Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్టుబడిదారీ సమాజంలో ఏదైనా సరుకే. రక్త మాంసాలు, మానప్రాణాలు అన్ని వ్యాపారమే. పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబీయాలో భారతదేశంలో తయారైన దగ్గుమందు తాగి 66మంది చిన్న పిల్లలు మరణించిన సంఘటన అత్యంత విషాదకరం. భారతదేశానికి చెందిన నాలుగు రకాల దగ్గు సిరప్లు పేద, వెనుకబడిన దేశాల అమాయక పిల్లల ప్రాణాలు తీశాయనీ, 'జాగ్రత్త' అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఘటనకు కారణమైన దగ్గు మందులను భారతదేశంలోని హర్యానాకు చెందిన 'మెయిడెన్' ఫార్మసూటికల్స్ కంపెనీ తయారు చేసిందని ప్రకటించింది. ఈ నాలుగు రకాల మందులను ప్రపంచవ్యాప్తంగా నిషేదించింది. ఈ మందులు గాంబియాకు మాత్రమే ఎగుమతి అయినట్లు తెలుస్తున్నప్పటికీ యావత్ ప్రపంచం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేసింది. దీంతో ఈ వార్తప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత ప్రటిష్ట దిగజారి పోయింది. జబ్బులు తగ్గించాల్సిన మందులు ప్రాణాలు తీయటమంటే అంతకన్నా ఘోరమైన నేరం ఉంటుందా? ప్రభుత్వాల భాద్యతా రాహిత్యం, చట్టంలోని లోసుగులు, నియంత్రణ, పర్యవేక్షణ లేని కారణంగా ఇలాంటి నేరాలు నిత్యం జరుగుతతూనే ఉన్నాయి. అటు గాంబియా, ఇటు భారత్‌లోనూ సరైన ఔషద నియంత్రణా వ్యవస్థ, జవాబుదారితనం లేదని తెలుస్తున్నది. ఈ సంఘటన జరగకముందే తమ ఉత్పత్తులు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందాయని మెయిడెన్ సంస్థ ప్రకటించుకుంది. కాని తాము ఈ సంస్థను ఎప్పుడు సందర్శించలేదని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. అటు ఐఎఎస్ఓ గుర్తింపు పొందిన సంస్థల జాబితాలోనూ మెయిడెన్ లేదు. అయినా తమకు ఐఎఎస్ఓ గుర్తింపు ఉందని సంస్థ ప్రకటించుకుంది. ప్రాణాలు కాపాడాల్సిన ఔషద సంస్థలు లాభాలే ధ్యేయంగా మనుషుల ప్రాణాలు తీస్తుంటే అన్ని వ్యవస్థలూ గుడ్లప్పగించి చూస్తూ ఉండాల్సిందేనా? ఈ సంస్థపై గత దశాబ్దకాలంగా బీహార్, గుజరాత్, కేరళ, కాశ్మీర్ రాష్ట్రాలు ఈ కంపెనీలో నాసిరకం మందులు ఉత్పత్తి అవుతున్నాయని ఫిర్యాదులు చేశాయి. కానీ కేంద్రం వైపు నుంచి ఎటువంటి చర్యలూ లేవు. ఇప్పుడు ఏకంగా 66మంది పిల్లల ప్రాణాలు పోయాయి. ఇలా ప్రజల ప్రాణాలు తీసే ఫార్మ కంపెనీలపై చర్యలు లేవంటే దేశంలో ఎటువంటి పరిస్థితు లున్నాయో అర్థం చేసుకోవచ్చు. మన ఔషద నియంత్రణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన ఎత్తిచూపుతోంది. లేకుంటే తల్లి పొత్తిళ్లలో బోసినవ్వులు విరియాల్సిన పిల్లల ప్రాణాలు పోతాయి. ఏమైనా వెనుక బడిన బడుగు దేశాల ప్రజల ప్రాణాలు ఎంత చులకనైనవో కదా!
'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్నారు పెద్దలు. అంటే దీనికి మించిన సంపద మరేది లేదు. కానీ నేటి ప్రపంచీకరణ రోగాన్ని మార్కెట్ సరుకుగానూ, దాన్ని వ్యాపారంగానూ మార్చివేసింది. నేటి కార్పొరేట్ వ్యవస్థలో వైద్యుడికి, రోగికి మధ్య పూర్తి స్థాయి వ్యాపార సంబంధాలు నెలకొన్నాయి. మానవజాతి చరిత్రలో మందులు గొప్ప పాత్ర నిర్వహించాయి అనడంలో సందేహంలేదు. అలాంటి మందులు మారణా యుధాలుగా మారడం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దుష్పలితం. మనుషులకు వచ్చే రోగాల నుండి కాపాడుకోవటానికి 256రకాల మందులు చాలని డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది. 1975లో మందుల పరిశ్రమ మీద ఒక సమగ్ర నివేదిక ఇవ్వటానికి ఉద్దేశించిన 'హాదీ కమిటీ' కేవలం 116మందులతో 99శాతం వ్యాధులను నయం చేయవచ్చని చెప్పింది. కాని నేడు మన దేశంలో 87వేల రకాలకుపైగా మందులను మందుల కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇవన్నీ వివిధ రకములైన మందులను కలిపి తయారు చేస్తున్న మందుల మిశ్రమమలు. ప్రపంచంలో తయారు చేసే మందులలో 75శాతం మందులు విదేశీ గుత్తసంస్థలు తయారు చేసేవే. ఈ మందులను తయారు చేసే క్రమంలో వచ్చే వ్యర్థలను (వాయు, ద్రవ, ఘన) శుద్ది చేయడం విదేశాలలో చాల ఖరీదు. పై పెచ్చు ఇవి గాలి, నీరు, భూమిలను కలుషితం చేస్తాయి. ఈ విష పదార్థాల వలన పర్యావరణం దెబ్బతింటుంది. ప్రజల ఆరోగ్యం చెడుతుంది. అందుకే మందులను తయారు చేసే ప్రయోగశాలగా ఈ కంపెనీలు భారతదేశాన్ని ఎంచుకున్నాయి. ఈ రకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలను కలుషితం చేశారు. ఆంధ్రలో కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు కెమికల్ క్యారిడార్ పేరుతో అనేక రకాల రసాయన పరిశ్రమలు స్థాపించి 60లక్షల మంది ప్రజల, మత్సకారుల వృత్తిని నాశనం చేస్తున్నారు. సముద్ర జాలలలోకి ఈ వ్యర్థాలు వదిలి మత్ససంపదకు, పర్యావరణానికి హానిచేస్తున్నారు. కారుచౌకగా లభించే కార్మికులు, శాస్త్రవేత్తలు, మౌలిక సదుపాయాలు ఉండటం వల విదేశీ గుత్తసంస్థలు మన దేశాన్ని ప్రయోగశాలగా ఎంచుకున్నాయి. ఒక కొత్త మందు తయారు చేసి జంతువులు, తర్వతా మనుషుల మీదకూడా ప్రయోగాలు చేయాలి. అజ్ఞానంతో నిండి ఉన్న మన దేశ ప్రజలు ఈ కంపెనీల ప్రయోగాలకు జంతువులుగా కూడా ఉపయోగపడుతున్నారు. ఈ మందుల వలన వచ్చే దుష్పలితాలను బయటకు చెప్పరు. మన దేశంలో ఈ కంపెనీలు క్లీనికల్ ట్రయల్స్, పరిశోధన పేరుతో చేస్తున్న పని ఇది. మన హైదరాబాద్‌లో ఇంకా ఇది జరుగుతూనే ఉంది. ఈ కంపెనీలు డాక్టర్లకు, మందుల షాపుల వారికి బహుమతుల పేరిట విలాసవంతమైన హౌటల్స్ పార్టీలు, దేశ, విదేశీ విహారయాత్రలు, బహుమతులు, కార్లు కూడా ఇస్తున్నారు. ఈ నజరానాలను పుచ్చుకున్న డాక్టర్లు అవసరం లేకున్నా ఈ మందులను రాస్తున్నారు. ఇదంతా వ్యాపారంలో భాగంగా జరిగిపోతూ ఉంది. ఇలా మందులు కంపెనీలు వేల కోట్లు అర్జిస్తున్నాయి. ఈ కంపెనీలు వారి లాభాల కోసం ఏమైనా చేయగలవు అనే దానికి తాజా నిదర్శనం గాంబియా దేశ ఘటన. ఇది అంతా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఒక డ్రగ్స్ మాఫీయా. ఎన్నో ఏండ్లుగా దేశంలో టానిక్కులు, హెల్త్ డ్రింకులు, ప్రోటీన్ పౌడర్లు, గ్లూకోజ్ పౌడర్లు, ఎర్ర సూది మందులు, కొలస్ట్రాల్, బరువు తగ్గించే మందుల పేరిట కోట్ల వ్యాపారం జరుగుతుంది. నిజానికి వీటి వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. అయినా ఏదో పెద్ద ప్రయోజనం ఉందని ప్రచారం చేస్తూ కోట్లు దండుకుంటున్నాయి మందుల కంపెనీలు.
ఈ డ్రగ్స్ మాఫీయాను అరికట్టే స్థాయిలో ప్రభుత్వాలు లేవు. ఈ గుత్త మందుల కంపెనీలే ప్రభుత్వాలను కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగాయి. కాబట్టి ప్రజలే వివేకంగా ఆలోచించాలి. స్పందించాలి. డాక్టర్లు, మేధావులు, మొత్తం పౌరసమాజం కల్పించుకొని ఈ మారణాయుధాలను (మందులు) అరికట్టాలి. ఈ డ్రగ్స్ మాఫీయా ఆట కట్టించాలి. నేడు ఇదీ మోడీ 'మేకిన్ ఇండియా' పరిస్థితి. మోడీ అధికారంలోకి వచ్చినాక ఈ ఎనిమిదేండ్లలో ప్రజల జీవన స్థితిగతులు బాగా దిగజారిపోయాయి. ప్రపంచ ఆకలిసూచిలో 121 దేశాలలో మనది 107వ ర్యాంకు. పాకిస్థాన్, శ్రీలంక కంటే దిగువస్థాయి. దేశంలో 22కోట్ల 40లక్షలమంది పోషక ఆహార లోపంతో బాధపడుతున్నారు. దేశ ప్రజల ఆరోగ్య విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ చాల నిర్లక్ష్యంగా ఉంది. ఇటీవల ప్రకటించిన 2022 ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం ఆరోగ్యంపై వ్యయంలో భారతదేశం 161 దేశాల జాబితాలో 157వ స్థానంలో అట్టడుగున ఉంది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దారుణ పరిస్థితులు ప్రజలకు అర్థం కాకుండా బీజేపీ సర్కార్ భిన్నతత్వంలో ఏకత్వం గల దేశ ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటుంది. అంబాని, అదాని లాంటి బడాబాబుల సేవలో మునిగితేలుతుంది. ఈ పరిస్థితులను దేశ ప్రజలు అర్థం చేసుకొని ఈ వ్యవస్థను సమూలంగా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ దేశ ప్రజల మౌలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
- షేక్ కరిముల్లా
సెల్: 9705450705