Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందెశ్రీ పాట ''జన జాతరలో మనగీతం జయ కేతనమై ఎగరాలి/ ఝంఝా మారుత జన నినాదమై జేగంటలు మోగించాలి/ ఒకటే జననం ఓహౌహౌ.. ఒకటే మరణం ఆహాహా../ జీవితమంతా ఓహౌహౌ.. జనమే మననం అహాహా../ కష్టాల్ నష్టాల్ ఎన్నెదురైనా కార్యధీక్షలో తెలంగాణ/ జై భోలో తెలంగాణ/ అంటూ మెల్లగా మన నరనరాల్లోకి, జవజీవాల్లోకి తన అక్షరాల ఆకుపసరును ఒంచి పదునెక్కించడం మనమంతా కళ్ళారా చూశాం. తనువారా అనుభవించాం. కడదాకా జ్వలించాం.
తనమీద వేరే ఏ ప్రభావాలున్నా విప్లవోద్యమ ప్రభావం కూడా బలంగానే ఉంటుంది. తనే చెప్పుకున్నట్లు సుద్దాల హనుమంతు పాట ''పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ/ పాలు మరిచి ఎన్నాళ్ళైందో/ ఓ పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళైందో/'' పాటంతా ఆయన జీవితమే. కనుక ఈ పాట ఆయనను కమ్మేసింది. అంతకుముందెన్నడూ ప్రజా ఉద్యమాల్లో పాల్గొనకపోయినా, పాలబుగ్గల జీతగాడుగా ఉన్న కాలంనుంచే ఆయన మెదడును ప్రజా ఉద్యమగాలి ఆవహించింది. ఆ రీతిగా తనకు తెలియకుండానే ఉద్యమాలను చదువుకున్నడు, ఆకళింపు చేసుకున్నడు. అంతే తప్ప ఏనాడు కన్నప్రేమకు, కలం ప్రేమకు నోచుకున్నోడు కాదు. కాబట్టే ఆ బాధలు మరిచిపోవడానికి పద్యం శరణుజొచ్చినాడు అందెశ్రీ. అలాంటి అక్షరం ముక్కరాని, ఏనాడు బడి మొఖం చూడని సామాన్యుడు ఇవాళ అందరి బాధలు తీర్చేందుకు పాట ఆయుధాన్ని భుజానికెత్తుకొని ధైర్యంగా కైతల కవాతు చేస్తున్నాడు. ఆ వైవిధ్య ఆగమనం వల్లనే కావచ్చు, భిన్నంగా రాయడంకోసం, పాటకు కొత్త జీవం అద్దడం కోసం కావచ్చు అప్పటిదాక రాస్తున్న వారిని ఎరువుగా, ప్రజలను పందిరిగా చేసుకొని, ప్రజా పాటను పరాకాష్టగా నిలబెట్టడం కోసం తపిస్తున్నవాడు అందెశ్రీ. నేటి పాటల పరాయీకరణ యుగం లో అందెశ్రీ ప్రజలకు తప్ప దేనికీ, ఎవరికీ తలవంచనని ప్రకటించడం అత్యంత సాహసమే కాదూ, సమరపు ధైర్యం కూడా. ప్రతి ఇంటిలో పటంగట్టి గోడలకు తగిలించాల్సిన ఎన్నో పాటలు రాశాడు అందెశ్రీ. కొమ్మ చెక్కితె బొమ్మరా కొలిసిమొక్కితె అమ్మరా/ ఆదికే ఇది పాదురా కాదంటె ఏది లేదురా/ అని ప్రకృతి తత్వాన్ని, మానవజాతి తొలి జీవనగమనాన్ని, మాతృస్వామిక వ్యవస్థ గొప్పతనాన్ని వివరిస్తాడు. జానపదుల జీవిక, గ్రామ దేవతల భూమికను చిత్రికపడతాడు. ఈ ప్రపంచీకరణ యుగంలో మారుతున్న, యాంత్రికమై మాయమై పోతున్న, మనిషిని వెతుకుతూ విలపిస్తాడు. భక్తి పేరుతో జరుగుతున్న బహుళ వ్యాపారాన్ని, ఆధ్యాత్మికత పేరుతో చేస్తున్న మతోన్మాద దుర్మార్గాలను ఖండిస్తాడు. అందుకే ''మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు/ మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం వున్నవాడూ/ నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు/ యాడవున్నాడో కాని కంటికీ కనరాడు/ అంటూ భక్తీ, ముక్తీ, రక్తిల అంతర్ వ్యాపార స్వభావాన్ని ఎండగడతాడు. ఆధ్యాత్మికత అంటే బుద్ధుడిలా ఉండటమే తప్ప ఇప్పుడు చూస్తున్న కుప్పిగంతులు, క్షుద్ర విద్యలు కావని బుగులుపడతాడు. ''కుక్కనక్కల దైవరూపాలుగా కొలిసి/ పంది నందిని జూస్తే పడి మొక్కుతుంటాడు/ చీమలకు చక్కెర పాములకు పాలోసీ/ జీవకారుణ్యమే జీవితము అంటాడు/ తోడబుట్టిన వాళ్ల ఊరవతలికి నెట్టి/ కులమంటు ఇల మీద కలహాల గిరిగీసి/'' అంటూ ఈ పాటలో జంతువులను మొక్కడం కాదు మనుషులను మనుషులుగా చూడటం నేర్చుకోవాలని కోరుతుంటాడు. ఆవుల కోసం మనుషు లను చంపుతున్న నేటి మతస్వామ్యం రాజ్యమేలుతున్న ఈ కాలంలో అందెశ్రీ పాట అత్యయిక అవసరం అనిపిస్తుంది. జీవితాన్ని చిత్రించేప్పుడు కళ నిరంతర జీవధార అవుతుంది. ఆవిధంగా అందెశ్రీ తన పాట ద్వారా జీవితాలను చిత్రించే పనిలో నిమగమై జీవధారగా సాగుతున్నాడు. ఆక్రమంలో తన జీవితంలోకీ, గడిచిన చరిత్రలోకీ తొంగి చూసు కుంటాడు. అలాంటి సందర్భంలో తన రేఖాచిత్రంలో సుద్దాల హనుమంతు లాంటివారు కనపడతారంటాడు.
ఇప్పుడు అదే సందర్భం. సినీగేయ రచయితగా ప్రఖ్యాతి గడించిన సుద్దాల అశోక్ తేజ, తన కుటుంబ సభ్యులంతా తమ తల్లిదండ్రుల జ్ఞాపకంగా నెలకొల్పిన సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం ఈ ఏడాది అందెశ్రీకి అందిస్తున్నారు. మట్టిని, మట్టి పరిమళాన్ని ఒళ్ళంతా పులుముకుని, నరాల బిగువున పొలాలు దున్ని, కరాళ బలమున వరాలుతీసి, పంట పండించిన నిజ పాలబుగ్గల జీతగాడిని అవార్డు వరించడం నిజంగా అభినందనీయం. అయితే సుద్దాల హనుమంతు పాట వింటూ పెరిగిన అందెశ్రీకి, హనుమంతు పాటలకు బలమైన సారుప్యతలున్నాయి. వారి పాట ఎల్లెడలా రాజ్యంపై ధిక్కార స్వర పతాకమై ఎగురుతూనే ఉంటుంది. ఓ మానవీయ ఉన్నతోన్నత సమసమాజాన్ని కాంక్షించే అందెశ్రీ పాట మరింత ప్రజ్వరించాలని కోరుకుందాం.
(నేడు అందెశ్రీ సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం, సుందరయ్య కళానిలయం, హైదరాబాద్లో అందుకుంటున్న సందర్భంగా)
- ఎం. విప్లవకుమార్
సెల్: 9515225658