Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాస్యనటుడు బ్రహ్మనందం ఓ ఇంటర్వ్యూలో 'నా ఫేసే నా ఎస్సెట్' అని ప్రకటించారు. తన ముఖకవలికలతోనే హాస్యం పండించగలరు. ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగలరు. బహుషా అందుకే ఆయన అలా ప్రకటించి ఉంటారు. రాజకీయ నేత బండి సంజయ్ మాత్రం అసందర్భానుసారంగా మాట్లాడి కూడా జనాన్ని భలే నవ్విస్తారు. మరి ఆయనకు అదే ఎస్సెట్..! అందుకు ఉదాహరణకు ఇటీవల ఆయన మునుగోడు ఉప ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ... బీజేపీ సిద్ధాంతాలు, కమ్యూనిస్టులు సిద్ధాంతాలు ఒక్కటేనంటూ రాగాలు తీశారు. ''ఓ బండి అదెలా'' అంటూ సభికుల్లో నవ్వులు ప్రతిధ్వనించాయి. మనుధర్మ సిద్ధాంతానికి, మార్క్సిస్టు సిద్ధాంతానికి పోలికే లేదు. బీజేపీది అశాస్త్రీయమైన ఆలోచన కాగా, మార్క్సిజం శాస్త్రీయమైనది. కులాలు, కులవివక్ష, అంటరానితనం, ముఢ నమ్మకాలను ప్రోత్సహించడంతోపాటు ప్రజలు అజ్ఞానులుగా ఉండాలని బలం విశ్వసించే మీరు... కుల రహిత సమాజం, దోపిడీలేని సమానత్వం సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కమ్యూనిస్టులతో పోలిక పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఏ రోజూ కమ్యూనిస్టుల గొప్పతనం గురించి మాట్లాడని కమలనాథులు మునుగోడులో మాత్రం ఓట్లకోసం మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టుల అడ్డాలో గొప్పగా మాట్లాడితే ఓట్లు పడతాయేమోనని భావించినట్టున్నారు. కానీ ప్రజలేమీ అమాయకులు కారు. విభజన రాజకీయాలు, మతచిచ్చు, మత ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్దిపొందాలని భావిస్తున్న బీజేపీ నేతలకు మునుగోడులో పగటి చుక్కలే చూపెడతారు.
- గుడిగ రఘు