Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒపెక్ (ఆయిల్ ప్రొద్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్)లో 13 సభ్యదేశాలున్నాయి. ఇవిగాక రష్యాతో సహా మరో 11 దేశాలు చమురు ఉత్పత్తి చేస్తూ ఎగుమతి కూడా చేస్తున్నాయి. ఈ మొత్తం దేశాలన్నీ కలిసి అక్టోబర్ 5న సమావేశం జరిపి తమ చమురు ఉత్పత్తిలో రోజుకు 20లక్షల బ్యారెళ్ళ మేరకు తగ్గించాలని నిర్ణయించాయి. ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దని ఒపెక్ దేశాలను అమెరికా వత్తిడి చేస్తూవచ్చింది. ఇటువంటి నిర్ణయం జరగకుండా ఆపడానికి అమెరికా నానా పాట్లూ పడింది. సౌదీ అరేబియాకు అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా చాలామంది అమెరికన్ ఉన్నతస్థాయి నేతలు ప్రయాణం కట్టారు. ఇటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఒపెక్‌కు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కాని ఒపెక్ నిర్ణయం వేరుగా ఉంది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడవలసినదేమీ లేదు. పాశ్చాత్యదేశాల మీడియా ఈ నిర్ణయం మీద వ్యాఖ్యానిస్తూ... ''ఇది బైడెన్‌కు చెంపపెట్టు'' అని అన్నది.
ఈ విధమైన నిర్ణయం ఒపెక్ తీసుకోకూడదని అమెరికా బలంగా కోరుకోడానికి మూడు కారణాలున్నాయి. మొదటిది: చమురు ఉత్పత్తి తగ్గితే చమురు ధరలు పెరుగుతాయి. అందువలన అమెరికాలో ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరింత వేగం పుంజుకుంటుంది. దాని వలన వడ్డీరేట్లను మరింత పెంచవలసివస్తుంది. అది అమెరికాతో సహా అన్ని చోట్లా ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. రెండవది: పైన చెప్పిన పరిణామాలు సంభవించడానికి కొంత సమయం పట్టవచ్చు. కాని, చమురు ధరలు పెరిగితే అమెరికాలోని వినియోగదారులకు అది నష్టం కలిగిస్తుంది, పైగా చికాకు తెప్పిస్తుంది. ఈ నవంబర్‌లో అమెరికన్ సెనేట్‌కు, కాంగ్రెస్‌కు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికలలో డెమాక్రటిక్ పార్టీకి దీనివలన నష్టం కలిగే అవకాశం ఉంది. ఇక మూడవది: ఒపెక్ దేశాల చమురు ఉత్పత్తి తగ్గితే, రష్యాకు చమురుద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. అప్పుడు రష్యా మీద విధించిన ఆంక్షల ప్రభావం ఏమీ లేకుండాపోతుంది.
ఈ మూడో కారణాన్నే అమెరికా చాలా సీరియస్‌గా తీసుకుంది. సౌదీ అరేబియా వెళ్ళిన అమెరికన్ అగ్రనాయకులంతా ఆ దేశం అటు అమెరికా కావాలో ఇటు రష్యా కావాలో తేల్చుకోవాల్సిందే అన్నంత తీవ్రంగా వత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఒపెక్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ రాజకీయాల మీద ప్రభావం చూపనుంది. అమెరికా-సౌదీ అరేబియా దేశాల నడుమ సంబంధాలు వేడెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
చమురు ఉత్పత్తిని తగ్గించడం రష్యాకు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. నిజానికి మరే ఇతర దేశం కన్నా ఇది రష్యాకే ఎక్కువ లాభం చేకూరుస్తుంది. చాలా ఒపెక్ దేశాలు తమ కోటా మేరకు కూడా చమురు ఉత్పత్తి చేయడంలేదు. నైజీరియా, అంగోలా వంటి దేశాలు తమ చమురు ఉత్పత్తిని పెంచడానికి కావలసిన పెట్టుబడులను పెట్టలేదు. ఆంక్షల కారణంగా రష్యా కూడా తన కోటా మేరకు ఉత్పత్తి చేయడం లేదు. ఇప్పుడు 20లక్షల బ్యారెళ్ళ మేరకు ఉత్పత్తిని తగ్గించడం అంటే అన్ని దేశాల ఉత్పత్తి కోటాలూ తగ్గుతాయి. అలా తగ్గబోయే కోటాకన్నా కూడా తక్కువ స్థాయిలోనే ఇప్పుడు రష్యా చమురు ఉత్పత్తి ఉంది. అందుచేత ఇప్పుడు కొత్తగా రష్యా తగ్గించుకోవలసిన కోటా ఏదీ ఉండదు. పైగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతాయి గనుక రష్యాకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. తక్కిన ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలతో పోల్చినప్పుడు రష్యాకు పెరిగే ఆదాయం ఎక్కువగా ఉండనుంది. ఆంక్షలు విధించడం ద్వారా రష్యాను లొంగదీయాలని ప్రయత్నిస్తున్న అమెరికాకు ఇది కచ్చితంగా ఎదురుదెబ్బ అవుతుంది.
పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించరాదంటూ చేస్తున్న వాదనను ఈ విధంగా సమర్థించుకుంటున్నాయి... చమురు ఉత్పత్తి గనుక తగ్గితే అప్పుడు చమురు ధరలు పెరుగుతాయి. అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. దాని వలన వడ్డీరేట్లను పెంచవలసివస్తుంది. అది తీవ్రమైన మాంద్యానికి దారి తీస్తుంది. ఇదీ ఆ దేశాల వాదన. అయితే ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాలని తాము చేసిన నిర్ణయాన్ని సమర్థించుకోడానికి ముందుకు తెచ్చిన వాదన కూడా ఇదే మాదిరిగా ఉంది. వడ్డీరేట్లు పెంచినందువలన అది మాంద్యానికి దారితీస్తోంది. మాంద్యం వలన చమురుకు డిమాండ్ తగ్గిపోతుంది. అప్పుడు చమురు ధర పడిపోతుంది. దానిని నిలుపు చేయాలంటే చమురు ఉత్పత్తిలో కోత విధించడం అవశ్యంగా జరగాలి. ముంచుకొస్తున్న ప్రపంచవ్యాప్త మాంద్యం నేపథ్యంలో చమురు ధర పడిపోకుండా నిలవరించడానికి ఇదొక్కటే మార్గం అని ఒపెక్ అంటోంది.
ముడిసరుకులకు డిమాండ్ తగ్గి, ఆ సమయంలో ఆ సరుకుల సరఫరా అదే మోతాదులో తగ్గకుండా కొనసాగితే అప్పుడు వాటి ధరలు పడిపోతాయి. 1930 దశకంలో వచ్చిన మహామాంద్యం సమయంలో ముడిసరుకుల ధరలు పడిపోయాయి. కాని వాటిని వినియోగించి ఉత్పత్తి చేసే వినిమయ సరుకుల ధరలు అదే మోతాదులో పడిపోలేదు. దాని వలన వ్యాపార లావాదేవీలలో ముడిసరుకుల వ్యాపారా నికి గట్టి దెబ్బతగిలింది. వ్యవసాయోత్పత్తుల విషయంలో కూడా అదేవిధంగా జరిగింది. దాని వలన భారతదేశంలోని రైతులతో సహా ప్రపంచవ్యాప్తంగా రైతాంగం అప్పుల పాలయ్యారు. ఆ నేపథ్యంలోనే రైతులు ఉద్యమాలవైపు మొగ్గారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో ముందుపీఠీన నిలిచారు.
డిమాండ్ తగ్గిన కారణంగా ఆ సరుకుల ధరలు పడిపోతే దానిని 'ధరల సర్దుబాటు(ప్రైస్ అడ్జస్ట్మెంట్) అంటాం.' అదే, ముడిసరుకులకు డిమాండ్ తగ్గినప్పుడు ఆ ముడిసరుకుల ఉత్పత్తిని తదనుగుణంగా తగ్గించుకుంటే దానిని 'ఉత్పత్తి పరిమాణం (క్వాంటిటీ అడ్జస్ట్మెంట్) సర్దుబాటు' అంటాం. ఇప్పుడు ఒపెక్ ఉత్పత్తి పరిమాణం సర్దుబాటుకు పూనుకుంది. అమెరికా మాత్రం ధరల సర్దుబాటు కోరుతోంది.
ఈ రెండు రకాల సర్దుబాట్లలోనూ ఉత్పత్తి పరిమాణం సర్దుబాటు వలన ఉత్పత్తిదారులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఉదాహరణకు: డిమాండ్‌లో 10శాతం మేరకు తగ్గుదల ఉందనుకుందాం. అప్పుడు సరఫరాలో కూడా 10శాతం మేరకు తగ్గిస్తే(ధర యధాతథంగా కొనసాగి) ఉత్పత్తిదారుల ఆదాయం 10శాతం తగ్గుతుంది. అదే సరఫరా గనుక యధాతథంగా కొనసాగిస్తే ధర పడిపోతుంది. డిమాండ్ పడిపోకుండా నిలబెట్టాలనుకుంటే ధర 10శాతం కన్నా ఎక్కువ స్థాయిలో పడిపోతుంది.
(ముడిసరుకుల డిమాండ్ ధరల హెచ్చుతగ్గులబట్టి మారదు అని చెప్పడం వంటిదే ఇది) ధర 20శాతం పడిపోయిందనుకుంటే అప్పుడు ఉత్పత్తిదారుల ఆదాయం కూడా 20శాతం పడిపోతుంది. మొదటి పద్ధతిలో ఉత్పత్తిదారులకు కలిగే ఆదాయం లోటు కన్నా రెండవ పద్ధతిలో కలిగే లోటు ఎక్కువగా ఉంటుంది. పైగా ఉత్పత్తి ఖర్చు కూడా మొదటి పద్ధతిలో కన్నా రెండవ పద్ధతిలో ఎక్కువ అవుతుంది. ఏ విధంగా చూసినా, ధరల సర్దుబాటు వలన ఉత్పత్తిదారులకు ఎక్కువ నష్టం అన్నది స్పష్టం.
కాబట్టి ఒపెక్ దేశాలు తీసుకున్న నిర్ణయం వారి ధృక్కోణం నుంచి చూసినప్పుడు సరైన నిర్ణయమే. అమెరికాను దెబ్బ కొట్టాలనే దురుద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయం కాదు. అమెరికా నుంచి వచ్చిన వత్తిళ్ళను తట్టుకుని నిలదొక్కుకో గలగడం మారుతున్న పరిస్థితులకు సంకేతంగా భావించ వచ్చు. నిన్నటివరకూ అమెరికాకు అత్యంత నమ్మకస్తులైన మిత్రులు సైతం ఇప్పుడ అమెరికా పెత్తనాన్ని సవాలు చేస్తున్నారు.
ముడిచమురు ధరలు ఈ మధ్య తగ్గుతున్నాయన్నది వాస్తవం. ఈ ఏడాది జూన్ నెలలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 120 డాలర్లు ఉంది. అది ఇప్పుడు (అక్టోబర్ 5 నాటికి) 100 డాలర్లకు దిగువకే పడిపోయింది. ఇప్పుడు ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించాలని తీసుకున్న నిర్ణయం వలన మళ్ళీ చమురు ధర పెరిగిపోదా? అన్న ప్రశ్న ఎదురవుతుంది. మామూలుగా ద్రవ్యోల్బణం ఉన్నకాలంలో కార్పొరేట్ల లాభాల మార్జిన్ (పెట్రో సరుకుల ఉత్పత్తిదారులతో సహా) పెరుగుతూనేవున్నాయి. ఇప్పుడు ముడిచమురు ధర పెరిగిన తర్వాత కూడా కార్పొరేట్ల లాభాలు యధాతథంగా పెరుగుతూపోతే దానర్థం ఆ కార్పొరేట్లు పెరిగిన ముడిచమురు ధర భారాన్ని వినియోగదారులమీదకు నెట్టేస్తున్నారనే. ద్రవ్యోల్బణానికి తక్షణ కారణం ఆ కార్పొరేట్ల విపరీత లాభాపేక్ష అవుతుందే తప్ప మరొకటి కాదు. (దానికి భిన్నంగా ముడిచమురు ఉత్పత్తిదారులు ఉత్పత్తి తగ్గించుకోవడం వలన వారి ఆదాయం తగ్గుతుంది.)
ప్రస్తుతం విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం వెనుక ప్రధానంగా ఉన్నది ఈ కార్పొరేట్ల అత్యాశే. పెట్రో కంపెనీల లాభాలమీద పన్ను పెంచాలన్న డిమాండ్ బ్రిటన్‌లో తలెత్తింది. దీనిని మధ్యేవాదులైన లిబరల్ డెమాక్రాట్లు సైతం బలపరిచారు. కాని అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ దానిని తిరస్కరించాడు.
అమెరికా వడ్డీ రేట్లను పెంచడం ద్వారా రెండు విధాలుగా లాభంపొందాలని చూస్తున్నది. మొదటిది: వడ్డీరేట్లు పెరిగినందువలన స్థూల డిమాండ్ తగ్గుతుంది. అది నిరుద్యోగాన్ని పెంచు తుంది. అందువలన కార్మికవర్గపు బేరసారాల శక్తి సన్నగిల్లు తుంది. అప్పుడు పెరిగిన ధరలకను గుణంగా వారి వేతనాలను సవరించ నవసరం ఉండదు. రెండవది: ముడిసరుకుల ధరలు తగ్గితే మొత్తం మీద ధరలసూచీ పెద్దగా పెరగకుండా యధాతథంగా ఉంటుంది.
క్లుప్తంగా చెప్పాలంటే... పశ్చిమ పెట్టుబడిదారీ దేశాలు అటు కార్మికులను, ఇటు ముడిసరుకుల ఉత్పత్తి దారులను బలిపెట్టి ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయాలని భావిస్తున్నాయి. కార్పొరేట్ల లాభాల మార్జిన్‌ను అదుపు చేయాలనే ఆలోచన ఏ కోశానా కనిపించడంలేదు. ఇప్పుడు ఒపెక్ తీసుకున్న నిర్ణయం వలన చమురు (ముడిసరుకు) ఉత్పత్తిదారులు దెబ్బ తినకుండా నిలదొక్కుకోగలుగుతారు.
అమెరికా తన చమురు నిల్వలనుండి ఈ నవంబర్‌లో ఒక కోటి బ్యారెళ్ళ ముడిచమురును అదనంగా మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. తద్వారా ఒపెక్ దేశాల నిర్ణయం ప్రభావం చమురు ధరలపైన పడకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. నవంబర్‌లో అమెరికన్ సెనేట్‌కు, కాంగ్రెస్‌కు జరిగే ఎన్నికలవరకూ ఈ నిర్ణయం డెమాక్రాట్లకు ఉపయోగపడవచ్చు. కాని నవంబర్ తర్వాత మాత్రం అమెరికన్ వినియోగదారులు విచ్చుకుంటున్న సంక్షోభం బారిన పడక తప్పదు.
- ప్రభాత్ పట్నాయక్
స్వేచ్ఛానువాదం