Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ సంపదలో 77శాతం సంపద కేవలం 10శాతం మంది దగ్గర పోగు పడిందని... 2017వ సంవత్సరంలో ఉత్పత్తి అయిన సంపదలో 73శాతం ఒకే ఒక్క శాతం అత్యంత ధనవంతుల దగ్గరే ఉన్నదని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ తెలిపింది. దేశంలో 119 మంది డాలర్ బిలియనీర్లు ఉన్నారని, 2000 సంవత్సరంలో 9 మందిగా ఉన్న డాలర్ బిలియనీర్ల సంఖ్య 2017 నాటికి 101కి పెరగ్గా, 2018-2022 మధ్య ప్రతిరోజూ 70మంది కొత్త మిలియనీర్లు పుట్టుకొస్తారని కూడా ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది. ఒకపక్క డాలర్ బిలియనీర్ల సంపద గత దశాబ్దకాలంలో దాదాపు పది రెట్లు పెరగగా, వారి సంపద 2018-19 కాలానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ కన్నా ఎక్కువనీ, 67 కోట్ల ప్రజానీకం సంపద పెరుగుదల అత్యంత నామమాత్రంగా ఒక శాతంగా నమోదయిందనీ తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతంలో కష్టం చేసుకొనే రోజువారీ వేతన కార్మికునికి, అత్యధిక వేతనంతో ఒక పెద్ద దుస్తుల కంపెనీలో పనిచేసే టాప్ ఎగ్జిక్యూటివ్ సంపాదించే వేతనాన్ని సాధించాలంటే 941సంవత్సరాలు పడుతుందనీ అంచనా. ఇటీవలే విడుదలైన 'హరూన్' నివేదిక ప్రకారం కూడా ఆదాయ-సంపద అసమానతలు అత్యంత తీవ్రంగా ఉన్నాయనీ 148అత్యంత సంపన్నుల దగ్గర కోటి కోట్ల రూపాయలు చేరుకున్నాయనీ తేలింది. ఇంత తీవ్రమైన వ్యత్యాసాలున్న దేశంలో పేదలు తమ ఆరోగ్య అవసరాల కోసం విపరీతమైన ఖర్చు చేయాల్సి వస్తోంది. దాంతో అది వారికి అత్యంత భారంగా పరణమిస్తోంది. ఏటా 6.3 కోట్ల మంది కటిక దారిద్య్రంలోకి నెట్టివేయబడుతున్నారు. అంటే ప్రతి సెకనుకూ ఇద్దరు పేదరికంలోకి కూరుకుపోతు న్నారు-అని కూడా ఆక్స్ఫామ్ రిపోర్టు తెలిపింది.
అందుకే దేశంలోని 98 అత్యంత సంపన్న కుటుంబాలపై కేవలం నాలుగు శాతం సంపద పన్ను విధించడం ద్వారా సమకూరే ఆదాయంతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు అవసరమయ్యే నిధులను రెండు సంవత్సరాలకు పైగా అందించవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 17సంవత్సరాలపాటు కొనసాగించవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదువుకి ఉద్దేశించిన సమగ్ర శిక్షా అభియాన్ పథకాన్ని 6సంవత్సరాల పాటు నిర్వహించవచ్చు. అలాగే 98 డాలర్ బిలియనీర్ల కుటుంబాలపై కేవలం ఒక శాతం సంపద పన్ను విధిస్తే వచ్చే ఆదాయంతో దేశ ప్రజల ఆరోగ్య రక్షణకై ఉద్దేశించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 6సంవత్సరాల పాటు కొనసాగించవచ్చని కూడా తెలుస్తోంది. ఈ ఒక్క శాతం సంపద పన్నుతో సమకూరే ఆదాయంతో 50,000 కోట్ల రూపాయల విలువైన సంపూర్ణ టీకా కార్యక్రమాన్ని ఇట్టే చేపట్టవచ్చు. అంటే ఈ దేశ సామాన్య ప్రజల ఆరోగ్యం భాగ్యవంతుల చేతుల్లో ఉందన్నమాట! 'ఇనీక్వాలిటీ కిల్స్' అనే ఈ సంవత్సర నివేదికలో భారత దేశంలో ఆదాయ-సంపద అసమానతలు ఏ విధంగా ఉన్నాయో కళ్ళకు కట్టినట్లు వివరించడంతోబాటు కొన్ని పరిష్కార మార్గాలను కూడా ఆక్స్ఫామ్ సూచించింది. వరుసగా వస్తున్న ప్రభుత్వాలు ఆరోగ్య రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్న విషయం తెలియనిది కాదు. వైద్య రంగానికి బడ్జెట్లో చేసే అరకొర కేటాయింపులు, పెట్టే నామమాత్రపు ఖర్చే వారి నిర్లక్ష్యానికి తార్కాణం. ఫలితంగా సామాన్యుడు, మధ్యతరగతి ప్రజానీకం తమ వైద్య అవసరాలకు ప్రయివేటు రంగంపై ఆధారపడి తమ ఒళ్లు, ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. ఒక దళిత మహిళ సగటు జీవితకాలం ఇతర అగ్ర వర్ణ మహిళ కన్నా 15 సంవత్సరాలు తక్కువగాను, ఒక గిరిజన మహిళది 4 సంవత్సరాలు తక్కువగాను ఉన్నది. ఒక ముస్లిం యొక్క సగటు జీవిత కాలం ఒక సంవత్సరం తక్కువగాను, దళితుడిది 3 సంవత్సరాలు తక్కువగాను ఉన్నదని 2021లో విడుదలైన ఒక రిపోర్టు తెలియచేసింది. తీవ్రస్థాయి ఆర్థిక వ్యత్యాసాలే దీనికి కారణమని కూడా నివేదిక ద్వారా తెలుస్తోంది. అంటే ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారికి, మధ్యతరగతి ప్రజానీకానికి రక్షిత మంచినీరు, పారిశుధ్య సౌకర్యాలు, పౌష్టికాహారం, మంచి వైద్య ఆరోగ్య సౌకర్యాలు ప్రభుత్వం కల్పించట్లేదు. ఆయా తరగతుల ప్రజలు తమ ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉండడం వల్ల వాటిని కొనుక్కోలేకపోతున్నారు. అలా జబ్బుల బారిన పడటంతో వారి జీవితకాలం కూడా కుంచించుకు పోతోందని అర్థం అవుతోంది.
ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ)-2021వ సంవత్సరంలో విడుదల చేసిన 'ఆహారభద్రత-పౌష్టికాహారం' నివేదిక ప్రకారం మన దేశంలో 20కోట్ల మంది ప్రజానీకం పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారు. ప్రపంచంలో ఈ విధంగా బాధపడుతున్న వారిలో ఇది 25శాతానికి సమానమని పేర్కొంది. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందీ కఠోర వాస్తవం. ఇక దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో వైద్య సౌకర్యాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆరోగ్య కేంద్రాలు 2019వ సంవత్సరం నాటికి ఉండాల్సిన వాటి కంటే 23శాతం తక్కువగా ఉన్నాయి. 43,736 సబ్ సెంటర్లు లేవు. 8764 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. 2865 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు లేవు. తమ ఖర్చుతో ప్రజానీకానికి మెరుగైన వైద్య ఆరోగ్య సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం అందుకు ఏమాత్రం ప్రయత్నించడంలేదు. దాంతో ఆరోగ్య అవసరాల కోసం ప్రజానీకం తమ జేబుల్లోంచి 60శాతానికి పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దాంతో చాలా మంది అప్పుల్లోకి కూరుకుపోవడమో, కొన్ని సందర్భాల్లో తమ ఆస్తుల్ని అమ్మేసుకోవడమో చేస్తున్నారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి తన స్థూల జాతీయ ఆదాయంలో (జీడీపీ) రెండున్నర, మూడుశాతం ఖర్చు చేసేట్లయితే... ప్రజలు ఆరోగ్యానికి తమ జేబుల్లోంచి చేస్తున్న ఖర్చును 60శాతం నుండి 30శాతానికి తగ్గించవచ్చని 2020-21 ఆర్థిక సర్వే తెలియజేసింది. ఆరోగ్య రంగానికి కేంద్ర బడ్జెట్లో చేసే కేటాయింపులు ఎప్పుడూ ఒకటిన్నర శాతానికి అటు ఇటుగా ఉంటున్నాయి. ఒకపక్క తన దేశ పౌరుల ఆరోగ్య స్థాయి సూచికలు అత్యంత దయనీయంగా ఉండగా ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థ చాలా బలహీనంగా ఉన్న తరుణంలో ప్రయివేటురంగం మాత్రం విదేశీ రోగులను ఆకర్షిస్తూ 'హెల్త్ టూరిజం', 'మెడికల్ టూరిజం' పేరిట తమ లాభాల వేటను కొనసాగించడానికి ప్రభుత్వాలు తగినంత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. వైద్య ఆరోగ్య వ్యవస్థల మౌలిక వసతులు పటిష్టంగా ఉన్నట్లయితే కరోనా లాంటి మహమ్మారిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే ఆవకాశముంటుందనీ, ఆక్సిజన్ కొరతతో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు, వైద్యులు-సిబ్బంది కొరత, వ్యాధి నిర్థారణ పరికరాలు-పరీక్షల కొరత వలన మహమ్మారిని సరిగా ఎదుర్కోలేకపోయామని పలువురు పేర్కొంటున్నారు. మహా భాగ్యవంతులకే ఆరోగ్యమన్న విషయం కరోనా మహమ్మారి సమయంలో మరోసారి రుజువయింది కదా! మధ్యతరగతి, ప్రతి నెలా జీతాలు తీసుకొనే వారికి కోవిడ్ వ్యాక్సిన్ సులభంగా అందుతున్నదనీ వారు ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లగలరనీ అదే ఒక సగటు కార్మికునికి వ్యాక్సిన్ అందటం కష్టమనీ 80శాతం ప్రజలు నమ్ముతున్నారని ఆక్స్ఫామ్ ఇండియా చేసిన మరో సర్వే తెలియజేసింది.
కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మధ్యతరగతి ప్రజానీకం రోజుకి 4 లక్షల రూపాయల వరకు ప్రయివేట్ హాస్పిటళ్లలో వైద్యం కోసం ఖర్చు చేసినట్లు కూడా ఆక్స్ఫామ్ ఇండియా చేసిన రాపిడ్ సర్వేలో తేలడం కొసమెరుపు. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ఆరోగ్యం అందాలంటే, ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు పెంచాలనీ, ప్రాథమిక ఆరోగ్య సేవల పట్ల దృష్టి పెట్టాలనీ, మందుల ధరలను సామాన్యునికి అందుబాటులో ఉంచాలనీ, అత్యవసర ప్రాణరక్షక మందులపై జీఎస్టీని తొలగించాలనీ ఈ రంగంలో పని చేసే పలువురు సూచిస్తున్నారు.
- పి. దక్షిణామూర్తి