Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో అతి పెద్దదేశం చైనా. అతి పెద్ద రాజకీయ సంస్థ చైనా కమ్యూనిస్టు పార్టీ. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్టీ సభల్లో భాగంగా 20వ మహాసభ ఈ అక్టోబరు 16-22 తేదీలలో జరుగుతున్నది. తొమ్మిది కోట్ల 67లక్షల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ మిలిటరీతో సహా వివిధ విభాగాలు, తిరుగుబాటు ప్రాంతంగా ఉన్న తైవాన్ నుంచి కూడా మొత్తం 2,296మంది ఈ మహాసభల్లో పాల్గొంటున్నారు. తదుపరి మహాసభ 2027లో జరగనుంది. సహజంగానే చైనా అధికార పార్టీ మహాసభ తీసుకొనే నిర్ణయాలు, చేసే దశ, దిశ నిర్దేశాల గురించి ప్రపంచం ఆసక్తితో ఎదురు చూస్తుంది. కొంత మంది ఆ ఏముంది, నేతలు ఏమి చెబితే ప్రతినిధులు దానికి తలూపటం తప్ప భిన్నాభిప్రాయాలను వెల్లడి కానివ్వరుగా అని పెదవి విరుస్తారు. వీరిలో కమ్యూనిస్టు పార్టీల పని పద్ధతుల గురించి తెలియని వారు కొందరైతే, తెలిసీ బురద చల్లేవారు మరి కొందరు. మన దేశంలో సీపీఐ(ఎం) మహాసభలు మూడు సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు. గతం, వర్తమాన పరిస్థితులను బేరీజు వేసి వచ్చే మూడు సంవత్సరాల్లో అనుసరించాల్సిన రాజకీయ విధానం గురించి పాత కేంద్ర కమిటీ కొత్త మహాసభకు ఒక ముసాయిదా తీర్మానాన్ని రూపొందించి దిగువన ఉన్న ప్రాధమికశాఖ నుంచి రాష్ట్ర కమిటీల వరకు చర్చకు పంపుతారు, సవరణలు, వివరణలను ఆహ్వానిస్తారు. అంతిమంగా ఖరారు చేసిన దానిని ప్రతినిధుల మహాసభ ఆమోదానికి పెడతారు. అక్కడే దాన్ని ఖరారు చేస్తారు. చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ దాని నిబంధనావళి ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అధికారంలో ఉంది గనుక రాజకీయ విధానంతో బాటు దేశ అభివృద్ధికి అనుసరించాల్సిన మార్గం గురించి కూడా చర్చిస్తుంది.
కొంత మంది ఆశిస్తున్నట్లు లేదా కోరుకుంటున్నట్లుగా అనేక పార్టీల మాదిరి భిన్నాభిప్రాయాలను కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు వీధుల్లోకి తీసుకురారు. పార్టీ వేదికల మీదే కుస్తీపడతారు. మెజారిటీ అంగీకరించిన విధానాన్ని మిగతావారు కూడా అనుసరిస్తారు. నేను పార్టీలోనే దీన్ని గురించి నిరసన తెలిపాను, కనుక అంగీకరించను, అమలు జరపను అని వెలుపల చెప్పటం క్రమశిక్షణా రాహిత్యం, కేంద్రీకృత ప్రజాస్వామిక విధానానికి విరుద్దం. ఎవరైనా అలాంటి వాటికి పాల్పడితే పార్టీ నుంచి బహిష్కరణతో సహా తగిన చర్యలుంటాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ చేసే నిర్ణయాలు, విశ్లేషణలు, ప్రపంచ స్పందనల గురించి ఒక వ్యాసంలో వివరించటం కష్టం. ఇంకా పూర్తిగా వివరాలు వెల్లడి కూడా కాలేదు. ప్రారంభ సభలో పార్టీ అధినేత షీ జింపింగ్ చేసిన ప్రసంగంలో తైవాన్ గురించి చేసిన ప్రస్తావన గురించి చూద్దాం.
ఈ మహాసభ పూర్వరంగంలోనే చైనాను రెచ్చగొట్టేందుకు వేసిన ఎత్తుగడ, చేసిన కుట్రలో భాగంగా అమెరికా అధికార వ్యవస్థలో మూడవ స్థానంలో ఉండే ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్) స్పీకర్ నాన్సీ పెలోసీని అడ్డదారిలో తైవాన్ పంపారు, అక్కడి వేర్పాటు వాదులకు మద్దతు తెలిపి గతంలో తాను అంగీకరించిన ఒకే చైనా అన్న విధానానికి తూట్లు పొడిచారు. ఈ వైఖరి ఐరాస, భద్రతా మండలి నిర్ణయాలకు సైతం వ్యతిరేకమే. అది వేరుగా ఉన్నందున శాంతియుత పద్ధతుల్లో విలీనం జరగాలన్నది వాటి తీర్మానాల సారాంశం. దానికి భిన్నంగా తైవాన్‌లో కొంత మంది చైనా వ్యతిరేక దేశాల తెరచాటు మద్దతుతో తమది స్వతంత్ర దేశమని చెబుతున్నారు. ఒక వైపు విలీనం జరగాలని చెబుతూనే అమెరికా వంటి దేశాలు తైవాన్ వేర్పాటు వాదులకు అవసరమైన ఆయుధాలను అందిస్తూ తిరుగుబాటుకు పురికొల్పుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే షీ జింపింగ్ తైవాన్ వేర్పాటు వాదులు, వారికి మద్దతు ఇస్తున్న దేశాలకు ఈ మహాసభలో తమ వైఖరి గురించి మరోసారి పునరుద్ఘాటించారు. తైవాన్ విలీనానికి శాంతియుత పద్ధతులు విఫలమైతే అవసరమైతే బలప్రయోగం తప్పదన్న తమ ప్రకటన, వైఖరిని వెనక్కు తీసుకొనే ప్రసక్తే లేదని జింపింగ్ చెప్పారు. ''తైవాన్ సమస్య పరిష్కారం చైనీయులకు సంబంధించింది. దాన్ని పరిష్కరించు కోవాల్సింది చైనీయులే. పూర్తి చిత్తశుద్ది, చివరి క్షణం వరకు శాంతియుత పద్ధతుల్లో విలీన యత్నాలను కొనసాగిస్తాం. బలప్రయోగం చేయబోము అని మేము వాగ్దానం చేసే ప్రసక్తే లేదు. అన్ని రకాల చర్యలు తీసుకొనే అవకాశాలను అట్టి పెట్టు కుంటాం. వెలుపలి శక్తుల జోక్యం, తైవాన్ స్వాతంత్య్రం కోరుతున్న కొంత మంది, వారి వేర్పాటు వాద కార్యకలాపాలే ఈ వైపుగా మమ్మల్ని నడిపిస్తున్నాయి. దీని అర్థం ఏ విధంగానూ మా తైవాన్ సోదరులను లక్ష్యంగా చేసుకోవటం కాదు'' అన్నారు.
ఈ మహాసభకు తైవాన్ ప్రాంతం నుంచి పది మంది ప్రతినిధులు వచ్చారు. వారు పార్టీ వైఖరిని సమర్థిస్తూ ఒక చైనా, రెండు వ్యవస్థలనే విధానం (బ్రిటిష్ వారి 99సంవత్సరాల కౌలు గడువు తీరిన హంకాంగ్, అదే విధంగా పోర్చుగీసు వారి కౌలు గడువు తీరిన మకావో దీవులను చైనాలో విలీనం చేశారు. ఆ సందర్భంగా అక్కడి వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను 50సంవత్సరాల పాటు ఉన్నవి ఉన్నట్లుగా కొనసాగిస్తామని, పౌరపాలనకు ప్రత్యేక పాలనా మండళ్లను ఏర్పాటు చేస్తామని చైనా ఒప్పందం చేసుకుంది. అంటే ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్థ-విలీన ప్రాంతాల్లో పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించటం. ఇదే విధానాన్ని తైవాన్ ప్రాంతానికి కూడా వర్తింప చేస్తామని చైనా చెబుతోంది. హాంకాంగ్, మకావో విలీనాలు జరిగి పాతికేండ్లు అవుతోంది. ఈ ప్రాంతాలకు చైనా భద్రతా చట్టాలు వర్తిస్తాయి, వాటితోనే అక్కడి వేర్పాటు వాదులను అదుపులోకి తెచ్చారు.) శాంతియుత విలీనం అన్న విధానానికి అనుగుణంగా, విలీనం కోసం పార్టీ చేస్తున్న యత్నాలకు రుజువుగా నివేదిక ఉందని పేర్కొనటం పట్ల సభ ప్రతినిధులందరూ హర్షాతిరేకాలు వెల్లడించారు. బ్రిటిష్ వారి పాలనలో ఎన్నడూ స్వాతంత్య్రం, ఎన్నికల గురించి మాట్లాడని కొన్ని శక్తులు చైనాలో విలీనం తరువాత తొలిసారిగా జరిపిన ఎన్నికలను తప్పు పట్టటం, విద్యార్థులను రెచ్చగొట్టి స్వాతంత్య్రం పేరుతో శాంతి భద్రతల సమస్యల సృష్టికి కుట్రలు పన్నడం గురించి తెలిసిందే. తైవాన్‌లో అక్కడి ప్రభుత్వం ఏకంగా మిలిటరీ, ఆయుధాలను సేకరిస్తున్నది. ఈ కారణంగానే అవసరమైతే చివరి అస్త్రంగా బలప్రయోగం తప్పదని చైనా చెబుతోంది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి ఆయుధాలను మోహరించి రష్యాకు పక్కలో బల్లెంలా మారేందుకు అమెరికా, నాటో కూటమి పూనుకుంది. అదే మాదిరి టిబెట్, తైవాన్లను స్వతంత్ర దేశాలుగా చేసి అక్కడ పాగా వేసి చైనా, భారత్‌లకు తల మీద కుంపటి పెట్టాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకే అక్కడ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నది. దలైలామా తిరుగుబాటు, మన దేశంలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటు కూడా దానిలో భాగమే. 1949లో కమ్యూనిస్టులు చైనాలో అధికారానికి వచ్చినపుడు పాలకుడిగా ఉన్న చాంగ్‌కై షేక్ మిగిలిన మిలిటరీ, ఆయుధాలను తీసుకొని తైవాన్ దీవికి పారిపోయి అక్కడ తిష్టవేశాడు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు పరోక్షంగా మద్దతు ఇచ్చాయి. అప్పటికే ఉన్న ఐరాస భద్రతా మండలిలో శాశ్వత దేశంగా ఉన్న చైనా ప్రభుత్వం తన ఆధీనంలోనే కొనసాగుతున్నదంటూ ఐరాసలో చాంగ్‌కై షేక్ నియమించిన వారినే ఐరాస గుర్తించింది. ఉన్నది ఒకే చైనా అని పేర్కొన్నారు. ఇది 1970 దశకం వరకు కొనసాగింది. విధిలేని పరిస్థితిలో అసలైన చైనా అంటే ప్రధాన భూభాగంలో ఉన్న కమ్యూనిస్టులదే ప్రభుత్వమని గుర్తించిన తరువాత తైవాన్ గుర్తింపు రద్దు చేసి, దాన్ని కూడా చైనాలో అంతర్భాగంగానే పరిగణించారు. అందువలన సాంకేతికంగా దాని స్వాతంత్య్ర ప్రకటనను అమెరికాతో సహా శాశ్వత సభ్యదేశాలేవీ సమర్థించే అవకాశం లేదు. కానీ దొడ్డిదారిన ఏదో ఒకసాకుతో విలీనాన్ని అడ్డుకుంటున్నాయి. 1950 దశకంలో ఒకసారి విలీనానికి చైనా ప్రయత్నించి నప్పుడు అణుబాంబులు వేస్తామని అమెరికా బెదిరించింది. దాంతో అప్పటికే హిరోషిమా- నాగసాకీలపై అవసరం లేకున్నా బాంబులు వేసిన దాని దుర్మార్గాన్ని చూసిన తరువాత అలాంటి పరిస్థితిని చైనా పౌరులకు కలిగించకూడదనే జవాబుదారీతన వైఖరితో పాటు తరువాత చూసుకుందాం లెమ్మని చైనా తన ఇతర ప్రాధాన్యతలపై కేంద్రీకరించింది. అంతే తప్ప తైవాన్‌పై తన హక్కును ఎన్నడూ వదులు కోలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా పునరుద్ఘాటిస్తూనే ఉంది.
పార్టీ మహాసభ ప్రారంభంలో షీ జింపింగ్ తైవాన్ గురించి చెప్పిన మాటలు, చేసిన హెచ్చరిక అమెరికాకే అని అనేక మంది విశ్లేషించారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. తన ఉపన్యాసంలో విలీన ప్రక్రియలో భాగంగా చైనాకు చెందిన తైవాన్ జలసంధి సంబంధ సంస్థ, తైవాన్‌లోని జలసంధి ఎక్సేంజ్ ఫౌండేషన్, బ్రిటిష్ పాలనలోని హాంకాంగ్ ప్రతినిధులతో చైనా జరిపిన సంప్రదింపుల్లో కుదిరిన అవగాహన 1992 ఏకాభిప్రాయానికి తాము కట్టుబడి ఉన్నామని కూడా షీ చెప్పారు. అయితే ప్రస్తుతం తైవాన్ అధికారంలో ఉన్న వేర్పాటు వాదులు దాన్ని తిరస్కరిస్తున్నారు. తైవాన్‌లో అప్పుడున్న జాతీయ ఐక్యతా మండలి ఇప్పుడు లేదు. నాటి ఏకాభిప్రాయం ప్రకారం చైనా అంటే ఒకటే గానీ అసలు చైనా అంటే ఏమిటి అన్నదానిపై విబేధం ఉందని తప్పుడు భాష్యం చెబుతున్నారు. విలీనం తరువాత ప్రత్యేక పాలిత ప్రాంతంగా తైవాన్ ఉంటుందని చైనా చెబుతుండగా, 1911 నాటిదే అసలైన చైనా అని దానిలో తైవాన్, ఇతర ప్రాంతాలతో పాటు ప్రధాన భూభాగం కూడా ఒక ప్రాంతమే అని తైవాన్ వేర్పాటువాదులు అన్నారు. దివంగత తైవాన్ నేత లీ టుంగ్ హుయి అసలు 1992 ఏకాభిప్రాయం లేదని, ఒకే చైనాలో రెండు దేశాలు అనే ప్రతిపాదనను ముందుకు తేగా చైనా తిరస్కరించింది. ఇప్పుడు ఏకంగా తమది స్వతంత్ర దేశమని అక్కడి పాల కులు అంటున్నారు. అమెరికా ఆడిస్తున్న నాటకంలో భాగంగా ఒకసారి చెప్పినదాన్ని మరోసారి చెప్పటం లేదు. మొత్తం షీ జింపింగ్ మాటల సారం గురించి చెప్పాలంటే స్వాతంత్య్రం అంటున్న తైవాన్ వేర్పాటు వాదులు, వారికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర చైనా వ్యతిరేకుల ఆటలు సాగనివ్వబోమన్నదే హెచ్చరిక!
- ఎం. కోటేశ్వరరావు
సెల్:8331013288