Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నప్పుడు స్కూలులోగాని, కాలేజీలోగాని 'కత్తి గొప్పా-కలం గొప్పా' అంటూ వక్తృత్వ పోటీలు పెట్టేవారు. అధిక విద్యార్థులు 'కలం' గొప్ప అని చెప్పేవారు. కానీ, నేడు ఈ దేశంలో కత్తే గొప్పగా మారుతోంది. బ్రిటిషువారి వలస పాలనలో వనరులు కొల్లగొట్టబడడమేగాక ప్రజలు బానిసలుగా మగ్గిపోతున్నారని ప్రాణత్యాగాలతో పోరాడి స్వాతంత్య్రం సంపాదించుకోవడం జరిగింది. మనకు మనమే పాలనా విధానం కోసం ఓ రాజ్యాంగాన్ని రచించుకున్నాం. సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమన్యాయం మన ప్రధాన లక్ష్యాలనుకున్నాం గానీ, నడుస్తున్న కాలాన్ని చూస్తే అవన్నీ అపహాస్యమవుతున్నాయని తెలుస్తోంది. ఇదేనా మనం కోరుకున్న స్వతంత్ర భారతదేశం అనిపిస్తోంది. ఇప్పటికి స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు పూర్తయ్యాయని సంబరాలు చేసుకోవడం ఒక్కటే సరిపోదు, ఒక్కసారి వెనక్కి తిరిగి అవలోకనం చేసుకుంటే ఏమి సాధించామో తెలుస్తుంది. స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు 'తెల్లవాడు పోయి నల్లవాడు వచ్చాడు, కాని సామాజిక మార్పు రానిదే స్వతంత్య్రం సిద్దించినట్లు కాదు' అంటు పెరియార్ రామస్వామి చెప్పారు. 'స్వాతంత్య్రం వచ్చేనని సభలే చేసి/సంబర పడగానే సరిపోదోయి/' అంటూ శ్రీశ్రీ కూడా ఏనాడో హెచ్చరించారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడినవారే పాలించాలని, అందుకు పౌరులందరికి ఓటు హక్కు ఇవ్వడమేగాక ఎన్నికలలో పోటీ చేసే హక్కు ఉందని చెప్పుకున్నాం. ప్రజాస్వామ్యం నిలబడాలంటే మీకు 'ఓటు' అనే ఆయుధాన్ని ఇస్తున్నాను. దాన్ని మీరు ఉపయోగించుకునే దాన్నిబట్టి ఈ దేశ పరిస్థితి ఉంటుంది' అని అంబేద్కరు ఆనాడే చెప్పాడు. కానీ, ఈనాడు ఎన్నికలలో ఓటు దుర్వినియోగాన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. అందుకు ప్రస్తుతం జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక తాజా ఉదాహరణ. కులాల పేరున ఓట్లు దండుకునే పరిస్థితి. మరోవైపు మతం పునాదిగా ఈ దేశంలో పార్టీలే ఏర్పడి, మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటున్నాయి.
ఇదంతా ఒక ఎత్తయితే, డబ్బు, మందు, మాంసం మొదలైన ప్రలోభాలు మరోఎత్తు. స్వతంత్య్రం వచ్చిన కొత్తలో దేశభక్తి కలిగి, సేవాతత్పరత, చదువు కలిగిన వ్యక్తులే ఎన్నికలలో పోటీ చేసేవారు. ఆ తరువాత తరువాత రౌడీల అండ కలిగినవారు నిలబడగా, రాను రాను రౌడీలు, రియల్ ఎస్టేటు దందా చేసేవారు, బడా వ్యాపారులు, మాఫియాలతో సంబంధాలున్నవారే ఎన్నికలను శాసించడం, పోటీ చేయడం జరుగుతోంది. ఓటర్లను ఆకర్షించడానికి కులం, మతం, ప్రాంతంతోపాటు డబ్బు, మద్యం పంపిణీ బాగా పనిచేస్తోంది. ఇప్పుడు ఓటరును ఏ స్థాయికి దిగజార్చారంటే, అభ్యర్థి గెలిస్తే నాకేమి వస్తుంది, అందుకే ఎన్నికలప్పుడే చేతిని తడుప్పుకోవాలనే స్థితికి తెచ్చారు. ప్రచారానికి వచ్చిన ప్రతి అభ్యర్థి దగ్గరా డబ్బును, మందును, మాంసాన్ని తీసుకుంటున్నారు. అభ్యర్థులు ఎలక్షన్ కమిషను నిర్ణయించిన ఎన్నికల ఖర్చుకంటే కొన్ని వందల రెట్లు ఖర్చు చేస్తున్నారు. హవాలా డబ్బు డ్రైనేజయి పారుతోంది, అవినీతి అందలం ఎక్కుతోంది. ఎన్నికలలో అభ్యర్థులు చేసే అక్రమాలు అంతా ఇంతా కాదు. బాహాటంగా రోడ్లపైనే నాయకులు టేబుళ్ళు పెట్టి మందు సీసా, కోడిని ఓటరుకు పంచి పెడుతుండడాన్ని మీడియా చూపుతున్నా ఎన్నికల కమిషన్‌గాని, న్యాయస్థానాలుగాని, జిల్లా పోలీసు యంత్రాంగంగాని అంతా కబోదిలా చూస్తుండి పోతున్నారేగాని ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎన్నికలంటే చాలామంది నిరుద్యోగులు, కార్యకర్తలు, లేబరుకు ఓ పండుగగా మారింది. కష్టపడే కార్మికులు, శ్రామికులు ఎన్నికల సమయంలో అభ్యర్థి ఇచ్చే డబ్బు, మందు, మాంసానికి ఆశపడి తమ పనులకు పోకుండా సోమరులవుతున్నారు. దానితో పరిశ్రమలు, నిర్మాణ వ్యవస్థ, వ్యవసాయ పనులకు కార్మికులు, శ్రామికులు సరిగ్గా దొరక్క కుంటుపడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి తిరిగి ఓటరు ముఖం చూడడు. తాను ఎన్నికలలో ఓట్లు వేయించు కోవడానికి అడ్డగోలుగా పెట్టిన ఖర్చుకు ఎన్నో రెట్లు రాబట్టుకోవడానికి అవినీతి, అక్రమాలకు పాలుపడతాడు. ఏ ఓటరైనా అతన్ని అడిగితే, 'నీవు డబ్బులు తీసుకొని ఓటు వేసావు, అడగడానికి నీకేమి హక్కు ఉందంటు' ఆ అభ్యర్థి ఓటరునే నిలదీస్తున్నాడు! ఈ విధంగా ప్రజాస్వామ్యం స్థానంలో ధనస్వామ్యం చోటు చేసుకుంటున్నది.
అయితే, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేసేవారూ ఉన్నారు. ఒకవేళ పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరూ తన మనసుకు అర్హుడు కాడనుకుంటే నోటాకు వేసేవారూ ఉన్నారు. 'పైన నిలబడిన వ్యక్తు లెవరూ ఎన్నికలలో నిలబడడానికి అర్హులు కారు' అనే భావనకు సూచనగా 'నోటా' పై ఓటు వేయడానికి ఒక కాలమ్‌ను ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. కానీ, ఇట్టి నోటా విలువలేని రూపాయిలాంటిదీ, ఎండమావి లాంటిదే. అలాంటప్పుడు దానివల్ల ఉపయోగమేమిటి? ఎన్నికల్లో సరియైన ప్రజాస్వామిక వ్యక్తులే నిలబడాలంటే 'నోటా'కు వేసిన ఓటుకూ విలువ ఇవ్వాలి. నిలబడిన అభ్యర్థులలో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి కంటే నోటాకు ఓట్లు ఎక్కువ వచ్చినట్లయితే, ఆ ఎన్నికలో పోటీ చేసిన ఏ అభ్యర్థి కూడా తిరిగి పెట్టబోయే బై ఎలక్షన్లో నామినేషను వేసే అర్హత లేకుండా చేయాలి. నోటాకు విలువ ఇవ్వడమనేది జరిగితే ఇది ఎన్నికల సంస్కరణలలో ఒక ముఖ్యమైన భాగం కాగలదు.
- తుమ్మా భాస్కర్