Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, గాంధీ కుటుంబ ప్రతినిధి రాహుల్‌గాంధీ తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన సమయం ఆ పార్టీకి చాలా క్లిష్టమైంది. దేశానికీ ఈ రాష్ట్రాలకూ కూడా కీలకమైంది. ఆ పార్టీ అధ్యక్ష పదవికి చాలా ఏండ్ల తర్వాత ఎన్నికల ప్రక్రియ 18వ తేదీన జరగనుంది. ఏం చెప్పినా చివరకు ఆ కుటుంబం వారే అధ్యక్షులవుతారని అందరూ అనుకున్నారు. ఆ పార్టీ అంతర్గత చర్చలు కూడా ఆ దిశలోనే నడిచాయి. అయితే మారిన పరిస్థితులకు తోడు రాహుల్‌గాంధీ ససేమిరా అనడంతో మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌లు పోటీ పడుతున్నారు. రాజ్యసభలో నాయకుడుగా ఉన్న ఖర్గేకే అధిష్టానం అండవుందన్న భావన అందరిలోనూ నెలకొంది. శశిథరూర్ ఆ మేరకు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. రాహుల్ సోనియాల రిమోట్ కంట్రోల్లోనే ఖర్గే నాయకత్వం ఉంటుందని వ్యాఖ్యలు వచ్చాయి. ఈ పూర్వరంగంలో రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ పాదయాత్ర ప్రారంబించారు. అందులోనూ బీజేపీని ఎదుర్కొవడం కంటే తమకు అవకాశమున్న రాష్ట్రాలపై ఆయన చూపు ఎక్కువగా ఉంటున్నది. వామపక్షాలు పాలించే కేరళలో 18 రోజులు నడిచిన రాహుల్ అతిపెద్ద బీజేపీ పాలిత స్వరాష్ట్రమైన యూపీలో రెండు రోజులతో సరిపెట్టడం దానికి సంకేతమైంది. కర్నాటకతో పోలిస్తే ఏపీలో మూడు రోజులు, తెలంగాణలో కొంచెం ఎక్కువ మాత్రమే కేేటాయించారు. లాంఛనంగా నిన్న అనంతపురం జిల్లా డి.హీరేలాల్ మండలంలో నడిచినా పూర్తిస్థాయిలో ప్రవేశం అధ్యక్ష ఎన్నిక తర్వాతనే ఉంటుంది. అయినా అక్కడకు వెళ్లి హాజరు వేయించుకుని వచ్చారు ఎపిసిసి నాయకులు.
తెలుగు రాష్ట్రాల్లో దుస్థితి
కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత బలహీనంగా తయారు కావడం ఒకటైతే, అందులో మరీ అధ్వాన్న స్థితికి చేరి ఉనికికే ఠికాణా ఉందా అని ప్రశ్నించే దశ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడింది. తెలంగాణలో కొంత మెరుగ్గా ఉన్నా అంతర్గత అనైక్యత, బీజేపీ దూకుడు, టీఆర్ఎస్కూ కాంగ్రెస్‌కూ ఉప్పు నిప్పులా పరిస్థితి మారడం ఇబ్బందికరమైంది. ఇప్పటికిప్పుడు మునుగోడులో ఉపఎన్నిక పోరాటం జరుగుతున్నా ఆ పార్టీ నాయకులు ఒక్కతాటిపై వచ్చి పోరాడే పరిస్థితి లేదు. బీజేపీని ఎదుర్కొవడం కీలకమనే మెళకువ కాంగ్రెస్‌లో అసలు కనిపించడం లేదు. ఏపీని పాలిస్తున్న వైసీపీ నాయకుడు జగన్ గతంలో కాంగ్రెస్ కుదురు నుంచి వచ్చిన వారైనా వాటి మధ్య ఎలాంటి సంబంధాలు లేకపోగా అసలు లక్ష్యపెట్టని స్థితి. పిసిసి అధ్యక్షుడిని మార్చినా కూడా క్రియాశీలత పెరగడం లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధ్యక్షుడైనాక హడావుడి పెరిగింది గాని, నిర్దిష్టమైన కార్యాచరణ అంతర్గత ఐక్యత రావడం లేదు. బీజేపీనీ టీఆర్ఎస్నూ ఒకే గాట కట్టడమే గాక మునుగోడు ఉప ఎన్నికలో బలపరుస్తున్న కమ్యూనిస్టులపైనా నోరు పారేసుకుంటున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. మునుగోడులో కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీ తరపున బరిలో నిలబడగా ఆయన అన్న ఎంపీ వెంకటరెడ్డి కాంగ్రెస్‌లో ఉంటూనే ఈ ప్రచారానికి మొహం చాటేశాడు. ఆయన తనతోనే ఉన్నాడని రాజగోపాల రెడ్డి చెపుతున్నాడు. ఇది ఆపార్టీ పరిస్థితికి నిదర్శనం. ఎంఎల్ఎలు, కీలకనేతలు కూడా ఎంతమాత్రం క్రమశిక్షణ గాని పరిస్థితి తీవ్రతకు తగిన ఆసక్తి గాని ప్రదర్శించడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్ది పార్టీని పట్టాలు ఎక్కించడం, వాస్తవిక రాజకీయ వ్యూహంతో ముందుకు సాగడం పెద్ద సవాళ్లు. గతంలో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు అంత ఆశాజనకంగా లేదు. గొంతు మీదకు వచ్చిన ఇప్పుడైనా ఆయన ఆ సమర్థత ప్రదర్శిస్తారా అందుకు నేతలు శ్రేణులు సహకరిస్తారా అన్న ప్రశ్న పెద్దదవుతోంది.
కాంగ్రెస్‌ను తీసిపారేస్తే ఎలా?
కాంగ్రెస్‌కు కాలం చెల్లిపోయిందని ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలలోనూ బీజేపీ కేంద్రంలోనూ స్థిరపడిపోయాయని వ్యాఖ్యలు నిత్యం వినిపిస్తున్నాయి. కానీ అతిపురాతనమైన పాలక పార్టీని అప్పుడే తీసిపారేయడం తొందరపాటవుతుంది. 200 స్థానాలలో బీజేపీ కాంగ్రెస్‌లే తలపడే రాష్ట్రాలు కొన్నివుంటే, ఉభయులనూ ప్రాంతీయ పార్టీలూ వామపక్షాలు ఎదుర్కొనే రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం కొరత వెన్నాడుతూనే ఉంది. అన్ని రాష్ట్రాలలో అంతర్గతకలహాలు కొనసాగుతుండగా అధికారంలో ఉన్నచోట్ల అవి మరింత జటిలంగా మారాయి. ఇటీవల రాజస్థాన్‌లో సచిన్‌పైలెట్ తిరుగుబాటు కుదిపేసి సర్దుకుంది. అయితే ఆ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్‌ను పదవి వదలిపెట్టి అధ్యక్ష పదవి స్వీకరించమంటే ఒప్పుకోకపోవడం గాంధీ కుటుంబం మాట చెల్లడం లేదనడానికి తాజా ఉదాహరణ.. ఆ పార్టీ గత వరవడిని బట్టి, అలాగే ప్రస్తుత సవాళ్లను బట్టి మళ్లీ రాహుల్ రావలసిందేనని పెద్ద ప్రయత్నమే జరిగినా ఆయన అంగీకరించకపోవడానికి కారణం ఇదే. చాలా మంది ప్రియాంక పేరు ప్రతిపాదించారు కూడా. ప్రియాంక ఇందిరాగాంధీలా ఉంటారు గనక పార్టీ ప్రచారానికి ఎక్కువ ఉపయోగం అని భావించేవారు చాలామంది ఉన్నారు. అయితే వారంతా తరాల మార్పును లెక్కలోకి తీసుకుంటున్నారో లేదో తెలియదు. ఆమె హత్యానంతరం 35ఏండ్లు గడిచిపోయాయి. అయితే మన్మోహన్ మంత్రివర్గంలో చేరడానికి గట్టిగా నిరాకరించిన రాహుల్ తర్వాత తన స్థానాన్ని బహిరంగంగా ప్రదర్శించిన సంగతి తెలుసు. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడిన తర్వాత మోడీకి కన్నుగీటడం వంటి చిలిపిపనులు కూడా మర్చిపోలేదు. విశ్వ విద్యాలయాలలో విద్యార్థులతో చర్చలు జరిపిన రాహుల్ తర్వాత ఎందుకు ఇలా మాస్టచ్ ఇచ్చారనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఆయన తండ్రి రాజీవ్‌గాంధీ మేకప్‌లో కనిపిస్తున్నారు. ట్వీట్లు, కామెంట్లు, ప్రముఖులతో ఆన్లైన్ సంభాషణల హడావుడి చేస్తున్నారు. మల్లికార్జున ఖర్గేను కోరి కీలక పదవి అప్పగించడంలో అంతరార్థం ఆయన గాంధీ కుటుంబానికి అత్యంత విధేయంగా ఉండటమే. కనుక బాధ్యతలేని అధికారం రాహుల్ చలాయించబోతున్నారు. ఆయన ప్రాధాన్యతల్లో రోజూ మోడీని విమర్శిస్తున్నా మతతత్వాన్ని ఖండిస్తున్నా ఒక తరహా హిందూత్వ ముద్ర సంకేతాలిస్తున్నారనే భావన బలంగానే ఉంది. బీజేపీయేతర పార్టీల సమీకరణ కన్నా తమ నాయకత్వం ప్రధానమనే ఆలోచన నుంచి కాంగ్రెస్ బయిటకు రావడం లేదు. ఇప్పుడు ఎన్నికలు జరగాల్సిన గుజరాత్‌కు ఆయన వెళ్లడం లేదు కూడా. అనైక్యతకు తోడు సైద్ధాంతిక వ్యూహాత్మక గజిబిజి కూడా కాంగ్రెస్‌లో మరీ ముఖ్యంగా రాహుల్‌లో ఉన్నాయి.
ఈ గందరగోళం తెలుగు రాష్ట్రాలలో మరింత ఎక్కువ కనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ తరచూ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ జోక్యం చేసుకోవాలని కోరుతుంటుంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న గవర్నర్‌ను బలపరుస్తుంటుంది. కేంద్ర పార్టీ పిలుపులు పాటిస్తూనే మరోవైపు రాష్ట్రాలలో ప్రత్యర్థులే ఆగర్భ శత్రువులన్నట్టు వ్యవహరిస్తుంటుంది. మధ్య మధ్యలో పరిశీలకుల రాకపోకలు ప్రహసన ప్రాయమవుతుంటాయి. ఏపీ విషయానికి వస్తే గతంలో చక్రం తిప్పిన హేమాహీమీలు, మాజీ ముఖ్యమంత్రులు మంత్రులు ఇప్పుడు నిరాసక్తంగా గడిపేస్తున్నారు. ఢిల్లీ పెద్దలను మాత్రం సంతృప్తి పరుస్తుంటారు. రాష్ట్రం ఇచ్చింది మేమైనా ఓడించారని తెలంగాణలో అంటుంటే, రాష్ట్ర విభజన చేశాం గనకే ఓడిపోయామని ఏపీలో వాపోతుంటారు. గతమేదైనా సరే ఇప్పుడు ముందున్న సమస్యలపై కేంద్రీకరించడం, చురుగ్గా ఉండటం లేనేలేదు. ఇదే విమర్శ చేస్తే మాలాగా ఎవరూ పోరాడలేదని వారు సమర్థించుకుంటారు. ప్రత్యేక హోదా వెనకబడిన ప్రాంతాలతో సహా ఆరు సమస్యలను తీసుకుని ఏపీలో చురుగ్గా పనిచేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. బీజేపీకి మూడు ప్రాంతీయ పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన ఉపగ్రహాలుగా వ్యవహరిస్తున్న పరిస్థితులలో ఈ జాతీయ పార్టీ ఆ అంశాన్ని రాజకీయ ప్రాధాన్యతగా ఎంచుకోవడమే లేదు. కొందరు కాంగ్రెస్ నాయకులైతే బీజేపీ జోలికి పోని తెలుగుదేశం నమూనానే అనుసరిస్తూ ఎల్లవేళలా రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వమే ఏకైక లక్ష్యంగా మాట్లాడుతుంటారు. మతరాజకీయాలను ఎదుర్కొవడంలో చొరవ చూపించరు.
రాజకీయ సవాళ్లు
ఇన్ని కారణాల వల్ల సంస్థాగతంగానూ రాజకీయంగానూ సైద్ధాంతికంగానూ తెలుగునాట కాంగ్రెస్ పరిస్థితిని బాగుచేయడం పెద్ద సవాలే. ఇప్పుడు గాంధీ కుటుంబంపట్టు దేశవ్యాపిత పాత్ర కూడా దుర్బలమైన రీత్యా రాహుల్‌గాంధీ యాత్ర జయప్రదమైనా కాంగ్రెస్ గత వైభవం సంతరించుకోవడం దుస్సాధ్యం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తామే అధికారంలోకి వచ్చేస్తామని బీజేపీ హంగామా చేస్తుంటే, టీఆర్ఎస్ వామపక్షాలు గట్టిగా విమర్శిస్తున్నాయి కానీ కాంగ్రెస్ నేతలు మరీ ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ మాత్రం బీజేపీ బిటీంగా టిఆర్ఎస్ను విమర్శిస్తున్నారు. ఏపీలో మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు వ్యూహకర్తలు వనరులున్నా తమ పార్టీకోసం ఏంచేసినా ప్రయోజనం లేదనే అంచనాకు వచ్చేసినట్టు కనిపిస్తున్నది. బీజేపీ ఈడీ దాడులు ఆ పార్టీకి చెందిన మాజీల పైనా సాగుతున్నాయి. వైసీపీ వారు గాని టీడీపీ గాని మతరాజకీయాలపైన కేంద్ర నిరంకుశత్వంపైన పోరాడే సూచనలే కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో జాతీయపార్టీగా, దీర్ఘకాలం పాలించిన పార్టీగా కాంగ్రెస్ చొరవ చూపితే ఫలితాలుండకపోవు. విభజనానంతర సమస్యలకు వారు కూడా కారణమే గనక వాటిపై పోరాడితే ప్రజలకు దగ్గరయ్యే అవకాశమూ ఉంటుంది. అలాంటి ఆలోచనలు చేస్తారా లేక రాహుల్ యాత్ర మూడురోజుల ముచ్చటగా ముగిసిపోతుందా చూడాల్సిందే. దేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ గత ప్రాభవం రాదనే వాస్తవం గుర్తించడం ఇందులో మొదటిమెట్టు.
- తెలకపల్లి రవి