Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొలితరంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్‌స్టార్ కృష్ణ, కృష్ణంరాజు తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఇప్పుడు మహేష్‌బాబు, జూనీయర్ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వెండితెరపై తమ విశ్వరూపాన్ని చూపించారు. విజయశాంతి, రాధ, సుమలత, రాధిక, జయసుధ, జయప్రద తమ నటనతో ఉర్రూతలూగించారు. వారు నటించిన అనేక చిత్రాలు బ్లాక్బస్టర్లు. ఇటీవల యువహీరోలు కొంత మంది పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. బుల్లితెరపై కొంత మంది తమ నటనతో ప్రేక్షకాదరణ పొందుతున్నారు. ఒకవైపు వెండితెర, మరోవైపు బుల్లి తెర హీరో, హీరోయిన్లు తమ ప్రతిభాపాటవాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. తాజాగా మునుగోడు ఎన్నికల్లో వెండితెర, బుల్లితెర నటులను మించి రాజకీయ నాయకులు నటిస్తున్నారు. వారి నటనకుగానూ ఎన్ని అవార్డులు ఇచ్చినా సరిపోవు. సినిమాలో చాన్స్ ఇచ్చే ముందు ఫొటో షూట్ నిర్వహించి, ఎంపిక చేస్తారు. ఇక్కడ మాత్రం ఫొటో షూట్లతో ముంచెత్తుతున్నారు. ఓటర్ల వద్దకు వెళ్లి ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్నారు. సినిమాల్లోనైతే ప్రేమానుగారాలు ఆ రెండు గంటలసేపు కనిపిస్తాయి. ఉప ఎన్నికల్లో మాత్రం ఓటర్ కనిపిస్తే చాలు కాళ్లు మొక్కుతున్నారు. చేతులు కావు కాళ్లు అని గడ్డాలు పట్టుకుంటున్నారు. చిన్న పిల్లలను ముద్దు చేస్తున్నారు. ఆటా, పాటలతో హోరెత్తిస్తున్నారు. తీన్మార్ డ్యాన్స్‌లు చేస్తూ ఓటర్లను ఉత్సాహ పరుస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఏకంగా తన తండ్రిని గుర్తుకు తెచ్చుకుని కన్నీళ్ల పర్యంతమయ్యారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భార్య లక్ష్మి కూడా పువ్వు గుర్తుపై ఓటు వేసి తన భర్తను గెలిపించాలంటూ ఊరూరా తిరుగుతూ కొంగు సాపుతున్నారు. మంత్రి కేటీఆర్ ఫ్లోరైడ్ బాధితులు హంసాల స్వామి ఇంటికెళ్లి భోజనం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం నవరసాలు పండిస్తున్నారు. ఇక చోటా మోటా నాయకులది మరో ఎత్తు! ఎంతగా నటిస్తున్నారంటే... పొద్దంతా ఒక పార్టీ జెండా మోస్తూ కనిపిస్తున్నారు. తెల్లారే సరికి మరో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. మూడో కంటికి తెలియకుండా పాత్రలు మార్చి నటిస్తున్నారు. సోషల్‌మీడియాలో వారి పోస్టులు చూస్తుంటే... ఓరి నాయనో మీ ఆస్కార్ నటనకుగానూ నటసార్వభౌములుగా కీర్తించాలి అని నవ్వుకుంటున్నారు జనం.
- గుడిగ రఘు