Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగటి నారాయణ 4 డిసెంబర్ 1956న ఖమ్మంజిల్లా బోనకల్ మండలం పెద్దబీరవల్లిలో నిరుపేద దళిత వ్యవసాయ కార్మిక కుటుంబంలో జన్మించారు. బాల్యంలో అనేక కష్టాలను అధిగ మించి చదువుకున్నారు. గ్రామంలో బలంగా ఉన్న వామపక్ష రాజకీయా లతో ప్రభావితం అయ్యారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐలలో పని చేశారు. భార్య అమృత సహకారం తో బిఎ, టిటిసి చదివారు. 1980 అక్టోబర్ 30న గిరిజన సంక్షేమ శాఖలో ఎస్జీటీ ఉపాధ్యా యుడుగా చేరారు. తదనంతరం దూరవిద్యలో ఎంఏ చేశారు. విద్యార్థి ఉద్యమం ఇచ్చిన చైతన్యంతో గిరిజన సంక్షేమశాఖలోని అధికారుల నిరంకుశత్వాన్ని ప్రశ్నించారు, ఎదిరించారు. నారాయణ నిరంతర అధ్యయనశీలి, సాహిత్యాభిమాని, మంచి వక్త, సాంస్కృతిక రంగంలోనూ ప్రవేశం ఉంది. తొలినాళ్ళలో ఐక్య ఉపాధ్యాయ పత్రికలో పుస్తక సమీక్ష రాసేవారు. నారాయణలోని సాహిత్యా భిలాషను గుర్తించి యుటిఎఫ్ రాష్ట్ర నాయకత్వం 1992లో ఐక్య ఉపాధ్యాయ ఎడిటోరియల్ బోర్డు సభ్యునిగా ఎంపికచేసింది.
జాతీయ సాక్షరతా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1990లో అక్షరకళా యాత్రను భద్రాచలం డివిజన్లో విజయవంతంగావించారు. 1991-92 సంవత్సరాల్లో భద్రాచలం డివిజన్ అక్షరదీపం కోఆర్డినేటర్‌గా, పూర్తికాలం బాధ్యతలు నిర్వహించారు. రంపచోడవరంలో 1992 ఆగస్టు 11, 12 తేదీల్లో ఏజెన్సీ ఉపాధ్యాయుల మొదటి రాష్ట్ర సదస్సు జరిగింది. నారాయణ చొరవతో జరిగిన ఆ సదస్సు వెలుగులో 1994లో ఆశ్రమ పాఠశాలలకు కొత్త పోస్టులు మంజూరైన సందర్భం లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఖాళీల్లో నియామకాలు అవినీతికి తావు లేకుండా అందరికీ అనుకూలమైన పద్ధతిలో దగ్గరుండి జరిపించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిసేబుల్డ్ బ్యాక్లాగ్ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకోసం 2002లో ఎంపికైన అన్ ట్రైన్డ్ అభ్యర్థులను మూడేండ్లలో శిక్షణ పొంది వస్తే అప్రంటీస్ టీచర్‌గా నియమిస్తామని ప్రభుత్వం విధించిన నిబంధనకు వ్యతిరేకంగా, ఎంపికైన అభ్యర్థులను సమీకరించి యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రారంభించిన పోరాటాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉధృతంగా నిర్వహించిన ఫలితంగా 9వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ అభ్యర్థులను స్పెషల్ విద్యావాలంటీర్లుగా నియమించి, దూరవిద్యా విధానంలో ప్రభుత్వమే అందరికీ శిక్షణ ఇచ్చింది.
శాసనమండలి పునరుద్ధరణ సందర్భంలో ప్రాథమిక ఉపాధ్యాయు లకు ఓటుహక్కు కావాలని యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం నిర్వహించారు. 2007లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. యుటిఎఫ్ మద్దతుతో ఏడుగురు ఉద్యమ అభ్యర్థులు (3 ఉపాధ్యాయ, 4 గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీలతో సమన్వ యం చేసుకుంటూ నిరంతరం ఆందోళనా, పోరాటా లకు పిలుపులిచ్చి నాయకత్వం వహిం చారు. పోరాటాల్లో ముందుండి మిలిటెన్సీని ప్రదర్శించారు. 2008 సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 4వరకు జాక్టో ఆధ్వర్యంలో జరిగిన13 రోజుల సమ్మెకు నాయకత్వం వహించి ఎఫెక్టివ్‌గా నడిపి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆగ్రహానికి గురయ్యా రు. సమ్మె విరమణ అనంతరం కొందరు ఎమ్మెల్సీలు, కొన్ని సంఘాలు కుట్రచేసి జాక్టో నుండి యుటిఎఫ్, డిటిఎఫ్, టిఎన్ యుయస్ సంఘాలను బహిష్కరిం చిన సందర్భంలో ఏమాత్రం వెరవ కుండా అప్రంటీస్ సర్వీసుకి నోషనల్ ఇంక్రిమెంట్ల సాధన, అప్రంటీస్ విధానం రద్దు కోసం మరింత పట్టుద లతో యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనా, పోరాటా లు నిర్వహించి సంఘాన్ని చాంపియన్‌గా నిలిపారు.
2012 సెప్టెంబర్ 6 నుండి పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, వై శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి 13 వరకు ఎనిమిది రోజులు కొనసాగించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు అరెస్టు చేసి గాంధీ హాస్పిటల్‌కు తరలించి బలవంతంగా దీక్ష విరమింపజేశారు. తత్ఫలితంగా 2012 డిఎస్సీ నుండి అప్రంటీస్ వ్యవస్థ రద్దు చేయబడింది.
2009లో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికై 2013 ఏప్రిల్ వరకు కొనసాగారు. సిఎస్ రావు నేతృత్వంలోని 9వ పిఆర్సీతో జరిగిన చర్చల్లో నారాయణ నేతృత్వంలో యుటిఎఫ్ ప్రతినిధులు, పిడిఎఫ్ ఎమ్మెల్సీలతో కలిసి చేసిన ప్రాతినిధ్యాల ఫలితంగా ఉపాధ్యాయులకు మెరుగైన పేస్కేల్స్ సాధించుకున్నాం. అప్రంటీస్ విధానం రద్దుకు సిఫారసు చేయబడింది. ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో జెఎసి ఆధ్వర్యంలో చర్చలు జరిపి మెరుగైన ఐఆర్, ఫిట్మెంట్ సాధించటంలో కో చైర్మన్‌గా నారాయణ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు 2012 డిసెంబర్ 31న విఆర్ఎస్ తీసుకుని 2013 ఫిబ్రవరిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పోటీచేసి తెలంగాణ ఉద్యమ హౌరులో ఓటమి చెందారు. 2013 డిసెంబర్లో తిరిగి ఉద్యోగంలో చేరారు. 2014 సెప్టెంబర్ 28న కారు ప్రమాదంలో భార్య అమృత మరణించారు. తీవ్ర గాయాలపాలైన నారాయణ భార్య మరణం కూడా తెలుసుకోలేని స్థితిలో సీపీఐ(ఎం) పార్టీ నాయకులు, యుటిఎఫ్ కార్యకర్తలు అండగా నిలిచారు. నిమ్స్‌లో నాలుగు నెలలపాటు చికిత్సపొంది కోలుకున్నారు. హాస్పిటల్లో ఉండగానే డిసెంబర్ 31న రిటైర్ అయ్యారు.
2013 నుండి ఉమ్మడి రాష్ట్రంలో యుటిఎఫ్ గౌరవాధ్యక్షుడుగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర యుటిఎఫ్‌కు 2014 డిసెంబర్ వరకు గౌరవాధ్యక్షుడుగా ఉన్నారు. 2014 అక్టోబర్ నుండి 2017 వరకు వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రికకు తొలి ప్రధాన సంపాదకులుగా బాధ్యతలు నిర్వహించారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టిఎఫ్ఐ) జాతీయ ఉపాధ్యక్షు నిగా బాధ్యతలు నిర్వహించారు. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్, విద్యాహక్కు చట్టం, ఎన్ఈపి తదితర జాతీయ స్థాయిలో విద్యావిధానంలో వచ్చిన మార్పు లు అధ్యయనం చేసి స్పందించటంలో, కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు చేయటంలోనూ, జాతీయ పెన్షన్ విధానంయ (ఎన్‌పిఎస్/సిపిఎస్)కి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాల రూపకల్పనలో ఎస్టీఎఫ్ఐ కమిటీల్లో జరిగే చర్చల్లో నారాయణ చురుకుగా పాల్గొనేవారు. 2017 తర్వాత తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ స్థాపించి ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకం గా పోరాడారు. ఉపాధ్యాయులతో విద్యారంగంలో వస్తున్న మార్పులపై నిరంతరం చర్చలు చేసేవారు. చనిపోయే ముందు రోజు కూడా వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్‌గా ఉన్నారు.
ప్రభుత్వ విద్య అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధ్యా యుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన నారాయణ మరణవార్త ఉభయ రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పలు జిల్లా, మండలశాఖల ఆధ్వర్యంలో అదే రోజు సంతాప సభలు నిర్వహించి నివాళులర్పించారు. మధ్యాహ్నం 12.00 నుండి 4.30 వరకు కార్యాలయంలో ఉంచగా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రముఖులు, జిల్లాల నుండి పలువురు టిఎస్ యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలు నారాయణ భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల నుండి సంఘంలో అత్యు న్నత నాయకత్వ స్థాయికి ఎదగడం ద్వారా యుటిఎఫ్‌లో సామాజిక న్యాయానికి ఉన్న సముచిత స్థానాన్ని నారాయణ నిరూపించారు. నేను 1989లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తర్వాత ఉద్యమం ద్వారానే నారాయణతో పరిచయం ఏర్పడింది. ఆనాటి నుండి మరణించేవరకు 33ఏండ్ల పాటు ఆ ఉద్యమ సంబంధమే మామధ్య ఆత్మీయ అనుబంధంగా కొనసాగింది. జోహార్ కామ్రేడ్ నారాయణ... నీకు జోహార్లు...
(అక్టోబర్ 23 కామ్రేడ్ నారాయణ సంస్మరణ సభ సందర్భంగా...)
- చావ రవి