Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామారావు ఎంతో ఆవేశంతో పిల్లాన్ని బాదటం కోసం దగ్గర్లో కర్రలాంటి వస్తువు వెతుకుతున్నాడు. భార్యను కూడా కేకలు వేస్తూ బజారంతా వినిపించేలా అరుస్తూ పిల్లాడి రెండు చెంపలు చెల్లుమనిపిస్తున్నాడు. ఏం జరిగింది ఏం జరిగింది అంటూ చుట్టూ పక్కల వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయినా రామారావు కోపం తగ్గట్లేదు. ఇంతలో ఓ పెద్దమనిషి రామారావు ను సముదాయించి ''ఎందుకు పిల్లాణి కొడుతున్నావు'' అని అడిగాడు. ''బాబాయి నేను ఎన్నికల ప్రచారానికి వెళ్దామని జెండా బుజానేసుకుని, మెడలో కండువా వేసుకొని బయలుదేరాను. వెళ్తూ వీడి పోగ్రస్ రిపోర్ట్ చూశాను. ఒక్క సబ్జెక్టులోనూ పాస్ కాలేదు సరికదా చుట్టుపక్కల పిల్లల కంటే చాలా తక్కువ మార్కులు వచ్చాయి. వాడి భవిష్యత్తు ఏంటి అని భయమేస్తుంది బాబారు'' అని కన్నీరు పెట్టుకున్నాడు రామారావు. ''అసలు వీడు ఇలా తయారు కావడానికి కారణం వాళ్ళ అమ్మే, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో వద్దా, పిల్లాడు సరిగా తినక బక్కచిక్కిపోయాడు, సరిగ్గా చదవక అందరికంటే చివరి స్థానంలో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబారు'' అంటూ బాధపడుతున్న రామారావును శాంతింపచేశారు రిటైర్డ్ పంతులు సత్యం మాస్టారు. రామారావుకు వరసకు బాబాయి అవుతారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా సత్యం మాస్టరు ఏం సమాధానం చెపుతారోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సత్యం మాస్టారు రామారావుని ''నీ పని నువ్వు జాగ్రత్తగా చేస్తున్నావా? నిజాయితీగా చేస్తున్నావా?'' అని అడిగాడు. దానికి రామారావు సంతోషంగా ''నేను చాలా కష్టపడుతున్నాను, నిజాయితీగా పనిచేస్తున్నాను, ఎవరేమన్నా పట్టించుకోకుండా మాపై వారు ఏం చెపితే అదే చేస్తున్నాను'' అన్నాడు. ''అందువల్లే నీ కొడుకుకి ఈ మార్కులు ఈ పరిస్థితి వచ్చింది'' అన్నాడు సత్యం మాస్టరు. ఈ మాటతో అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు! మన పనులు మనం సిన్సియర్‌గా చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఇలా అవుతుందా! అని ఒక్క క్షణం సందేహపడ్డారు.
సత్యం మాస్టారు తన చేతిలో ఉన్న న్యూస్ పేపర్ ఓపెన్ చేసి వారికి చూపించి ''ఇది భారతదేశంలో ఉన్న పిల్లలందరి, తల్లిదండ్రులందరి ప్రోగ్రెస్ రిపోర్ట్'' అన్నాడు. ''ఈనెల అక్టోబర్ 15న ప్రపంచంలోని 121దేశాలలో సర్వే చేసి ఇచ్చిన ప్రపంచ ఆకలి సూచిక రిపోర్టులో మన భారతదేశం 107వ స్థానానికి పడిపోయింది'' అన్నాడు. అంటే ఏంటండీ అని అమాయకంగా అడిగాడు రామారావు. ''మీ వాడికి వందకి 11, 12 మార్కులు వచ్చినట్లు మన దేశానికి ఇంకో 14 స్థానాలు దిగజారితే ''0'' మార్కులు వచ్చినట్లే. అంత వెనకబడి ఉన్నాం అన్నమాట. కాగా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ 5లోపే ఉండి ప్రపంచంలోనే టాప్ ర్యాంకుల్లో చైనా, టర్కీ, కువైట్ వంటి దేశాలు ఉన్నాయి. పక్కనే ఉన్న చైనా జనాభాలో మనకంటే ఎక్కువ ఉన్నప్పటికీ మొదటి 17దేశాలలో స్థానం అంటే 100కు 92 మార్కులు సాధించినట్లు. మన చుట్టుపక్కల దేశాలైన పాకిస్థాన్ 99వ స్థానం, బంగ్లాదేశ్ 84వ స్థానం, నేపాల్ 81వ స్థానం, శ్రీలంక 64వ స్థానంలో మనకంటే మెరుగ్గా ఉన్నాయి. 2021లో మొత్తం 116దేశాల్లో భారత్ 101వ స్థానంలో నిలించింది. గతం కంటే ఇప్పుడు మరింత దిగజారింది'' అని ఆగాడు. ''అయ్యో అంత దారుణంగా ఉందా? మన పరిస్థితి'' అని వాపోయాడు రామారావు. ''ఇంతలోనే అయిపోలేదు ఇంకా ఉంది. ప్రతి వందకి 19మంది పెరుగుదలలేని చిన్నారులతో ప్రపంచంలో జీరో మార్కులు వచ్చాయి. కనీస పోషక ఆహారంలేక తీవ్రఆకలి అనారోగ్యంతో బాధపడే పిల్లలు మొత్తం ప్రపంచంలో 82.8 కోట్లు ఉంటే, మన భారత దేశంలోనే 22.43 కోట్లు ఉన్నారు. పసి భారతదేశం ఆకలి, పౌష్టికాహార లోపంతో విలవిలలాడుతోంది. పసిపిల్లలకు పట్టెడన్నం పెట్టలేని దయనీస్థితిలో భారతదేశం ఉంది'' అంటూ సత్యం మాస్టారు వివరించిన వాస్తవాలకు అక్కడున్న వాళ్ళకు కాళ్ళ కింద భూమి బ్రద్ధలైనట్టు అనిపించింది.
వెంటనే రామారావు ''మాస్టర్ గారు ప్రతిరోజు మన ప్రధానమంత్రి చెప్పినట్లు ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక శక్తిగా మనం ఉన్నాం, ఐదు ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ లక్ష్యం వైపు అభివృద్ధి వైపు భారతదేశం నడుస్తుంది అంటే నమ్మి మెడలో కండువా, చేతిలో జెండా పట్టుకుని నేను చేస్తున్న ప్రచారం తప్పంటారా?'' అన్నాడు రామారావు. వెంటనే సత్యం మాస్టరు ''కాదు... నువ్వు చెప్తుంది నిజమే రామారావ్... గౌతమ్ అదాని, ముఖేష్ అంబానీ వంటి పెద్ద పెద్ద కంపెనీల వ్యాపార సామ్రాజ్యాలు లక్షల కోట్ల రూపాయలకు విస్తరించాయి. వీరి వ్యాపారాలు మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకూ విస్తరించాయి. ఒక రోజుకు 1000 కోట్లకు పైగా సంపాదించగల వ్యాపారవేత్తలు భారతదేశంలో పుట్టకొచ్చారు. వారి అభివృద్ధినే మన ప్రధానమంత్రి దేశ అభివృద్ధిగా చెబుతున్నారు. ఆ నిజాన్ని నువ్వు ప్రతిరోజు ప్రచారం చేస్తున్నావు'' అన్నాడు.
''వీరు పొందే లాభాలన్నీ మనదేశంలో పేద ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల అధిక ధరలు, సేవలకు చెల్లించే అదనపు ధరలు, భారతదేశం కోల్పోతున్న ప్రకృతి వనరుల నుండే..! భారత ప్రజల త్యాగం కష్టార్జితంతో నిర్మించబడ్డ ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ భారత ప్రజలు వారికి కోల్పోవడం, ప్రభుత్వం ద్వారా అందించాల్సిన సబ్సిడీలను కోల్పోవడం, ప్రభుత్వం ద్వారా అందించాల్సిన విద్య వైద్యం మౌలిక వసతులు కోల్పోవడం వల్ల మనదేశంలో పెట్టుబడుదారుల లాభాలు వేలు, లక్షల కోట్లు దాటుతున్నాయి. 100 కోట్ల భారతీయ రైతులు, కూలీలు, కార్మికులు, మహిళలు, యువకులు, పసిపిల్లలు తమ శ్రమ, హక్కులు కోల్పోవడం వల్ల దేశంలో ఇలాంటి ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయి'' అంటూ విషయాన్ని సత్యం మాస్టారు మరింతగా అందరికీ అర్థమయ్యేటట్లు వివరించారు. ''2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నుండి సంక్షేమరంగానికి కోతలు విధించడం మొదలుపెట్టారు. పసిపిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ సెంటర్ల కుదింపు. ప్రాథమిక విద్య అందించేందుకు అవసరమైన మౌలిక వసుతు లకు బదులు పెద్ద సంఖ్యలో స్కూల్లు మూసివేయడం చేస్తే పిల్లలకు పౌష్టికాహారం విద్య, వైద్యం ఎలా అందుతాయి? కరోనా లాంటి విపత్తు సమయంలో సర్వం కోల్పోయిన పేదలకు ఉపాధి చూపించాల్సింది పోయి, ఉపాధి హామీని నిర్వీర్యం చేసి ప్రభుత్వ రంగాలను ప్రయివేటుపరం చేయడం వల్ల కోట్లాదిమంది ఉపాధి పొయింది. ఫలితంగా పని దొరకని స్థితులు ఏర్పడ్డాయి. 18 రకాల నిత్యవసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించాల్సింది పోయి, కేవలం బియ్యం సప్లై చేయడం వల్ల ప్రజలకు పౌష్టిక ఆహారం ఎలా అందుతుంది? పైగా ఇలాంటి కష్టపరిస్థితుల్లో ప్రజలపై జీఎస్టీ, నోట్లరద్దు, మతకలహాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. విపరీతంగా పెరిగిన పెట్రోల్, గ్యాస్, నిత్యవసరాల ధరల ఫలితాలను ప్రపంచ ఆకలి సంస్థ ఇచ్చిన రిపోర్ట్ కళ్ళకు కట్టినట్లు తెలియజేస్తున్నది'' అని మాస్టారు ముగించారు. వెంటనే రామారావు తన మెడలో ఉన్న పార్టీ కండువా తీసి పడేసి ''ఇప్పటివరకు నేను నా కుటుంబానికి, సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను అన్న విషయం నాకు అర్థం కాలేదు. నన్ను క్షమించండి గురువుగారు'' అంటూ ప్రాధేయపడ్డాడు. నేను, నాలాంటి అమాయకులు ఇలా పనిచేయబట్టే నా కుటుంబా నికి ఈ దేశానికి ఇలాంటి పరిస్థితులు వచ్చాయని రామారావు చాలా బాధపడ్డాడు. వెంటనే తన చేతిలో జెండాను మార్చి ''నేను ప్రచారానికి బయ లుదేరుతున్నాను మాస్టారు... మాయ మాటలు కాదు, ప్రజలకు వాస్తవాలు చెప్పడం కోసం వెళ్తున్నాను'' అంటూ ఎరుపెక్కిన కళ్లతో బయటికి వెళ్లాడు.
- మందా సైదులు
సెల్:9704874247