Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పతాకాన్ని ఎత్తి పట్టండి! - బలాన్ని కూడగట్టండి!! - సంఘీభావాన్ని పెంచండి!!! - అంకిత భావాన్ని అలవర్చుకోండి!!!!
చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభలు అక్టోబరు 22న విజయవంతంగా ముగిసాయి. భౌగోళిక ఆర్థికవ్యవస్థలో చైనాకి వున్న ప్రముఖస్థానం మూలంగా ఈ మహాసభలను ప్రపంచం ఆసక్తిగా గమనించింది. 2021లో చైనా స్థూల జాతీయత్పత్తి (జీడీపీ) 17.1 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది ప్రపంచ జీడీపీ మొత్తంలో 18.5శాతం. 2013 నుంచి 2021 దాకా, భౌగోళిక వృద్ధిరేటు 2.6 శాతంగా ఉంటే, చైనా దానిని అధిగమించి సగటు వార్షికాభివృద్ధి రేటు 6.6శాతాన్ని సాధించింది. 2013-2021 మధ్యకాలంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో చైనా వాటా 38.6శాతం. ఇది జీ-7 దేశాల మొత్తం ఆర్థికాభివృద్ధిని కలిపిన దానికన్నా ఎక్కువ. 2020లో చైనా, అమెరికాను అధిగమించి మొదటిసారి ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య దేశంగా అవతరించింది. 2021లో విదేశీ వ్యాపారంలో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవటమేగాక, 6.9 ట్రిలియన్ డాలర్లకు తన విదేశీ వాణిజ్యాన్ని విస్తరించింది.
చైనా ఒక సోషలిస్టు దేశం కావటం మూలంగా ఈ మహాసభలకున్న ప్రాముఖ్యం మరింత పెరిగింది. చైనా ప్రజల తలసరి స్థూల ఆదాయం 11,890 డాలర్లకు చేరి, 2012లో ఉన్న తలసరి స్థూల ఆదాయానికి రెట్టింపయింది. ఆదాయంలో పెరుగుదలవల్ల, విద్యా వైద్య సంరక్షణలో మెరుగుదలవల్ల 2020లో చైనా ప్రజల ఆయుప్రమాణం 77.9 సంవత్సరాలకు చేరింది. భౌగోళిక సగటు ఆయుప్రమాణం కన్నా ఇది 5.2 సంవత్సరాలు ఎక్కువ. ఇవన్నీ సోషలిస్టు వ్యవస్థ అధిక్యతను తెలియచేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
9 కోట్ల 60 లక్షల మంది కమ్యూనిస్టు ప్రాథమిక సభ్యులకు, 49లక్షల ప్రాథమిక స్థాయి పార్టీ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తూ 2296మంది డెలిగేట్స్ ఈ మహాసభలకు హాజరయ్యారు. మహాసభకు నివేదిక సమర్పించటానికంటే ముందు ఒక పెద్ద ప్రజాస్వామిక కసరత్తు జరిగింది. కమ్యూనిస్టుపార్టీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో 54సంస్థలు 26కీలక కర్తవ్యాలపై విస్తృతమైన పరిశోధనచేసి, 80పరిశోధనా పత్రాలను తయారుచేశాయి. మహాసభకు సమర్పించే ముసాయిదా నివేదికకు ఇవే ఆధారం. ఈ ముసాయిదా నివేదికపై ఆన్లైన్లో ప్రజల అభిప్రాయాలను కమ్యూనిస్టుపార్టీ సేకరించింది. ఆవిధంగా ముసాయిదాపై 85లక్షల 4వేల కామెంట్స్ వచ్చాయి. 4700మంది తమ అభిప్రాయాలు నేరుగా వెలిబుచ్చారు.
సమీక్షాకాలంగా ఉన్న గత ఐదేండ్లు అనేక ఘటనలతో నిండివుందని నివేదిక పేర్కొంది. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, పర్యావరణ అభివృద్ధి అనే అంశాలతో కూడిన ఐదు రంగాలకు చెందిన సమగ్ర పథకాన్ని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్ళటంలో చైనా కమ్యూనిస్టు పార్టీ విజయవంతమైందని నివేదిక పేర్కొంది. 'ప్రజల ప్రజాస్వామిక సర్వంసహ ప్రక్రియను ప్రోత్సాహించటం, అభివృద్ధికర సోషలిస్టు సంస్కృతిని పెంపొందించటం, ప్రజాశ్రేయస్సును మెరుగు పరచటం' పార్టీ చేయగలిగిందని ఆ నివేదికలో చెప్పారు. 2021లో చైనా కమ్యూనిస్టు పార్టీ స్థాపించి వందేండ్లు అయిన సందర్భంగా నిర్దేశించుకున్న రెండు లక్ష్యాలలో మొదటిదైన నిష్ట దరిద్రాన్ని నిర్మూలించటం, తగు మొతాదులో సంపద్వంతమైన సమాజాన్ని నిర్మించటంలో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించింది. అభివృద్ధికరమైన, సామరస్య సామ్యవాద సమాజాన్ని 2049 నాటికల్లా చైనాలో ఏర్పరచాలానే వందేండ్ల రెండవ లక్ష్యాన్ని చేరుకోవటానికి పార్టీ నాయకత్వం వహిస్తున్నది. (2049 అంటే చైనాలో కమ్యూనిస్టులు రాజ్యాధి కారానికి వచ్చి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడి వంద సంవత్సరాలు అవుతుంది)
చైనా కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, చైనా ప్రధాని అయిన లీ కెకియాంగ్ ప్రజల ప్రాధమిక ప్రయోజనాలు కాపాడటం చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కర్తవ్యం అని మహాసభలో నొక్కిచెప్పారు. అభివృద్ధి కోసం సాగే క్రమంలో ప్రజల శ్రేయస్సును కాపాడటం, దానిని మరింత మెరుగు పరచటం ముఖ్యం అని అన్నారు. ఆధునికీకరణ ఫలితాలు అందరికీ పూర్తిగా, సమానంగా చేరువకావాలి అని అన్నారు.
దేశంలోని దరిద్య్రాన్ని పూర్తిగా అంతమొందించటంలో, అలాగే కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న యుద్ధంలో, ప్రజల జీవితాలు, ఆరోగ్యాలు సాధ్యమైనంత గరిష్ట స్థాయిలో కాపాడటంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి ఏ సూత్రాలు మార్గదర్శకంగా ఉంటాయి. పెట్టుబడిదారీ దేశాలు చేసే విధంగా, చైనా ఎన్నడూ ఆర్థికప్రయోజనాలకు మాత్రమే పట్టం కట్టదు, ప్రజల జీవితాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది.
మహాసభలో నివేదికను ప్రవేశపెడుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి షీ జిన్ పింగ్, తామెప్పుడూ పార్టీ ప్రాధమిక సూత్రాలను మరచిపోమని, మార్క్సిజం, సోషలిజంపట్ల అంకితభావాన్ని మార్చుకోము అని ఉద్భోధించారు. పార్టీ ఎప్పటికీ తన లక్షణాన్ని, స్వాభావాన్ని లేక ధృడవిశ్వాసాన్ని వదులుకోదని చెప్పారు. చైనా కమ్యూనిస్టు పార్టీ విజయానికి, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం స్థాపనలో విజయం పొందటానికి కారణం ''ముఖ్యంగా చైనా సందర్భానికి తగినట్టుగా, నేటి అవసరాలకు అనుగుణంగా అనుసరిస్తే మార్క్సిజం పనిచేస్తుంది'' అని జిన్ పింగ్ అన్నారు. స్వభావాన్ని మార్చుకోవటం లేదా సోషలిస్టు వ్యవస్థను వదిలివేయటం ద్వారా చైనా ఎప్పటికీ తన మార్గాన్ని వీడదు' అని వక్కాణించారు.
ఒత్తిడులకు, బెదిరింపులకు చైనా ఎప్పుడూ తలవంచదని, ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొంటుందని షీ జిన్ పింగ్ ప్రతిజ్ఞ చేశారు. ఆచంచలమైన అంకితభావంతో, సమయానికి తగ్గ సమాధానాలు ఇవ్వటం ద్వారా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటం ద్వారా పార్టీ మున్ముందుకు సాగుతుందని అన్నారు. కమ్యూనిస్టులు ఎల్లవేళలా తమకుతాము సంస్కరించుకోవటానికి సిద్ధంగా ఉండాలని, సోషలిజం నిర్మాణంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను అధిగమించు కుంటూ సాగాలని అన్నారు. ఈ క్రమంలో అవినీతికి వ్యతిరేకంగానూ, ఆ అవినీతికి ఆస్కారమిచ్చే పరిస్థితులు ఉన్నంతకాలం పార్టీ పోరాడుతూనే ఉంటుందని ధృడంగా చెప్పారు.
అవినీతికి వ్యతిరేకంగా పార్టీ సాగించిన నిర్ణయాత్మక పోరాటం తగిన ఫలితాలను ఇచ్చిందని సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లేన్ ఇన్ప్‌క్షన్ (క్రమశిక్షణా సంఘం) మహాసభకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం, 19వ మహాసభ నుంచి 74 వేల మందికి పైగా విచారణ జరిపి, అవినీతి సంబంధిత నేరాలకు శిక్ష విధించటం జరిగింది. ఇందులో 48శాతం 18వ మహాసభకు ముందు, 11.1శాతం మహాసభకు ముందుకాలంలో మొదటిసారి ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఇది క్రమంగా నేరాల సంఖ్య తగ్గటాన్ని తెలియ చేస్తున్నది. కమ్యూనిస్టు పార్టీ నిరంతర ప్రయత్నాల మూలంగా 2022లో సర్వే చేయబడిన ప్రజలలో 97.4శాతం మంది పార్టీ యొక్క పూర్తి కఠినతరమైన స్వయం పాలన 'అత్యంత ప్రభావవంతం'గా ఉన్నదని భావించారు. 2012లో 22.4శాతం మందిమాత్రమే ఇలా భావించినవారు ఉన్నారు. 2015 నుంచి పార్టీ అధికారులు, వారి కుటుంబ సభ్యుల వ్యాపార కార్యకలాపాలపై నిఘా పెంచటం జరిగింది. 4700మంది అధికారులు, వారి భాగస్వాములు, పిల్లల వ్యాపార కార్యకలాపాలను క్రమబద్దీకరించటం జరిగింది. ''పులులను బయట పడేయటం, దోమలను నలిపి చంపటం, నక్కలను వేటాడటం'' కోసం 'కీలక ప్రాంతాలు, రంగాల'పై ఫోకస్ పెట్టటం జరిగిందని, అవినీతికి వ్యతిరేకంగా జరిగే ఈ సంక్లిష్ట సమరంలో విజయం సాధించాలి అని నివేదికలో పేర్కొన్నారు.
1982 నుంచి పార్టీ మహాసభల్లో నిబంధనావళికి సవరణలు తీసుకురావటం సాధారణమైన అంశంగా ఉన్నది. 'సైద్ధాంతికంగా నూతన ఆలోచనలకు, ఆచరణాత్మక పరిణామానికి' తగినట్టుగా ఇది జరుగుతున్నది. 'వ్యూహత్మక ఆలోచన' ప్రతిరూపాలుగా ఈ సవరణలు సూచిస్తున్నాయి. 'చైనా సందర్భం నుంచి, కాలానికి తగినట్టు మార్క్సిజాన్ని అనుసరించటంలో తాజాగా సాధించిన విజయా లకు' అనుగుణంగా ఇవి ఉన్నాయి. ఆధునీకరణకు చైనా అనుసరించిన మార్గం ద్వారా చైనా పునరుజ్జీవనాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడం పార్టీ కేంద్ర కర్తవ్యంగా పేర్కొని, దానినే సవరించిన పార్టీ రాజ్యాంగంలో చేర్చటం జరిగింది.
205 మంది సభ్యులతో, 171మంది ప్రత్యామ్నాయ సభ్యులతో, మహాసభ నూతన కేంద్రకమిటీని ఎన్నుకున్నది. 133మందితో కూడిన నూతన క్రమశిక్షణ కమిటీ (సీసీడీఐ)ని ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నుకోబడిన కేంద్ర కమిటీ అక్టోబర్ 23న సమావేశమై ప్రధాన కార్యదర్శిగా షీ జిన్ పింగ్‌ను తిరిగి ఎన్నుకున్నారు. జిన్ పింగ్‌తో పాటు ఏడుగురు సభ్యులతో కూడిన పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీని ఎన్నుకున్నారు. షీ జిన్ పింగ్‌ను చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు ఛైర్మన్‌గా కూడ ఎన్నుకున్నారు.
తన ముగింపు ఉపన్యాసంలో జిన్ పింగ్ చైనా కమ్యూనిస్టు పార్టీకి తెగించి పోరాడే ధైర్యం, గెలిచే సాహసం ఉందన్నారు. ''ఈ నూతన ప్రయాణంలో మరిన్ని కొత్త, మహాత్తర నవీన-యుగపు అద్భుతాలు సృష్టించగలమన్న విశ్వాసం సామర్థ్యం, మనకు మెండుగా ఉన్నాయి. అవి యావత్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తాయి'' అన్నారు. తదనంతరం అక్టోబర్ 23న జరిగిన మీడియా సమావేశంలో జిన్ పింగ్ మనం మహాసభ జెండాను సమున్నతంగా నిలబెడదాం. మన సర్వ శక్తులను కూడదీసుకుందాం. అంకిత భావంతో సంఘీభావాన్ని అభివృద్ధి చేద్దాం! అదే ఈ మహాసభ మనకిచ్చిన కర్తవ్యం. చైనాలో సోషలిస్టు సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీకి శుభాకాంక్షలు తెలియచేద్దాం.
- ఆర్. అరుణ్‌కుమార్