Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కఠినమైన, సంక్లిష్టమైన అంశాలతో మెదడు బద్దలు కొట్టుకునే బదులు, చాలా సరళమైన సామాన్యమైన అంశాల మీద దృష్టిపెడితే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. మొట్టమొదట ఒక చిన్న విషయం గమనిద్దాం. ప్రపంచంలో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తూ జరుగుతున్న హింసకు కారణాలేవో బేరీజు వేసుకుందాం. జరుగుతున్న హింసలో ఎక్కువశాతం ధర్మం పేరుతో జరుగుతూ ఉంది. 'ధర్మం' అనే లేబుల్ తగిలించుకుని జరుగుతూ ఉంది. కానీ, అదంతా 'ధర్మస్థాపన' కోసం కాదు. ఉగ్రవాదులైనా, సంప్రదాయవాదులైనా తాము తమ ధర్మాన్ని ప్రతిష్టాపించడానికి హింసకు పాల్పడుతున్నామని చెప్పుకుంటున్నారు తప్పిస్తే, ఆ హింస సమాజంలో నైతిక విలువలు, జీవన మూల్యాలు కాపాడడానికి ఏ విధంగానూ ఉపయోగపడటం లేదు. ఈ విషయాన్ని రుజువు చేయడానికి మనం మన దేశంలోని మూడు ప్రధానమైన మతాలు చెప్పే నైతిక సూత్రాల్ని విశ్లేషించుకుందాం...
హిందూ మతం ఏం చెపుతోంది? ''వసుధైక కుటుంబకం'' అని చెపుతుంది. ప్రపంచంలోని మనుషులందరూ తమ కుటుంబంలోని వారే అని అర్థం. అలాంటి భావన ఉన్నప్పుడు వీరు ముస్లింలను, క్రైస్తవుల్ని, బౌద్ధుల్ని, జైనుల్ని ఇంకా అన్యమతస్థుల్ని ద్వేషించవచ్చా? ద్వేషించకూడదు కదా? అందరూ తమ కుటుంబ సభ్యులే అనుకుని ప్రేమను పంచాలి కదా? కానీ పుష్యమిత్రుడి కాలం నుండి ఇప్పటి దాకా ఎప్పుడైనా అలా జరిగిందా? జరగనప్పుడు ఇక ఆ మతమెందుకూ? ఇక క్రైస్తవుల నైతిక సూత్రం ''లవ్ ద నైబర్'' అంటే పొరుగు వాణ్ణి ప్రేమించమని అర్థం. పొరుగు వారు ఎవరూ? అంటే నువ్వు ఉండే ఇంటికి నాలుగు వైపులా ఉన్న 77 కుటుంబాల వారు పొరుగువారే అవుతారు. అలా అని వారి మతమే చెపుతోంది. అలా చూసుకుంటూ పోతే విస్తృతమైన పరిధిలో ప్రంచ పౌరులందరూ మన పొరుగువారే. అలా అయినప్పుడు ద్వేషించడానికీ, పగ తీర్చుకోవడానికీ ఎవరూ ఉండరు. ఉండకూడదు కూడా! పొరుగు వారు హిందువులో, ముస్లింలో అయితే ద్వేషించవచ్చని అందులో లేదు. పొరుగువారు ఎవరైనా సరే, వారు ఏ ధర్మం ఏమతం పాటించే వారైనా సరే, ప్రేమించమనే ఉంది. మతాల, కులాల ప్రసక్తి అక్కడ లేనే లేదు. ''పొరుగువారు'' అన్నదే అక్కడ ప్రథానం. విశ్వజనీనమైన ఈ భావనకు మన తెలుగుకవి గురజాడ అప్పారావు కూడా స్పందించారు. 'స్వంత లాభము కొంత మానుకు / పొరుగువాడికి తోడుపడవోరు' అని అన్నారు కదా?
ఇక మూడవది ఇస్లాం - ''జిస్ వ్యక్తీ కె పడోసి భూకే పేట్ రహతా హై / ఉస్ కె లియె జన్నత్ క దర్వాజే కభీ నహీఁ ఖులేంగే'' - అన్నది ఇస్లాం మత నైతిక సూత్రం. ఇందులో జన్నత్ (స్వర్గం) అనే పదం వల్ల ఇది ముస్లింల సూత్రమని స్పష్టంగా తెలుస్తోంది. - నీ పొరుగువాడు ఆకలితో నకనకలాడుతూ ఉంటే, నీకోసం స్వర్గ ద్వారాలు యెలా తెరుచుకుంటారు- అనే ప్రశ్న ఉంది అందులో. ఇక్కడ మనం చెప్పుకున్న సూత్రాలు ఒక దానికి ఒకటి వ్యతిరేకం కాదు. ఒకే విషయాన్ని వేరు వేరు రకాలుగా చెప్పుకున్నట్లుగా ఉంది. మానవత్వాన్ని పరిరక్షించుకోవడమే మానవుడి ముఖ్య ధ్యేయమని ఈ మూడు మతాలే కాదు, ఇతర అన్ని మతాలూ చెప్పాయి. ఈ భావనలన్నీ మానవతను నిర్వచించడానికి ఉపయోగించిన అత్యున్నతమైన పరిభాష అని మనకు అనిపించడం సహజం!
ఇలాంటి పరిస్థితుల్లో ఏ మతానికి సంబంధించిన వారైనా, పైన చెప్పుకున్న నైతిక సూత్రాల ఆధారంగా హింసకు పాలుపడరు. హింసకు పూనుకోవడానికి కారణం ధర్మం కాదు - మతం కాదు. ఏ మతమూ ఇతర మతస్థుల్ని కొట్టి చంపమని చెప్పలేదు. మరి ఎందుకు హింసకు / ఉగ్రవాదానికి పాల్పడుతున్నారూ? అంటే... తమ అస్థిత్వాన్ని ప్రదర్శించుకోవడానికి! తమ ఆధిక్యతను అధర్మంగా స్థాపించుకోవడానికి!! అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి ధర్మ ప్రసక్తీ లేదన్నది వాస్తవం. ఇక్కడ మనకు రెండు విషయాలు కనిపిస్తున్నాయి. 1. వీఉ=Aూ×ు్ (నైతికత) 2. ×ణజుచీు×ు్ (అస్థిత్వం). నైతికత ప్రకారం చూస్తే అన్ని మతాల సూత్రాలు ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి వారు వీఉ=Aూ×ు్ విషయంలో గొడవలు పడడం లేదు. హింసకు దిగడం లేదు. రాజకీయాలు చేయడం లేదు. కానీ, తమ అస్థిత్వాన్ని, ఆధిక్యతను నిలుపుకోవడానికి అక్రమ మార్గాల్లో హింసకు పాల్పడుతున్నారు.
వివిధ మతాల వారు వివిధ రకాల దుస్తులు ధరిస్తున్నారు. వివిధ మత గ్రంథాలు చదువుతున్నారు. వారి పవిత్ర గ్రంథాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. వారు దర్శించే ధార్మిక కేంద్రాలు వేరు. వారి పూజా పద్ధతులు వేరు. సంప్రదాయాలు, ఆచారాలు వేరు. పుట్టినప్పటి నుండి చనిపోయే దాకా వారు అనుసరించే వేడుకలు, పండగలు, కర్మకాండలు (=×ుఖAూూ) అన్నీ వేరు వేరుగా ఉన్నాయి. వీటిలో వేటివల్లా వివిధ మతస్థుల మధ్య భేదాభిప్రాయాలు లేవు. ఎవరి పండగలు వారు జరుపుకుంటున్నారు. ఎవరి జాతరలు వారు జరుపుకుంటున్నారు. ఒక్కోసారి కొందరు ఇతర మతస్థుల వేడుకల్లో, పండగల్లో కూడా స్నేహ భావంతో పాలు పంచుకుంటున్నారు. ఈ రకమైన అవగాహనకు ముఖ్యంగా భారత దేశంలో ప్రాముఖ్యం ఉంది. ఈ దేశ ప్రజల్ని ముస్లిం పరిపాలించినా, క్రైస్తవులు పరిపాలించినా మతపరమైన ఘర్షణలు జరగలేదు. కానీ, తర్వాతి కాలంలో జరుగుతూ వచ్చిన మత ఘర్షణలు మతం ఆధారంగానో, లేక ధర్మం ఆధారంగానో జరగలేదు. కేవలం అస్థిత్వ స్థాపనకు, తమ 'పై చేయి'ని నిలుపుకోవడానికి చేసినవే! వాటి వల్ల సమాజం దెబ్బతిన్నదే గాని, ఎప్పుడూ ఎక్కడా ఏ మంచీ జరగలేదు. కొన్ని సంఘటనలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు గౌతమ బుద్ధుడి ప్రతిమను ధ్వంసం చేశారు. కారణం ఏం చెప్పారంటే... ఇస్లాం విగ్రహపూజకు వ్యతిరేకం కాబట్టి ఆ విగ్రహం ధ్వంసం చేశామన్నారు. హిందూ దేవాలయాల్లో దేవీ దేవతలకు పూజలు చేసినట్టు ఆఫ్ఘనిస్తాన్లోని ఆ పెద్ద బుద్ధుడి విగ్రహానికి నిత్యం అక్కడ ఎవరూ పూజలు చేసేవారు కాదు. అయినా ఏదో దొంగసాకుతో తమ ఆధిక్యతను నిలుపుకోవడానికి, తమను అక్కడ ఎవరూ అడ్డుకోలేరన్న ధీమాతో చేశారు. ప్రతిమల్ని పగలగొట్టమని ఇస్లాం మతం ఎక్కడా చెప్పలేదే? భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు రథయాత్ర పేరుతో దేశమంతా తిరగాడు. ఆయన ఏ మన్నాడూ? ''నా భగవంతుడైన రాముడు ప్రస్థుతం బాబ్రీమసీదు ఉన్న చోట పుట్టాడు. అది అతని జన్మస్థలం. అక్కడ మందిరం కట్టనంత కాలం రాముడిపై నాకు గల భక్తి పూర్తికాదు'' (జబ్ తక్ వహా మందిర్ నహీఁ బనావూఁ తబ్ తక్ మెరా రామ్ భక్తీ పూరా నహీవోగా) అని, ఆయనగారు రథయాత్ర సందర్భంగా దేశ ప్రజల చెవులు పగులగొట్టాడు కదా? తర్వాత కాలంలో బాబ్రీమసీదునే కూలగొట్టారు. ఇతర మతస్థుల కట్టడాలు కూలగొట్టమని ఏ హిందూ పురాణాల్లోనైనా చెప్పారా? ఎక్కడా చెప్పలేదే? ఇక్కడ జరిగింది కూడా అదే! ఒక దొంగసాకుతో, వక్ర బుద్దితో తమ ఆధిపత్యాన్ని సమాజంలో అక్రమంగా స్థాపించుకోవడానికి చేసిన కుట్ర.. దాడి! ఇందులో రహస్యమేమీ లేదు.
రాముడి జన్మస్థలం బాబ్రి మసీదు ఉన్నచోటేనని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు ఏవీ లేవని - సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. పైగా బాబ్రీ మసీదు అడుగున తవ్వకాల్లో బయటపడ్డవన్నీ హిందూ దేవాలయాల ఆనవాళ్ళు కావనీ, అవి బౌద్దారామాల ఆనవాళ్ళని ఆర్కియాలజిస్ట్‌లు పరిశీలించి చెప్పారు. మత ద్వేషాన్ని ఏ మతమూ పనిగట్టుకుని ప్రచారం చేయలేదు. కుత్సిత బుద్ధితో కొందరు దుండగులు మతం పేరుతో, ధర్మస్థాపన పేరుతో మానవ హననానికి పాల్పడ్డారు. ప్రస్థుతం కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ దాన్నే ఇంకా కొనసాగిస్తోంది. దీన్ని దేశ ప్రజలు తప్పకుండా అడ్డుకోవాల్సి ఉంది. ఒకప్పటి గంగా జమునా తహజీబ్‌ను నిలపుకోవాల్సి ఉంది.
మతం మాటున దాక్కుని - ఇతర మతస్థుల్ని దొంగ దెబ్బతీయడం మానాలి! మనుషుల్ని విడగొట్టే మతాలెందుకూ - అనే ప్రశ్న నేటి తరాన్ని తీవ్రంగా వేధిస్తూ ఉంది. కుల మతాల్ని వదిలేసి మనుషులు మనుషులుగా హాయిగా హుందాగా బతకొచ్చు కదా? అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి తన గేయంలో ''మతం వద్దు గతం వద్దు మారణహౌమం వద్దు'' అని అన్నారు. అంతే కాదు, ''మతమన్నది నా కంటికి మసకైతే / మతమన్నది నా మనసుకు మబ్బయితే / మతం వద్దు గితం వద్దు మాయా మర్మం వద్దు- / ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే / కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే / మతం వద్దు గతం వద్దు మారణ హౌమం వద్దు- / మతమన్నది లోకానికి హితమైతే / హిందువులం ముస్లింలం అందరమూ మానవులం / అందరమూ సోదరులం'' అని కూడా నొక్కి చెప్పారు కృష్ణశాస్త్రి. మతాలు - మనుషుల్ని సన్మార్గంలో పెట్టలేనప్పుడు అవి విఫలమైనట్టే కదా- అని మన మంటున్నాం. అలాంటప్పుడు వాటిని వదిలేస్తే వచ్చే నష్టం ఏముందనీ?
ఇక్కడ ఇంతియాజ్ మహ్మద్ అనే నాస్తికుడు చెప్పిన అంశం గూర్చి సీరియస్‌గా ఆలోచించాలి... ''ఒక వేళ 190 కోట్ల మంది ముస్లింలు, వారి మసీదుల్లో, 100కోట్ల మంది హిందువులు వారి దేవాలయాల్లో, 250 కోట్ల మంది క్రైస్తవులు వారి చర్చీల్లో మూకుమ్మడిగా - కేవలం ఒకే ఒక్క మనిషి కాన్సర్ తగ్గాలని ప్రార్థించారని అనుకోండి... ఆ ప్రార్థనలు ఫలిస్తాయా? ఫలించవు కదా! అన్ని కోట్ల మంది తప్పుడు నెంబర్‌కు ఫోన్ చేస్తున్నట్లే కదా? అదే ఎవరో ఒకరు ఆసుపత్రికి ఫోన్‌చేసి, అతణ్ణి తరలించారనుకోండి... తప్పకుండా మంచి ఫలితం ఉంటంది!'' ఇదీ వాస్తవం!!
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు