పెరగటానికి దారితీస్తుంది. ఎక్కడైనా ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకోకముందే ఇది ద్రవ్యోల్భణం రూపంలో సాక్షాత్కరిస్తుంది. అంతేకాకుండా ఇటువంటి ద్రవ్య విధానం కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్భణాన్ని నియంత్రించటానికి ప్రభుత్వ వ్యయాన్ని, బడ్జెట్ లోటును నియంత్రించే ''ఫిస్కల్ ఆస్టిరిటీ''ని పాటించటం లేక ఇప్పుడు జరుగుతున్నట్టుగా వడ్డీ రేట్లను పెంచటం అనే సాధనాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇవి రెండూ మాంధ్యాన్ని, నిరుద్యోగితను పెంచుతాయి.
ఇక్కడే మనకు సమస్య స్వభావం పూర్తిగా అర్థం అవుతుంది. అమెరికాలోని ఎవరో కొందరు స్పెక్యులేటర్ల ప్రవర్తన వలన కలిగే దుష్పలితాలను తగ్గించటానికి వర్తమాన పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒక ఆర్థిక సాధనం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విపరీతమైన నిరుద్యోగితను ఇది సృష్టిస్తుంది. వివిధ దేశాల సరిహద్దుల మధ్య పెట్టుబడి ముఖ్యంగా ద్రవ్య పెట్టుబడి సంచరించే నయావుదారవాద ఆర్థిక వ్యవస్థలో అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు యావత్ ప్రపంచంలో వడ్డీరేట్లు కూడా పెరిగితీరాలి (అలా జరగకపోతే పెట్టుబడులు వెనుకబడిన ఆర్థిక వ్యవస్థల నుంచి అమెరికాకు నిష్క్రమిస్తాయి. ఇది డాలర్‌తో ఆయా దేశాల కరెన్సీ మారకపు విలువను క్షీణింపజేస్తుంది). వేరే మాటల్లో చెప్పాలంటే అమెరికాలో నెలకొన్న స్పెక్యులేషన్‌ను వేరే సాధనాలతో నేరుగా అధిగమించటానికి బదులుగా ద్రవ్య ''ఉదారవాదం'' పాలనలో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగాన్ని సృష్టించటం ద్వారా అధిగమించే ప్రయత్నం జరుగుతుంది. ఇది అహేతుకతకు పరాకాష్ట. బోల్షివిక్ విప్లవం నీడలో, మహామాంధ్యం మధ్యలో అర్థశాస్త్ర సూత్రీకరణలు చేసిన జాన్ మేనార్డ్ కీన్స్‌కు ఈ అహేతుకత తీవ్రత గురించి సమగ్రమైన అవగాహన ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించే లక్ష్యంతో పనిచేసిన కీన్స్ ''పెట్టుబడి సామాజికీకరణ''ను కోరాడు. ఇది జరగాలంటే అందుకు తగిన ద్రవ్య విధానం, విత్త పాలనలో ప్రభుత్వ జోక్యం కావాలి. యావత్ సమాజ అవసరాలకు లోబడి ఫైనాన్షియల్ ప్రయోజనాలు ఉండటం ఈ రెండింటికీ అవసరం.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం నెలకొన్న ఇటువంటి మేధో వాతావరణంలో వలస పాలన నుంచి నూతనంగా విమోచనను సాధించిన ఆనేక దేశాలు స్పెక్యులేషన్‌ను నియంత్రించటం కోసం నిరుద్యోగితను పెంచటం అటుంచి ఆర్థిక కార్యకలాపాలు ఏమాత్రం తగ్గకుండా అనేక వినూత్న ఫైనాన్షియల్ విధానాలను రూపొందించాయి. ఉదాహరణకు భారతదేశంలో పెట్టుబడుల కోసం దీర్ఘకాల రుణాలను అందించటానికి అనేక రకాల ఫైనాన్షియల్ సంస్థలుండేవి. ఈ రుణాలకు ఉండే వడ్డీ రేట్లు బ్యాంకులు అందించే స్వల్పకాలిక రుణాలకు ఉండే వడ్డీ రేట్ల కంటే తక్కువగా ఉండేవి. స్పెక్యులేషన్‌ను నియంత్రించటానికి బ్యాంకులు కూడా కేవలం వడ్డీ రేటునే కాకుండా సంప్రదాయ రిజర్వ్ రేషియోవంటి అనేక రకాల సాధనాలను వాడుతుండేవి. స్పెక్యులేటివ్ కార్యకలాపాలను నిర్వహించే సంస్థలకు అందే పరపతిని ప్రత్యక్షంగా నియంత్రించే విధానాన్ని లేక అటువంటి సాధనాలను ''స్పెక్యులేటివ్ క్రెడిట్ కంట్రోల్స్'' అనే పేరుతో పిలిచేవారు. ద్రవ్యోల్బణాన్ని విత్త, ద్రవ్య విధానాలతోనే కాకుండా ''సప్లై మేనేజ్మెంట్'', ప్రజా పంపిణీ, రేషనింగ్ వ్యవస్థల ద్వారా కూడా నియంత్రించేవారు. పెట్టుబడి, ఉత్పత్తి, ఉద్యోగితలు స్పెక్యులేటర్ల దురాశాపూరిత లాభాల దాహం బారీనపడకుండా చాలావరకు ఇవన్నీ కాపాడేవి.
ఈ ఏర్పాట్లన్నింటినీ బ్రెట్టాన్ వుడ్స్ సంస్థలు, వాటి విశ్వాసపాత్రులైన నయావుదారవాద ఆర్థికవేత్తలు తీవ్రంగా విమర్శిస్తారు. అటువంటి ఫైనాన్షియల్ ఏర్పాట్లను వాళ్ళు ''ఫైనాన్షియల్ అణచివేత''గా భావిస్తారు. అటువంటి ఫైనాన్షియల్ ఏర్పాట్లకు బదులుగా ఫైనాన్షియల్ వ్యవస్థను ''ఉదారీకరించాలి(లిబరలైజేషన్)'' అని అంటారు. అలా ఉదారీకరింపబడిన ఫైనాన్షియల్ వ్యవస్థలోని ఫైనాన్షియల్ మార్కెట్లలో ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యం అనేదే ఉండదు. ఆహార ధాన్యాల విషయంలో ఇప్పటికీ కొనసాగుతున్న ప్రజాపంపిణీ, రేషనింగ్ వ్యవస్థను వారు రద్దుచేయాలని అంటారు. అలాగే వారు తమ లక్ష్యం కోసం మోడీ ప్రభుత్వం చేత మూడు వ్యవసాయ చట్టాలను చేయించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను, రేషనింగ్‌ను రద్దుచేయటానికి వాళ్ళ ప్రయత్నం ఫలిచనప్పటికీ నయా ఉదారవాద ''సంస్కరణల''లో భాగమైన ''ఫైనాన్షియల్ లిబరలైజేషన్''ను వారు రుద్దగలిగారు.
ద్రవ్య విధాన సాధనంగా వడ్డీ రేటుపై ప్రత్యేకంగా ఆధారపడటాన్ని ''ఫైనాన్షియల్ లిబరలైజేషన్'' అనుమతి స్తుంది. ఇక్కడ కూడా ఇంతకుముందే చెప్పినట్టు పెట్టుబడుల సాపేక్ష సరళ ప్రవాహాల ప్రపంచంలో వడ్డీరేటు అమెరికా వడ్డీ రేటుతో అనుసంధానమైన ఉంటుంది. ఈ విషయంలో దేశానికి అంతగా వెసులుబాటు ఉండదు. ప్రభుత్వ వ్యయం ప్రభుత్వ ఆదాయంతో ముడిబడి ఉండటమే ''విత్త సంబంద జవాబుదారీతనం(ఫిస్కల్ రెస్ప్న్సిబిలిటి)''. ఈ విధానంలో సంపన్నులపైన పన్ను విధించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచటం సాధ్యపడదు. ఎందుకంటే అలా పన్నులు విధిస్తే సంపన్నులు తమ పెట్టుబడులను వేరే చోటుకు తరలించజూసే అవకాశం ఉంటుంది గనుక వారిపైన పన్నులు విధించటం కుదరదు. ద్రవ్యోల్భణాన్ని నియంత్రించటానికి ఏ వడ్డీ రేటునైతే ఉపయోగిస్తామో అదే వడ్డీ రేటు పెట్టుబడికి, ఉత్పత్తికి, ఉద్యోగితకు, వృద్ధికి కూడా కీలకంగా ఉంటుంది.
అంటే తిరోగమించి చేరుకున్న ప్రపంచంలోని ఒకానొక దేశంలో కొందరు స్పెక్యులేటర్ల ప్రవర్తన ఆ దేశంలోని ఉత్పత్తిని, ఉద్యోగితను నిర్దేశిస్తుంది. అసలు విషయం ఏమంటే ఎవరో కొందరు అమెరికా స్పెక్యులటర్లు ప్రపంచంలో ప్రతి దేశంలోని ఉత్పత్తిని, ఉద్యోగితను నిర్దేశిస్తారు. అంటే యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అమెరికాకు చెందిన కొద్దిమంది స్పెక్యులేటర్లు నియంత్రిస్తారు.
సంక్షేమ రాజ్య కాలంలో లక్షలాది కార్మికుల ఉద్యోగావకాశా లను ఎవరో కొంతమంది చపలురైన స్పెక్యులేటర్ల నిర్దేశాలకు లోబడని ఫైనాన్షియల్ వ్యవస్థ మనకు ఉందని ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ కేఎన్ రాజ్ ఒకసారి మెచ్చుకున్నాడు. సరిగ్గా అటువంటి ఏర్పాటును ఫైనాన్షియల్ ఉదారీకరణ నాశనం చేసింది. అంతేకాకుండా అది ప్రతి దేశ ఉద్యోగిత స్థాయిని ఎవరో కొందరు అమెరికన్ స్పెక్యులేటర్ల చపలత్వంపైన ఆధారపడేలా చేసింది.
దవ్యోల్భణాన్ని నియంత్రించే సాధనంగా వడ్డీరేట్లను పెంచటంలోగల ఔచిత్యంపైన ప్రపంచ వ్యాప్తంగా చాలానే రాయబడింది. నయావుదారవాద నిర్మాణం అస్థిత్వంలో ఉండ టంవల్ల ఉద్యోగిత, ద్రవ్యోల్భణాల మధ్య ఏదో ఒకదానిని ఎంచు కోవలసిన పరిస్థితి ఉంటుంది. చర్చలో దానికి అనుగుణంగా వాదనలను ముందుకు తేవటం జరుగుతుంది. అటువంటి వ్యవస్థ వల్లనే ప్రభుత్వం చేతుల్లో ఉండవలసిన అనేక సాధనాలు నిర్వీర్యం అయిపోయాయి. కాబట్టి నయావుదారవాద వ్యవస్థను అధిగమించటంతో మాత్రమే అలా ఎంచుకోవలసిన పరిస్థితిని లేకుండా చేయగలం. అయితే చర్చలో అటువంటి ప్రస్తావనే లేదు. అనువాదం: నెల్లూరు నరసింహరావు,
- ప్రభాత్ పట్నాయక్
సెల్: 8886396999