Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లో డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ బౌద్ధం స్వీకరించారు. అది జరిగి ఇప్పటికి 66ఏండ్లు. ఆయన తనతో పాటు ఆరులక్షల మంది అనుచరుల్ని, అనుయాయుల్ని బౌద్ధంలోకి మార్చారు. వారంతా ఇప్పుడు 'నియో బుద్దిస్ట్'లుగా గుర్తింపు పొందారు. గతంలో ఉన్న మహాయానం, హీనయానం శాఖల్లాగ వీరిది 'నవయానం' శాఖ అయ్యింది. బౌద్ధం ప్రపంచాన్ని మానవీయ సమాజంగా తీర్చిదిద్దగలదు అన్నది అంబేద్కర్ భావన! తను బౌద్ధం స్వీకరించి, ఈ దేశ వాసులకు ఒక మంచి సందేశం ఇచ్చాననీ - ఒక మంచి మార్గాన్ని చూపించానని ఎంతో ఆత్మ విశ్వాసంతో హుందాగా ప్రకటించారు. మానవ హక్కులు, ఆత్మగౌరవం బౌద్ధంతో దక్కుతాయి. ఎందుకంటే బౌద్ధంలో సమానత్వం ఉంది. స్వేచ్ఛ ఉంది. అది నైతికత మీద ఆధారపడి ఉంది. పైగా దైవభావన లేదు. హిందూ ధర్మం పూర్తిగా దైవ భావన మీద, అసమానతల మీద ఆధారపడి ఉంది.
ఇతర మతాలు, ధర్మాలు ప్రవేశపెట్టిన వారు, వాటిని ప్రచారం చేసే వారు తమకు తాము దేవతలమనో లేదా దేవదూతలమనో చెప్పుకుంటారు. కానీ, బుద్ధుడు అలా చేసుకోలేదు. ఆయన ఎప్పుడూ ప్రజల మధ్యే తిరిగాడు. ప్రజలకు ప్రజల భాషలోనే విషయాలు బోధించాడు. తను ఉన్నతుడనని ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోలేదు. ఆ విధంగా ఎక్కడా ప్రవర్తించలేదు. ఆనాటి ప్రజల భాష ప్రాకృతం గనక, అందులోనే ఆయన ప్రజలతో మాట్లాడేవాడు. పాళీ భాష ప్రాకృతానికే మరో రూపం. అంతేగాని ఆ రెండూ వేరు వేరు భాషలు కావు. అందుకే బౌద్ధ సాహిత్యమంతా పాళీ భాషలోనే గ్రంథస్థమయ్యింది. కనీసం తన వారసుణ్ణయినా ప్రకటించమని శిష్యులెందరో బుద్ధుణ్ణి బలవంత పెట్టారు. అయినా, ఆయన ప్రకటించలేదు. ''ధమ్మమే - వారసుణ్ణి ఎన్నుకుంటుందని, ముందుగా మనం ఎవరినీ ప్రకటించనవసరం లేదనీ'' ఆయన అన్నాడు. ఆ స్థాయిని ఈ కాలపు మత గురువులు, రాజకీయ నాయకులు, కార్పొరేట్లు అసలు అందుకోగలరా? పైగా తను చెప్పిన విషయాలు కూడా నిశితంగా పరిశీలించి, ఆలోచించి, అర్థం చేసుకుని నిర్ణయించుకోవాలనీ, గుడ్డిగా నమ్మవద్దనీ చెప్పాడు బుద్ధుడు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ధమ్మక్రాంతి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందనే చెప్పాలి. ఇప్పటికీ నూటా ఇరవై ఎనిమిదిదేశాల్లో బౌద్ధం విలసిల్లుతూ ఉంది. బౌద్ధ సూత్రాల్ని దృష్టిలో ఉంచుకునే డాక్టర్ అంబేద్కర్ మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించారు. మనువాదుల ప్రభావంలో ఆలోచన కోల్పోయిన రాజకీయ నాయకుల స్వార్థ చింతన వల్ల, రాజ్యాంగమే సరిగా అమలు కావడం లేదు. ఇక దేశం బౌద్ధ దేశం ఎలా అవుతుందీ? కళింగ యుద్ధం తర్వాత, చక్రవర్తి అశోక మౌర్య పరివర్తనకు లోనయ్యాడు. విజయదశమి నాడు ఆయుధాలు త్యజించి బౌద్ధం స్వీకరించాడు. అందుకే అది 'అశోక విజయ దశమి' అయ్యింది. బౌద్ధ చక్రవర్తిగా ఆయన ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు. ఆ స్ఫూర్తితోనే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కుశీనగర్కు చెందిన బర్మా బౌద్ధ భిక్షువు మహస్తవీర్ చంద్రమణి ద్వారా బౌద్ధం స్వీకరించారు. ఆయన వెంట ఆయన రెండో భార్య డాక్టర్ సవిత కూడా స్వీకరించారు. సుమారు ఆరులక్షలపై చిలుకు జనం అంబేద్కర్‌ను అనుసరిస్తూ బౌద్ధం స్వీకరించారు. ఆ రోజు ఆయన ప్రజల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగ సారాంశం ఈ విధంగా ఉంది... నిజానికి అది ప్రపంచాన్ని ఉద్దేశించి చేసినట్టుగా ఉంది.
''ప్రియమైన నా సోదర సోదరీ మణులారా!
నేను హిందూ ధర్మాన్ని త్యజించి బుద్ధుడి శరణుజొచ్చాను. బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించాను. ఇది జ్ఞానం, సమానత్వం, కరుణ, సదాచారాల మీద ఆధారపడి ఉంది.
సోదర సోదరీ మణులారా! వినండి. ఇప్పుడు నేను హిందువును కాదు. అస్పృశ్యుణ్ణీ కాదు. నేనొక విముక్త మానవుణ్ణి. ఒక స్వేచ్ఛా జీవిని. హాని కలిగించే ఈ దుష్ట వ్యవస్థకు బానిసను కాను. నేనిప్పుడు 'ధమ్మదీక్ష' తీసుకున్నాను గనక, నా శేష జీవితం బౌద్ధ ధమ్మాన్ని ప్రచారం చేయడానికి వినియోగిస్తాను. బుద్ధుడి వెలుగులు మానవాళికి అందించడానికి నిబద్ధుడనై ఉంటానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను.
సోదర సోదరీ మణులారా! నాతో పాటు బుద్ధ ధమ్మాన్ని స్వీకరించాలనుకున్న వారు లేచి నిలబడి, నాతోపాటు ప్రమాణం చేయండి.. అని అంబేద్కర్ అనగానే, మైదానంలో కూర్చున్నవారంతా లేచి నిలబడి ఆయన చెప్పిన మాటలు వారు కూడా ఉచ్ఛరించి ప్రమాణం చేశారు.
* నేను బుద్దుడు చెప్పిన పది నీతి సూత్రాల్ని అనుసరిస్తాను.
* నేను అన్ని జంతువులపట్ల కరుణతో వ్యవహరిస్తాను.
* నేను మనుషులందరినీ సమానులుగా భావిస్తాను.
* జన్మతో, కుటుంబ నేపథ్యంతో వచ్చిన మతాన్ని, ధర్మాన్ని త్యజిస్తున్నాను. అది ప్రగతి నిరోధకంగా ఉండి నా జీవితాన్ని దుఃఖమయం చేసిందని గ్రహించాను. అందుకే బౌద్ధం స్వీకరించి, బుద్ధుడి శరుణజొచ్చాను.
* మనుషుల్ని హీన దృష్టితో చూసే ధర్మాన్ని త్యజించి, మానవీయ విలువల్ని నిలిపే బౌద్ధం స్వీకరించి స్వేచ్ఛా మానవుణ్ణి అవుతున్నాను.
* దీనితో నాకు కొత్త జన్మ లభించినట్లుగా భావిస్తున్నాను.
* ఇక నుండి హిందూ దేవీ దేవతలను పూజించను.
* హిందూ కర్మకాండను అనుసరించను. మూఢనమ్మకాలను నమ్మను. వ్యాప్తి చేయను.
* ఈ రోజు నుండి బుద్ధుడు చెప్పిన మూడు సిద్ధాంతాలు - ప్రజ్ఞ - సన్మార్గం - కరుణ - జీవితాంతం తప్పక పాటిస్తాను. అవే నాకు మార్గదర్శకాలవుతాయి!
* బుద్ధం శరణం గచ్చామి. ధమ్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ధమ్మదీక్ష తీసుకున్న ఆ స్థలానికి 'దీక్షాభూమి' అనే పేరు స్థిరపడింది. విషాదమేమంటే దీక్ష తీసుకున్న తర్వాత కేవలం యాభైరెండు రోజుల వ్యవధిలో అంబేద్కర్ కన్నుమూశారు (డిసెంబర్ 6, 1956). అయితే ఆయన మరణానంతరం మార్చి 1959లో ఇరవై మిలియన్ల మంది బౌద్ధం స్వీకరించారు. తరువాత కాలంలో అంబేద్కర్ స్మారకసమితి ఏర్పడి, 1968-78 మధ్యకాలంలో అక్కడ నాలుగు ఎకరాల స్థలంలో ఒక పెద్ద స్థూపం నిర్మించారు. అది నాగ్‌పూర్‌లో రామ్దాస్పేట్ ప్రాంతం. ప్రస్థుతం దాన్ని అభయంకర్ నగర్ అని పిలుస్తున్నారు. ఆ స్థూపం ప్రపంచంలోనే అతి పెద్ద బోలు స్థూపం. అందులో రెండు అంతస్థులు ఉన్నాయి. అందులో కొన్ని వందల మంది బౌద్ధ భిక్షువులు ఉండగలిగే విధంగా నిర్మించారు.
డాక్టర్ అంబేద్కర్ ఈ ధమ్మదీక్ష నాగపూర్‌లోనే ఎందుకు తీసుకున్నారూ? నాగపూర్ ఆర్ఎస్ఎస్ వారికి ప్రధాన కేంద్రం. వారి ప్రభావం తగ్గించడానికా? హిందూ మత ప్రభావంతో ఆరెస్సెస్, గతంలో అల్లర్లు సృష్టించి దేశ విభజనలో ప్రధాన పాత్ర పోషించింది. అందువల్ల, కావాలనే అంబేద్కర్ వారిని దెబ్బతీయడానికి నాగపూర్‌ను ఎంచుకున్నారు... అని ఒక వాదన ముందుకొచ్చిన మాట వాస్తవమే! కానీ.. అసలు విషయం అదికాదు. అసలు నాగపూర్‌కు ఆ పేరు ఎందుకొచ్చిందో తెలుసుకోవాలి. ఆ ప్రాంతంలో నాగజాతి ప్రజలు ఉండేవారు. వారంతా బౌద్ధులు. కుట్రలు, కుతంత్రాలు వారికి తెలియదు. వలస వచ్చిన ఆర్యులకు వీరు బలయ్యారు. నాగజాతి ప్రజలు అధిక సంఖ్యలో నివసించిన ఊరు గనక అది నాగపూర్ అయ్యింది. అక్కడికి దగ్గరలో ప్రవహించే నదిపేరు నాగానది. బౌద్ధానికి ఆ ప్రాంతానికి విడదీయరాని బంధం ఉన్నందువల్ల అంబేద్కర్ ఆ నాగపూర్‌ను ఎంచుకున్నారు. ఇదే విషయం విలేకరులు అడిగినప్పుడు తనకు ఆరెస్సెస్ వారి విషయం స్పృహలోకే రాలేదన్నారు.
అంబేద్కర్ దమ్మదీక్ష తీసుకుని, లక్షల మందిని బౌద్ధులుగా మార్చడం 'హిందూ సంప్రదాయ వాదులకు నచ్చలేదు. అంబేద్కర్ మెహర్లను (మహారాష్ట్ర దళితులు) తప్పుదోవ పట్టిస్తున్నాడని, వారి జీవితాలతో ఆడుకుంటున్నాడని - వారికి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు దక్కకుండా అడ్డుకుంటున్నాడని, దళితులపై ప్రేమాభిమానాలు ఉన్నట్లు గగ్గోలు పెట్టారు. ముఖ్యంగా లోకమాన్యుడని చెప్పుకున్న బాలగంగాధర తిలకే తన పత్రిక ''కేసరి''లో అంబేద్కర్ గురించి అవాకులు చవాకులు రాయించాడు. అసెంబ్లీ - పార్లమెంట్లలో కూడా మెహర్లు తమ స్థానాల్ని వదులుకోవల్సి వస్తుందని, వారిని రెచ్చగొట్టారు. అంబేద్కర్ నింపాదిగా ఓపికగా అన్ని ప్రశ్నల్ని తిప్పికొట్టారు. తన జాతి వారికి ఎలా మేలు చేయాలో తనకు తెలుసునని, కావాలంటే బ్రాహ్మణులు మెహర్లుగా మారి రిజర్వేషన్లో ఉన్న ఉద్యోగాలు, అసెంబ్లీ, పార్లమెంట్లో ఉన్న రిజర్వుడు స్థానాలు తీసుకోవచ్చని అన్నాడు. చనిపోయిన జంతువుల కళేబరాలు మెహర్లు ముట్టుకోవద్దని అంబేద్కర్ పిలుపునిచ్చినప్పుడు కూడా హిందూ సంప్రదాయ వాదులు గోల చేశారు. దానికి అంబేద్కర్ ఇచ్చిన జవాబు వారి నషాళానికి ఎక్కింది. ''మీ ఇళ్ళలో మీ వాళ్ళు చనిపోతే మీరే పాడె మోసుకుంటున్నారు కదా? అలాగే మీ పశువుల్ని మీరే ఎత్తేసుకోండి. పశువుల చర్మం, మాంసం, ఎముకల మీద వచ్చే ఆదాయం మా జాతి ప్రజలు వదిలేస్తున్నారు. ఆ ఆదాయం కూడా బ్రాహ్మణుల్నే సంపాదించు 0కోనీయండి!'' అని అన్నాడు. వర్ణాశ్రమ ధర్మాల్ని తిప్పికొట్టి, మనుషులుగా ఎవరి హక్కుల్ని వారు సాధించు కున్నప్పుడే సమ సమాజ నిర్మాణం జరుగుతుంది - అని నమ్మినవాడాయన!
'హిందువుగా పుట్టాను. కానీ, హిందువుగా మరణించను' అని నాసిక్ దగ్గర 13 అక్టోబర్ 1935నాడు యోలా కాన్ఫరెన్స్‌లో అంబేద్కర్ తన చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించినప్పుడు ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. తన 'ధమ్మదీక్ష'తో అన్నింటికీ ఆయన సరైన సమాధానం చెప్పారు. దేశ ప్రజలకు దిశా నిర్దేశం చేశారు.
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.