Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక హక్కుల కోసం జీవితం అంతా పోరాడిన ఉద్యమ యోధుడు కామ్రేడ్ నాగటి నారాయణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, అనంతరం తెలంగాణ రాష్ట్రంలోనూ ఉపాధ్యాయ హక్కుల కోసం గళమెత్తి అనేక హక్కులను సాధించిన ఉపాధ్యాయ ఉద్యమ నేత. నిన్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూసిన నారాయణ మరణం ఉపాధ్యాయ ఉద్యమానికి తీరనిలోటు. ఖమ్మంజిల్లా బోనకల్లు మండలం పెద్ద బీరవల్లిలో సుందరమ్మ సామేలు దంపతులకు దళిత కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ చదువుకున్నారు. అనేక సామాజిక ఆర్థిక అంతరాలను అధిగమిస్తూ చదువుకునే క్రమంలో ఒక దశలో డ్రాప్ అవుట్‌గా కూడా మారారు. పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తిరిగి చదువు కొనసాగించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు చిన్నప్పటినుంచి నారాయణలో అభ్యుదయ భావాలు పురుడు పోసుకున్నాయి. ఒకవైపు చదువుకుంటూనే డీవైఎఫ్ఐలో క్రియా శీలక నాయకుడిగా ఎదిగారు. అనేక నాటకాల్లో నటిస్తూ ప్రజలను చైతన్య వంతులను చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తొలి నియామకం పొందారు. కనీస వసతులులేని గిరిజనగూడాలలో పనిచేస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. గిరిజన విద్యార్థులను చదువుల వైపు మళ్ళించారు. భోజనం విషయంలో గిరిజన విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి, ఎదురు తిరిగి అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. ఫలితంగా గుండాల అటవీ ప్రాంతానికి బదిలీ అయ్యారు. తన బదిలీ అక్రమమని నారాయణ అధికారులను నిలదీశారు. చివరికి వారు ఆ బదిలీని రద్దు చేశారు. ఆనాడు అదొక పెద్ద సంచలనాన్ని సృష్టించింది. దీనితో నారాయణ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా ఒక గుర్తింపు పొందారు. అప్పటికే అధికారుల నిరంకుశత్వాన్ని ఎదిరిస్తున్న సయ్యద్ జియావుద్దీన్, జి మాధవరావు, గోపిచంద్ మరికొందరు ఉపాధ్యాయులతో కలిసి గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ ఉద్యమానికి పునాదులు వేశారు. ఆనాడు ఐటిడిఎ ఆఫీస్ పాల్వంచలో ఉండేది. జిల్లా గిరిజన సంక్షేమాధికారి తనకు నచ్చిన వారికి పదోన్నతులు ఇవ్వడం, బదిలీలు చేస్తుండటంతో యుటిఎఫ్ ఆధ్వర్యంలో 1981లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులను కదిలించి ధర్నా నిర్వహించ డంలో కీలక పాత్ర పోషించారు. ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారుల గొంతులో వెలక్కాయ బడ్డట్లయ్యింది. ఐటిడిఏ చరిత్రలో ఆ పోరాటం ఒక మైలురాయిగా నిలిచి పోయింది. ఆ తర్వాత గిరిజన సంక్షేమ పాఠశాలలకు పోస్ట్‌లు ఇవ్వాలని చేసిన పోరాటాల ఫలితంగా 1989లో ఆపరేషన్ బ్లాక్‌బోర్డు పథకం కింద ఐదువందల టీచర్ పోస్టులు మంజూ రయ్యాయి. స్థానిక గిరిజన యువతను ఉపాధ్యా యులుగా నియమించాలని చేసిన పోరాటం వల్ల జీవివీకే ఉపాధ్యా యులు వచ్చారు. వారికి శిక్షణ ఇవ్వాలని, అందుకోసం ఉట్నూరు, అరకు లోయలో సబ్ డైట్స్ ఏర్పాటు చేయించడంలో వీరి కృషి ఎనలేనిది. గిరిజన ఉపాధ్యాయులకు టైంస్కేల్ ఇప్పించడంలో, నోషనల్ ఇంక్రిమెంట్ల సాధనలో గొప్ప ఉద్యమాన్ని నడిపారు. వీరి నాయకత్వంలో గిరిజన, గిరిజనేతరులు యుటిఎఫ్ సంఘంలో సభ్యులుగా చేరడం ఫలితంగా రాశిలో, వాసిలో సంఘం బలం, ప్రతిష్ట ఇనుమడించింది. ఖమ్మం జిల్లాలో వస్తున్న మార్పులను చూసి ఇతర గిరిజన ఏజెన్సీ జిల్లాలు కూడా ప్రేరణ పొందాయి. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులను ఐక్య పరచడం కోసం రంపచోడవరంలో, భద్రాచలం లో రెండుసార్లు రాష్ట్ర సదస్సులను నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఉపాధ్యాయ ఉద్యమంలో చురుకుగా వ్యవహరిస్తున్న నారాయణ అనతి కాలంలోనే ఖమ్మంజిల్లా అధ్యక్షుని గా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంచలంచలుగా ఎదుగుతూ దాచూరి రామిరెడ్డి, అప్పారి వెంకటస్వామి వంటి యోధుల వారసునిగా రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. సిద్ధాంతం ఆచరణ మేళవించి పనిచేసే ప్రతిభ నారా యణ సొంతం. అందుకే ఆయన రాష్ట్ర నాయకుడిగా అశేష ఉపాధ్యాయలోకం చేత నీరాజనాలు అందుకున్నారు.
ముఖ్యమంత్రిని ఎదిరించిన ధీశాలి
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలమైన, ప్రతిష్ట కలిగిన యుటిఎఫ్ సహకారం ఆయనకు అవసరమైంది. సంఘం చేసిన పోరాటాలను బలపరిచారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అవే పోరాటాలు ఆయనకు కంటగింపుగా మారాయి. 2008లో పిఆర్సి సాధన కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఎన్జీవో, టిఎన్జీవో సంఘాలతో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాల జెఏసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. ఉద్యోగులు ఉపాధ్యాయులు తెగించి గట్టిగా నిల బడ్డారు. జేఏసీ నాయకులు ప్రభుత్వంతో లోపాయి కారిగా వ్యవహరిస్తూ ఉద్యోగులను మాయ మాటలతో బురిడీ కొట్టించేవారు. యుటిఎఫ్ చేసిన ప్రతిపాద నలు, వాదనలు ఉపాధ్యాయులు ఉద్యోగు లను ఆకర్షించాయి. జేఏసీ కో-ఛైర్మన్‌గా ఉన్న నారాయణ నిక్కచ్చితనం జేఏసీ నాయకులకు మింగుడు పడలేదు. నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి కంప్లైంట్ చేశారు. నాడు నిండు కొలువులో వందలాది మంది సమక్షంలో ముఖ్యమంత్రి కళ్ళెర్ర జేసి యుటిఎఫ్ నాయకుడు నారాయణ ఎవరు అన్నారు. నారాయణ లేచి నిలబడ్డారు. 'నువ్వు అంత మొనగాడివా?' అంటూ దబాయించాలని చూశారు. ఆ బెదిరింపులకు నారాయణ చలించకుండా తన వాదనలు వినిపించారు. ఆ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఎంతో ఉత్తేజాన్నిచ్చింది. అరకొరగా ఇస్తామన్న ఫిట్మెంట్ మీద జేఏసీ నాయకుల వైఖరికి భిన్నంగా పత్రికా ప్రతినిధుల సమావేశంలో నారాయణ మాట్లాడిన మాటలు ఉద్యోగులు ఉపాధ్యాయులలో ఉన్న అసంతృప్తికి ఆజ్యం పోశాయి. ఆనాడు అన్ని పత్రికలు యుటిఎఫ్ వాదనలోని సహేతుకతను, నారాయణ గురించి పతాక శీర్షికగా రాశాయి. మరొకమారు సెక్రటేరి యట్లోనే నారాయణపై భౌతిక దాడికి కూడా ప్రయత్నాలు జరిగాయి. అయినా వెన్నుచూపని తత్వం ఆయనది.
2014 సెప్టెంబర్‌లో నార్కట్ పల్లి సమీపంలో జరిగిన కార్ యాక్సిడెంట్లో నారాయణ శ్రీమతి అమృత మరణించారు. నారాయణకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. జీవితాంతం ఉద్యమాల్లో తనకు తోడునీడగా నిలిచిన భార్యను కోల్పోవడం నారాయణ జీవితంలో ఎనలేని చీకట్లను నింపింది. అయినా కర్తవ్య నిర్వహణలో వెనుకడుగు వేయకుండా ఉపాధ్యాయ ఉద్యమానికి తన వంతు సేవలు అందిస్తూనే ఉన్నారు. యుటిఎఫ్ సంఘం ఆదేశం మేరకు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. బలమైన తెలంగాణ సెంటిమెంట్ కారణంగా ఓడిపోయారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే ధీరత్వం ఆయనది. కడదాక కమ్యూనిస్టు భావజాలంతో బాధితులకు అండగా నిలబడ్డారు. మరణించే వరకు విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.
యుటిఎఫ్ నేర్పిన పాఠాలు, నిర్మాణ దక్షత వల్ల ప్రయివేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నిర్ణయం గురించి వేసిన కమిటీ ముందు హాజరై సహేతుక వాదనలు విన్పించారు. ''1960 దశకాల్లో ఉపాధ్యాయులు దిగువ మధ్య తరగతి. గత తరం అనన్య త్యాగాల ఫలితంగా 1980 నాటికి మధ్య తరగతి, 2010 నాటికి ఎగువ మధ్యతరగతిలోకి చేరారు. ఆర్థిక పరిపుష్టి చేకూరింది. ఈ తరంలో అత్యధికులకు గతం తెలీదు. పాలక వర్గాలు తమకు చేస్తున్న అన్యాయం తెలియదు. పెన్షన్ రద్దు చేయడం, ఏండ్ల తరబడి బదిలీలు, పదోన్నతులు ఇవ్వక పోవడం, విద్యారంగం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా పోరాడాలనే చైతన్యం వారిలో తగినంతగా కలగడం లేదు. ఈ ధోరణి పాలక వర్గాలకే ఉపకరిస్తుంది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, బోధనలో నూతన టెక్నాలజీని ఉపయో గించుకోవాలి. స్వయం కృషి, వర్క్ కల్చర్ పెరగాలి. విద్యార్థులతో ఆత్మీయ సంబంధాలు పెంచు కోవాలి. విద్యార్థుల తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వగలగాలి. ఉపాధ్యా యులు తమను తాము విముక్తం చేసుకుంటూ ప్రజల పక్షాన నికరంగా నిలబడాలి. అప్పుడే ప్రభుత్వ విద్యారం గాన్ని కాపాడుకోగలం. అదంటూ ఉంటేనే కదా మన హక్కులు సౌకర్యాలను అనుభవించ గలిగేది'' అనే నారాయణ సందేశం ప్రతి ఉపాధ్యాయుడికీ శిరోధార్యం. నేటి విద్యా వ్యవస్థను కాపాడుకోవాలంటే పేదలకు కూడా నాణ్యమైన చదువు అందాలంటే నారాయణని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు అడుగేద్దాం.
- సాగర్ల సత్తయ్య
సెల్: 7989117415