Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు రాష్ట్రాలలో భిన్న సమీకరణాల సంకేతాలు, రాజకీయ సందేహాలు పరిపరివిధాల పరిభ్రమిస్తున్నాయి. మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా చలామణి అయ్యే అంశాలలో ప్రజల వాస్తవ సమస్యలకు సమాధానం ఉండటం లేదు. పాలకపక్షాల ప్రచారాలు, ప్రభుత్వంలోకి రావాలనే ప్రతిపక్షాల ఆరాటాలే ప్రధాన భాగం ఆక్రమించడంతో విధానపరమైన దీర్ఘకాలిక అంశాలు మరుగున పడిపోతున్నాయి. జాతీయ పార్టీలూ అనేక ప్రాంతీయ పార్టీలు కూడా రాజ్యాంగ సైద్ధాంతిక కోణాలను పక్కన పెట్టేసి వచ్చే ఎన్నికలలో మనుగడ కోసమే తాపత్రయ పడుతున్నాయి. గతంలో తమ రాష్ట్రానికి ప్రాంతానికి పరిమితమైన నేతలే పరిస్థితి తీవ్రతను బట్టి జాతీయాంశాలు ముందుకు తేకతప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపున జాతీయ స్థాయిలో చక్రం తిప్పామనే నేతలు కొందరు స్థానిక లెక్కల్లోనే సంచరిస్తున్నారు. జాతీయపార్టీల నేతలే రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడుతూ గందరగోళం పెంచుతున్నారు. వ్యక్తిగత దూషణలు పరాకాష్టకు చేరుతున్నాయి. రెండు తెలుగురాష్ట్రాల రాజకీయ చర్చలో పరస్పర ప్రభావం కూడా గతం కంటే ఎక్కువగా ముందుకొస్తోంది. ఈ మధ్యలో అటూ ఇటూ పార్టీలు మారే నేతల యాత్రలు ఎడతెగని ప్రహసనంగా తయారైనాయి. షరామామూలుగా ప్రజా ఉద్యమాలు, ఉద్యోగకార్మికులు, గ్రామీణ ప్రజల పోరాటాల పట్ల పాలకుల నిర్బంధం, పాలకపార్టీల ఉపేక్షా భావనే కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రస్పుటమవుతున్న రాజకీయ వైరుధ్యాలు, సామాజిక వైషమ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలోఎడతెగని రాజధాని సమస్యపై బాధిత రైతుల పాదయాత్రలూ, ప్రభుత్వ మద్దతుతో విశాఖ గర్జనల మధ్య ఉద్రిక్తతలు కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక రాజకీయ పునస్సమీకరణకు సంకేతమవుతుందని భావిస్తున్నారు.
ఏపీ తాజాపరిణామాలు
విశాఖ గర్జన, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ జనవాణి నేపథ్యంలో జరిగిన పరిణామాలు తీవ్ర ఘర్షణలకు వాదోపవాదాలకు దారితీశాయి. ఆ సందర్భంగా పవన్‌కు విశాఖలో టీడీపీ, బీజేపీ ప్రధానంగా కలసి సంఘీభావం చెప్పాయి. అందుకు పోలీసులు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పిన సీపీఐ(ఎం) జనసైనికుల దాడినీ ఆ పేరిట పలువురు అమాయకుల అరెస్టులను కూడా ఖండించింది. కేంద్రంలోని బీజేపీ ఇటు అమరావతి విషయంలోనూ అటు విశాఖ ఉక్కుతో సహా ఉత్తరాంధ్ర అభివృద్దికి అడ్డుపడుతున్న తీరునూ ప్రస్తావించింది. విశేషమేమంటే జనసేన టీడీపీ హడావుడిలో ఎక్కడా బీజేపీపై విమర్శ లేకపోవడం. ఈ ఘటనల తర్వాత విజయవాడ వచ్చిన పవన్‌కళ్యాణ్ తన ప్రసంగంలో చెప్పుచూపించి వైసీపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం మీడియాలో విపరీత ప్రచారం పొందింది. వైసీపీ నాయకులు మంత్రులు తనపై చేసే వ్యక్తిగత దూషణను తీవ్రంగా ఖండించే ప్రతిఘటింటచే హక్కు ఆయనకు ఉంది. అయితే చెప్పులు తిట్లు అభ్యంతరకరమైన ప్రతిసవాళ్లు, అందులోనూ మహిళలకు సంబంధించి పొరబాటు సంకేతాలిస్తాయని చెప్పకతప్పదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్‌తోసహా ఇదే భాషలో మరింత తీవ్రంగా ప్రతిస్పందించడం వివాదాన్ని కొనసాగించడానికే కారణమవుతోంది.
ఈ తగాదాల కన్నా పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలు మరింత కీలకమైనవి. బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇవ్వలేదు గనక వ్యూహం మార్చుకోవలసి వస్తోందని ఆయన అన్నారు. మతతత్వానికి, నిరంకుశ పోకడలకు మారుపేరైన బీజేపీ ఏపీకి ప్రత్యేకంగా అన్యాయం చేస్తోందని అందరికీ తెలుసు. ఇదే పవన్ గతంలో ప్రత్యేక హోదాపై రౌండ్‌టేబుల్ నడిపారు కూడా. విశాఖలోనూ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడారు. అది కమ్యూనిస్టులతో కలసివున్నప్పటి మాట. బీజేపీతో జట్టుకట్టాక కేంద్రంపై ఆయన పూర్తిగా మౌనందాల్చారు. బీజేపీ తనను పూర్తిగా విస్మరిస్తున్నా ఉప ఎన్నికలలో వారికే మద్దతిచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి లేదా ఒప్పించి రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క సదుపాయం సాదించలేక పోయారు. ఇప్పుడు వ్యూహం మార్చుతున్నానంటూనే బీజేపీపైన మోడీపైన పూర్తి గౌరవం ఉందని, తాము వారికి వ్యతిరేకంకాదని సెలవిచ్చారు. బీజేపీకి విధేయపూర్వకమైన ఈ వ్యాఖ్యలు పవన్ మాటలను అతిగా అంచనా వేసేవారికి కనువిప్పు కలిగించాలి. జనసేన నాయకులు కూడా చర్చలలో తాము కలిసి ఉన్నామనే చెబుతున్నారు. బీజేపీ ముఖ్య నేతలూ తమ పొత్తు కొనసాగుతుందని చెబుతున్నారు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గరవాలని తహతహ లాడుతున్న టీడీపీ జనసేనకు కూడా ఎప్పుడూ సంకేతాలు పంపుతూనే ఉంది. ఈ సందర్శాన్ని వెంటనే ఉపయోగించుకుని రంగంలోకి దిగిన చంద్రబాబు పవన్‌కు సంఘీభావం చెప్పడమే గాక తాము ఉభయలం కలసి ఏపీలో ప్రజాస్వామ్య పునరుద్దరణ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. బీజేపీ నుంచి వామపక్షాల వరకూ అందరినీ ఒకతాటిపైకి తెస్తామని వారు చెబితే అదేదో నిజమైనట్టు కొన్ని మీడియా సంస్థలు విపరీతమైన హైప్ ఇచ్చాయి. చరిత్రే మారిపోతోందన్నంత మోతమోగించాయి. పవన్ చంద్రబాబు ఉభయులూ కూడా బీజేపీ పేరెత్తకపోవడాన్ని మాత్రం ప్రశ్నించలేదు. సీపీఐ(ఎం) నాయకులు రాఘవులు, శ్రీనివాసరావు తదితరులు పవన్ మాటల్లోని డొల్లతనాన్ని ద్వంద్వత్వాన్ని సూటిగానే ప్రశ్నించారు. ప్రజా ఉద్యమాలపై నిర్బంధం, సమస్యలపై తప్పు నిర్ణయాలను ఖండించడంలో కలసి పాల్గొన్నా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే ఒక సిద్ధాంతరహితమైన రాజకీయ కూటమి కట్టడం జరిగేపని కాదని వారి మాటలు స్పష్టం చేశాయి. 2018లో బీజేపీ నుంచి విడిపోయి ధర్మయుద్ధం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చేస్తే అంతా అయిపోయినట్టేనన్నట్టు మాట్లాడుతున్నారు. కేంద్రంపై తానుగా పోరాడని వైసీపీ గతంలో మోడీపై చంద్రబాబు విమర్శలు గుర్తు చేస్తోంది. మొత్తంపైన ఇవి తాత్కాలిక రాజకీయావసరాల వ్యూహాలు తప్ప నిబద్ద రాజకీయాలు కాజాలవు. ఎంతో దూరంలో ఉన్న ఎన్నికల పొత్తులపై ఊహాగానాలు చేసే బదులు ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు, రాజదాని, పోలవరం, విశాఖ ఉక్కు వంటి అంశాలపై అందరూ కలసి పోరాడటం ముఖ్యం.
తెలంగాణలోనూ ప్రశ్నలు
ఇదే సమయంలో ఏపీలో జోడో యాత్రకు వచ్చిన రాహుల్‌గాంధీ 2024 తర్వాత అవసరమైతే జగన్ సహాయం తీసుకోవడం గురించి ప్రశ్నించగా జవాబు దాటేశారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి టీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒకటేనన్నట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తున్నది. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వంపైనే అత్యధికంగా దాడి చేస్తూ బీజేపీపై పోరాటాన్ని రెండోస్థానంలో ఉంచుతోంది. బీజేపీలో దూకిన కాంగ్రెస్ నేత రాజగోపాలరెడ్డిని ఓడించేందుకు మునుగోడులో ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకరరెడ్డికి మద్దతునిస్తున్నాయి. బీజేపీపై తీవ్రరాజకీయ విమర్శ చేస్తున్న కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్గా మార్చి దేశమంతటా పోరాడతానంటున్నారు. అయితే కేసీఆర్ బీజేపీపై పోరాటం విషయంలో స్పష్టత నివ్వాలని సీపీఐ నాయకులు నారాయణ కోరారు. ఈ పోరాటంలో కాంగ్రెస్ స్థానమేమిటో కూడా చెప్పాలంటున్నారు. కాంగ్రెస్ విషయంలో కేసీఆర్ దాటవేత నిజమే అయినా ఈ దశలో దాన్ని షరతుగా పెట్టడం జరిగేది కాదు. పైగా కాంగ్రెస్ కూడా తన గెలుపే కీలకమైనట్టు వ్యవహరించడం కేరళ నుంచి తెలంగాణ వరకూ కనిపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు రోజుకో దాడి చేస్తూ రాజకీయ వ్యాపారవర్గాలపై ఒత్తిడి పెంచుతుంటే బీజేపీ నేతలు ముందే వాటి గురించి సూచనలిస్తున్నారు. ఈ దాడులకు గురవుతున్న వారిలో ఏపీ ప్రముఖులూ ఉన్నారు. బీఆర్ఎస్ ఏపీలోనూ పోటీ చేస్తుందా అనే చర్చ ఒకటైతే ఇరు రాష్ట్రాల నేతలూ గతంలో లాగా రెండు చోట్ల విషయాలు కలగలపి చర్చ చేస్తున్నారు. వైఎస్ షర్మిల వైఎస్ఆర్టిపి రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించడమే గాక ఢిల్లీకి వెళ్లి సిబిఐకి ఫిర్యాదు చేసి వచ్చారు. పవన్‌కళ్యాణ్ తెలంగాణలో పోటీ ప్రకటించారు. అయితే గతంలో పోటీ ప్రకటించి బీజేపీ ఒత్తిడితో వెనక్కు తగ్గిన ఆయన గాని, చంద్రబాబుగాని ఇప్పుడు కూడా బీజేపీకి ఉపయోగపడే పాత్రే పోషిస్తారా అన్నది ప్రశ్నగానే వుంది.
వచ్చే ఎన్నికల తర్వాతనే
తెలంగాణలో బాగా బలహీనపడిన టిడిపిని బలోపేతం చేస్తానని ప్రకటించిన చంద్రబాబు ఇటీవల సమావేశాలు జరిపారు. ఆ పార్టీ మునుగోడులో పోటీ చేస్తామని సూచనలిచ్చి వెనక్కు తగ్గింది. కొన్నిచోట్ల ప్రచారంలో జెండాలతో టిడిపి కార్యకర్తలు కనిపిస్తున్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంతర్గత అనైక్యతతో తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. 2018లో మహాకూటమిగా ఏర్పడి పూర్తిగా దెబ్బతిన్న చంద్రబాబు అవే రాజకీయాలు పునరావృతం చేయాలనుకుంటున్నారని టిఆర్ఎస్ ఆరోపిస్తున్నది. నాష్ట్రానికి రావలసిన నిధులు కేంద్రం విడుదల చేస్తే మునుగోడులో పోటీ నుంచి తప్పుకుంటామని మంత్రి కెటిఆర్ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యను సీపీఐ(ఎం) కార్యదర్శి తమ్మినేనివీరభద్రం తప్పు పట్టారు. ఇది రాజకీయ విధాన సమస్యతప్ప మునుగోడుకో లేక తెలంగాణకో పరిమితమైంది కాదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు టిఆర్ఎస్ను బలపర్చడాన్ని షరా మామూలుగా కొన్ని శక్తులు అవహేళణ చేయడం జరుగుతున్నా లౌకిక వాదులు హర్షిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో అన్ని చోట్లా కాలూనేందుకు మోడీ షాలు పాచికలు వేస్తున్న పూర్వరంగంలో మునుగోడు ఎన్నిక ఫలితం కీలకమవుతుంది. ఇతరపార్టీల మల్లగుల్లాలు, రాజకీయ లెక్కలు కూడా ఈ ఏడాది కీలక రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఒక కొలిక్కి రావచ్చు. ఏ ఫలితాలేవైనా మోడీ ప్రభుత్వ కేంద్రీకృత పెత్తనం, మతతత్వ రాజకీయాలు, కార్పొరేట్ విధానాలు మాత్రం మారేవి కావు గనక వాటిని ప్రతిఘటించడం అనివార్యం.
- తెలకపల్లి రవి