Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మతోన్మాదం, కులోన్మాదం మాదిరిగానే పురుషాహంకారం కూడా మన సమాజంలో అనాదిగా పాతుకుపోయిన విషబీజం. సామాజిక అణచివేత దాని అంతఃసారం. అడుగుడుగునా అది విలయతాండవం చేస్తూనే ఉన్నది. నిశ్శబ్ద హంతకిలా (సైలంట్ కిల్లర్) దాని పని అది చేసుకుపోతూనే ఉన్నది. దీనికి ముకుతాడు వేయాల్సిందే. ఎవల్యూషన్ షుడ్ బి రివల్యూషన్ - మార్పు విప్లవాత్మకంగా రావాలి అంటే అప్పుడప్పుడూ ఇలాంటి తీర్పులే కీలకం.
గర్భవిచ్ఛితి, గర్భస్రావం (అబార్షన్) హక్కు గర్భం ధరించే వ్యక్తే కలిగి ఉంటారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పురుషాధిక్యతపై పెద్ద పిడుగుపాటు.
మానవ సమాజ పరిణామ వికాసం ఎన్నెన్నో దశలు దాటుకుని ఇప్పటికి ఇలా వచ్చింది. వావివరుసలు లేని ఆదిమానవుల గుంపు సంపర్కం నుండి బహు భర్తృత్వం, బహుభార్యత్వం, ఒక పురుషుడు - ఓ స్త్రీ కలిగిన దాంపత్య వ్యవస్థకు సమాజం చేరుకున్నది.
ఆహార-నిద్ర-మైధునాలు పశుపక్ష్యాదుల ప్రాకృతిక అవసరాలు గనుక, వాటికి లేని కఠిననైతిక నియమాలు ఈ మానవులకు ఏల? అనివాదించే వారు లేకపోలేదు. పెట్టుబడిదారీ ప్రపంచం అదే ప్రభోదిస్తున్నది కూడా.
కుప్పలు తెప్పలుగా అంతర్జాల (ఇంటర్నెట్) ప్రపంచంలోకి చొరబడ్డ పోర్న్ కల్చర్ (అశ్లీల బూతు చిత్రాల ఉత్పత్తి, పంపిణీ, వినిమయం) ఓ జాడ్యమై పసి మెదడుల నుండి, పండు ముసలి మెదళ్ళ వరకు కలుషితం చేస్తున్నది. లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు ద్వారాలు తెరుస్తున్నది. మత్తు, మాదక పదార్థాల్లా ఈ మురికి సెల్ఫోన్ల ద్వారా మారుమూల గ్రామాలకు సైతం ప్రవహిస్తున్నది. జంతువులాగా శృంగారంలో పాల్గొను. క్షణాల్లో నీ సంభోగ సామర్థ్యం పెంచుకో అనే వ్యాపార ప్రకటనలను ఇబ్బడి ముబ్బదిగా పెంచుతూ అనారోగ్యకర కామవాంఛలకు తెరదీస్తున్నది. ఇప్పుడంతా బహిరంగమైపోయింది. ఈ దుర్మార్గం వలన లైంగిక హింసా నేరాలు తామర తంపుల్లా పెరుగుతున్నాయి. ఆరేండ్లలోపు పసి పిల్లలు కూడా ఈ అమానుషాలకు బలికావడం పెద్ద విషాదం. అయినప్పటికీ వాటిని నిషేధించకుండా కళ్ళు మూసుకుని పాలుతాగే పిల్లిలా ప్రభుత్వాలు వ్యవహరించడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
ఇక అసలు విషయానికి వస్తే ఆదిమ సమాజంలో గుంపు యుద్ధాలు సంభవించినప్పుడు గెలిచినవారు ఓడినవారి సంపదలు దోచుకోవడం, ఆ మనుషులను బానిసలుగా ఉపయోగించుకోవడం లేదా నిర్బంధించడం అందరికీ తెలిసిందే. అంటే బానిసలు విజేతల ఆస్తిగా మారారు. ఆ విధంగా బానిసలు తమపై తమకున్న మాన, ప్రాణ హక్కులు కోల్పోయారు.
మహాభారత గాథ ఇదేగా మనకు చెప్పేది. జూదంలో ధర్మరాజు తన ధర్మపత్ని ద్రౌపదిని ఓడితే, ...రా, వచ్చి తన అంకపీఠం (తొడను చూపుతూ) అధీష్టించమని ధుర్యోధనుడు కోరినప్పుడు గాని, అతని తమ్ముడు దుశ్శాసునుడు నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం గావించినప్పుడు గాని, భీష్మ ద్రోణాచార్యులు సైతం పల్లెత్తు మాట అనలేకపోయారు. దీనిని బట్టి స్త్రీ ఒక వ్యక్తి గాదని, పురుషుడి ఆస్తిగానే చూసే విధానం ఆ పురాణాకాలం నాటి నుండే ఉన్నదని అర్థమవుతున్నది.
ఈ క్రమంలోనే మాన రక్షణకు 'ఇనుప కచ్చడాలు' పుట్టుకొచ్చాయని తాపీ ధర్మారావు తెలుగోలోకానికి తెలిపారు. ఆ మనిషితో సంపర్కరం తనొక్కనికే సొంతం అనడానికి ఇదో తార్కాణం.
'నిజం చెప్పాలంటే ఇనుపకచ్చడం అనేది కల్పనా కాదు, కాకరకాయ కాదు. కడిగి వడబోసిన సత్యం. ఇప్పుడు కూడా అవి ఉండే ఉండవచ్చు. మానవ స్వభావం మారకుండా ఉంటే ఈ కచ్చడాలకు కావలిసినంత అవసరం ఎప్పుడైనా ఉండవలసిందే' అనేది ఆ 'ఇనుపకచ్చడాల' గ్రంధవ్యాఖ్య.
స్త్రీ మానం మీద, స్త్రీ గర్భం మీద పురుషాధిక్యత తరతరాలుగా కొనసాగుతున్నట్టు ఈ ఉదంతాలు తెలియజేస్తున్నాయి. పరాకాష్టగా భర్త మరణిస్తే, భార్య కూడా విధిగా భర్తతో పాటు మరణించాలన్న సతీసహగమనం ఇటీవల వరకు సాగింది. సిగ్గులేకుండా మనుధర్మ శాస్త్రవాదులు ఈ మూఢాచారాన్ని ఇప్పటికీ బలపరుస్తున్నారు. స్త్రీ స్వేచ్ఛను, సమానత్వాన్ని ఆమోదించలేని ఆధునిక కపట సమాజంలో మహిళలు బతుకుతున్నట్టు అడుగడుగున విదితమవుతున్నది. గర్భవిచ్ఛితి (అబార్షన్) హక్కులు స్త్రీల పరం కాకూడదని ఇటీవల అగ్రదేశం అమెరికాలో కూడా న్యాయస్థానం, మితవాదులు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మన సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు స్వాగతించదగినదని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వారి వారి వైవాహిక, జీవన స్థితిగతులతో నిమిత్తం లేకుండా సురక్షితమైన అబార్షన్ (గర్భవిచ్చితి, గర్భస్రావ) హక్కు మహిళలందరికీ ఉండే తిరుగులేని హక్కు అని సుప్రీం తీర్పు ప్రస్పుటం చేసింది.
స్త్రీలేకుండా సృష్టిలేదు. అదే సందర్భంలో సురక్షిత గర్భస్రావం ఓ సామాజిక నైతిక బాధ్యత. పునరుత్పత్తి చేయగల అవకాశం, చేసే సామర్థ్యం ప్రకృతి పరంగా స్త్రీలకే దక్కింది. మధ్యలో పురుషాహంకార జోక్యం అవాంఛనీయం. మతం, ధర్మసూక్తులను అడ్డుపెట్టుకుని పురుష ప్రపంచం సాగించిన కపట నాటకాన్ని ఇంతకాలం స్త్రీలోకం భరించింది. ఇకచాలు, ఇప్పుడు పురుషాధిక్యతతో పాటు మతగోడలు బ్రద్దలువుతున్న తీరును చూసి చాంధసులు బెంబేలెత్తుతున్నారు.
కార్యేషు దాసీ, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, శయనేషు రంబా, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ అంటూ పురుష కాంక్షలకు యుగయుగాలుగా స్త్రీని బంధీగా చేశారు. అదే విధంగా స్త్రీ మూర్తి పురుషలోకాన్ని బంధిస్తే... భూన బోనంతరాలూ బ్రద్దలైపోవూ అనే చమత్కారాలు పుట్టుకొస్తున్నాయి.
అందుకే చాలా దేశాల్లో ఇప్పటికీ స్త్రీని సమానంగా గౌరవించే ఆధునిక మానవుడు ఉద్భవించకుండా పురుషాధిక్య పాలకులు ముళ్ళకంచెలు నిర్మిస్తున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. స్త్రీ-పురుష కలయిక ఇష్టపూర్వకమైనప్పుడు గర్భస్రావం ఒకరికి ఇష్టం - మరొకరికి ఇష్టం కాకపోవడం ఏమిటీ? అని కూడా సుప్రీం ప్రశ్నించడం గమనార్హం.
మతోన్మాదం, కులోన్మాదం మాదిరిగానే పురుషాహంకారం కూడా మన సమాజంలో అనాదిగా పాతుకుపోయిన విషబీజం. సామాజిక అణచివేత దాని అంతఃసారం. అడుగుడుగునా అది విలయతాండవం చేస్తూనే ఉన్నది. నిశ్శబ్ద హంతకిలా (సైలంట్ కిల్లర్) దాని పని అది చేసుకుపోతూనే ఉన్నది. దీనికి ముకుతాడు వేయాల్సిందే. ఎవల్యూషన్ షుడ్ బి రివల్యూషన్ - మార్పు విప్లవాత్మకంగా రావాలి అంటే అప్పుడప్పుడూ ఇలాంటి తీర్పులే కీలకం. సెల్:
- కె శాంతారావు
9959745723