Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పరిధిలో ఉన్న భద్రాచలం నియోజకవర్గంలో 20రోజులకు పైగా కూలిపోరాటాలు సాగు తున్నాయి. సుమారు పదేండ్ల కాలం తర్వాత సాగుతున్న ఈ కూలిపోరాటాలు పల్లెలు, కూలి పేటలు, గిరిజన గ్రామాలను కదిలిస్తున్నాయి. 98 గ్రామాలలో గ్రూప్ మీటింగులు, జనరల్బాడీలు 128 గ్రామాలలో 10వేల కరపత్రాలతో ప్రచారం జరిగింది. గ్రామాలలో జరిగిన సభలలో 8778మంది ప్రజలు పాల్గొన్నారు. కనీస వేతన జీవోను అమలు జరపాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని మండల కేంద్రాలో జరిగిన ప్రదర్శనలలో వాజేడు, వెంకటాపురం మండలాలలో సుమారు 4,000మంది ప్రజలు పాల్గొన్నారు. చర్ల, దుమ్ముగూడెం మండలాలలో జరిగిన ప్రచారం గ్రామసభలలో 27 గ్రామాలలో 1875 మంది కూలీలు పాల్గొన్నారు. 75 గ్రామాలలో రూ.200 నుండి రూ.260గా కూలి రేట్లు సాధించుకోవడం జరిగింది.
జాతీయ గ్రామీణ
ఉపాధిహామి పథకం రాకముందు
ఉపాధి పనిలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ చట్టం వలన కొంత మేరకైనా పని గ్యారంటీ లభించింది. దీనితో వేతన సమస్య కొద్దిగానైనా పరిష్కారం అయ్యింది. ఒకనాడు ఈ చట్టం సాధించుకోవడానికి ముందు వ్యవసాయాధారిత పనులు మాత్రమే దొరికేవి. నాటి భూసమస్య, ధనిక రైతాంగం ఆగడాలకు దోపిడీకి తిరుగుండేది కాదు. అయ్యా! దొర పని కావాలని కూలీలు అడిగితే గంటలు, రోజులు తరబడి పని ఇవ్వటానికి కూడా నిర్లక్ష్యం చేసేవారు. పిల్లలకు, వృద్ధులకు పని ఇచ్చేవారు కాదు. యుక్త వయసులో ఉన్న వారికి మాత్రమే పని ఉండేది. ఎందుకంటే శారీరక శ్రమ ఎక్కువగా చేసి ఉత్పత్తి ఎక్కువగా సాధించే వారిని మాత్రమే ఏరి, కోరి పని ఇచ్చే స్వభావం, కూలీల రెక్కల కష్టం దోపిడీ చేసే స్వభావం భూస్వాములు సొంతం.
ఆత్మగౌరవం, సామాజిక వివక్ష, దోపిడీ
కులం ఆధారంగా పని, ఆడ, మగ తేడాతో వేతనాలు, యుక్త వయసులో ఉన్న వారికి పని ఇవ్వటం, సగం పేర్లతో పిలిచి అవమానం చేసే పద్ధతికి కొంత పరిష్కారం దొరికింది. బేరమాడే శక్తి కూలీలకు పెరిగింది. ఆనాడు ఎల్లమ్మ అని పేరు ఉంటే ఎల్లి అని, మల్లయ్య అని పేరు ఉంటే మల్లిగాడు, వెంకట్గాడు, మాలోడు, మాదిగోడు, చాకలోడు, మంగళోడు అని సగం పేరుతో పాటు కులాల పేర్లతో పిలిచి అవమానం చేశారు భూస్వాములు. బీదా, బిక్కి జనానికి గత కేంద్ర యూపీఏ ప్రభుత్వంలో కమ్యూనిస్టుల పాత్ర వలన జాతీయ గ్రామీణ ఉపాధి హామి చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి చట్టాల వలన ఇప్పుడు మార్పు వచ్చింది. నాడు భూస్వామి ఇచ్చే పని కోసం పడికాపులు కాచిన బీదలకు, పనికి వస్తే ఎంత కూలి ఇస్తావు, పని ప్రదేశానికి వాహనం (ట్రాక్టర్,ఆటో) పెడతావా అని అడిగే చైతన్యం కూలి సంఘం నేర్పింది. ఈ చైతన్యంతోనే పేదలు పోరాడుతున్నారు. వేతనాలు సాధిస్తున్నారు.
వ్యవసాయంలో వచ్చిన మార్పులు
నాటి పెత్తందారీ పోకడలు చెల్లుబాటు కాకపోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం గ్రామాలకు విస్తరించడం, సరైన సాగునీటి వనరులు లేకపోవడం, కార్పొరేట్ వ్యవసాయ పద్ధతి ప్రవేశంతో భూస్వామ్య వ్యవస్థ గ్రామాలలో బలహీనపడింది. అయితే కూలీల రెక్కల కష్టానికి మాత్రం ఎటువంటి పురోగతి లేని మార్పులు ప్రస్తుతం ఉన్నాయి. పోరాటాల ఓరవడి కూడా బలహీనపడింది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్థిక స్తోమత లేని పరిస్ధితిని గమనించిన కూలి సంఘం కూలిలలో భారాలపై, ఆర్థిక స్ధితిపై చర్చ పెట్టింది. సరైన మార్గాన్ని ఎంచుకున్న పేదలు కూలీ పోరాటాలకు సిద్దమ య్యారు. ఈ క్రమంలో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ములుగు జిల్లాలోని వెంకటా పురం, వాజేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలాలలో కూలి పోరాటాలకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది.
నేపధ్యం
కనీస వేతనాల కోసం పార్లమెంటులో సమగ్ర శాసనం చట్టం ఆమోదమై ఉన్నది. అట్టి చట్టం ప్రకారం కనీస వేతనాల జీవోను ప్రతి రెండేండ్లకు ఒకసారి పెరిగిన నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వమే వ్యవసాయ ఆధారిత పనులకు కూలి రేట్లు నిర్ణయించి అమలు చేయాలి. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ కాలంలో ఒక్కసారి కూడా కనీస వేతనాలపై పార్లమెంట్లో చర్చ జరగలేదు. ఈ జీవో గురించి పట్టించుకోకపోగా పేదప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారాలు మోపింది. గ్యాస్, నూనెలు, పప్పులు, ఉప్పులు, ఆడపిల్లలు పెట్టుకునే బొట్టు బిళ్ళల దగ్గర నుండి కట్టుకునే బట్టల వరకు విపరీతమైన ధరలు పెంచింది. కానీ కూలీల రెక్కల కష్టానికి మాత్రం రేట్లు పెంచడం లేదు.
కేంద్ర ప్రభుత్వ మార్గంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాల విషయంలో పేదలకు అన్యాయం చేసింది. ఈ ఎనిమిదేండ్ల కాలంలో ఒక్కసారి కూడా రాష్ట్రంలో కనీస వేతనాల జీవోను సమీక్షించలేదు. ఈ ప్రభుత్వం కూడా కూలీలపై తీవ్రమైన భారాలు మోపింది. ఈ భారాలను అనుభవిస్తున్న పేదలు తమ రెక్కల కష్టానికి ఖరీదు లేదని గ్రహించి కూలిపోరాటాలకు సన్నద్ధమయ్యారు.
కనీస వేతనాల జీవోను సమీక్షించి పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు ప్రభుత్వమే నిర్ణయించి అమలు జరపాలి. కానీ వాస్తవంగా ఇస్తున్న కూలి రేట్లు ఏ పనికి ఎంత ఇస్తున్నారు చాలీచాలని వేతనాలకు మూలకారణం ఏమిటని ఆలోచించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీలు పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు.
వీటి సాధన కోసం అన్ని గ్రామాలలో ప్రచారం ముగించుకొని వేలాది మందితో వాజేడు, వెంకటా పురం మండలాలలో ప్రదర్శన నిర్వహించి స్థానిక ఎమ్మార్వోలకు వినతి పత్రం ఇచ్చారు. రైతులను పిలిచి చర్చలు జరపాలని కోరారు. స్పందించిన రెండు మండలాల ఎమ్మార్వోలు చొరవ చేశారు. వాజేడు మండలంలో రైతులను, ముఠా మేస్త్రీలను, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల సమక్షంలో చర్చించుకొని ప్రస్తుతం రూ.200 రోజు కూలికి అదనంగా రూ.50లు పెంచి రూ.250లు సాధించుకోవడం జరిగింది. కానీ వెంకటాపురం మండలంలో కూలి రేట్లు పెంచేది లేదని రైతులు అనటంతో సమ్మెకు దిగారు. సమ్మె జరుగుతున్న సమయంలో రైతులు చత్తీస్ఘడ్ నుండి కూలీలను తీసుకువచ్చారు. పైసా పెంచం నీ దిక్కున్న కాడ చెప్పుకోండి మా వద్ద పనిచేసే వాళ్లు మాకే ఎదురు తిరుగుతారా? కూటికెల్లకుంటే, పొట్ట మాడితే అప్పుడు తెలుస్తుందని, కలిసి, మెలిసి పనిచేసుకుంటున్న గ్రామలలో కూలి సంఘం నాయకులు వచ్చి పచ్చని పల్లెలలో చిచ్చు పెడుతున్నారని, రెచ్చగొట్టడంతోపాటు కూలి సంఘం నాయకులపై పోలీసు ఫిర్యాదువ కూడా చేశారు. కూలీలు సంఘం అండతో సామరస్యంగా పోటీ కూలీలకు నచ్చచెప్పే పని చేశారు. అధికారులను కదిలించే పని చేశారు. జోరు వానలను సైతం లెక్కచేయకుండా కూలీలు రోడ్లపై బురదలో బైఠాయించారు. ఆ సందర్భంగా రెవెన్యూ పోలీస్ అధికారులు కొన్ని బెదిరింపులకు పూను కున్నారు. కూలీలు కనీస వేతనాలు జీవో కాపీని చేతికిచ్చి సమాధానం చెప్పమన్నారు. జిల్లా లేబర్ ఆఫీసర్ సైతం వచ్చి రైతులతో చర్చలు జరిపారు. ససేమీరా అని రైతులు మొండికేశారు. ఈ క్రమంలో వెంకటాపురం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద 24గంటల వంట వార్పుకు కూలీ సంఘం పిలుపునిచ్చింది. ఆ సమయంలో స్థానిక ఎమ్మార్వో, ఎస్ఐ చొరవ చేసి రైతులతో సీరియస్గా చర్చించారు. దిగివచ్చిన రైతులు కూలీ రేట్లు పెంచడానికి అయిష్టంగానైనా అంగీకరించారు. కూలిలతో, సంఘం నాయకులతో చర్చ జరపమని అధికారులే బాధ్యత తీసుకొని పరిష్కారం చేయాలని రైతులు తెలిపారు. దీనికి స్పందించిన కూలీ సంఘం నాయకులు, కూలీలు రైతులు చర్చలకు రాకపోతే పెరిగిన కూలీ రేట్లు ఏవరు అమలు జరుపుతారని అధికారులను ప్రశ్నించారు.
అనంతరం రోజు కూలి రూ.200 నుండి రూ.260లు అదికూడా ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు ఇస్తామని 2023 కొత్త సంవత్సరం సందర్భంగా కొంత పెంచుతామని రైతులు చెప్పారు. శాంతించిన కూలీలు సంఘం ప్రతినిధులు పరస్పరం చర్చించుకుని 2023 జనవరి మొదటివారం నుండి రేట్ల పెంపునకు పోలీసు రెవెన్యూ బాధ్యత తీసుకోవాలని పెట్టిన షరతులకు పోలీస్ అంగీకరించింది. దీనితో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. పోరాడి విజయం సాధించుకున్న పేదలకు వ్యవసాయ కార్మిక సంఘం అభినందనలు.
- మచ్చా వెంకటేశ్వర్లు
సెల్: 9490098192