Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నారాయణ!'' అనుకుంటూ నారదుడు యాదాద్రి చేరుకున్నాడు. లక్ష్మీసమేత నరసింహుడిని దర్శించుకున్నాడు.
''ఎలా ఉంది! స్వామీ మీ కొత్త ఆలయం!'' అడిగాడు నారదుడు.
''ఈ ఆలయాలు, గుళ్ళూ, గోపురాలు నేనడిగానా? వారి అవసరాల కొద్ది భక్తులే నిర్మించుకుంటున్నారు! ఇందులో నా ప్రమేయం ఏమీ ఉండదని నీకు తెలుసుగదా! అయినా చాలా కాలం తర్వాత విచ్చేశావు! ఏమీ విశేషాలు? ప్రశ్నించాడు నర్సింహస్వామి.
''ఏముంది స్వామీ! మీ ప్రాంతంలోని మునుగోడు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతున్నది. మనసాగక ఏమిటో చూద్దామని వచ్చి, మీ దర్శనం చేసుకుంటున్నాను!'' అన్నాడు.
''అంటే మునుగోడు ముందు చూచితివా? లేక నన్నే ముందుగా నన్నే సందర్శించుకొనుచుంటివా?'' ప్రశ్నించాడు నరసింహుడు.
''భారతంలో కృష్ణుడు అడిగినట్లున్నది స్వామి! మీకు అబద్ధం చెప్పగల సాహసం చేయగలనా! మునుగోడు ముందే దర్శించుకుని, పిమ్మట శ్రీవారి సందర్శనార్థం వచ్చితిని స్వామీ!'' అన్నాడు నారదుడు చేతులు జోడించి.
నరసింహుడు చిన్నగా నవ్వాడు.
''స్వామీ, మునుగోడు వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని సందేహాలు తీర్చుటకై మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను'' అన్నాడు నారదుడు.
''తప్పకుండా అడుగు నారదా! ఇందులో ప్రార్థించవలసిన అవసరమేమున్నది?'' అన్నాడు నరసింహస్వామి.
''ఉన్న ఫళంగా రాజగోపాలరెడ్డి రాజీనామా చేసి, ఎన్నికలు తెచ్చిపెట్టవలసిన అవసరమేమున్నది? ఎలాగూ ఒక సంత్సర కాలంలోనే ఎన్నికలున్నవి కదా!'' అడిగాడు నారదుడు.
''ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నది నారదా! దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో అధికారం సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ ఈ ఎన్నికలను సృష్టించింది!'' అన్నాడు నరసింహస్వామి.
''స్వామీ నాకేమీ అర్థం కావటం లేదు!'' అన్నాడు నారదుడు అయో మయంగా.
''ఇందులో అర్థం కానిదేమున్నది! తెలంగాణలో వరసగా వచ్చిన ఉప ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్‌లలో బీజేపీ గెలిచింది! హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మంచి సంఖ్యలోనే సీట్లు వచ్చాయి! వచ్చే ఎన్నికలకు ముందే మరో ఎన్నికలో విజయం సాధిస్తే టీఆర్ఎస్కు తానే ప్రత్యామ్నాయంగా చాటుకుని, తర్వాత అధికారంలోకి రావాలన్నదే బీజేపీ ప్రణాళిక!'' వివరించాడు నరసింహస్వామి!
''కానీ ఎంతో కాలంగా కాంగ్రెస్‌లో ఉన్న రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం గొప్పవిషయమే! మరో పార్టీలో చేరుతున్నారు. తమ పదవులను పట్టుకుని వేలాడుతున్న ఈ కాలంలో ఎమ్మెల్యే సీటును త్యాగం చేయటం గొప్ప విషయమే కదా!'' అన్నాడు నారదుడు.
''పిచ్చి నారదా! నేనింతకు ముందే చెప్పినట్లు అదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది! ఇందులో త్యాగానికి చోటే లేదు!'' అన్నాడు నర్సింహస్వామి.
''స్వామీ మరో సందేహం! 18వేల కోట్ల బొగ్గు కాంట్రాక్టు కోసమే బీజేపీలో చేరినట్లు ప్రచారం జరుగు తున్నది నిజమేనా!'' అన్నాడు నారదుడు.
''ఇందులో నేను చెప్పవలసినది ఏమున్నది? స్వయంగా అతనే అంగీకరించాడు కదా!'' అన్నాడు నరసింహస్వామి.
''ఇదేమిటి? స్వామి రాజకీయ నాయకులకు నైతిక విలువలు ఉండవా? తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారతారా? ఇందులో ప్రజలకేమి ప్రయోజనాలు నెరవేరుతాయి! కొందరు వ్యక్తుల స్వార్థం కోసం రాజీనామాలు చేసి, ఎన్నికలు తెచ్చిపెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేస్తారా?'' ఆవేదన చెందాడు నారదుడు.
''నీవు చెప్పింది నిజమే నారదా! రాజకీయ నాయకుల కోసం, వారి ప్రయోజనాల కోసం ఎన్నికలు సృష్టించుకున్నారు. ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేసి బీజేపీలో చేరి 18వేల కాంట్రాక్టు సంపాదించుకున్నవాడు, మునుగోడు ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాడు!'' అన్నాడు నర్సింహాస్వామి.
''కాని, నేను చూసినంత వరకు ఈ ఎన్నికల్లో డబ్బు వరదలా పారుతున్నది. అనేక ప్రలోభాలు వచ్చి ప్రజల ముందు వాలుతున్నవి. ప్రజలు కూడా వాటికి లోబడి పోవటం బాధాకరం స్వామీ!'' అన్నాడు నారదుడు బాధగా.
ఇందులో కొంత నిజమున్నా ప్రజలను పూర్తిగా తప్పుపట్టలేము. ఆకలి సూచికలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశం మనది! అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్నవాడు బిర్యానీ పొట్లాన్ని నిరాకరించటం ఎంతో కష్టం. ఈ పూటకి ఆకలి తీరుతుందన్న స్థితిలో ఉన్నారు ప్రజలు! ఇంకా చెప్పాలంటే పాలకులు ప్రజలను ఈ స్థితికి దిగజార్చి డబ్బు వెదజల్లి తమ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు! ఆకలితో ఉన్నా, దరిద్రంతో ఉన్నా ప్రజలు తెలివైనవారు! ఎన్ని ప్రలోభాలు ఉన్నా, తగు సందర్భాలలో తమ ఓటుతో సరైన తీర్పే ఇస్తారు! ఈ ఎన్నికల్లో కూడా అలాగే తీర్పు ఇస్తారని నా నమ్మకం!'' అంటూ ముగించాడు నర్సింహాస్వామి.
- ఉషాకిరణ్