Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సార్ యాద్గిరి మీరేనా''
''అవును నేనే''
''మా అబ్బాయున్నాడు. మంచి సాఫ్టువేరు ఉద్యోగం. సంవత్సరానికి ఎనిమిది. ఒకే పిల్లోడు. మీ బావమరిది నర్సింగ్ చెప్పి పంపాడు''.
''ఏ ఊరు మీది?''
''ఫలానా ఊరండి''
''ఓ ఆ ఊరా, మేం పిల్లని ఇవ్వం''
''అదేమిటండీ వేరే వివరాలు అడగకుండా కనీసం అబ్బాయి ఎలా ఉంటాడనీ అడగకుండా, ఫొటో చూడకుండా, ఊరేదని అడుగుతారే!''
''అంతే, మేము ఆ ఊరికి పిల్లనివ్వం''
''మేమేమి పాపం చేశాము సార్? మా ఊరికేమైనా వాస్తు దోషముందా?''
''చేసింది మీరే''
''అవునా? ఏం చేశాం, ఏమిటి మా పాపం''
''మీ ఊరికి రోడ్డు లేదు. పిల్లనివ్వం, అంతే... గ్రామ సడక్ యోజన కింద మీ ఊరికి రోడ్డు వేయించుకోవచ్చు కదా!'' అన్నాడు అమ్మాయి తండ్రి
''మన పిల్లలకు పెళ్ళి చేస్తామా లేదా అన్నది పక్కనబెడితే, మీరడిగిన ప్రశ్నకి మాత్రం జవాబివ్వాలి సార్. ఈ గ్రామ సడక్లు, ఫీల్ గుడ్డులు కుళ్ళిపోయిన గుడ్లే. ఆ కుళ్ళు కంపు అలా అలా పెరుగుతోంది. తమ పబ్బం గడుపుకోవడానికి దాన్ని ఇంకా ఇంకా పెంచేసి ఎన్నో విషయాలు కుష్ కబర్లుగా చలామణి చేస్తున్నారు. గ్రామ గ్రామానికి ఓట్లు రాబట్టుకునే రహదారులవి. అందరూ మోసపోతున్నారు ఇంకా. అందులో నేను మా ఊరివాళ్ళు భాగం అంతే''
''మీకున్న శక్తి మీకు తెలెయదు. కోపం మాత్రమే మీకు తెలుసు. ఆ శక్తి ఎప్పుడు వాడాలి, ఆ కోపం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి అన్నదే మీకు సరిగా తెలియడం లేదు. ఉక్రోషానికి మాత్రం తక్కువలేదు.''
''సడక్ అంటే రొడ్డు అని ఒక అర్థం, అనాధ అని ఇంకొక అర్థం ఉన్నాయి సార్. ప్రజలంతా రెండవ అర్థానికి చెందినవాళ్ళు. అయితే ఆ విషయం వాళ్ళకు అర్థం కావడం లేదు. ఊరికి రోడ్డు లేకున్నా సారాయి వస్తుంది, ఇంకా ముందుకు పోతే ఫైవ్ జి కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. వాళ్ళ వాళ్ళు బాగుపడితే చాలు సార్ పైన అధికారం ఉన్నోళ్ళకి.''
అశోకుడు రహదారులకు ఇరువైపులా చెట్లు నాటించెను అని చదూకున్నాం. అశోకుని శాసనాలు కూడా చదివాం. మరి ఏం నేర్చుకున్నట్టు. అందుకే చదవడం ముఖ్యం కాని దానిలో పాటించేది తక్కువ అని మా మిత్రుడి మాటలు మతికొస్తుంటాయి. నిజం లేకపోలేదు. ఇది ఒక్కరి సమస్య కాదు. తమ పిల్లనిచ్చి తను బాధ పడేకంటే ఆ బాధ తెచ్చుకోవడమెందుకు అని ప్రతి తండ్రి ఆలోచిస్తాడు. మొదటి కానుపుకు తామే పిలుచుకొస్తాం. ఇక రేప్పొద్దున రెండో కానుపుకైనా ఊరికి రోడ్డు వస్తుంది అన్న గ్యారెంటీ ఏమిటీ అన్నది అతని ప్రశ్న. ఆ ఊరినుండి అమెరికాకు పోయుండొచ్చు ఎవరైనా. ఇంకా అరిస్తే చంద్రమండలనికి పోయిన వ్యక్తుల్లో ఒకరు ఆ ఊరివాళ్ళే ఉండొచ్చు. అయితే ఏంటి లాభమంట? పక్క ఊరికి పోవడానికి ఏ నదో, కాలువో అడ్డమొచ్చినప్పుడు మాత్రమే రోడ్డు గుర్తుకొస్తుంది. తరువాత హుళక్కి. నాయకుల మాటలే పెద్ద హుళక్కి మొదటినుండి. ఇప్పుడున్న వాళ్ళు పాతవారి కొనసాగింపు మాత్రమే.
హైవేలు మాత్రం ఫోర్వేలు అంటే నాలుగు వరుసల్లో వాహనాలు పోవచ్చు. ఎదురెదురుగా రెండు రెండు లైన్లు కిలోమీటర్లు కిలోమీటర్లు వేస్తారు. లేదా ఆరు లైన్లు కూడా వేస్తారు. ఎందుకంటే ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు వాళ్ళు దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ దోచుకోవచ్చు అని చూసుకోవాలి కదా!! అయితే జనాలు ఆలోచించవలసింది ఆ హైవేలెక్కడానికి తమ ఊరినుండి రోడ్డు లేకపోవడంలో మతలబు ఏమిటి అని. అమాత్యులు చేసే ప్రతి పని వెనుక ఒక మతలబు ఉంటుంది అన్న నిజం వాళ్ళకు తెలియాలి. ఆ తెలిపేది ఎవరు చేయాలి. చదువుకున్నోళ్ళా, లేదా మంచి చేసే పార్టీలవాళ్ళా, ఇంకెవరు మీదేసుకోవాలి అన్నది చిరకాల ప్రశ్న. ఆ ప్రశ్న నడిచి పోవడానికి మాత్రం మన మనసుల్లో రోడ్డు ఉండదు.
మహా కవి శ్రీశ్రీని సాహిత్యంలో మీరు రహదారి కల్పించారు ముందు తరాల వారికి అన్నారట. ఆయన ఒప్పుకోలేదు, ఒప్పుకోకపోగా గురజాడ లాంటివాళ్ళు రోడ్లు వేశారు, నేను వాటిని వెడల్పు చేస్తున్నానంతే అన్నాడట సిగరెట్ పొగవదిలి. అంతటి మహాకవే ఆ మాట అన్నప్పుడు మనం ఆ రోడ్ల మీద పోతూ వెడల్పు చేయడం అటుంచి, కనీసం దాన్ని క్లీనుగాను, ఎక్కడన్నా గుంతలు పడి ఉంటే వాటికి రిపేర్లు చేస్తున్నామా అని మనకి మనం ప్రశ్నించుకోవాలి. మనం నడిచే రోడ్డులో మనకు ప్రశ్నలు రాకపోతే ఆ రోడ్డు మార్చాలని గుర్తు చేసుకోవాలి. ఆ రోడ్డు మంచిది కాదని తెలుసుకోవాలి. ప్రశ్న రాకుంటే మెదడు పనిచేయడం ఆగిపోయిందని తెలుసుకోవాలి. దానికి కరెంటు షాకు పెట్టైనా మెదడుని మళ్ళీ పనిచేయించాలి. ఆ షాకు తగలాలంటే రోడ్డెంట ఉన్న కరెంటు స్తంబాల్లో విద్యుత్తు ప్రవహిస్తుందా లేదా అని చూడాలి.
కరెంటు లేని స్తంబం, ప్రశ్నించని మెదడు ఒకటేనని అర్జంటుగా సమజైపోవాలి. మన మెదడులో కరెంటు లేదని, అగ్గిపోయిందని అర్థం. అప్పుడు రోడ్లేమి, వాటి అవసరమేమి, వాటి వెనుక ఇన్నిన్ని కథలున్నాయా! ఆ కథల్లో నాయకా నాయకిలెవ్వరు, ఆ పాత్రల్లో ఎప్పుడూ కొందరే ఉంటారా? ఆ రోడ్డెక్కడానికి ఎలాంటి బండిలో పోవాలి, ఎలాంటి బండి వాడాలి, దానిలో ఎక్కడ ఆగిపోవాలి మొదలైనవి తెలుసుకున్నోళ్ళే బాగుపడుతుంటారు.
కాబట్టి అశోకుడు చెట్లు నాటించెను, ఇంకొకరు వాటిని పీకి మళ్ళీ తమ రోడ్లేసిరి. ఇరువైపులా ఉన్న చెట్లనుండి వచ్చిన చెక్కతో తమ భవనాలకు వాకిళ్ళు చేయించుకొనిరి, మంచాలు చేయించుకొనిరి, టెబుళ్ళు, కుర్చీలు చేయించుకొనిరి అని చదువుకుంటే సరిపోదు. ఆ రహదారుల్లో సామాన్య ప్రజలు కూడా ప్రయాణించాలి, బాగుపడేవారి లిస్టులో ప్రజలకూ చోటు ఉండాలి, అప్పుడే ఆ రహదారుల అర్థం నిజమైనదని, లేదంటే అంత హుళక్కి అని గ్రహించాలి. ఆ రహదారుల్లో పాదయాత్రలు ఎవరికోసం చేస్తున్నారు అన్నదీ ముఖ్యమైన పాయింటే. ఆ పాద యాత్రల్లో పాదాలు కందిపోయాయా, పాదరక్షలు ఎలా మోస్తున్నారు, మధ్య మధ్యలో విశ్రాంతి ఎందుకు, ఎక్కడ తీసుకుంటున్నారు అన్నవి కూడా చూస్తుండాలి. ఇవన్నీ రహదారి విశేషాలు. నా దారికి అడ్డు వస్తే ఇక అంతే అనేవారినీ జాగ్రత్తగా గమనించాలి. దాన్ని పూల దారి ఎలా చేసుకోవాలన్నదే అందరి ప్రయత్నం. అది మనమే ఎందుకు కాకూడదు? అన్నది సామాన్యుల మదిలోకి వస్తే రోడ్డు పడిపోయినట్లే.
- జంధ్యాల రఘుబాబు
సెల్:9849753298