Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకురాలి అవతారమెత్తి... ''అత్యద్భుతమైన'' విషయాన్ని ఇటీవల ఆవిష్కరించారు. కాకపోతే అది ఆర్థిక నిపుణులకు సుతారామూ రుచించలేదు. వారికే కాదు... సాధారణ జనం సైతం నిర్మలమ్మగారి వాక్కులు విని అవాక్కయ్యారు. ఈ పాటికే మీకు విషయం అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోయినా, జ్ఞాపకం లేకపోయినా మరోసారి గుర్తుకు తెచ్చుకోండి. రూపాయిని పాపాయిలా కాపాడు కోవాల్సిన విత్తమంత్రి... డాలర్‌తో దాని మారకం విలువ రోజురోజూ పడిపోతున్నదంటూ దేశం మొత్తం గగ్గోలు పెడుతున్న వేళ... 'అబ్బే... అదేం లేదండీ...మన రూపాయి విలువ పడిపోలేదు.... డాలర్ విలువ పెరిగిందంతే...' అంటూ వదిలిన ''అమృతవాక్కులు'' విని మేధావులు ఫక్కున నవ్వుకుంటున్నారు. ఆ వెంటనే సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. 'ఏరా... ఈ మధ్య బాగా లావయ్యావురా...? అని ఒక స్నేహితుడు అడిగితే... 'నేను లావు కాలేదు... నిక్కరే టైటయ్యింది...' అంటూ మరో స్నేహితుడు చెప్పిన హ్యాసోక్తి బాగా వైరలయ్యింది. 'ఏరా... చింటూ మార్కులెందుకు తక్కువగా వచ్చాయి...' అని తల్లి అడిగితే... ఆ చింటూగాడు... 'నాకు తక్కువ రాలేదమ్మా... వేరే వాళ్లకు ఎక్కువ మార్కు లొచ్చాయి...' అనే వ్యంగ్య వీచికా బాగా పేలింది. రూపాయి విలువకు సంబంధించి మన కేంద్ర మంత్రి గారి నోటి నుంచి వెలువడిన వ్యాఖ్యలపై ఇలా అనేక వ్యంగ్యాస్త్రాలు ఇప్పటికీ వెలువడుతున్నాయి. మరి కేంద్ర బీజేపీ మంత్రుల ప్రజ్ఞాపాటవాలా మజాకా..!
-బి.వి.యన్.పద్మరాజు