Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందమైన పిల్లల్ని కనాలనుకునే, అల్లరిచిల్లరగా తిరిగే ఓ వికారమైన పక్షి, అంతకు ముందే గుడ్లు పెట్టిన ఓ అందమైన పక్షి గూటిలోకి రహస్యంగా దూరి ఓ గుడ్డును దొంగిలించి, తన సొంత గూటికి చేరి, దానిని వెచ్చగా ఉంచి, పొదగడంతో అందమైన పక్షి పిల్ల బయటికి వచ్చిన కథ నాకు చిన్నతనంలో విన్నట్లు గుర్తుంది.
సెప్టెంబర్ 8న మన ప్రధానమంత్రి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు నాకీ కథ గుర్తుకొచ్చింది. తమ స్వంత సంఫ్‌ు పరివార్‌లో స్వాతంత్య్ర సమరయోధులులేని లోటును, ప్రజల దృష్టిలో సావర్కర్‌ను ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధునిగా నిలబెట్టడంలో ఏ విధమైన విజయాన్ని సాధించని లోటును పూడ్చే ప్రయత్నమే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఆగస్ట్ 15న, ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాని, సుభాష్ చంద్రబోస్‌తో పాటు సావర్కర్‌ను కూడా గొప్ప స్వాతంత్య్ర సమరయోధులుగా పేర్కొన్నాడు. కర్నాటకలో కూడా వారి పార్టీకి చెందిన వారు, సంఫ్‌ుపరివార్ సభ్యులు, సుభాష్ చంద్రబోస్, సావర్కర్ల ఫొటోలున్న బ్యానర్లను ప్రదర్శించారు. కానీ బ్రిటిష్ వ్యతిరేక మిలిటెంట్ విప్లవకారుడు, అండమాన్ జైలులో జీవిత ఖైదు విధించబడిన సావర్కర్, తనకు క్షమాభిక్ష పెట్టాలని వేడుకుంటూ, అదే జరిగితే వారికి చాలా విధేయంగా సేవలు చేసుకుంటానని బ్రిటిష్ వారికి ఉత్తరాలు రాసిన వాస్తవాలను చెరిపి వేయడం చాలా కష్టమనే విషయం రుజువైంది.
ఆయనీ వాగ్దానాలను నిలబెట్టుకునేందుకు చాలా కష్టపడ్డాడనీ, జాతీయోద్యమాన్ని, దానితో సంబంధం ఉన్న వారిని తీవ్రంగా విమర్శించడమే కాక, హిందూ ముస్లిం మత విభజనను మరింత విస్తృతపరిచేందుకు చాలా శ్రమించాడనేది రహస్యమేమీ కాదు. ''ఎసెన్షియల్స్ ఆఫ్ హిందూత్వ'' అనే తన రచనలో, భారతదేశం ''పుణ్యభూమి'' లేదా ''పవిత్ర భూమి''గా లేనటువంటి ముస్లింలు, క్రైస్తవులకు పౌరసత్వంలో సమానమైన హక్కులు నిరాకరించాలనే సిద్ధాంతాన్ని ప్రచారం చేసాడు. సంఫ్‌ుపరివార్ పక్షీయులు హిందూత్వను తమ రాజకీయ సిద్ధాంతంగా స్వీకరించారు.
సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై తన ప్రత్యేకమైన ఆగ్రహాన్ని ప్రదర్శించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన నేతాజీని ''జీహాదీ హిందూ'' అని పేర్కొన్నాడు. హిందూ ముస్లిం ఐక్యతను ప్రోత్సాహించేందుకు అనేక చిహ్నాలను స్వీకరించడానికి సిద్ధపడ్డాడని నేతాజీని తీవ్రంగా విమర్శించాడు. ఉదాహరణకు, ఇండియన్ నేషనల్ ఆర్మీ మూడు రంగుల జెండా మధ్యలో పులిపై దూకుతున్న టిప్పుసుల్తాన్ చిత్రం ఉంటుంది. ''ఈతిమాద్, ఇత్తిహాద్, ఖుర్బానీ'' ఇండియన్ నేషనల్ ఆర్మీ నినాదంగా ఉంది. ఆయనకంటే ముందుగా ఉన్న అధికారులనేకమంది ముస్లింలే. ఆయన మొదటి బర్మా సందర్శనలో, బహదూర్ షా జాఫర్ మజార్ వద్ద చద్దార్ను అందించాడు.
ప్రధానమంత్రి పాల్గొన్న నేతాజీ విగ్రహావిష్కరణలో బ్రహ్మాండమైన ప్రణాళికను రూపొందించారు. దేనినీ వదిలిపెట్టలేదు. ఆయన పైన, విగ్రహం పైనే దృష్టంతా కేంద్రీకరించబడింది. భారత రాష్ట్రపతి గానీ, మోడీ సహచర మంత్రివర్గ సభ్యులు గానీ, ఆఖరికి సుభాష్ చంద్ర బోస్ కూతురైన అనితా ప్ఫాఫ్ గానీ, బోస్ కుటుంబ సభ్యులు గానీ ఏ ఒక్కరూ దానిలో భాగస్వాములు కాలేదు. కేవలం ప్రధానమంత్రి, విగ్రహం మాత్రమే ఉండి, బంగారు వెలుగులో స్నానమాచరించారు. అయితే ప్రజల మనసుల్లో వీరిరువురిని నిలిపేందుకు ఇది కూడా సరిపోవడం లేదు.
సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని చూసేందుకు ప్రతీరోజూ ప్రజలు పెద్దసంఖ్యలో వస్తున్నారు. సాయంకాల సమయంలో ప్రజలు విగ్రహం చుట్టూ గుంపులు గుంపులుగా చేరడంతో దానిని చూడడం కష్టతరంగా ఉంది. ''సుభాష్ చంద్రబోస్‌ను చీకటి నుండి బయటకు తీసుకొని వచ్చి, మోడీ తన బాకీ తీర్చుకుంటున్నాడని మీరు అనుకున్నారా?'' అని ఇటీవల నేతాజీ కూతురు అనితాను ఒక ఇంటర్వ్యూలో అడిగితే, కొద్దిసేపు ఆలోచించి, 'అది నిజమని నేననుకోవడం లేదనీ, సుభాస్ చంద్రబోస్ ఎప్పటికీ ఈ దేశంలోని స్త్రీ, పురుషుల హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నాడనీ, దేశంలోని ప్రతీ మూలలో ప్రజలు ఆయన్ను ఎంతగా గౌరవించారో, ఎంతగా ప్రేమించారో తలచుకుంటే నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే' అని అన్నారు.
ఇది అనేకమంది ధృవీకరించే వాస్తవం. సుభాష్ చంద్రబోస్ ధైర్యం, వలసపాలన అణచివేత నుండి ప్రజలకు విముక్తి కలిగించాలన్న ఆయన సంకల్పం, ఆయన అకాల మరణం, అనేకమంది భారతీయుల దృష్టిలో ఆయనను ఒక తిరుగులేని నాయకుడిగా నిలిపాయి. నేతాజీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే తపనను అనేకమంది పెంచుకున్నారు. ఆయన స్వీయచరిత్ర భారీ స్పందనతో అనేక పర్యాయాలు పునఃప్రచురణలు జరిగాయి. అనేక భాషల్లో, అనేక పత్రికలలో ఇంతకు ముందెన్నడూలేని విధంగా ఆయన గురించి వ్యాసాలను ప్రచురించారు. ప్రజలు ఆయన చేసిన ప్రసంగాలను వింటున్నారు. నేతాజీని, ఇండియన్ నేషనల్ ఆర్మీలో పని చేసిన నాయకులు, నాయకురాళ్ళతో సంబంధం ఉన్న వారిని ఆయన విశ్వాసాలు, ఆయన వ్యక్తిత్వం,ఆయన భారత స్వాతంత్య్ర ఉద్యమానికి చేసిన సేవల గురించి ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జైహింద్ నినాదం
''జైహింద్'' నినాదాన్ని తీసుకొచ్చిందెవరు? అని అనేకమంది ప్రశ్నిస్తున్నారు. కలకత్తాలో హౌస్ అరెస్ట్ నుండి నాటకీయంగా తప్పించుకొని జర్మనీ చేరుకున్న సుభాష్ చంద్రబోస్‌కు వ్యక్తిగత కార్యదర్శి అయిన అబీద్ హాసన్ అనే వ్యక్తి ఆ నినాదాన్ని తీసుకొచ్చాడని తెలిసి వారు ఆశ్చర్యపోతారు. అతడు జర్మనీ నుండి జపాన్ వరకు జలాంతర్గామి ద్వారా సుదీర్ఘమైన, అపాయకరమైన ప్రయాణంలో నేతాజీకి తోడుగా ఉన్నాడు. ఆసియా వచ్చిన తర్వాత కూడా అబీద్ హాసన్ తనతోనే అదే ఇంట్లో, తాను ఎక్కడికి వెళ్తే అక్కడే ఉండాలని నేతాజీ అతడ్ని బలవంతపెట్టాడని తెలిసి వారు ఆశ్చర్యపోతారు. అలా అబీద్ సింగపూర్, బ్యాంకాక్, టోక్యో, బర్మాలలో ఆయనతోనే కలిసి ఉన్నాడు. ఇలాంటిదేదో మన ప్రధానమంత్రి చేస్తాడని ఊహించడం కష్టం. అదే విధంగా అబీద్ హాసన్ ప్రకారం, లౌకికతత్వం పట్ల సుభాష్ చంద్రబోస్‌కు ఉన్న అవగాహనను మన ప్రధాని అంగీకరిస్తాడని ఊహించడం కూడా అసాధ్యమైన పని.
హాసన్ ఇచ్చిన ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూను సుభాష్ చంద్రబోస్ మేనల్లుడైన సిసిర్ బోస్ భార్య కృష్ణ బోస్ రికార్డ్ చేశారు. ఆమె ఆ ఇంటర్వ్యూ సమగ్ర నివేదికను రాసి, ప్రచురించారు. ఇప్పుడది ''నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, రాజకీయాలు, పోరాటాలు'' అనే పేరుతో వ్యాస సంపుటిగా ప్రచురించబడింది.
ఇండియన్ లెజియన్ ఏర్పాటు చేయడానికి జర్మనీలోని భారతీయ యుద్ధ ఖైదీలను సుభాష్ చంద్రబోస్ నియమించాడనీ, తనతో పాటు యుద్ధ ఖైదీలు అనేకమందిని ప్రత్యేక శిక్షణ కోసం పంపించారని అబీద్ హాసన్ కృష్ణ బోస్‌కు చెప్పాడు. కృష్ణబోస్ కథనం ఇంకా ఇలా సాగుతుంది... ''ఇండియన్ లెజియన్ క్యాంపుల్లో సైనికుల కోసం ప్రార్థనా స్థలాలుండేవి. సైనికులు వారికిష్టం వచ్చిన రీతిలో వ్యక్తిగతంగా లేదా అందరూ కలిసి ఒక చిన్న గుడిలో, లేదా మసీదులో లేదా గురుద్వారా లేదా చర్చిలో ప్రార్థన చేసుకోవచ్చు. కొందరు సైనికులు ఒక ప్రతిపాదనతో అబీద్ హాసన్ వద్దకు వెళ్ళారు. వేరువేరు సమూహాలుగా ప్రార్థనలు చేసేకంటే అందరూ కలిసి ప్రార్థన చేయాలని భావించడంతో హాసన్ సంతోషపడ్డాడు. తరువాత సైనికులంతా కలిసి కూర్చొని దేవుని ప్రార్థించేందుకు ఒక ప్రార్థనను కూర్పు చేశారు. తరువాత క్యాంపును బోస్ సందర్శించినప్పుడు పురుషులంతా ప్రార్థన చేయాలని నిర్ణయించారు. సందర్శన ముగింపులో సైనికులు నేతాజీ ముందు నిలబడి గర్వంతో ఉమ్మడి ప్రార్థనను ఆలపించారు. నేతాజీ ఏ విధంగానూ స్పందించలేదు. కొద్ది సమయం తర్వాత నేతాజీని వ్యక్తిగతంగా కలవాలని అబీద్ హాసన్‌ను పిలిచారు. గదిలోకి అబీద్ ప్రవేశించగానే ఏంటీ? అర్థంపర్థం లేని పని మొదలుపెట్టావని నేతాజీ అన్నాడు.''
మత విశ్వాసం వ్యక్తిగతమైనది
''భారతీయుల్ని ఈ విధంగా ఐక్యం చేయడం లోపభూయిష్టమైనది, వెంటనే దీనిని నిలిపివేయాలని నేతాజీ అబీద్‌తో గట్టిగా చెప్పాడు. వ్యక్తులకు మత విశ్వాసం అనేది వ్యక్తిగతమైన విషయం. వారి రాజకీయ ఉద్యమాల్లో మతం ఎలాంటి పాత్రను పోషించకూడదు. భారతజాతీయవాదం మతపరమైన గుర్తింపులను, భావోద్వేగాలను అధిగమించాలి. సర్వమతాల సంఘీభావ తత్వశాస్త్రంపైన లేదా భిన్నమతాల అంగీకార కథనాల పునాదుల పైన భారత జాతీయవాదం ఆధారపడి ఉండకూడద''ని నేతాజీ నొక్కి వక్కాణించాడు. ''నేడు మీరంతా ఐక్యం అయ్యేందుకు మతాన్ని ఉపయోగిస్తున్నారంటే, ఇలాంటి భావోద్వేగాలను ఉపయోగించడం ద్వారా రేపు విభజన విత్తనాలు చల్లే వాడికి కూడా మీరు తలుపులు తెలుస్తున్నారని'' నేతాజీ అబీద్‌కు చెప్పాడు.
సుభాష్ చంద్రబోస్ విశ్లేషణలోని సరైన అవగాహన, భారతీయులందరికీ ఎలాంటి మతపరమైన అర్థాలు సూచించని శుభాకాంక్షల గురించి అబీద్ హాసన్ ఆలోచించేందుకు దారి తీసింది. దాని ఫలితమే ''జైహింద్''. ప్రజాదరణ పొందిన ఆ జైహిందే నేటికీ నిలిచివుంది. దశాబ్దాల క్రితం ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులు, అధికారులు మతపరమైన లక్షణాలను సూచించని జైహింద్‌ను ఉపయోగించినట్లే, మిలిటరీలో పని చేస్తున్న వారు, పోలీసులు తమపై అధికారులకు సెల్యూట్ చేస్తున్న సమయంలో ''జైహింద్''ను ఉపయోగిస్తున్నారు.
సుభాష్ చంద్రబోస్ లౌకికతత్వం, గాంధీజీ లౌకిక తత్వానికి భిన్నంగా ఉండేది. అదే విధంగా భారతదేశంలో, లౌకికతత్వం వివరించబడుతున్న మార్గమైన సర్వధర్మ సమభావనకు (అన్ని మతాల ఐక్యత)కూడా సుభాష్ లౌకిక తత్వం భిన్నమైనది. ఈ వివరణను ఆయన తీవ్రంగా ఆక్షేపిం చాడు. నేడు ప్రధానమంత్రి, సంఫ్ుపరివార్లు అమలు చేస్తున్న ఆధిపత్య భావజాలం ఆయనను హడలగొట్టి ఉండి ఉంది.
అందమైన పక్షుల గూటి నుండి గుడ్డు దొంగిలించి, పొదిగే వరకూ వెచ్చగా ఉంచిన తర్వాత ప్రపంచంలోకి అడుగు పెట్టిన పిల్ల పిచ్చుక రెక్కలు రావడంతో తన కుటుంబ మార్గాన్ని వెతుక్కుంటూ మోసపూరిత తల్లిదండ్రుల్ని వదిలి వెళ్లిన కథ నా చిన్నతనంలో విన్నాను.
అదే విధంగా, ప్రతీ విషయంలో నేతాజీకి భిన్నంగా ఉన్నవారు, ఆయన వారసత్వాన్ని ఉపయోగించుకుంటామంటే అది పూర్తిగా అసాధ్యమైన విషయం. ఆయన ఇల్లు అప్పటికీ, ఇప్పటికీ, తఎప్పటికీ కూడా స్వేచ్ఛను కోరుకున్న ఈ దేశ స్త్రీపురుషుల హృదయాల్లో, మనసుల్లోనే ఉంటుంది. కానీ అతని భావాలను పంచుకోని వారిలో, అతని కీర్తి, ప్రతిష్టలను పొందాలని ఆరాటపడే వారి హృదయాల్లో మాత్రం కాదు.
- సుభాషిణీ ఆలీ
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451