Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరాన్లో మహిళలు హిజాబ్‌లు తగులబెట్టే దృశ్యాలు ఇండియాలోని బీజేపీ సోషల్ మీడియా పోకిరీలకు ఉత్సాహం కలిగించాయి. కర్నాటక విద్యా సంస్థలలో హిజాబ్ ధరించాటాన్ని వ్యతిరేకించిన మహిళలను తిట్టటానికి అవకాశంగా వీరు దానిని వాడుకున్నారు. ''హిజాబ్ ధరించాలని చెప్పే సిగ్గులేని భారతీయ మహిళలకు ఈ ఫొటోలను చూపండి'' అని ఒకడు కూశాడు.
మెహెసా అమిని అనే 22 సంవత్సరాల కుర్దిష్ యువతి టెహరన్లో పోలీసు కస్టడీలో మరణించింది. దీంతో టెహరన్, మరికొన్ని నగరాలలో వరుసగా నిరసనలు చెలరేగాయి. దుర్మార్గానికి మారుపేరుగా నిలిచిన మోరల్ పోలీసులు మెహసా అమినిని ''సరిగా హిజాబ్'' ధరించలేదని అరెస్టు చేశారు. పోలీస్ కస్టడీలో మెహసా తలపై లాఠీలతో చాలాసార్లు కొట్టారని, అందువలనే ఆమె చనిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. మెహసా మరణానికి నిరసనగా వందలాది మంది ఇరాన్ మహిళలు ధిక్కారంతో, సంఘీభావ ఆందోళనకు దిగారు. వీధులలో మంటలు రాజేసి ఆ మంటలకు హిజాబ్‌లను అహుతి చేశారు. పోలీసులు జరిపిన కాల్పులలో పదుల సంఖ్యలో నిరసనకారులు మరణించారు. బలమైన నిరసనకు గుర్తుగా, ఒక అమరవీరుని చెల్లెలు అతని అంత్యక్రియలలో హిజాబ్‌ను చించివేసింది, తన జుట్టును కత్తిరించుకుని పిడికెడు జుట్టును శవపేటికపై ఉంచింది. దీని తరువాత, అనేకమంది యువతులు జుట్టును కత్తిరించుకున్న, హిజాబ్‌లను గాలిలోకి విసిరివేసిన వీడియోలతో సామాజిక మాధ్యమాలు నిండిపోయాయి. ఇరాన్ అంతటా నిరసనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఇరాన్ మహిళల నిరసనకు సంఘీభావంగా మనముందాం. వారి అగ్రహావేశాలలో మనమూ భాగస్వాములమవుదాం.
ఇక్కడ కర్నాటకలో హిజాబ్ తొలగించనిదే కాలేజీలోకి రానివ్వమని ముస్లిం యువతులపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. దానిని వ్యతిరేకిస్తూ హిజాబ్ ధరించి, తమను కాలేజీలోకి అనుమతించాలిసిందే అని డిమాండ్ చేస్తూ వారు కాలేజీ గేటువద్ద నిలబడ్డారు. అలా గేటు వద్ద నిలబడిన ముస్లిం యువతులను ప్రభుత్వ వత్తాసు కలిగిన రౌడీమూకలు వెక్కిరించాయి, తిట్టాయి, బెదిరించాయి, అవమానించాయి. అయినా వారు లొంగలేదు, తమ పోరాటాన్ని సుప్రీంకోర్టుకు నివేదించాయి. వారి ప్రతిఘటనకు సంఘీభావంగా మనం నిలబడదాం. చదువుకి, నమ్మకానికి మధ్య దేనిని ఇష్టపడాలో తేల్చుకోవలసిన పరిస్థితి పట్ల వారు చూపిన ఆగ్రహంలో మనమూ పాలుపంచుకుందాం.
అణచివేతకు చిహ్నంగా ఉన్న హిజాబ్‌ను ఇరాన్ దేశపు మహిళలు తగలపెట్టట్టాన్ని మనం సమర్థిద్దాం. హిజాబ్‌ను ధరించటం తమ హక్కని పోరాడుతున్న కర్నాటక యువతులను అదే స్థాయిలో మద్దతుగా నిలబడదాం. ఇది ఏమన్నా పరస్పర విరుద్ద వైఖరిగా ఉన్నదా?
ప్రతిఘటనలకి, సమస్యలకు ఒక రాజకీయ సందర్భం ఉంటుంది. ఏ పరిస్థితులు, ఏ రాజకీయాలు ఇటువంటి నిరసనలను ప్రేరేపిస్తాయి? ఈ రెండు సందర్భాలలోను సమస్యలో ''హిజాబ్'' అనే అంశం కామన్‌గా కనపడుతున్నప్పటికీ, వీటి పరిష్కారాలకు మార్గం భిన్నంగా ఉన్నది. ఎటువంటి దుస్తులు ధరించాలో, ఎవరి సహచర్యం కలిగివుండాలో, ఎవరిని తన భాగస్వామిగా ఎంచుకోవాలో- ఇటువంటివి నిర్ణయించుకోవటంలో మహిళకు హక్కు ఉన్నదా, లేదా? నిరసనలు జరిగిన ఈ రెండు సందర్భాలలోను మహిళలకున్న నిర్ణయాధికారం, తమ శరీరంపై తమకున్న హక్కు, వారికున్న లైంగిక ఆలోచనలు- వీటిని అవగాహన చేసుకోవటం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాలలో మౌలికంగా పరస్పర విరుద్ధ వైఖరులతో ఉన్న శత్రుపక్షాలు ఏదైనా ఒక సమస్యపై ఒకే వైఖరిని కలిగివుండటం సంభవించవచ్చు. స్త్రీల స్వయం నిర్ణయాధికారానికి, వారు దేనినైనా ఎంచుకునే హక్కుకు మద్దతిస్తున్నారా, లేదా అనే ఒకేఒక కొలబద్దత ఆధారంగా వారి వైఖరిని చూడాలి.
ఇరాన్లో మహిళా హక్కుల పోరాటానికి ''హిజాబ్'' ఒక ప్రతీకగా ఉంది. సామాజిక భిన్నత్వం ఇరాన్‌కి ఉన్న మరో కోణం. ఇరానీయన్లు, కుర్దిష్ ప్రజలు, ఆదివాసీలు ఇలాగ ప్రత్యేక సంస్కృతులు ఇరాన్లో ఉన్నాయి. స్వతంత్ర ప్రతిపత్తి కోసం కుర్దిష్ ప్రజల ఆకాంక్షలు కూడా ఇరాన్ మహిళల పోరాటాన్ని ప్రభావితం చేసాయి. 1930 దాకా అక్కడ వస్త్రాధారణ పై కఠిన ఆంక్షలులేవు. ఇరాన్ షా అధికారంలోకి రావటంతో, పాశ్చాత్య దేశాల సంస్కృతికి ఊపు వచ్చింది. అతని చొరవతో పశ్చిమ దేశాలలో లాగా బట్టలు వేసుకోవటం, వారి భాష, ఇతరవిధాలలో మార్పు వచ్చింది. 1930లో ఆ తర్వాత హిజాబ్ వేసుకోవటంపై నిషేధం విధించారు. ఏ మహిళ అయినా హిజాబ్ ధరిస్తే శిక్షకు గురవుతారు.
అయితే, హిజాబ్ ధరించిన మహిళలపై హింస, దౌర్జన్యం చేయటంతో పరిస్థితి మారిపోయింది. హిజాబ్‌ను బలవంతంగా తొలగిస్తున్న సందర్భాలలో గట్టి ప్రతిఘటన, నిరసనలు జరిగాయి. పాలకులకు నిరసన తెలిపే ఉద్దేశ్యంతో ఎక్కువ మంది మహిళలు హిజాబ్ ధరించటం ప్రారంభమయింది. షాను పదవీ భ్రష్టున్ని చేసినవారు. హిజాబ్ ధరించాలా లేదా అనే దానిని మహిళల ఇష్టానికి వదిలివేశారు. షాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం మరింత ప్రజాస్వామ్యం, పౌర స్వేచ్ఛ, పౌర హక్కుల కోసం అయినప్పటికీ ఇరాన్‌లోని అన్ని తరగతుల ప్రజలను కలుపుకుని సాగింది. అయితే, అంతిమంగా ఇస్లాం పేరుతో మాతాధికారులు, నిరంకుశ వర్గం అధికారాన్ని చేజిక్కించుకున్నది. హిజాబ్ తప్పనిసరిగా ధరించాలనే ఆదేశాలు కొత్త పాలకులు ప్రకటించారు. దీనితో మహిళలు పెద్దయెత్తున నిరసనలకు దిగారు. చట్టం అమలును నిలిపివేశారు. 1983లో మరింత కఠిన శిక్షలతో హిజాబ్ ధరించటం తప్పనిసరి అని చట్టం చేశారు. ముసుగు ధరించని మహిళకు జైలు, జూల్మానాతో పాటు 74కొరడా దెబ్బల శిక్ష కూడా వేశారు. దీన్ని ప్రతిఘటించి కొందరు దేశం నుంచి వెళ్లగొట్టబడ్డారు. అసమాన సాహసంతో మహిళలు సాగిస్తున్న పోరాటం అది. హిజాబ్ తగులపెట్టటం ఆ పోరాటానికి చిహ్నం.
ఇండియాలో, ఇటీవల కర్నాటకలో జరిగిన ఘటనల వరకు, ఎప్పుడూ ఏ మతానికి సంబంధించి అయినా అధికారికంగా ఎటువంటి డ్రెస్‌కోడ్ లేదు. సిక్కు మతానికి సంబంధించి కృపాణాలు వెంట ఉంచుకోవటం లాంటి కొన్ని చిహ్నలను రాజ్యాంగం గుర్తించింది. సిక్కులు టర్బన్ ధరిస్తారని చాలామంది నమ్ముతుంటారు. స్కూల్ యూనిఫారంతో పాటు సిక్కు యువకులు టర్బన్ ధరించటం సాధారణంగా చూస్తూవుంటాం. దానినెప్పుడు విభజనకు గుర్తుగా పరిగణించలేదు. అయితే, మెజార్టీమత రాజకీయాలు పెరగటంతో, మరీ ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదేండ్ల కాలంలో ఆ ప్రభుత్వం, దాని రాజ్యాధికారం వెన్నుదన్నుతో మతపరమైన చిహ్నలు, పండుగలను మతతత్వ రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాటానికి వాడుతున్నారు. దీనికి స్పందనగా, ముస్లిం మతసమాజం తమ సంప్రదాయం, ఆచారమైన బురఖాను, హిజాబ్‌ను ధరించాలని ముస్లిం మహిళలపై ఒత్తిడి పెట్టింది. బురఖాను ధరించాలనే ఒత్తిడి ముస్లిం మహిళల మీద నిస్సందేహంగా ఉన్నది. కొన్ని ప్రాంతాలలో చిన్న పిల్లలకు కూడా తలకి గట్టిగా బిగించి కట్టుకున్న దుస్తులు ధరింపచేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటిది లేదు. ఇది మతంలో ఛాందసవాదుల పైచేయిని చూపుతోంది. కానీ, ఇండియాలో ముస్లిం మహిళల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క లాగా, ఒకవైపు సంస్కరణలకు గట్టి వ్యతిరేకులైన సొంత మతం ఛాందసవాదులు, మరోవైపు విద్వేషపు మాటలతో కయ్యానికిదిగే హిందుత్వ శక్తులు ఉన్నప్పటికీ, తాము నమ్మిన ఇస్లాం మతచట్రంలోనే సంస్కరణలకోసం పోరాడుతున్నారు. ఈ వీరోచిత పోరాటానికి ప్రజాస్వామ్యశక్తులన్నీ మద్దతు పలకాలి, ఆ పోరాటంలో భాగం కావాలి. కానీ ఇది చాలా కష్టమైనది. ఇటువంటి పరిస్థితుల్లో, విద్యాలయాలలోకి ప్రవేశించే అమ్మాయిలు హిజాబ్ తొలగించుకోవాలని బలవంతం చేసి కర్నాటక ప్రభుత్వం ఒక సమస్యను సృష్టించింది. అందరికీ తెలిసిన ఆ పరిణామాల లోతుల్లోకి వెళ్ళటం లేదు. యూనిఫారం కోడ్‌కి వ్యతిరేకంగా బురఖా ధరించి వచ్చే విద్యార్థినులకు మద్దతుగా నిలిచిన వారిని అయోమయంలోకి నెట్టటానికి బుద్దిపూర్వకమైన ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ఈ వివరణ అవసరమైంది. ఒకపెద్ద అబద్ధాన్ని ప్రచారంలో పెట్టారు. ఎవరూ బురఖాను, లేక ముఖం మొత్తాన్ని కవరు చేస్తూ క్లాస్ రూములకు వెళ్ళటం లేదు. ఖిమిర్ను వాడుకభాషలో హిజాబ్ అంటారు. హిజాబ్ తలపై వేసుకునే వస్త్రంకు సంబంధించిన సమస్య. తలపై ధరించే ఈ వస్త్రాన్ని నిషేదించటంలో కర్నాటక ప్రభుతత్వానికి ఉన్న లక్ష్యం పూర్తిగా రాజకీయపరమైనది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మతోన్మాద ఎజెండాను ముందుకు తీసుకెళ్లటానికి ఉద్దేశించినది. ప్రక్కనున్న కేరళలో విద్యార్థినులు, యూనిఫాంతోపాటు హిజాబ్ వేసుకునే స్కూళ్లకు, కాలేజీలకు వెళుతున్నారు. కొన్నిచోట్ల యూనిఫాం రంగులోవున్న హిజాబ్‌ని ధరిస్తున్నారు. హిజాబ్ వేసుకుంటున్నందువల్ల కేరళలో ఎటువంటి సమస్యా రాలేదు. మతచిహ్నాల పేరుతో విభజన లేదు, యూనిఫాం కోడ్ ను ఉల్లంఘించిందిలేదు. అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ పరీక్షలు రాస్తున్నారు, మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
ఇటువంటి పరిస్థితులలో ప్రజాస్వామ్య వైఖరి ఎలా ఉండాలి? కర్నాటకలో విద్యార్థినులు హక్కుగా హిజాబ్ ను ధరించటానికి ఇష్టపడితే, అది ఇస్లాం మతం నమ్మకంలోని భాగమని నమ్మితే మద్దతు ఇవ్వాలి. వ్యాఖ్యనాలు (అర్ధవివరణలు) ఒకదానికొకటి విరుద్ధంగా ఉండవచ్చు. సౌదీ అరేబియాసహా చాలా ముస్లిం దేశాలలో మహిళలు, యువతులు హిజాబ్ ధరించటం తప్పనిసరికాదు. అయితే, ప్రపంచంలోని కొన్నిచోట్ల తప్పనిసరి అని నమ్ముతారు. అటువంటప్పుడు యువతుల విద్యాహక్కును నిరాకరిస్తూ, కాలేజీ చదువును వదిలి పోవటమా, లేక తమ అంతరాత్మకు వ్యతిరేకంగా నడుచుకోవటమా అనే సమస్యగా ఇది ఎందుకు తయారయింది? ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. న్యాయానికి విరుద్ధం. దీనిని నేను అణచివేతకు గుర్తుగా అనుకోవాలా, లేక ఇది అప్రధాన విషయం అనుకోవాలా? విద్యార్థినులు బలవంతం మీద హిజాబ్ ధరించకూడదనటంలో ఉన్న విషయం- రాష్ట్రం, న్యాయస్థానాలు, ప్రభుత్వాలు మానసిక స్వేచ్ఛతో, విద్యాహక్కుతో, వ్యక్తిగత ఇష్టాఇష్టాలతో లింకై ఉన్న ప్రాధమిక హక్కును నేలమట్టం చేస్తున్నాయి.
ఈ రెండు సందర్భాలలోను అధికారంలోవున్న మతోన్మాదులు, అత్యధికసంఖ్యాకుల భావజాలాన్ని బలవంతంగా అంటగట్టటానికి మహిళలను సాధనంగా చేసుకున్నారు. చరిత్రాత్మకంగా, మహిళలు వస్త్రాధారణ, ప్రవర్తన, లైంగిక ఆలోచనలు నియంత్రించు కోవటం వంటి కఠిన నియమాలకు కేవలం తలవొగ్గి ఉండటం వలన మాత్రమే మతాలు వారిని ''గౌరవనీయులుగా'' చూడటంలేదు. అటువంటి నియమాలను ఏమాత్రం ఉల్లంఘించినా కఠినమైన శిక్షలకు సంబంధించింది ఈ ''గౌరవం''. ఇరాన్లో అధికారంలోవున్న మతపెద్దలు అటువంటి నియమాల కోడ్‌ను మతం పేరుమీద చెరగని ముద్రగా లిఖించారు. ఇండియాలో, మనుస్మృతి లాంటి అధికసంఖ్యాకుల మతగ్రంథాలలోని అధిపత్య భావజాలాన్ని ఆచరణలో పెట్టటం మనం చూస్తున్నాం. కులమతాలకు అతీతంగా ఒకరినొకరు ఇష్టపడి, జీవిత భాగస్వాము తరతలవుదామనుకున్న యువ జంటలపై జరుగుతున్న గౌరవ నేరాలు మనం చూస్తున్నాం. కర్నాటకలో దీనినే మరోమార్గంలో నడుపుతున్నారు.
మెజార్టీ మత దృక్పధాన్ని ముందుకు తీసుకుపోవాలనుకునేవారు, తమ అధికార పీఠాన్ని వాడుకుని, మహిళను అవమానించటం ద్వారా ఆమె మతాన్ని అవమానించాలనుకుంటున్నారు. ''గౌరవం'' పేరు మీద ఏ సమాజంలో నైనా మహిళల మీద ఆంక్షలు రుద్ది, స్త్రీలను కుహనా ''గౌరవానికి'' గుర్తుగా మార్చటానికి చూస్తే, దానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలకు ప్రజాస్వామిక ఆలోచనలున్న ప్రతివ్యక్తి ఒక కర్తవ్యంగా మద్దతు ఇవ్వాలి. మహిళను మతానికి చిహ్నంగా చేసి, ఆమెనే టార్గెట్ చేస్తూ, తీవ్రమైన నిరంకుశత్వం ఆమెపై ప్రయోగించటాన్ని వ్యతిరేకించాలి. ఇరాన్లో గాని, కర్నాటక విషయంలోగాని రెండింటిలోను ఇదే సత్యం.
మేము మళ్ళీ మళ్ళీ చెపుతున్నాము: మా మద్దతు ధైర్యం సాహసాలు చూపుతున్న ఇరాన్ మహిళకే. మా సంఘీభావం హిజాబ్ ధరించటానికి ఇష్టపడుతున్న కర్నాటక యువ మహిళలకే. మేము అంటున్నాం, అది వాళ్ళ ఇష్టం, వాళ్లు మాత్రమే ఎంపిక చేసుకునే విషయం.
- బృందాకరత్
అనువాదం: కర్లపాలెం.