Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మడిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలన్నారు నటవిరాట్ రావు గోపాలరావు. ముత్యాల ముగ్గు సినిమాలో ఆయన తన దైన, తనకే సాధ్యమైన మేనరిజంతో కొట్టిన ఈ డైలాగ్... యావత్ తెలుగు సినీ అభిమానుల నోళ్లలో ఇప్పటికీ నానుతూ ఉంది. వాట్సాప్, ఫేసుబుక్కు, ట్విటర్, ఇన్స్ట్రా తదితర సామాజిక మాధ్యమాలు తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతోడు రావు గోపాలరావు గారిలో పరకాయ ప్రవేశం చేసి... తమ కళాపోషణను నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నారు. పరోపకార్థం ఇదం శరీరం అని పెద్దలు చెప్పిన మాటల్ని పక్కనెట్టి ప్రతీదీ ప్రచారార్థం.. ఇదే అసలు తత్వం అనే రీతిలో అవసరం ఉన్నా, లేకపోయినా అదే పనిగా ఫొటోలు, పోస్టులు పెడుతూ జనాల్ని వెర్రెత్తిస్తున్నారు. ఇదొక తతంగమైతే.. క్షేత్రస్థాయిలోని చోటా మోటా లీడర్లు, ఒకడుగు ముందుకేసి, తమ సృజనాత్మకతకు మరింత క్రియేటివిటీని అద్ది 'భజనాత్మకత..'ను ప్రదర్శిస్తుండటం పరిపాటిగా మారింది. తమ సర్పంచో, ఎమ్మెల్యేనో, ఎంపీనో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవ గురించో ప్రచారం చేసుకోవటంలో ఎలాంటి తప్పూ లేదు. దాన్ని కాదనటానికి ఎవరికీ ఎలాంటి హక్కూ ఉండదు కూడా. కానీ 'మా అన్న రాముడు, శూరుడు, వీరుడు, దానకర్ణుడు, సింహం, పులి...' అంటూ అదే పనిగా భజనానంద లహరి వాయించటం మరీ అతిగా అనిపిస్తుందంటున్నారు సాధారణ జనాలు. పై నాయకుడికి అదే పనిగా భజన చేయటం ద్వారా తమ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండబోదని భావించటం అవగాహనా రాహిత్యమే అవుతుందంటున్నారు సీనియర్ పొలిటీషియన్లు. తమకున్న పదవులతో గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించటం, జనం బాధల్ని పట్టించుకోవటం ద్వారానే వారి మనసుల్ని చూరగొంటామనే విషయం ఇలాంటి భజనాత్మక భక్తులకు ఎప్పుడు అర్థమవుతుందో..? అందుకే 'వాళ్లని అలా వదిలేయకండ్రా... ఎవరన్నా వాళ్లని మార్చండ్రా బాబూ...' అంటూ వేడుకుంటున్నారు నెటిజన్లు.
-బి.వి.యన్.పద్మరాజు