Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాజాగా ప్రకటించిన 2022 ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం మరింత దిగజారింది. గతేడాది 116 దేశాలకు గాను 101వదిగా ఉంటే ఇప్పుడు 121లో 107వ స్థానం. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆకలి సూచికలో మనకు దక్కుతున్న స్థానం గురించి ప్రతి ఏటా కాషాయ దళాలతో పాటు మరి కొందరు తప్పుపడుతున్నారు. అసలు ఆ లెక్కలే తప్పు, లెక్కించిన పద్ధతే తప్పు, పరిగణనలోకి తీసుకున్న అంశాలే సరైనవి కాదు, ప్రభుత్వేతర సంస్థలు(ఎన్జిఓ) చెప్పేవాటిని లెక్కలోకి తీసుకోనవసరం లేదని వాదనలు చేస్తున్నారు. మూడువేల మందిని ప్రశ్నించి దాన్నే దేశమంతటికీ వర్తింప చేయటం ఏమిటి అని ఆశ్చర్యం నటిస్తున్నారు. నిజమే, ఇలాంటి వాదనలను ప్రభుత్వం కూడా చేస్తున్నది, ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నది. ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది, మరో రెండు పరిశీలక దేశాలు, అసలు చేరని దేశాలూ ఉన్నాయి. ఇప్పుడు నివేదిక రూపొందించిన సంస్థలకు సమగ్రంగా తమ సమాచారం ఇచ్చిన దేశాలు 121మాత్రమే. అది స్వచ్చందం తప్ప ఇవ్వకపోతే తలతీసేదేమీ ఉండదు. అమెరికా, ఐరోపా దేశాల్లో సమాచారం ఇవ్వకపోతే మీడియాలో విమర్శించే స్వేచ్ఛను అక్కడి జర్నలిస్టులు వినియోగించుకుంటున్నారు. మన దగ్గర ఇంకా అలాంటి అవకాశాలు మిణుకుమిణుకు మంటూ కనిపిస్తున్నా అడిగే దమ్మున్న జర్నలిస్టులు లేరు, అడిగేవారున్నా ఇంతవరకు మనది అపర ప్రజాస్వామిక దేశం గనుక మన నరేంద్రమోడీ ఎవరికీ ప్రశ్నించే అవకాశమే ఇవ్వలేదు. అందువలన మనం కూడా అసలు అధికారిక సమాచారం ఇవ్వటం మానేస్తే సూచికల ప్రసక్తి ఉండదు, వాటి మీద విమర్శలు, ఉక్రోషాలు, ఉడుక్కోవటాలు, కుట్ర సిద్ధాంతాల ప్రచారం వంటివీ ఉండవు. మరి ప్రభుత్వం ఆపని ఎందుకు చేయదు? లేదా ప్రభుత్వమే ఒక సంస్థను ఏర్పాటు చేసి వివిధ దేశాల నుంచి సమాచారాన్ని సేకరించి సరైన విశ్లేషణలు అందించవచ్చు, సూచికలు ప్రకటించవచ్చు. దేశానికి మచ్చతెచ్చే వారికి బుద్ది చెప్పవచ్చు. ఈ రోజు ప్రపంచంలో ఉన్న పరిస్థితిలో నరేంద్రమోడీ అడిగితే సమాచారం ఇవ్వని దేశం ఉంటుందా? నిధుల కొరత లేదే, ఎందుకు చేయరు? కావాలంటే అప్పులు తీసుకురావచ్చు. 55.87లక్షల కోట్ల (జీడీపీలో 52.16శాతం) అప్పు లతో దేశాన్ని నరేంద్రమోడికి అప్పగించారు. దాన్ని 2023 మార్చి నాటికి రూ.152.19లక్షల కోట్లకు పెంచుతామని ప్రభుత్వమే అంచనా వేసింది, కనుక మరో లక్ష కోట్లు అప్పుచేసి సరైన సూచికలు వెల్లడిస్త్తే మన ప్రతిభ లోకానికి తెలుస్తుంది. అప్పు తీర్చేది జనమే, ఎవరి జేబుల్లోంచి పెట్టటం లేదు కదా!
ఇక ఐరాస సంస్థలకు సమాచారం ఇవ్వకపోతే మచ్చపడుతుంది. అక్కడ మనం సుభాషితాలు మాట్లాడే అవకాశం ఉండదు. అవి టీవీ చర్చలు కాదు గనుక వాటిలో మాదిరి మాట్లాడితే మర్యాద దక్కదు. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి అప్పులు తెచ్చుకోవాలి, కాబట్టి వాటికి సమాచారం ఇవ్వకపోతే తిప్పలు తెచ్చుకున్నట్లే. మన దేశం తప్ప ఈ నివేదికను ఆమోదించటం లేదని గానీ, తప్పుడు పద్ధతుల్లో రూపొందించారని గానీ ఎన్నిదేశాలు స్పందించిందీ సమాచారం లేదు, ఎవరైనా అలాంటి వివరాలు అందచేస్తే ఈ విశ్లేషణలో వాటిని చేర్చవచ్చు. అయినా ఒక్క ఆకలి సూచికనే కాదు, అనేక సూచికలను ఎప్పుడైనా మోడీ సర్కార్ లేదా దాని మద్దతుదార్లు అంగీకరించారా? లేదు, ఎందుకంటే అన్నింటా అధమస్థానాలే.
ఆకలి సూచికలను రూపొందించేందుకు ప్రాతిపదికగా తీసుకున్న నాలిగింటిలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, వాటిని మొత్తం జనాభాకు ఎలా వర్తింపచేస్తారు అన్నది కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల్లో ఒకటి. ఆ ప్రాతిపదికను మన దేశానికి మాత్రమే వర్తింపచేస్తే తప్పే, అన్ని దేశాలకూ ఒకటే పద్ధతిని అనుసరించారు కదా! పోషకాహార లేమికి గాను కేవలం మూడువేల మందితో జరిపిన సర్వేను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారు అన్నది మరొక అభ్యంతరం. ఇది కూడా అన్ని దేశాలకూ ఒకటే పద్ధతి. ఏ సర్వేకైనా జనాభాలో ఎంత మందిని తీసుకుంటే సరైన వాస్తవాలు వెల్లడౌతాయో ఎవరైనా చెప్పగలరా? మన ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలు ఎంతమంది మీద జరుపుతున్నారో చెప్పి ప్రభుత్వం ఒప్పించగలదా? ఒక పద్ధతి ప్రకారం మన దేశం గురించి తప్పుగా చూపేందుకు ప్రతి ఏటా తప్పుడు సమాచారమిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అదే నిజమైతే ఆర్ఎస్ఎస్ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్ డిమాండ్ చేసినట్లు సదరు సూచికలు ఇచ్చే సంస్థలను అంతర్జాతీయ కోర్టుకు లాగి బోనులో నిలబెట్టి వాస్తవాలేమిటో వెల్లడించాలి. ఒట్టి అరుపులెందుకు? నివేదికను రూపొందించిన సంస్థలు తాముగా ఎలాంటి సర్వేలు జరపలేదు. ప్రభుత్వం చెబుతున్న మూడువేల మందిపై సర్వే జరిపింది ఐరాస సంస్థలలో ఒకటైన ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ). అది కూడా వేరే సంస్థ ద్వారా చేయించింది. దాని సమాచారాన్నే నివేదికను రూపొందించిన జర్మనీకి చెందిన ''వెల్ట్ హంగర్ హిల్‌ఫీ'' ఐర్లండ్‌లోని ''కన్సరన్ వరల్డ్‌వైడ్'' తీసుకున్నాయి, అనేక అధికారిక సంస్థల సమాచారాన్ని కూడా అవి తీసుకున్నాయి.
తాజా ఆకలి సూచిక విశ్లేషణకు 2017 నుంచి 2021వరకు ఉన్న ఐదేండ్ల సమాచారాన్ని విశ్లేషించారు. వచ్చే ఏడాది 2018 నుంచి 2022 వరకు తీసుకుంటారు. ప్రతి ఏటా ఇలాగే మారుతుంది. 2022 నివేదికలో మన దేశం సాధించిన మార్కులు 29.1 కాగా, ఐదు శాతం లోపు మార్కులతో చైనాతో సహా 17 దేశాలు ఒకటవ స్థానంలో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు అసలు ఈ జాబితాలోనే లేవు. మన దేశం కూడా వాటి సరసన చేరితే అసలు రాంకుల గొడవే ఉండదు కదా!
2014లో పేర్కొన్న 76 దేశాల్లో మనది 55వ రాంకు అన్నది వాస్తవం కాదు అని కొందరు చెబుతున్నారు. మరి ఎంత? ఆ జాబితాలో ఐదు కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న 44 దేశాలను సూచికలో చూపలేదు. వాటిని కలుపుకుంటే మొత్తం దేశాలు 122 మన రాంకు 99 అవుతుంది. తాజా రాంకుల్లో అలాంటి దేశాలన్నింటినీ కలిపితే 121లో మనది 107 పెరిగినట్లా దిగజారినట్లా? తీవ్ర పరిస్థితి తరగతిలోనే మనం ఉన్నాం. మన కంటే మెరుగుదల ఎక్కువ ఉన్న దేశాలు మనల్ని వెనక్కు నెట్టాయి. అత్త తిట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు.. అన్నట్లుగా మనం అధ్వాన్నంగా ఉన్నందుకు కాదు, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మన కంటే మెరుగ్గా ఉండటమే కాషాయ దళాల గగ్గోలుకు అసలు కారణం. అదే వారునుకుంటే తక్కువ ఉంటే చూశారా మన ప్రతిభ అని తమ భుజాలను తామే చరుచుకొనే వారు!