Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ రాజకీయ దాహం వల్ల, రాజగోపాల్‌రెడ్డి అవకాశవాదం వల్ల రాష్ట్రంలో మునుగోడు ఎన్నిక అనివార్యమైంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, స్వార్థ ప్రయోజనాల కోసం మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి, లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో రాజకీయంగా అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్వీళూరుతున్నది. ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరించాలి. ముఖ్యంగా కార్మికవర్గం వీరి కుట్రలను తిప్పికొట్టాలి. బీజేపీని ఓడించాలి. వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి.
2014 నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్మికుల హక్కులను కాలరాసి, కట్టు బానిసలుగా మార్చే చట్టాలను తీసుకువచ్చింది. ప్రజల సంపదను, ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్ముతున్నది. ధరలు, దారిద్య్రం, నిరుద్యోగం పెరుగుతున్నాయి. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా నడ్డివిరుస్తున్నది. వ్యవసాయ కార్మికుల కూలి రేట్లు పెంచడం లేదు. దళిత, గిరిజన, ఆదివాసి ప్రజలపైన నిత్యం దాడులు జరుగుతున్నాయి. భూములు, అటవీ సంపదలు కార్పొరేట్ల పరం చేస్తున్నారు, మహిళలపై దాడులు నిత్యకృత్య మయ్యాయి. ప్రశ్నించే గొంతులపై రాజా ద్రోహం కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తున్నారు. భారత సమాజాన్ని మతాల ప్రాతిపాదికగా విడగొట్టాలని చూస్తున్నది. హిందుత్వ పేరిట మెజారిటీ రాజకీయాలు చేస్తూ తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రచించబడిన భారత రాజ్యాంగాన్ని కాదని, ఆర్ఎస్ఎస్ మనువాద సిద్ధాంతం ప్రకారం బీజేపీ పాలించ చూస్తున్నది. ఇంతటి దుర్మార్గమైన బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలి. అందుకు మునుగోడు నాంది పలకాలి. హైదరాబాదుకు అతి చేరువలో ఉన్న చౌటుప్పల పారిశ్రామిక ప్రాంతంలో వేలాదిమంది కార్మికులున్నారు. మిగిలిన మండలాలలో భవననిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, హమాలీ కార్మికులు పెద్దసంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వంతో సంబంధం కలిగిన గ్రామపంచాయతీ, మున్సిపల్, ఆర్టీసీ, ఐకెపి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, పెన్షన్ ఉద్యోగులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ స్కీములైన ఐసిడిఎస్ అంగన్వాడీలు, మధ్యాహ్నం భోజనం, ఎన్హెచ్ఎం వైద్య సిబ్బంది, ఆశాలు, రెండవ ఏఎన్ఎం, గ్రామీణ ఉపాధి హామీ సిబ్బందితో పాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులైన పోస్టల్, బిఎస్ఎన్ఎల్, బ్యాంకు, ఎల్ఐసి తదితరులు గ్రామ గ్రామాన ఉన్నారు. వీరంతా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నవారు. అందుకే మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి. బీజేపీని ఓడించగలిగే శక్తి ఉన్న టీఆర్ఎస్ను గెలిపించాలి.
సమస్యలకు కారణమైన ప్రభుత్వ విధానాలను, ప్రభుత్వ విధానాలకు కారణమైన రాజకీయాలను కార్మికులు అర్థం చేసుకొని వాటిని ఓడించాలని సిఐటియు ఎప్పటినుంచో చెబుతున్నది. 2014, 2019లలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వేటు కార్మికులపైన పడింది. స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత కాలంలో పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను రద్దుచేసిన బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చింది. వేతనాలకు సంబంధించి వేజ్కోడ్, సౌకర్యాలు, ఉద్యోగ భద్రత ఆరోగ్యానికి సంబంధించి ఓహెచ్ఎస్కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సాంఘిక భద్రత కోసం కోడ్ తెచ్చింది. వీటి వల్ల మన రాష్ట్రంలోని సుమారు రెండు కోట్ల మంది కార్మికులు, వ్యవసాయ సంబంధిత కార్మికులు అనేక హక్కులు కోల్పోతున్నారు. చట్టబద్ధంగా 8గంటల పని దినం బదులు 12గంటలు పని చేయవలసిన దుస్థితి ఏర్పడుతుంది. కనీస వేతనాల నిర్ణయం ప్రభుత్వాల దయా దక్షిణ్యాలపై ఆధార పడవలసిన స్థితి ఉంటుంది. ఇప్పటికే పెట్టుబడిదారుల లాభాల కోసం మోడీ ప్రభుత్వం కనీస వేతనమును రోజుకో రూ.178మాత్రమే నిర్ణయించింది. పరిశ్రమల్లో పర్మినెంట్ వ్యవస్థ లేకుండా ఫిక్స్టెర్మ్ ఎంప్లాయిమెంట్ పేరిట ఎప్పుడైనా యజమానులు తొలగించుకోవడానికి అవకాశం కల్పించారు. 300మందిలోపు పనిచేసే ఏ పరిశ్రమనైన ప్రభుత్వం అనుమతి లేకుండానే మూసేసు కోవడానికి అనుమతించారు. సంఘాలు పెట్టుకునే హక్కును, సమ్మె హక్కును నీరు కార్చారు. కార్మిక శాఖను నిర్వీర్యం చేశారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో వివిధ స్కీములలో రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా వర్కర్స్ గ్రామ గ్రామాల సేవలు అందిస్తు ఉన్నారు. ఐసిడిఎస్‌లో పనిచేస్తున్న అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనపథకం కార్మికులు, నేషనల్ హెల్త్మిషన్లో పనిచేస్తున్న ఏఎన్ఎం ఇతరులు, ఉపాధి హామీ పథకం ఉద్యోగులను గతంలో 43, 45 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్సలో వీరందరినీ కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనాలు ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తీర్మానాలు అమలు చేయకుండా రద్దు చేశాడు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నా కేంద్రం తిరస్కరిస్తున్నది. స్కీములకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారు.
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని రద్దు చేయడం వల్ల వీరికి రక్షణ లేకుండా పోతున్నది. వేల కోట్ల రూపాయల సెస్ వసూలు చేయకపోవడం, చేసిన సెస్ ద్వారా వసూలైన వేల కోట్ల రూపాయలు కార్మికులకు ఖర్చు చేయడం లేదు. హమాలీలకు సమగ్ర శాసనం లేదు. వెల్ఫేర్ బోర్డులేదు. మోటార్ వెహికల్ చట్టం 2019 తీసుకురావడం వల్ల ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు రంగంలో పనిచేస్తున్న కార్మికులపై పన్నుల భారం, చలానుల భారం పెరిగింది. ఆటో డ్రైవర్లకు లారీ మోటార్ కార్మికులకు ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం లేదు. ప్రభుత్వరంగంలోని రోడ్డు రవాణా వ్యవస్థలను ప్రయివేటీకరించటానికి ఈ చట్టం తోడ్పడింది. ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతున్నది. రూట్లు, బస్సులు అన్ని ప్రయివేటు వారికి ఇవ్వడానికి చట్టం ఉపయోగపడు తున్నది. 2001, 2004 తర్వాత నియమించబడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులకు ప్రభుత్వ పెన్షన్ సౌకర్యం లేకుండా ఉన్నది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయడానికి బీజేపీ అంగీకరిం చడం లేదు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడం లేదు.
కార్మికుల కనీస వేతనాలు పెంచకుండా ధరలు విపరీతంగా పెంచింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోలు, డీజీలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. కార్పొరేట్ సంస్థల లాభాల కోసం వాటి మీద నియంత్రణలు ఎత్తివేశారు. బీజేపీ పాలనలో సామాన్యులు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు. రాష్ట్రంలో కార్మికవర్గం తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు. వీఆర్ఏ, సింగరేణి, ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, తదితర ఉద్యోగులు తీవ్ర ఆసంతృప్తిలో ఉన్నారు. అనేక రూపాల్లో పోరాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా ఈ రంగాలను ప్రభావితం చేస్తున్నాయి. కార్మికవర్గం సకల సమస్యలకు మూలం కేంద్ర ప్రభుత్వ విధానాలు కారణం. అందుకే బీజేపీ కార్మికుల ప్రథమ శత్రువు. దాన్ని ఓడించడమే నేటి కర్తవ్యం.
- భూపాల్