Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యుత్తులేని ప్రపంచం సూర్యుడు లేని భూగ్రహంతో సమానం. పవర్‌లేని జీవితం చీకటిమయం. గృహ, పారిశ్రామిక, రవాణ, కార్యాలయ రంగాల్లో విద్యుత్ వినియోగం అనివార్యమైనది. ఆధునిక మానవుని దినచర్యలో అనుక్షణం విద్యుత్ వినియోగం తప్పనిసరి. ఈ వినియోగం ఆధారంగానే దేశ ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే స్థితికి ప్రపంచం చేరిన రోజులివి. దేశంలోని జనాభా సగటున వాడే విద్యుత్ పరిమాణాన్ని బట్టి దేశ సంపన్నత లేదా ప్రగతి రేటు వివరించబడు తున్నది. ఈ విద్యుత్ ఉత్పత్తి, వాడకం, సేవల విస్తరణతోనే దేశ భవిష్యత్తు నిర్వచించబడుతుంది. ఇందుకు ఈ భూమికి అతి గొప్ప శక్తి వనరు సూర్యుడే. శక్తి వనరుల్లో తరిగే సాంప్రదాయ (పునరుత్పాదకం కాలేని) నాన్రెన్యువబుల్ శిలాజ ఇంధనాలు (బొగ్గు, వంట చెరుకు, పెట్రోలియం, సహజ వాయువు లాంటివి), తరగని సాంప్రదాయేతర పునరుత్పాదక ఇంధనాలు (సౌరశక్తి, పవనశక్తి, అలలశక్తి, భూఉష్ణం, బయోమాస్ లాంటివి) ఉంటాయి. పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, రవాణ, వ్యవసాయ, గృహావసరాల వంటి రంగాల్లో శక్తి వినియోగమే ప్రాణ సమానం. విద్యుచ్ఛక్తితోనే గ్రామీణ వ్యవసాయాధార ప్రగతి సహితం సాధ్యపడుతుంది.
ప్రపంచ శక్తి దినం-2022 నినాదం
తరిగే సాంప్రదాయ శిలాజ ఇంధన వినియోగం జరుగు తున్నప్పటికీ, వీటితో పర్యావరణానికి, జీవ మనుగడకు హాని కలుగుట అనివార్యమని గమనించాలి. శిలాజ ఇంధనాల వాడకంతో అడవుల నరికివేత, ఇంధన నిల్వలు తరుగుతూ కోరత ఏర్పడటం, పర్యావరణ కాలుష్యం, అనారోగ్యం, జీవవైవిధ్యానికి విఘాతం లాంటి దుష్ఫలితాలు ఏర్పడుతాయి. శిలాజ ఇంధన వినియోగాలను తగ్గిస్తూ, భవిష్యత్తులో ఆశాజనకమైన పర్యావరణహిత సాంప్రదాయేతర పునరుత్పత్తి చేయదగిన శక్తివనరుల వాడకాన్ని ఆశ్రయించాల్సిన సమయం ఆసన్నమైంది. శక్తి వనరుల వాడకం, శక్తి ఉత్పత్తి, ఇంధన వనరులను ఆదా చేస్తూ వినియోగించడం, శక్తి ప్రాధాన్యతలను వివరించడం లాంటి అనేక అంశాలను సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి యేటా 22 అక్టోబర్ రోజున ''ప్రపంచ శక్తి దినం (వరల్డ్ ఎనర్జీ డే)'' పాటిస్తారు. ప్రపంచ శక్తి దినం-2022 ''గ్రీన్ ఎనర్జీ ఈజ్ మై చాయిస్'' అనబడే అంశాన్ని తీసుకొన ప్రచారం చేస్తున్నది. ఇండియాలో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చరిత్ర డార్జిలింగ్‌లో 1897లో పారంభమైంది. 1902లో ప్రథమ హైడ్రోపవర్ స్టేషన్ శివసముద్రం, కర్నాటకలో వెలిసింది. స్వాతంత్య్రా నంతరం శక్తి మంత్రిత్వశాఖ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపన, రవాణ, పంపిణీ చేయడం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. యన్‌టిపిసి, యన్హెచ్పిసి, యన్ఈఈపిసిఓ, పిజిసిఐయల్, యన్పిజి లాంటి కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలు క్రియాశీలంగా విద్యుత్ ఉత్పత్తి, రవాణ, పంపిణీల పని చేస్తున్నాయి.
విద్యుత్తును ఆదా చేద్దాం
విద్యుత్తును ఆదా చేయడం ఉత్పత్తి చేయడంతో సమానమని ప్రతి ఒక్కరు భావించాలి. అనవసర విద్యుత్ వాడకాన్ని తగ్గించాలి. గృహాల్లో వ్యర్థంగా నడుస్తున్న ఫ్యాన్లు, లైట్లు, ఏసి, నీటి కులాయిలను ఆపేయాలి. వాహనాలను అనవసరంగా వినియోగించరాదు. ప్రజారవాణాను అధికంగా వాడుకోవాలి. తక్కువశక్తిని వినియోగించు కునే యల్ఈడి బల్బులను, శక్తిని ఆదా చేసే ఫ్రిజ్, ఏసి, వాషింగ్ మిషిన్లను వాడాలి. శక్తి వినియోగం తక్కువగా ఉండే దిన చర్యను పాటించాలి. గీజర్ల వాడకాన్ని వీలైనంత తగ్గించాలి. ఇంటిని ఫాల్స్ రూఫింగ్ చేయించాలి. ఇంటి నిర్మాణంలో మెళుకువలతో విద్యుత్తు వాడకాన్ని తగ్గించవచ్చు. శిలాజ ఇంధనాలను పొదుపు చేస్తే, కాలుష్యాన్ని తగ్గించినట్లే. ప్రపంచ జనాభాలో నేటికీ 13శాతం మందికి విద్యుత్తు అందకపోవడం ఓ వైఫల్యం. పవర్ లేని సమాజం ఆర్థిక సంక్షోభంలో అవస్థలు పడుతుంది. జీవన ప్రమాణాలను పెంచేది శక్తి వినియోగం మాత్రమే. ఇది గ్రహించి ప్రభుత్వాలు ప్రతి ఇంటికి సౌరశక్తిని విధిగా అందించాలి.
- డా: బుర్ర మధుసూదన్ రెడ్డి - 9949700037