Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికలు ప్రజాస్వామ్య యుతంగా జరుగుతున్నాయా..? నిబంధనలు పక్కాగా అమలు అవుతున్నాయా..? చట్టప్రకారంగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారా..? నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారా..? ప్రస్తుత ఉప ఎన్నికలను పరిశీలిస్తే... అధికార, అంగ, అర్థ బలమే ప్రభావితం చూపిస్తోందని తెలుస్తుంది. గతంలో హుజురాబాద్... నేడు మునుగోడు ఉప ఎన్నిక తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్టీలు, ప్రత్యర్థుల బలా బలాలేమైనా... ఓటర్లను ప్రలోభాలకు, గందరగోళానికి గురి చేస్తున్న అంశాలనేకం ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల తీరును నిశితంగా పరిశీలిస్తుంటే... ఓ సామాన్యుడు, సామాజిక సేవే పరమావదిగా పని చేసేం దుకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఏ కోశానా లేవని స్ఫష్టమవుతుంది.
గత హుజురాబాద్ తాజాగా మునుగోడు ఉపఎన్నిక.. భవిష్యత్ రాజకీయాలకు ఇచ్చే సందేశంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్ పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నిబంధనల అమలు, ఉల్లంఘనలపై అధికారులున్నా... విధుల నిర్వహణ, చర్యలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎన్నికల నిర్వహణలో నైతిక విలువల గురించి చర్చించే పరిస్థితులే లేవని ఘంటాపథంగా చెప్పవచ్చు.
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చు 28 నుండి 40 లక్షల వరకు పెంచింది ఎన్నికల సంఘం. ఎన్నికలు పూర్తయ్యాక నెల రోజుల్లోగా ఎన్నికల కమిషన్కు ఖర్చుల వివరాలు నివేదించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో చేసిన ఖర్చు, అందులో పేర్కొన్న పద్దుల వివరాలు చూస్తే... ఆశ్చర్యం కలుగక మానదు. ఓటుకు వేలాది రూపాయలు పంచుతున్నట్లు గత ఎన్నికల్లో అనేక ఆరోపణలు, సాక్ష్యాలు రుజువు చేశాయి. అయినా అభ్యర్థులపై ఏ మేరకు చర్యలు తీసుకున్నారో తెలిసిందే. గత హుజురాబాద్ ఉప ఎన్నిక తీరుపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక తీరు... వ్యవస్థను ప్రశ్నించేలా ఉంది. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్, అధికారుల విధులు, చర్యలపై విశ్వసనీయ ఎంత అంటే... సమాదానాలు చెప్పలేని పరిస్థితి నెలకొంది. జిల్లా ఎన్నికల అధికారి, నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, సర్వేలెన్స్ టీమ్, ఆడిట్, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ నిస్ఫక్షపాతంగా ఏ మేరకు విధులు నిర్వహిస్తున్నారు. తీసుకున్న, తీసుకోబోయే చర్యలపై ప్రజల విశ్వాసం ఎంత అనేది ప్రశ్నార్థకం. అసెంబ్లీ నియోజక వర్గంలో అభ్యర్థి 40 లక్షల రూపాయల వరకు ప్రచార ఖర్చు చేసుకునేందుకు వీలు కల్పించింది. ప్రస్తుతం మునుగోడులో ఆయా పార్టీల అభ్యర్థులు, వారి తరుపున పార్టీలు చేస్తున్న ఖర్చు ఎంత..? తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
సాధారణ రోజుల్లో ఈ నియోజక వర్గంలో మద్యం, మాంసం అమ్మకాలు... ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చాక విక్రయాలను బేరీజు వేయలేదా ఎన్నికల సంఘం? ఆయా పార్టీల కార్యాలయాల అద్దెలు, నాయకుల ప్రచార సామాగ్రీ, భోజనాలు, వినియోగిస్తున్న వాహనాలు..ఇలా కోట్లాది రూపాయల ఖర్చును లెక్కించలేరా ఎన్నికల అధికారులు? ప్రచారానికి వచ్చే నేతల ప్రచార ఖర్చు ఆయా పార్టీల అభ్యర్థుల ఖాతాల్లో జమ చేయలేరా..? ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యలను నియంత్రించలేరా..? నిబంధనల ఉల్లంఘనలు, పరిమితికి మించి చేస్తున్న ఎన్నికల ఖర్చుపై..అధికారులు తీసుకుంటున్న చర్యలపై విశ్వాసం కోల్పోతున్నారు ప్రజలు. ప్రతీ రోజు మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచార సరళి ఇందుకు నిదర్శనం. ప్రభుత్వాలు, పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వయం ప్రతిపత్తితో నిస్వార్థంగా ప్రజల్లో విశ్వాసం కలిగేలా చూడాల్సిన ఎన్నికల కమిషన్ ఉత్సవ విగ్రహంగా మారిపోయిం దన్నది ఓ నిష్టుర సత్యం. ఇలాంటప్పుడు ప్రలోభాలు అరికట్టేదెవరూ, నిజమైన ప్రజాభిప్రాయానికి పట్టం కట్టేదెవరూ?
- చిలగాని జనార్థన్
సెల్:8121938106