Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలంలో ప్రతి అనుభవాన్నీ అక్షరబద్ధం చేసి విశ్లేషించే నైపుణ్యం ఒక్క కవికే ఉంటుంది. గత, వర్తమానాలు వ్యక్తి, వ్యవస్థ భావనలను పరిశీలిస్తూ గురుతర బాధ్యతతో వ్యక్తిని, వ్యవస్థను సరైన దారిలో నడిపించే మార్గదర్శ కవి. అది వేద, ఉపనిషత్ల కాలం కావచ్చు, కావ్య, పురాణ ప్రబంధం కావచ్చు. ఆధునికం కావచ్చు ఏదైనా మార్పు కోసమే ప్రయత్నాలు. ఆ మార్పు కూడా సమమకాలీనతతో ముడిపడి ఉండడమే సాహిత్య పరమార్థం. ప్రపంచాన్ని మరింత ఏకత్వ భావనతో చూసే దృష్టికి పునాదులు వేసింది మాత్రం ఆధునిక యుగమే. సమాజంలో సంస్కరణ ప్రాధాన్యతను గుర్తించి ఉద్యమించిన సంస్కర్తల కృషికి పునాదులేర్పరచింది ఆధునిక యుగంలోనే. ఈ ఆధునికంలో కవి ప్రకృతి పట్ల మరింత శ్రద్ధ కనబర్చాలనే సందేశంతో తమదైన దృక్పథంతోనే తెలుగు సాహిత్యావరణంలో ప్రభంజనం సృష్టించారు గుంటూరు శేషేంద్ర శర్మ గారు. ప్రాచీన, ఆధునికాల వారధియై కొత్తమార్గం ఏర్పరచుకుని తానేమిటో నిరూపించుకున్నారు. రామాయణ షోడసి రాసినా, ''నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నులో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది'' అని భావకవిత్వ గుబాళింపులు కృష్ణశాస్త్రి గారికి ధీటుగా అందించారు.
నిజానికి శేషేంద్ర గారు హృదయవాది. అభ్యుదయాన్ని ప్రజలపరంగా కాంక్షించిన చైతన్యవాది. వర్తమానంలో కళ్ళముందు జరుగుతున్న ప్రతి అసంఘటిత చర్యను నిరసించారు. కవిత్వంలో స్పందించారు. దేశం కోసం భయపడమన్నారు, కనుల ముందు జరిగే నాశాన్ని 'వేడి వేడి చేతనతో' ఎదుర్కోవాలని కవులను ఉత్తేజపర్చారు.
'కవిసేన మేనిఫెస్టో'లో కవిని సత్యాగ్రహిగా అభిర్ణిస్తూ, కవిసేన అవసరాన్ని సమాజపరంగా తెలియజేశారు. అలాగే కవి క్రాంతిదర్శి అని, కవి స్థానం కాలక్షేపానికి గాక, కాల ఆక్షేపానికి నడుం కట్టాలని ప్రబోధించారు. యువత ఉద్యమించి కుళ్ళి దుర్గంధం వెదజల్లుతున్న పాతను నొక్కేయాలి. అభ్యుదయం అంటే స్వేచ్ఛ. అది పాదాల నలిగే పువ్వు కారాదు. వృక్షాగ్రాల నిలిచి దివాకరుని రశ్మితో ప్రకాశనం కావాలని అదే అభ్యుదయం అని ఉద్ఘాటించారు.
కవి అంతర్గతాన్వేషణ 'ఆత్మ అగ్నికోసం' అని ఘంటాపథంగా తెలియజేశారు. నీతి, ధైర్యం పెంచుకోవల్సిందని యువతకు సందేశమిచ్చారు. నిజంగా ఈ కవిసేన మేనిఫెస్టోలో శేషేంద్ర గారు దశావస్థలను ఆవిష్కరించారు. ఈ పది దేనికది ప్రత్యేకత కలిగి ఆలోచనకు, ఆచరణకు యువతను దగ్గరయ్యేలా చేశారు. 'కొంత మంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన నిర్మాతలు' అన్న శ్రీశ్రీ భావజాలానికి రూపం ఈ కవిసేన మేనిఫెస్టో.
మనిషి పనిముట్లు చేయడం కన్నా, ఆయుధాలు చేసే మనిషిగా మారాలి అంటే జీవితం చేతిలో ఓడిపోకుండా, జీవితం కంటే బలవంతుడు కావాలి. క్రియా యుగానికి స్వాగతం చెప్పాలి అంటారు. ఇది నిజంగా శేషేంద్ర శర్మ గారి మానసిక ధృడత్వం కాదు. క్రియాధృడత్వం అన్నది నిజం. శేషేంద్ర గారు కవిదేశానికి అసలు నాయకుడని స్థిరపర్చారు. విశాల మానవతకు కవిబాధ్యుడు అంటారు. మరొకచోట కవిత్వం కవి ఆత్మకళ అంటారు. అంతేగాక ఆ ఆత్మకళాసిద్ధి దశలో కవి ఒక అసాధారణ విశిష్టస్థితిలో ఉంటాడు అంటారు. ఆలోచన, ఆత్మకళ లేకుండా రాసే కవుల కవిత్వ సిద్ధాంతాల్ని అగ్నిహౌత్రంలో పారేయమన్నారు. ప్రాచీన కవిత్వం శోకంలో నుంచి వచ్చిందనీ, ఆధునిక కవిత్వం క్రోధంలోంచి వస్తుంది. అంటారు. ఆ భవాన ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారు అన్నట్లు ధర్మాగ్రహం అనవచ్చు. చివరిగా ఈ కవిసేన మేనిఫెస్టో రాజకీయ పార్టీల మేనిఫెస్టోలా ఘడియ ఘడియకు మారేది కాదు. అది శాశ్వతం, సార్వజనీనం, సార్వకాలీనం. ఎందుకంటే కవిసేన మేనిఫెస్టో మార్పు కోరుకునేదే తప్ప, తనకు తాను మారేది కాదు. అదే శేషేంద్ర శర్మ గారి ఈ గ్రంథం ఆంతర్యం. 'కవిగొంతు ఒక శాశ్వత నైతిక శంఖారావం'. గుంటూరు శేషేంద్ర శర్మ గారి 'కవిసేన మేనిఫెస్టో' ఒక ఆశయం, ఒక నియమం, ఒక నిర్భయత్వం, ఒక ఆచరణ, ఒక విశ్వసమాజం, ఒక శాశ్వత తత్త్వం.
(అక్టోబర్ 20 జయంతి సందర్భంగా)
- డా||కె. రత్నశ్రీ