Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యక్తులు, సమాజాలు, ప్రభుత్వాలు ఏవైనా పాఠాలు నేర్చుకోదలిస్తే నేర్చుకోవచ్చు. ఉదాహరణకు క్యూబా నుండి, అక్కడి డాక్టర్ల నుంచి నేర్చుకోవచ్చు. టర్క్స్, కైకోస్ దీవుల్లో గత రెండు సంవత్సరాలుగా కోవిడ్-19పై పోరులో క్యూబా డాక్టర్లు సుమారు 60వేల మందికి వైద్య సేవలందించారు. స్టార్ ఐకాన్స్ - అంతర్జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. అయితే, క్యూబా వైద్య బృందం అధినేత ఆల్ఫ్రెడ్ మోరన్ - తమకు అవార్డు కన్నా ఇలాంటి ప్రత్యేక విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడటమే గొప్ప సంతృప్తి నిస్తుందనీ, ఆ దీవుల్లోని స్థానికులు కురిపిస్తున్న ప్రేమాభిమానాలు మరువలేని వని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నలభై దేశాల్లో క్యూబా వైద్య బృందాలు అందిస్తున్న వైద్య సేవల్లో భాగంగానే తాము టర్క్స్, కైకోస్ దీవుల్లోనూ అందించామని అన్నారు.
అమెరికాలో వైద్య విద్య చదవాలంటే 10కోట్లు ఖర్చు పెట్టాలి. క్యూబాలో ప్రభుత్వమే ఉచితంగా ఆ విద్యను అందిస్తుంది. ప్రజల డబ్బుతో చదువుకున్న క్యూబా డాక్టర్లు, ప్రజలతో మమేకమై వారి కోసమే పనిచేస్తారు. సంతోషం సంపాదించడంలో ఉండదు. సేవను అందించడంలో ఉంటుంది. అమెరికా వైద్యుడి కన్నా క్యూబా డాక్టరుకు జీతం చాలా తక్కువ. అయినా సరే, వారు ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. ఖర్చుపెట్టిన డబ్బు మళ్ళీ సంపాదించాలన్న యావ వారికి ఉండదు. చేగువేరా, ఫైడల్ కాస్ట్రో చూపిన బలమైన ఆరోగ్యవ్యవస్థ క్యూబాలో ఉంది. అది ప్రపంచానికే ఆదర్శం! క్యూబాను శత్రువుగా చూసే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలకు సైతం క్యూబా - తన వైద్య బృందాలను పంపి మానవత్వాన్ని ఎప్పుడూ చాటుకుంటూనే ఉంది. ఆ దేశంలో ప్రతి వెయ్యి మందికి ఎనిమిది మంది డాక్టర్లున్నారు. మరి మన దేశ పరిస్థితి ఏమిటీ? వివరాలు చూద్దాం... క్యూబాలో ప్రతి వెయ్యి మందికి డాక్టర్లు 8.2, ఇటలీలో 4.2, అమెరికాలో 2.6, దక్షిణ కొరియాలో 2.4, చైనాలో 1.8 అయితే, భారతదేశంలో మాత్రం ప్రతి వెయ్యి మందికి ఉన్న డాక్టర్ల సంఖ్య 0.62. ఈ గణాంకాలు చూస్తే వైద్యరంగంలో మన ప్రగతి అర్థమవుతోంది కదా? ఇక నిస్వార్థసేవ గురించి ఏం మాట్లాడతాం?
ఇటీవల కోవిడ్-19 కేసుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విడుదల చేసిన ప్రకటనలో ఇలా ఉంది... ప్రపంచ కరోనా కేసుల్లో ఒక దశలో సగానికి పైగా భారత్‌లోనే నమోదయ్యాయని చెప్పింది. ప్రపంచంలోని ప్రతి నాలుగు కరోనా మరణాల్లో ఒకటి భారత్‌లోనే నమోదవుతోందని చెప్పింది - ప్రపంచ ఆరోగ్య సంస్థ! అంతే కాదు, కట్టడికి భారత ప్రభుత్వం తీవ్రంగా చర్యలు చేపట్టాలని కూడా సూచించింది. ఈ దేశంలో అన్ని రకాల అనర్థాలకు కాలుష్యాలే కారణం. కాలుష్య మంటే వాతావరణ కాలుష్యమే కాదు, మానసిక కాలుష్యం కూడా! మానవత్వంపై గౌరవం లేకపోవడం, మానవుడి హూందాతనాన్ని కాపాడుకుందామన్న కాంక్ష జనంలో లేకపోవడం. ఉదాహరణకు భారతీయ సమాజంలో ఏం జరుగుతుందో చూడండి. ఎనభైవేలు జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి, రోజుకి మూడువందలు అతి కష్టం మీద సంపాదించుకునే రోజు కూలీ దగ్గర లంచం తీసుకుంటాడు. అక్కడ మానవత్వ స్పృహ ఉందా? ఎనభైవేలు జీతం తీసుకునే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎనమిదివేలు అతికష్టం మీద సంపాదించే ప్రయివేటు స్కూలు టీచర్ దగ్గరికి వెళ్ళి ''మా అబ్బాయి ఎలా చదువుతున్నాడూ?'' అని అడుగుతాడు. అక్కడ నైతికతకు సంబంధించిన స్పృహ ఏమైనా ఉందా? పైగా మనువాదులు మెదడులో దట్టించిన విషం ఎంత ప్రమాదకారిగా తయారైందంటే... ఎదుటివాణ్ణి మోసగించి, లేదా ఇరకాటంలో పెట్టి సంపాదించిన డబ్బు - తనకు 'దేవుడు ఇచ్చిందే'ననుకుంటాడు - అట్లని సమాజాన్ని కూడా నమ్మిస్తూ ఉంటాడు.
''నా కులస్థుల అభివృద్ధికి పాటు పడటమే నా ప్రథమ కర్తవ్యం. విశాలమైన సమాజహితం కోసం పని చేయడమనేది ఆ తర్వాతి విషయం'' అని అన్నారు రాజస్థాన్ శిశు సంక్షేమ శాఖామంత్రి మమతా భూపేష్. ఇది నిస్సిగ్గుగా ప్రెస్మీట్లో ప్రకటించిన విషయం! ఇంతటి నీచాతి నీచమైన ఆలోచనలున్న వారు అధికారంలో ఉంటే... ఇక సమాజ స్వరూపం ఎలా ఉంటుంది? మనుషులంతా ఒక్కటి, మానవ జాతి అంతా ఒక మిశ్రమ సంతతి అని వీరు ఎప్పుడూ తెలుసుకుంటారో కదా? అబద్దాలు ప్రచారం చేసే వారికి పలుకుబడి పెరుగుతోంది. వాస్తవాలు మాట్లాడేవారి పరిధి కుంచించుకు పోతూ ఉంది. వారిని దోషులుగా నిలబెట్టి వారి పలుకుబడి తగ్గిస్తున్నారు. ఒక్కోసారి వారి ప్రాణాలు తీయడం కూడా చూస్తున్నాం. హంతకులు అధికారంలో ఉంటే అంతకన్నా ఇంకేం జరుగుతుంది? చరిత్రను వక్రీకరించి అబద్దాలు ప్రచారం చేస్తున్న నేటి బీజేపీ ప్రభుత్వం సావర్కర్‌ను జాతిపతిగా ప్రకటించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇప్పటికే మహాత్మాగాంధీని ఏ ప్రభుత్వమూ జాతిపితగా ప్రకటించలేదని - ప్రచారం ప్రారంభించింది కదా? ''దయా గుణం అనేది ఒక ప్రత్యేకమైన భాష. దాన్ని చెవిటివాళ్ళూ వినగలరు. గుడ్డివాళ్ళూ కనగలరు'' అని అన్నారు రచయిత మార్క్‌ట్విన్! ఇప్పటి ఈ మూర్ఖులకు మార్క్‌ట్విన్ ఎవరో తెలియదు. పైగా, ఆయన చెప్పిన మాటల సారాంశం అర్థం కావాలంటే... వాడు ముందు మనిషై ఉండాలి. వాడిలో ఇంత దయాగుణం కూడా ఉండాలి. బుల్డోజర్ ప్రభుత్వాలు నడిపే సన్యాసులకు ఇవన్నీ ఎప్పుడు అర్థం కావాలీ?
''బుద్ధుడు హింసకు వ్యతిరేకం. అయితే అతను న్యాయానికి అనుకూలంగా ఉండే వ్యక్తి. ఎక్కడ న్యాయం లభించదో, ఎక్కడ అన్యాయం రాజ్యమేలుతుందో అక్కడ న్యాయాన్ని సాధించుకోవడానికి అన్యాయంపై తిరుగుబాటు చేయడానికి బుద్ధుడు అనుమతి ఇచ్చాడు.'' ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే... ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా అన్యాయానికి లొంగిపోయి బతకగూడదు. న్యాయం కోసం పోరాడాల్సిందే! ప్రపంచ వ్యాప్తంగా తన అహింసా సిద్ధాంతంతో విరాజిల్లిన బుద్ధుడే ఆ మాట చెప్పాడని గుర్తుంచుకోవాలి. ఇది డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తన రచనల్లో వెలిబుచ్చిన అంశం. అన్యాయాన్ని తిప్పికొడుతున్న వారు మన సామాన్య ప్రజల్లో కూడా ఎంతో మంది ఉంటారు. అలాంటి వారికి మనం వెన్నుదన్నుగా నిలబడాలి. బిరుబాల రభా అనే వృద్ధ మహిళ అస్సాం - గోల్పర జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో నివసిస్తుంది. ఆ మహిళకు మతి స్థిమితం లేని ఒక కొడుకు ఉన్నాడు. అతని పిచ్చి చూపులూ పిచ్చి చేష్టలు చూసి... అతనొక మంత్రగాడని గ్రామస్థులు అనుమానపడ్డారు. అంతవరకు బాగానే ఉంది... కానీ వారు అతణ్ణి చంపడానికి ప్రయత్నించారు. అంతే, అతని తల్లి వృద్ధ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. కొడుకును రక్షించుకుంది. ఆ సంఘటన తర్వాత కూడా ఆ వృద్ధ మహిళ, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించింది. చేత బడులు, బాణామతి వంటి అర్థ రహితమైన అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా అచంచల విశ్వాసంతో పోరాడింది. క్రమంగా కొందరు ఆమెకు తోడు నిలిచారు. పదిహేను సంవత్సరాలలో ఆమె ఆ ప్రాంతంలో నలభైరెండు మంది ప్రాణాలు కాపాడింది. ఈ విషయం అస్సాం రాష్ట్రం దాటి జాతీయ వార్తల్లో కెక్కింది. ఆమె నిరంతరం సాగించిన పోరాటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేసింది. ఇప్పుడు బిరుబాల రభా-మానవ హక్కుల పోరాట కార్యకర్తగా చాలామందికి తెలుసు. సామాన్యుల్లోనే ఇలా అసామాన్యులుంటారు.
జి.ఓ.2430ని వెంటనే అమలు చేసి మీడియాలో రోజూ అబద్దాలు చెప్పే జ్యోతిష్యుల్ని, వాస్తు చెప్పే వారిని, ప్రవచన కారుల్ని, స్వస్తత గాళ్ళని ఇంకా అలాంటి బాపతు గాళ్ళని - వెంటనే ఎక్కడికక్కడ ప్రభుత్వాలు అరెస్టు చేయాలి! జనాన్ని కాపాడాలి!! వీరివల్ల సమాజానికి ఎంత నష్టం కలుగుతుందో ఇప్పటికైనా బేరీజు వేసుకోవాలి... అని దేశవ్యాప్తంగా హేతువాదులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఏం లాభం? మన దేశంలో ప్రభుత్వాధినేతలంతా సన్నాసుల కాళ్ళమీద పడుతున్నారయ్యే... సామాన్యుల ఆక్రందనలు వారికి ఎప్పుడు వినిపించాలీ? టెలిస్కోపు, మైక్రోస్కోపుల కాలం ఇది. కానీ కొందరు ఇంకా హారోస్కాపును నమ్ముతూ పిచ్చివాళ్ళలా తిరుగుతున్నారు. పిడుగులు పడకుండా చర్చిలపైన, గుళ్ళపైన, మసీదుల పైన ఇతర మత కేంద్రాల పైన కొన్ని వైజ్ఞానిక అమరికలు, ఏర్పాట్లూ చేసుకున్నప్పుడే సైన్సు చేతిలో మతం మరణించింది. ఇంకా ఎందుకు దాన్ని నిలబెట్టాలన్న వృధా ప్రయాస?
''దేవుడూ, దేవతలు, రాక్షసులు ఎవరూలేరు. ఉన్నది కేవలం మానవుడు. వాడే అంతానూ'' అని అన్నారు తెలుగు కవి కాళోజి నారాయణరావు. ఒక విచిత్రం ఏం జరుగుతోందంటే... అన్ని వాదనలు అందరూ వినిపిస్తున్నారు కానీ, నాస్తిక వాదాన్ని నాస్తికులు మాత్రమే వినిపిస్తున్నారు. భావ సారూప్యం గల సంఘాలు, సంస్థలు ముఖ్యంగా వామపక్షవాదులు ఇది గుర్తించాలి. ప్రత్యర్థి బలిసిపోయి అక్రమాలకు పాలుపడుతున్నప్పుడైనా అందరూ ఒక్కతాటిపైకి రావాలి కదా? ''చట్టం, న్యాయం ముసుగులో అన్యాయం రాజ్యమేలడం కంటే మించిన నిరంకుశత్వం మరొకటి లేదు'' అని అన్నాడు ఫ్రెంచ్ రాజకీయ తత్త్వవేత్త ఛార్లెస్ లూయిస్ మాంటెస్క్యూ.
ఇవన్నీ సరే... ఒక్క విషయం ఆలోచిద్దాం! బుద్ధుడు రాజ్యాన్ని రాజభవనాల్ని వదిలి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. చెట్లకింద ఉన్నాడు. కానీ ఇప్పటి అత్యాధునిక అజ్ఞాన సన్యాసులు చెట్లను వదిలి రాజభవనాల్లో ఉంటున్నారు. పైగా రాజ్యకాంక్ష! రాజ్యం కావాలంటున్నారు? దీనికి దేశ పౌరులు ఎలా సమ్మతిస్తారూ? తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం కాదా?
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు