Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యాయం విస్తుపోవటమే కాదు
కటకటాల వెనక్కి నెట్టబడటం కాల ధర్మం
అన్యాయం వికటాట్టహాసం చూడలేక
కళ్ళకు గంతలు కట్టుకోవడమే కాదు
వినలేక చెవులని మూసుకోవడమే ఇక సమ్మతం
చెడు వినవద్దు చెడు కనవద్దు చెడు మాట్లాడకూడదు
అంటే చెడు గురించి ఎక్కడా ఫిర్యాదు చేయొద్దు
పదే పదే అన్యాయం, అక్రమం అనడం
రాజ్యానికే కాదు సదరు న్యాయరక్షకులకు
చికాకు తెప్పించటం వింత కాదు విలక్షణ వాస్తవం
సహజ న్యాయ సూత్రాల వల్లింపులో అందం ఉంది
ఎనలేని సౌందర్యం దాగుంది
వాటి అమలు ప్రస్తావనే ఓ అభాస
హక్కుల కోసం అడగటమూ వద్దు
ఆ పై అభాసు పాలూ కావద్దు
ఎవరి గూట్లో వారు క్షేమంగా, నిక్షేపంగా కామెడీ సీరియళ్ళు
రీల్స్ అండ్ షార్ట్ వీడియోలు చూసుకోటం ఎంత హాయి
పొరుగువారిని ప్రేమించవోయి
పక్కవాడి మేలు తలపోయవోయి
బడిలో వల్లె వేయాల్సిన పాఠాలు మాత్రమే
బతకాలంటే నోర్మూసుకోవాలి ఎవరో ఆడించినట్టు ఆడాలి
ఆలోచనలని పరిహరించాలి
ఏజంట్ విక్రమ్ సినిమా చూడాలి
నిజంగానే ఎవరో విక్రములు వస్తారని కలల్లో తేలిపోవాలి
ఇక్కడ నిజం నిజం కాదు అబద్ధమే అసలు నిజం అని
తలకెక్కించుకోవాలి
ఇక్కడ రెండు కాళ్ళ మీద నడవటం కాదు
రెండు చేతుల్ని కూడా కాళ్ళుగా ఉపయోగించడమే సిసలైన కళ
తల మాత్రమే కాదు సమస్త దేహమూ వంగిపోవాలి
తల దించడం నేర్పింది మొబైల్
దేహాన్నీ, మస్తిష్కాన్నీ కుదించే మాయాజాలం మంత్రజాలం
మరీ దూరంగా లేదు దరిదాపులలోనే ఉంది
మరేం భయం లేదు వెనక్కి వెనక్కి వెళదాం
ఎవరి గుహలో వాళ్ళం ఉండిపోదాం
అదే పరమానందం పరమ మోక్షదాయకం
- గుడిపాటి