Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతిలో మనిషి ఒక భాగం. దేశంలో ప్రకృతి విపత్తులు వచ్చిన ప్పుడు పర్యావరణ ప్రాముఖ్యాన్ని చర్చించు కోవడం సర్వసాధారణం అయింది. చెట్లయొక్క ప్రాముఖ్యత, ప్లాస్టిక్‌ను నిరోధించడం, వాయు కాలుష్యం, జల కాలుష్యంను నిలువరించడం వంటి పర్యావరణ అంశాలపై చాలా చర్చ జరుగుతుంది. కానీ ఈ చర్చలు నిజజీవితంలో అమలు కావడం లేదు. పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ పర్యావరణ విధ్వంసాన్ని నిలవరించలేక పోతున్నాం. చట్టాలతో సాధించలేనిది చదువుతో సాధించవచ్చు అని అనేక సందర్భాలలో నిరూపించబడింది. పర్యావరణ విద్య ద్వారా పర్యావరణ పరి రక్షణ జరిగే అవకాశం ఉంది.
మెహతా అనే న్యాయవాది పర్యావరణ విద్య అమలుకై భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (డబ్ల్యు.పి నంబర్ 860/1991)కు తీర్పునిస్తూ పర్యావరణ విద్యను అన్ని శాఖలకు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో తప్పనిసరిగా అమలు చేయాలని 6.12.1999 నాడు మన అత్యున్నత న్యాయస్థానం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిలభారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసిటీఈ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్.సి.ఈ. ఆర్.టి)లను ఆదేశించడం జరిగింది. ఈ తీర్పుకు అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003-2004 విద్యా సంవత్సరం నుండి పర్యావరణ శాస్త్రాన్ని అన్ని శాఖలకు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల పాఠ్యప్రణాళికలో పాఠ్యాంశంగా అమలు చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కూడా పర్యావరణ శాస్త్రాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చడం జరిగింది. కానీ ఇంటర్మీడియట్ స్థాయి నుంచి ఉన్నత విద్యస్థాయి వరకు పర్యావరణ శాస్త్రాన్ని అమలు చేస్తున్న తీరు విద్యార్థులకు పర్యావరణ శాస్త్రంపై ఒక నిర్లిప్త వైఖరి పెంపొందించే విధంగా ఉన్నది. ఈ పాఠ్యాంశం అమలు చేసిన మొదటల్లో క్రెడిట్స్ లేకపోవటం వలన విద్యార్థులు ఈ పాఠ్యాంశంపై అంతగా శ్రద్ధ చూపేవారు కాదు. ఇది గమనించిన విశ్వవిద్యాలయాలు పర్యావరణ శాస్త్రానికి కూడా క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది. 2018లో అఖిలభారత సాంకేతిక విద్యా మండలి ప్రతిపాదించిన పాఠ్య ప్రణాళికలో పర్యావరణ శాస్త్రానికి క్రెడిట్స్ తిరిగి తొలగించడం జరిగింది. కాబట్టి ఈ పాఠ్యాంశం అమలు విద్యా సంస్థల్లో అంత ప్రభావవంతంగా అమలు కావడం లేదు. విద్యాసంస్థల్లో పర్యావరణ శాస్త్రానికి సంబంధం లేని ఉపాధ్యాయులచే పాఠాలు బోధించడం, సరైన పరీక్ష విధానాన్ని పాటించకపోవడానికి తోడు క్రెడిట్స్ కూడా లేకపోవడం వలన పర్యావరణ శాస్త్రం ఒక మొక్కుబడి చదువుగా మారిపోయింది.
పర్యావరణ శాస్త్రం అవశ్యకత:
పర్యావరణ శాస్త్రం వివిధ పాఠ్యాంశంల కలయిక
జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతికశాస్త్రం, వాతావరణ శాస్త్రం, భౌగోళిక శాస్త్రాలకు సంబంధించిన విజ్ఞానం పర్యావరణ శాస్త్రంలో ఉంటుంది. మనిషి భూమిపై మనుగడ సాగించాలంటే తను చుట్టూ ఉన్న పరిసరాల గురించి ప్రకృతి గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలు అన్ని మానవుడు సృష్టించినవే. పర్యావరణంపై అవగాహన రాహిత్యంతో మానవుడు తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్న పరిస్థితి ఏర్పడింది. పర్యావరణవిద్య విద్యార్థులలో పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని పెంపొందిస్తుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ''పర్యావరణ అనుకూల జీవన విధానం మంచి ఆరోగ్యానికి సోపానం''. ఉదాహరణకు సైకిల్ తొక్కడం అనేది పర్యావరణ అనుకూల జీవన విధానం. ఈ అలవాటు మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఉచితంగా ఇస్తుంది. పర్యావరణ అనుకూల జీవన విధానం తక్కువ ఖర్చుతో కూడిన జీవన విధానం. ఈ విషయాన్ని గమనిస్తే చాలా మంచిది. పర్యావరణ వ్యతిరేక జీవన విధానం అధిక ఖర్చుతో కూడిన అనారోగ్య జీవన విధానం. ఉదాహరణకు పెట్రోల్ వంటి శిలా ఇంధనాలతో పనిచేసే వాహనాలు అధికంగా వాడటం ఖర్చుతో కూడిన అనారోగ్య జీవన విధానం. అంటే పర్యావరణ విద్య పరోక్షంగా ఆదాయాన్నీ పెంచుతుంది.
పర్యావరణ పరిజ్ఞానం లేకుండా స్వచ్ఛభారత్ ఎలా సాధ్యం?
మన చుట్టూ ఉండే పరిసరాలు మన జీవన విధానాన్ని, మన ఆలోచన విధానాన్ని తెలియజేస్తాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ పర్యావరణ పరిజ్ఞానం లేకుండా స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమాలు విజయవంతం కావు. ఈ కారణం చేతనే స్వచ్ఛభారత్‌పై వేలకోట్ల ధనం వెచ్చించినప్పటికీ స్వచ్ఛభారత్ విజయవంతం కాలేదు. ధనం వృధా అయింది తప్ప ఫలితం సాధించలేదు. ప్రజల ఆలోచన విధానం మారినప్పుడే స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. పర్యావరణ విద్య ద్వారా విద్యార్థులలో తద్వారా సమాజంలో పర్యావరణం, పరిసరాలపై ఆలోచన విధానం పెంపొందే అవకాశం ఉంది. ఇప్పటికైనా విశ్వవిద్యాలయాలు, విద్యసంస్థలు పర్యావరణ శాస్త్రాన్ని ఇతర పాఠ్యాంశాలతో సమానంగా అమలు చేసినట్లైతే విద్యార్థులలో తద్వార సమాజంలో పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది.
- డాక్టర్ శ్రీదరాల రాము
సెల్: 9441184667