Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పశుసంవర్థక రంగం, భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటి. 2018-19సంవత్సరంలో వ్యవసాయ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో 28శాతం, జాతీయ ఆదాయంలో 5శాతం వాటా ఈ రంగం నుండే వచ్చింది. గడచిన ఆరు సంవత్సరాల కాలంలో పశుసంవర్థక రంగం 7.9శాతం వృద్ధి (స్థిరమైన ధరలతో) చెందగా, పంటల సాగు 2శాతం వృద్ధి చెందింది. పశువులను కలిగి ఉన్న గ్రామీణ కుటుంబాలలో పశువుల పెంపకంలో ఎక్కువగా నిమగమై ఉండేది మహిళలేనని క్షేత్రస్థాయి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి పశువుల పెంపకం, దాని వృద్ధి, పశువుల సంరక్షణా సేవలు, సేవల విస్తరణ, రుణాల లాంటి పశుసంవర్ధక అభివృద్ధిలోని బహుముఖాలలో మహి ళలను చేర్చి, వారి పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మహిళా శ్రామికులు (72శాతం) వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ మవుతారని గుర్తించడం జరిగింది. అయినా పాల ఉత్పత్తి సహకార సంఘాల్లో, ముఖ్యంగా పాల మార్కెటింగ్‌లో భాగస్వాములయ్యే వారిని మినహాయిస్తే, పశుసంవర్ధక ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర విస్తృతంగా ఉన్న విషయం ఎవరికీ తెలియదు. వారి పాత్ర అసలు చర్చలోనే లేదు. 2015-16 సంవత్సరంలో పాల ఉత్పత్తి సహకార సంఘాలలో ఐదు మిలియన్ల మహిళా సభ్యులు ఉండేవారు. తరువాత 2020-21 సంవత్సరానికి ఆ సంఖ్య 5.4 మిలియన్లకు పెరిగింది. భారతదేశంలో మహిళల పాల ఉత్పత్తి సహకార సంఘాల సంఖ్య 2012లో 18,954 ఉంటే, అది 2015-16 నాటికి 32,092కు పెరిగింది.
వివరాల సేకరణలో సమస్యలు
అనేక కారణాల వల్ల పశువుల పెంపకాన్ని వృద్ధి చేయడంలో మహిళల పనిని ఖచ్చితంగా నమోదు చేయడంలో సాంప్రదాయ కార్మిక శక్తి సర్వేలు వైఫల్యం చెందుతున్నాయి. వివరాల సేకరణలోని అనేక సమస్యల్లో రెండు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి, రోజు మొత్తంలో తక్కువ సమయంలో అప్పుడప్పుడూ చేసే పనితో పాటు ఇంటి పరిధిలోనే చేసే పని స్వభావం. రెండు, మహిళల స్వంత బాధ్యతలు. ఒక పేద మహిళా రైతు తన రోజువారీ పనిని, పశువుల కొట్టంలోని ఆవు పేడను పది నిమిషాల (5.15 నుండి 5.25 వరకు) పాటు ఎత్తివేయడంతో ప్రారంభించింది, కొంత సమయం వంట పనికి సంబంధించిన పనిలో నిమగమై, కొద్దిసేపటి తర్వాత 25 నిమిషాల పాటు ఆవుల పాలు తీసి, అరగంటలో ఆ పశువుల కొట్టాన్ని ఊడ్చి శుభ్రం చేసింది. ఇతర ఇంటి పనులన్నీ పూర్తయిన తర్వాత నిర్మాణ రంగానికి సంబంధించిన పని ప్రాంతానికి వెళ్ళింది. తనతో పాటు రెండు ఆవుల్ని కూడా తీసుకొని వెళ్ళి, అవి మేత మేసే వీలుగా పని ప్రాంతం దగ్గర కట్టివేసింది. ఆమె సాయంకాలం ఇంటికి తిరిగొచ్చి, పశువులు, ఆవుల పాలు తీసి వాటికి మేత వేసింది. ఈ పని చేయడానికి సుమారు 40 నిమిషాలు పట్టింది. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ రోజులో చివరిసారిగా పశువులకు మేత వేసింది. ఆ మహిళకు పశువుల పెంపకానికి సంబంధించిన పనులు చేయడానికి సుమారు మూడున్నర గంటల సమయం పట్టింది. ఈ పనులన్నీ ఇంటి పనులతో కలిపే చేసింది. అందువలన ''పశువుల పెంపకం'' పనిని ఆ మహిళ బహుశా ఒక ఆర్థిక కార్యకలాపమని చెప్పకపోవచ్చు అని కర్నాటక రాష్ట్రంలోని ఒక గ్రామంలో జరిగిన ''ఏ టైం యూజ్ సర్వే'' నివేదిక తెలిపింది. అధికారిక గణాంకాలలోని ఈ దోషాన్ని సర్దుబాటు చేయాలంటే, పనిలోని భాగస్వామ్యం వృద్ధిని పెంచి లెక్కించడమే ఏకైక మార్గం. మరో మాటలో చెప్పాలంటే... ఆర్థిక కార్యకలాపాలలో నిమగమై ఉన్నామని నివేదించిన మహిళలతో పాటు, ఇంటి పనుల్లో నిమగమయ్యే లేదా సంవత్సరంలో ఎక్కువ భాగం సంరక్షణా పనుల్లో నిమగమయ్యే మహిళలను కూడా చేర్చాలి.
తక్కువ అంచనా
స్పష్టంగా చెప్పాలంటే, 2011-12 సంవత్సరంలో ఎంప్లారుమెంట్ అండ్ అన్ఎంప్లారుమెంట్ జరిపిన సర్వేపై ఆధారపడిన అంచనా ప్రకారం పశువుల పెంపకంలో 12 మిలియన్ల మంది గ్రామీణ మహిళలు కార్మికులుగా పనిచేస్తున్నారు. అయినా పెంచిన ఆలోచన ప్రకారం సుమారు 49మిలియన్ల మంది గ్రామీణ మహిళలు పశువుల పెంపకంలో నిమగమయ్యారని మేం అంచనా వేశాం. ఒక్కమాటలో చెప్పాలంటే, వాస్తవానికి పశుసంవర్థక ఆర్థిక వ్యవస్థలో నిమగమైన మహిళలు అధికారిక అంచనాలకు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నారు. వారు కూడా గ్రామీణ జనాభాలో గణనీయమైన భాగంగా ఉన్నారు. 2019లో భారతదేశంలో మొదటిసారి జరిగిన జాతీయ టైం యూజ్ సర్వే గణాంకాలు ఈ ఫలితాన్ని దృవపరుస్తున్నాయి. గడచిన 24గంటల్లో చేసిన అన్ని కార్యకలాపాలను (వంట పని లేదా వ్యవసాయపనులు) నమోదు చేయడం ద్వారా, 11శాతం మంది గ్రామీణ మహిళలు లేదా 48 మిలియన్ల మంది మహిళలు పశువుల పెంపకంలో నిమగం అయ్యారని చెప్పవచ్చు.
పాలిచ్చే జంతువున్న ప్రతీ కుటుంబంలో ఒక మహిళ దాని పెంపకం కోసం రోజుకు కనీసం రెండు గంటలు వెచ్చించిందని కర్నాటక రాష్ట్రంలో ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్ నిర్వహించిన గ్రామ సర్వేల వివరాలు తెలియజేస్తున్నాయి. జంతువుల సంఖ్య, జంతువుల రకం, కాలం ఆధారంగా (కొన్ని కాలాల్లో మేత అంత తేలికగా అందుబాటులో ఉండదు కాబట్టి పశువుల్ని మేపడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది) ఏడు నుండి ఎనిమిది గంటల వరకు కూడా సమయం పడుతుంది. అదనంగా పశువుల పెంపకం గ్రామంలోని వయసు మీరిన, తక్కువగా చదువుకున్న మహిళల వృత్తిగా మారింది.
''ద నేషనల్ లైవ్ స్టాక్ పాలసీ''(ఎన్నెల్పీ) 2013, పశువుల ఉత్పత్తిని, ఉత్పాదకతను దీర్ఘకాలం పాటు కొనసాగించే లక్ష్యంతో ఉంది. ఈ పశుసంవర్థక రంగంలో వినియోగించే శ్రమలో సుమారు 70శాతం శ్రమ మహిళల నుంచే వస్తుంది. మహిళల సాధికారతను సాధించడం ఈ పాలసీ లక్ష్యాలలో ఒకటి. పశువుల మేతను అందుబాటులో ఉంచడం, సేవల విస్తరణను సమకూర్చడం, పశుసంవర్ధక రైతులకు మెరుగైన రుణ సౌకర్యాలపై దృష్టి సారించి పశుసంవర్థక రంగం అభివృద్ధి కోసం 2014-15లో ''ద నేషనల్ లైవ్ స్టాక్ మిషన్''(ఎన్నెల్ఎమ్)ను ప్రారంభించారు. అయినా ఈ ఎన్నెల్ఎమ్ పశుసంవర్ధక మహిళా రైతులకు ప్రత్యేకించి ఏ విధమైన పథకాలు లేదా కార్యక్రమాలను ప్రతిపాదించదు. మహిళల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 30శాతం నిధులను కేటాయిస్తుందని ఈ పాలసీ ప్రతిపాదిస్తుంది. 30శాతం కోటాలో హేతుబద్ధత లేదు.
ప్రధాన సమస్యలు
విధాన నిర్ణేతలకు మహిళా పశుసంవర్ధక రైతులు కనిపించడం లేదనేది ఇక్కడ స్పష్టంగా కనిపించే సమస్య. ఇక్కడ వివరించిన విధంగా లింగ, విభజన వివరాలు లేకపోవడం ఒక కారణం. మొదటిది, ''ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే'' లాంటి ఇటీవలి ఉపాధి సర్వేలు ప్రాథమికంగా గృహ సంబంధిత విధుల్లో నిమగమైన వ్యక్తుల నిర్దిష్ట కార్యకలాపాల వివరాలను సేకరించడంలో విఫలమైనాయి. కాబట్టి పశుసంవర్థక ఆర్థిక వ్యవస్థలో మహిళలను తక్కువగా లెక్కించడం కొనసాగుతుంది.
రెండవది, పశుసంవర్ధక మహిళా రైతులకు విస్తరణ సేవలు అందుబాటులో లేవు. అధికారిక నివేదికల ప్రకారం... 2021లో దేశ వ్యాప్తంగా 80వేల మంది పశుసంవర్థక రైతులకు శిక్షణ ఇచ్చారు. కానీ మహిళా రైతులు ఎంత మంది అనేది మాకు అవగాహన లేదు. మా గ్రామీణ సర్వేలలో... కొద్దిమంది మహిళలు మాత్రమే విస్తరణ కార్మికుల నుండి సమాచారాన్ని పొందినట్లు చెప్పారు. మహిళలు సమాచారాన్ని కోరుకున్నారు కానీ వారి ఇంటి దగ్గరలో, అదీ కూడా వారు ఖాళీగా ఉన్న సమయంలోనే.
మూడు, పశువులను కొనేందుకు బ్యాంకులకు ఆస్తుల తాకట్టు పెట్టకుండా బ్యాంకు రుణాలు పొందడం పేద కుటుంబంలోని మహిళలకు ఇబ్బందిగా మారిందని మా గ్రామీణ సర్వేలు తేల్చాయి. 2020-22 మధ్య కాలంలో కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద పశుసంవర్థక రైతులకు సుమారు 15లక్షల కొత్త కిసాన్ క్రెడిట్ కార్డులను సమకూర్చారు. వారిలో మహిళా రైతులు ఎంతమంది అనే సమాచారం లేదు.
నాల్గవది, జంతువుల ఎంపిక (పెంపకం), పశుసంరక్షణ వైద్యంపై మహిళా రైతులకు సాంకేతిక పరిజ్ఞానం లేదు. మా గ్రామీణ సర్వేల ప్రకారం... ఈ నిర్దిష్టమైన పనులను నిరంతరం పురుషులే నిర్వహించి కృత్రిమ గర్భధారణ కోసం జంతువులను వారే తీసుకొని వెళ్ళారు.
ఐదవది, మహిళలకు పాల ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం,వాటి విధులు తెలియదనీ, మహిళలు మాత్రమే సభ్యులుగా ఉన్న పాల ఉత్పత్తి సహకార సంఘాల్లో కూడా పురుషులే నిర్ణయాలు తీసుకుంటారని మా గ్రామీణ అధ్యయనాలు తెలియజేశాయి. దానితో పేద షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు చెందిన లేదా భూమి లేని మహిళల గొంతులు చాలా అరుదుగా వినిపించాయి.
పశుసంవర్ధక రంగ ఆర్థిక వ్యవస్థకు మహిళల శ్రమ చాలా కీలకమైనది. ఈ రంగం అభివృద్ధిలో, నిర్ణయా ధికారంలోని ప్రతీదశలో మహిళలను చేర్చాలి. అధికారిక గణాంకాలలో పశుసంవర్ధక మహిళా కార్మికులు లేకపోవడంతో నేడు వారు కనిపించకుండా పోయారు. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది.
(''ద హిందూ'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, సెల్:9848412451
- మధురా స్వామినాథన్
- ఆర్. విజయాంబ