Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా కాలంగా సుప్రిం కోర్టు పరిగణలో ఉన్న ''మత మార్పిడుల అనంతరం షెద్యూల్డ్ కులాల అర్హత ఉండాలా వద్దా'' అన్న అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వడానికి ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండేళ్ళ గడువునూ ఇచ్చింది. 1950 నుండే ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ మతమేదైనా కులాల ఆధారంగానే అన్ని రకాల పరిగణనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడున్న అధికార పార్టీ మత ఏకీకరణలో భాగంగా కులాలను బంధీలుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా లోతైన విశ్లేషణ అవసరం. మతానికి కులానికి ఏమైనా సంబంధం ఉందా? ఫలానా మతంలో ఫలానా కులాలు ఉండాలని ఎక్కడైనా స్పష్టంగా రాసి ఉన్నదా? ఆయా మతాల్లో కులాల సంఖ్యకు, దాని పద్ధతులకు ఎక్కడైనా ఆధారాలు ఉన్నయా? లేదా ఏ కులాల్లోనైనా, సదరు కులం ఏ మతానికి చెందినదో, దాని పూర్వా పరాలేవో ఎక్కడైనా రాసి ఉందా? ఇంతకీ కులాలకు సంబంధించిన రాజ్యాంగాలు లేదా నియమ నిబంధనలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కడైనా ఉన్నాయా? వాటి ప్రకారమే నడుచుకోవాలని నిబంధనలు ఎక్కడైనా ఉన్నాయా? అంటే... బ్రాహ్మణ కులానికి సంబంధించిన కొన్ని ఆచార నియమాలు అక్కడక్కడ పుస్తకాల్లో కనిపించినా మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీి కులాలకు సంబంధించినవి స్పష్టంగా అచ్చు వేయబడిన ఆధారాలతో లేవు. సదరు నిబంధనలేవైనా ఉంటే పాటించని వారిని ఏ విధంగా భావించాలో ఎక్కడైనా ఉన్నదా? ఆహార అలవాటులకు సంబంధించి గాని, వస్త్రధారణకు సంబంధించి గాని లేదా పూజించవలసిన దేవుడి గురించి గానీ, అతిథులను ఆదరించవలసిన తీరు గురించి గానీ, ఇండ్ల నిర్మాణం గురించి గానీ, వివాహాల సంబంధాల విషయంలో వివాహాల వయసుల విషయంలో గానీ, ఏ కులంలో స్త్రీ పురుషుల్లో ఎవరు కుటుంబ భారం మోయాలి అన్న అంశాల్లో గానీ ఎక్కడైనా ప్రతి కులానికి విధివిధానాలు రూపొందించబడ్డాయా? స్థూలంగా లేవు అన్నదే సమాధానం. ఇలాంటప్పుడు ఫలానా కులం ఫలానా మతంలోనే ఉండాలనే నిబంధన ఎంత వరకు సమంజసమైనది. ఇతర మతానికి మారితే రిజర్వేషన్లు వర్తించవని చెప్పడానికే ఈ కుల అర్హతను నిర్థారించే ప్రక్రియ మొదలుపెట్టారన్నది వాస్తవం. ఆ తరువాత ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నావన్నది కూడా ధృవీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది, సిద్దంగా ఉండాలి.
రాజ్యాంగం మత స్వేచ్ఛను ఇచ్చింది. ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించడానికి, ఇష్టం వచ్చిన భాషను ఉపయోగించడాన్ని, ఇష్టం వచ్చిన దేవుణ్ణి ప్రార్థించడాన్ని రాజ్యాంగం కల్పించింది. దళితులుగా ఉన్నవాళ్లు క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్లు వర్తించవు అనడానికి దళితులుగా ఉన్నన్ని రోజులు ''మేము హిందూ మతాన్ని పాటిస్తున్నాం'' అని ఎవరైనా ప్రకటించారా? లేదా హిందూ మత ఆచారాలేవైనా పాటించడం ద్వారా ఎవరికైనా రుణపడి ఉన్నారా? ఎవరైనా దళిత వెనుక బడిన వారిని ఆధరించి సహాయం ఏదైనా అందించారా? ఇలాంటి ఏ రకమైన సహాయ వెసులుబాట్లు కల్పించకుండా కేవలం చర్చీకి, మసీదుకు వెళ్ళలేని ఫలానా వాళ్ళందరూ కూడా హిందువులే (ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఈ అమాయకులు గుడికి కూడా వేళ్ళే వాళ్ళు కాదు, అట్టి అసహాయతని అవకాశంగా భావించి గుడికొస్తామని ఆశించిన వారిని కూడా అంటరాని వారుగా, అనర్హులుగా ముద్ర వేశారు) అని భావించి, వాళ్ళందరూ ఇతర మత మతాలను స్వీకరిస్తే రిజర్వేషన్లకు అనర్హులంటూ ప్రకటించడానికి ప్రయత్నిస్తున్న ఈ ఆలోచన చాలా దుర్మార్గమైనది. కులం ఒక మనిషికి అంటగట్టబడింది. భూమి మీద పుట్టగానే పడిన చెరపరాని మురికి రంగు కులం. ఇప్పుడు మతాన్ని కూడా పూసి ఒక బోనులో బంధించజూస్తున్నారు. మతాభిప్రాయాలు, భక్తి అభిప్రాయాలు మారవచ్చు. ఒక వ్యక్తి తాను జన్మించిన కులాన్ని తూలానాడి నేను ఫలానా కులం కాదు.. అని చెబితే ఎవరైనా అంగీకరిస్తారా? వేరే కులంలోకి ఆహ్వానిస్తారా? ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వారి సంతానానికీ తల్లి కులాన్ని అంగీకరించలేక పోతున్నది ఈ సమాజం. మతం అనేది ఒక జీవన విధానం అని చెప్పే పెద్దలు వివిధ రకాల జీవన విధానాలను ఐచ్చికంగా స్వీకరించే స్వేచ్చను ఎందుకు హరించజూస్తున్నారు? ఆచారాలు నచ్చనప్పుడు, ఆరోగ్యం సహకరించనప్పుడు, అన్నిటికీ మించి అవమానాలు ఎదురవుతున్నప్పుడు మతమార్పిడు లకు అవకాశం ఉండాలిగా! మతం మారినంత మాత్రాన ఆర్థిక స్థాయి మారుతుందా? కులము జన్మతః సిద్ధించిన దౌర్భాగ్యం కాబట్టే కాటి వరకు అంటిపెట్టుకొని ఉంటుంది. అందుచేత రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా రిజర్వేషన్లు కులాల ఆధారంగానే ఇవ్వాలి తప్ప మతం మారినందువలన లేదా మతాల ఆధారంగానూ ఇవ్వవలసిన అవసరాన్ని ఎక్కడ రాజ్యాంగంలో పొందుపరచలేదు.
మతమార్పిడి జరిగింది కాబట్టి ఎస్సీ స్టేటస్ తీసేస్తారు, అనగా కులాన్ని తొలగిస్తారు. మరి అలాంటప్పుడు అట్లాంటి వారి సంతానానికి పెళ్లి సంబంధాలు ప్రభుత్వమే చూస్తుందా? ఏ కులం వాళ్ళని వెతుక్కోవాలి? ఇప్పుడు కొన్ని కులాల్లో కొన్ని రకాల ఆహారపు అలవాట్లు, వ్యవహారాలు అంగీకరించబడవు అయినప్పటికీ వాటిని పాటిస్తున్న వారందరిని ఆ కులాలు వెలివేస్తాయా?
చాలామందిలో ఒక అభిప్రాయం ఉంటుంది. మత మార్పిడి జరిగి దళితులు క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు కాబట్టి ఇక వారికి ఎస్సీ, ఎస్టీ అనబడే రిజర్వేషన్లు ఎందుకు అని. మరి ఉన్నత కులాలుగా భావించబడుతున్న రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ వంటి కులాల నుండి కూడా మతమార్పిడులు జరిగాయి, మరి వారందరికీ కూడా సదరు కులానికి సంబంధించిన స్టేటస్ తొలగిస్తారా? ఇప్పుడు తెచ్చిన ఈ ప్రతిపాదన కేవలం మత ఏకీకరణ కోసమే కాదు, రిజర్వేషన్ల అంశంలో ఒకరికీ ఇంకొకరికీ మధ్య చిచ్చు రగిల్చి, అవి లేకుండా చేయడానికి! 1990-92లో మండల్ కమిషన్ను వ్యతిరేకింఛడంతోనే ఇప్పుడున్న రాజకీయుల మూలాల్లో ఏముందో విధితమైంది. భావోద్వేగాలకు ప్రభావితమై రాజకీయ పార్టీలు, ప్రభుత్వం స్పందించవచ్చునేమో గాని సరాసరి సుప్రీంకోర్టు, సీనియర్ న్యాయవాదులూ దీనిపై కాలు దువ్వడం దురదృష్టకరం. ప్రతిపాదిత దళితుల అంశంలో మత మార్పిడి జరిగింది కాబట్టి కులం అనే స్టేటస్ ను ప్రభుత్వ లెక్కల ప్రకారం తీసేస్తారు తప్ప ఆచార వ్యవహారాల్లో మాత్రం అదే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది... ఇది ఎంతటి కుటిలత్వపు రాజనీతి! ఇతర మతాలను ఆదరించడానికి అక్కడున్న సౌకర్యాలో లేదా ఆర్థిక జరుగుబాటో కాదు, హిందూ మతంలో ఉన్న కుల అధారిత అవమానం అక్కడ లేకపోవడమే. కుల ధృవీకరణ పత్రంతోపాటు మత ధృవీకరణ పత్రం కూడా తీసుకొమ్మని చెప్పడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారన్నమాట! భవిష్యత్తులో కుల, మత ధృవీకరణ పత్రం కావాలంటే కూడా నియమ నిభంధనలు (ఇప్పుడు తయారు చేస్తారు కాబోలు) పాటిస్తున్నారా లేదా అనే అంశాన్ని మత పెదలు తీర్పునిస్తారేమో! వెరసి పాలానా వ్యవహారాలు పీఠాధిపతులకు సంక్రమించ నున్నయన్న మాట!
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016