Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ ఆకలి సూచిక తాజాగా 2022 సంవత్సరపు గణాంకాలను ప్రకటించింది. ఆకలి ఒక సమస్యగాలేని దేశాలను పక్కనపెట్టి 121 దేశాల వివరాలను ప్రకటించారు. వాటిలో భారతదేశం 107వ స్థానంలో ఉంది. 2014లో భారతదేశం స్కోరు 28.2 ఉండగా, అది తాజాగా 29.1కి పెరిగింది. ఈ స్కోరు ఎంత తక్కువగా ఉంటే ఆకలి ఆ దేశంలో అంత తక్కువగా ఉన్నట్టు లెక్క. మన దేశం ప్రపంచంలోనే అతి వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా ఉందని, అతి త్వరలో 5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కాబోతున్నదని, ముందుకు దూసుకొస్తున్న ఆర్థికశక్తిగా భారతదేశం రూపొందుతున్నదని మనదేశంలో అధికారికంగా తెగ ఊదరగొడుతున్నారు. ఆ ప్రచారంలో కొట్టుకుపోయినవారిని ఈ ప్రపంచ ఆకలి సూచిక వివరాలు తిరిగి నేల మీదకు తీసుకొస్తాయి. దక్షిణాసియా దేశాలలో మనకన్నా దిగువ స్థానంలో ఉన్నది ఒక్క ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే. యుద్ధాలతో దెబ్బతిన్న ఆ దేశం 109వ స్థానంలో ఉంది. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక సైతం మనకన్నా ఎగువన, 64వ స్థానంలో ఉంది. నేపాల్ 81వ స్థానంలో, బంగ్లాదేశ్ 84వ స్థానంలో, పాకిస్థాన్ 99వ స్థానంలో ఉన్నాయి.
ప్రపంచ ఆకలి సూచిక వెల్లడించిన విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగించేవేమీ కాదు. చాలామంది మేధావులు మన దేశంలో ఆకలి సమస్య తీవ్రంగా ఉన్నదని, అది నానాటికీ పెరుగుతోందని పలు సందర్భాలలో ఎత్తిచూపుతూనే ఉన్నారు. ఆకలి పెరుగుదల దేశంలో పెరుగుతున్న పేదరికాన్ని సూచిస్తుంది అన్న నిర్ధారణను ప్రణాళికా సంఘం మొదట్లో అంగీకరించింది. మన స్థూల జాతీయోత్పత్తి పెరిగిపోతోందని గొప్పలు ఎంతగా చెప్పుకున్నప్పటికీ, మన దేశంలో ఆకలి పెరుగుతున్నదనే వాస్తవాన్ని ప్రపంచ ఆకలి సూచిక బైటపెట్టింది. అంటే ఈ నయా ఉదారవాద కాలంలో మన దేశంలో పేదరికం పెరుగుతోందన్నమాట వాస్తవం అని స్పష్టమవుతోంది.
ఈ విధమైన నిర్థారణకు రావడానికి చాలా బలమైన ఆధారాలు ఉన్నాయి. నయా ఉదారవాద విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత 1993-94లో ఒకసారి, 2011-12లో రెండోసారి పెద్ద స్థాయిలో జాతీయ శాంపిల్ సర్వే నిర్వహించారు. రోజుకు 2200 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందలేకపోయినవారు 58 నుండి 68శాతానికి పెరిగినట్టు ఆ రెండు సర్వేల వివరాలు తెలియజేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కనీసస్థాయిగా నిర్ణయించిన 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందలేకపోతున్నవారు 57 నుండి 65 శాతానికి ఇదే కాలంలో పెరిగారు. ఈ రెండు సర్వేల తర్వాత మూడో పెద్ద శాంపిల్ సర్వే 2017-18లో చేపట్టారు. ఆ వివరాలు ఎంతగా భయం గొలిపేవిగా ఉన్నాయంటే వాటిని మొత్తంగానే కప్పిపుచ్చడానికి ప్రభుత్వం పూనుకుంది. అంతేగాక, జాతీయ శాంపిల్ సర్వే విధానాన్నే మార్చివేయడానికి నిర్ణయించింది. కాని బైటకు పొక్కిన వివరాల మేరకు గ్రామీణ భారతంలో తలసరి వినియోగం 2011-12 నుంచి 2017-18 మధ్య కాలంలో ఏకంగా 9శాతం మేరకు పడిపోయిందని తెలుస్తోంది.
అయితే, కొంతమంది పరిశోధకులు మాత్రం ఆకలి సూచికను బట్టి ప్రజల స్థితిగతులు దిగజారిపోయినట్టు భావించరాదని వాదిస్తున్నారు. ఆ వాదనలలో ఒక తరహాకు చెందినవి ఈ విధంగా ఉన్నాయి: అన్ని రంగాలలో ఈ కాలంలో పెరిగిపోయిన యాంత్రీకరణ వలన శ్రామిక ప్రజలకు గతంలో అవసరమైనంత శక్తి ఇప్పుడు అవసరం లేదని వారంటున్నారు. ఆ కారణంగానే శ్రామిక ప్రజలు ఆహారం కోసం తక్కువ ఖర్చు చేస్తున్నారని, ఆ మేరకు ఇతరత్రా వారి ఖర్చు పెరిగిందని ఆ పరిశోధకులు వాదిస్తున్నారు. రెండో తరహాకు చెందినవారు శారీరక శ్రమకు అవసరమైన కనీస శక్తి గురించి మాట్లాడడం లేదు కాని, ప్రజలు ఆహార ధాన్యాల వంటి మౌలిక అవసరాలకోసం చేసే ఖర్చు కన్నా రెడీమేడ్ ఆహార వస్తువుల కొనుగోలు కోసం, పిల్లల విద్య కోసం, వైద్య సంరక్షణ కోసం స్వచ్ఛందంగానే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. అందుచేత తలసరి ఆహారధాన్యాల వినియోగం తగ్గిపోవడం అంటే ప్రజల జీవన పరిస్థితులు దిగజారిపోయినట్టుగా భావించకూడదని, వాస్తవానికి అది ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడినదానికి సూచన అని ఈ రెండు తరహాల వారూ సూత్రీకరిస్తున్నారు. ప్రభుత్వం, ప్రపంచబ్యాంకు కూడా ఇదే విధంగా వాదిస్తున్నాయి.
ప్రాసెస్డ్ ఫుడ్‌ను, మాంసం కోసం పశువులకు, కోళ్ళకు పెట్టే దాణాను కలిపి లెక్క వేసినా, తలసరి ఆహారధాన్యాల వినియోగం తగ్గిపోయిందనడం నిస్సందేహం. తీసుకున్న ఆహారం వలన కలిగే శక్తి తలసరి కేలరీలుగా లెక్కించితే అది కూడా తగ్గిపోయింది. ఇదీ స్పష్టమే. అయితే ఈ విధంగా తగ్గిపోవడం అంటే పేదరికం పెరిగినట్టు భావించాలా లేక తగ్గినట్టు భావించాలా అన్నదే ఇప్పుడు వివాదం. పేదరికం పెరిగితే ఆకలి పెరుగుదలకు అది దారి తీస్తుందన్నది నిర్వివాదాంశం. కాని ఆహారధాన్యాల వినియోగం తగ్గితే పేదరికం పెరిగినట్టా లేక తగ్గినట్టా అన్నదే ప్రశ్న.
ఒకవేళ తలసరి ఆహార వినియోగం తగ్గిపోవడం అనేది ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడ్డా యన్నదానికి సంకేతమే అయితే, వృద్ధిరేటు చాలా ఆకర్షణీయంగా కనిపించే ఇతర దేశాలు కూడా ఆకలి సూచికలో భారతదేశం సరసన చోటు సంపాదించుకోగలిగి ఉండాలి కదా! ప్రపంచ ఆకలి సూచికలో 107 వస్థానంలో ఉన్న మనదేశం సరసన చోటు దక్కించుకున్న దేశాలు రువాండా (102వ స్థానం), నైజీరియా (103), ఇథియోపియా (104), రిపబ్లిక్ ఆఫ్ కాంగో (105), సూడాన్ (106), జాంబియా (108) ఆఫ్ఘనిస్థాన్ (109), తైమర్-లెస్టె (110). వీటన్నింటినీ కడు పేద దేశాలుగానే పరిగణిస్తారు. అందుచేత ఈ దేశాలు ఆకలి సూచికలో అట్టడుగు స్థానాలు దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగించదు. కానీ, మన దేశం ఆర్థిక వృద్ధిరేటు బట్టి పోల్చదగ్గ దేశాలు చైనా వంటివి ఉన్నాయి. చైనా ఆకలిసూచికలో 17వ స్థానంలో ఉంది. ఆకలిసూచికలో అగ్రస్థానంలో కొన్ని దేశాలకు ఉమ్మడిగా ఒకే ర్యాంక్ ఇచ్చారు. చైనా ఆకలి సూచిక స్కోరు 5. మన దేశం స్కోర్ 29.1 కన్నా అది ఎన్నో రెట్లు మెరుగు.
ఆర్థిక వృద్ధి బాగా కనపరుస్తున్న దేశాలలో వేరే ఏ ఒక్క దేశమూ భారతదేశం సరసన ఆకలి సూచికలో కానరాదు. దీనిని బట్టే ఆహారధాన్యాల వినియోగం తగ్గడం అభివృద్ధిని సూచిస్తుందంటూ వాదించేవారి వైఖరి ఎంత పనికిమాలినదో వెల్లడవుతోంది. పిల్లల చదువుకోసమో, కుటుంబ ఆరోగ్య పరిరక్షణ కోసమో ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని, అందుకే ఆహారధాన్యాల వినియోగం తగ్గిందని చెప్పేవారు ప్రపంచవ్యాప్తంగానే ప్రజలు విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తారని గమనించాలి. అదేదో మన దేశానికే ప్రత్యేకం కాదు. ఎటొచ్చీ విద్య, వైద్యం మన దేశంలో ఖరీదైన సేవలు అయిపోయాయి. అదే చైనాలో అవే సేవలు చవకగా లభిస్తాయి. మన దేశంలో తల్లిదండ్రులు తమ బిడ్డలను ఖరీదైన స్కూళ్ళలో చేర్చడం కోసం తాము కడుపులు మాడ్చు కుంటున్నారు. చైనాలో తల్లిదండ్రులు బిడ్డల చదువుకోసం తాము కడుపులు మాడ్చు కోవలసిన దుస్థితి లేదు.
ఇలా బిడ్డల చదువు కోసం తల్లిదండ్రులు కడుపులు మాడ్చుకోవలసిరావడం పేదరికం పెరుగుదలకు సూచనే తప్ప పేదరికం తగ్గిపోయిందనడానికి కాదు. అటు ఆహారం కోసం, ఇటు విద్య, వైద్యం కోసం ప్రజలు చేసే ఖర్చులో ఒకదానికోసం చేసే ఖర్చు పెరిగిపోయి నందువలన రెండవదానికోసం చేసే ఖర్చు తగ్గించు కోవలసిరావడం జీవన వ్యయం పెరిగి పోతోంద నడానికి సంకేతం. జీవన వ్యయం పెరిగిందంటే నిజ ఆదాయాలు పడిపోతున్నాయని దానర్థం. అంటే పేదరికం పెరిగిందనే దానర్థం.
నిజ ఆదాయాలు పెరిగితే దాని ఫలితంగా ప్రజలు తమ అవసరాలు తీర్చుకోవడం కోసం చేసే ప్రతీ ఖర్చులోనూ ఎంతో కొంత పెరుగుదల కనిపించాలి. కాని దానికి భిన్నంగా భారతదేశంలో ప్రజానీకం ఆహార వినియోగం కోసం చేసే ఖర్చులో (అది ప్రత్యక్షంగా ఆహారధాన్యాల కొనుగోలులో గావచ్చు, లేదా పరోక్షంగా పశువులకు మేపే దాణాలో కావచ్చు, లేదా ఫాస్ట్ ఫుడ్స్‌లో కావచ్చు) తగ్గుదల కనిపిస్తోంది. అంటే దానర్థం ప్రజల నిజ ఆదాయాలు తగ్గిపోతున్నాయి. అంటే పేదరికం పెరుగుతోంది. ఆకలిసూచికకు పేదరికానికి ప్రత్యక్ష సంబంధం ఉందన్న వాదన సరైన వాదన అని ఇది సూచిస్తోంది.
ప్రభుత్వ అధికారిక లెక్కలలో గాని, ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారంగాని దారిద్య్ర రేఖ అనేది తలసరి ఖర్చును బట్టి నిర్థారిస్తారు. ఆ ఖర్చును ధరల సూచీతో ముడిపెడతారు. అయితే ఆ ధరల సూచీ విద్య, వైద్యం వంటి సేవలు ప్రైవేటుపరం అయిన కారణంగా పెరిగే భారాన్ని లెక్కలోకి తీసుకోదంటే వాస్తవంగా ఆ రెండింటి కోసం చేసే ఖర్చు వాస్తవంగా ఎంత పెరుగుతోందో దానిని లెక్కలోకి తీసుకోదు. అంటే ఈ లెక్కలు వాస్తవ జీవనవ్యయాన్ని తగ్గించి చూపుతాయి. దానివలన పేదరికం తగ్గిపోయిందని నిర్థారిస్తాయి. ఇటువంటి తప్పుడు లెక్కల నిజస్వరూపాన్ని ప్రపంచ ఆకలి సూచీ బట్టబయలు చేస్తోంది.
- ప్రభాత్ పట్నాయక్
స్వేచ్ఛానువాదం