Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ దేశంలో నేడు ఆడపిల్లగా పుట్టడం పుట్టిన సురక్షితంగా మనుగడ సాగించడమే దుర్భరమవుతున్న దురవస్థ ప్రపంచం ముందు మనల్ని తలదించుకునేలా చేస్తున్నది. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన 2021 లింగ వ్యత్యాసం సూచిక ఆడపిల్లల పట్ల ఇండియాలో విచక్షణ ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టింది. 156 దేశాల సూచీలో భారతదేశం 140వ స్థానంతో అట్టడుగు స్థాయి దేశాల సరసన తలవంచుకుని నిలబడాల్సి వచ్చింది. భారతదేశంలో పితృస్వామ్య వ్యవస్థ, స్త్రీ ద్వేషం, వివక్ష ఎంతగా జడలు విప్పిందో తెలియజేయడానికి జరుగుతున్న లింగనిర్థారణ పరీక్షలు, గర్భస్రావాలు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దేశంలో ప్రతి సంవత్సరం లింగనిర్ధారణ గర్భస్రావాల కారణంగా ఆరు లక్షల ఆడశిశువులు పుట్టకుండా మరణిస్తున్నారు. దేశంలో ప్రతి ఏడాది ఒక కోటి 20లక్షల బాలికలు జన్మిస్తే 15సంవత్సరాలు వచ్చే వరకు 30లక్షల మంది మరణిస్తున్నారు. 2021లో జరిగిన మొత్తం నేరాల్లో 33.2శాతం పిల్లలపై జరగగా దీనిలో 95శాతం నేరాలు బాలికలపై జరిగాయని జాతీయ నేర గణాంకాల వివరిస్తున్నాయి. పోక్సో చట్టం కింద ఎక్కువ మంది బాధితులు బాలికలే ఉన్నారు. దేశంలో సగటున ఏడాదికి 15వేల మైనర్ బాలికల అపహరణ కేసులు, 4900పైగా అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. ఆడపిల్లకు దేశంలో సురక్షిత స్థలం అంటూ లేకుండాపోయింది. ఇంటాబయటా ఎక్కడైనా సరే ఆడపిల్లలను చెరబట్టే విష సంస్కృతి ఎక్కువైంది గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని నగరంలో సింగరేణి కాలనీలో చిన్నారి చైత్రపై జరిగిన అత్యాచారం లైంగిక వేధింపులతో బాల్యం చిద్రమవుతుందనడానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది. మహారాష్ట్ర, గోవా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో బాలికలపై ఆకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. మరోపక్క తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మెదక్, వికారాబాద్ జిల్లాలు మినహ మిగతా జిల్లాల లింగనిష్పత్తిలో తీవ్ర అంతరం కనిపిస్తున్నది. ఆడపిల్లల్ని కాపాడడం వారిని చదువుల తల్లులుగా తీర్చిదిద్ది సాధికారత కల్పించడం స్థూలంగా బేటి బచావో బేటి పడావో కార్యక్రమ లక్ష్యం. 2015 జనవరి 22న దేశవ్యాప్తంగా ఆరేండ్లలోపు ఆడపిల్లల సంఖ్య విషయంలో బాగా వెనుకబడిన 100జిల్లాలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం దేశమంతటా అమలు పరుస్తున్నారు. కానీ బడిలో సమాన విద్యావకాశాలు, లింగనిర్థారణ గర్భస్రావాలు తగ్గించడం, మహిళలు పురుషుల కన్నా ఎందులోనూ తక్కువ కాదు అన్న సమానత్వం, విధాన నిర్ణయ ప్రక్రియలో వారికి భాగస్వామ్యం కల్పించడం మొదలైన అంశాల్లో పురోగతి లేకుండా అంతిమంగా బంగారుతల్లికి కొత్త భరోసా ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం. బీజేపీ ప్రచార ఆర్భాటాలకు తప్ప బాలిక అభివృద్ధికి నిధుల ఖర్చు జరగడం లేదు. ఫలితంగా సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత నేటికీ అందని ద్రాక్షగానే మిగిలింది.
ఆగాలిక అనిచివేత...
వివక్ష బారి నుండి బాలికలను సంరక్షించడానికి ఎన్ని చట్టాలు తెచ్చినా పక్కాగా అమలు కాక సాధికారిత ప్రశ్నార్థకంగా మారింది. పిసిÊపియన్ డిటి చట్టం-1994 ద్వారా లింగ నిర్ధారణ గర్భస్రావాలు కొంత తగ్గినా, ఇంకా చట్టానికి మెరుగులుదిద్ది పగడ్బందీగా అమలు పరచాల్సిన అవసరం ఉంది. పోక్సో చట్టం, నిర్భయ చట్టం, వరకట్న నిషేధ చట్టం, బేటి బచావో బేటి పడావో పథకం మొదలైనవాటికి నిధులు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే ఆడపిల్లల రక్షణ పట్ల మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఇటీవలి సామాజిక ధోరణలు గుర్తు చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న అంతర్జాలం యువతరాన్ని పెడదోవ పట్టిస్తున్నది. దీనివల్ల పసిబిడ్డలపై అత్యాచారాలు అక్రమ తరలింపులు జరుగు తున్నాయి. ఈ పెడధోరణికి అడ్డుకట్ట వేయాలంటే పిల్లలకు ఇంటి నుంచీ బడినుంచీ విలువల బోధన జరగాలి. అందుకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు మార్చవలసిన అవసరం ఉంది. మార్కులు ర్యాంకుల కోసమే కాకుండా నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యంగా విధ్యావిధానం ఉండాలి. మరింత మెరుగైన రేపటి భవితవ్యం కోసం ఈనాడే బాలికలకు సాధికారిక కల్పించాలి. ఆడపిల్లలకు రక్షణ కల్పించడం, ఆత్మవిశ్వాసంతో పెరిగేలా చూడటం, లింగ వివక్ష లేని సమాజం తీసుకురావడం వంటి లక్ష్యాలను సాధించాలి. అందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. అమ్మాయి పుట్టితే పండుగ వచ్చినట్లు భావించే పరిస్థితి నెలకొన్నప్పుడే ఇలా ఏటేటా బాలిక దినోత్సవాలు జరపాల్సిన అవసరం రాదు.
(అక్టోబర్ 11 అంతర్జాతీయ
బాలికల దినోత్సవం సందర్భంగా)
అంకం నరేష్, 6301650324