Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఎన్నో చిత్ర, విచిత్రాలు కనిపిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు చేయని సాహసమూ లేదు, పడని కష్టమూ లేదు. నాయకుల గుంపులను చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. ఖద్దర్ చొక్కాలతో గ్రామాలు తెలుపుమయమవు తున్నాయి. డప్పుల మోత, మైక్చప్పుళ్లు, కార్యకర్తల నినాదాలతో నెల రోజులుగా గ్రామాలు హోరెత్తు తున్నాయి. రచ్చబండ వద్ద కోలాహలంతో సందడి చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ప్రచారానికి వచ్చిన వారికి కనీస సౌకర్యాల కోసం అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో పేదరికం కనిపిస్తున్నది. సొంత ఇండ్లులేని దీనులు తారసపడుతున్నారు. అద్దాల్లా ఉండాల్సిన రోడ్లు... గుంతలమయమై ప్రజలను ఎగతాళి చేస్తున్నాయి. అలాంటి గ్రామాల్లో రయ్... రయ్ మంటూ లగ్జరీ కార్లు తిరుగుతున్నాయి. పాత మోడల్ కార్ల కంటే ఇటీవల వచ్చిన లెటేస్టు కార్లు రరు మంటూ దూసుకొస్తున్నాయి. పేదల ఇండ్ల ముందు వచ్చి ఆగుతున్నాయి. ఒకవైపు లగ్జరీ కార్ల ఆగమనం... మరోవైపు బక్కచిక్కిన శరీరాలు, మాసిన బట్టలు, ఉపాధి కరువై ఆవేదనతో ఉన్న ప్రజలు. ఓటర్లను పచ్చని నోట్లు పలకరిస్తున్నాయి. ముక్క, చుక్కకు కొదవేలేదు. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ ప్రజలకు దిక్కెవరు. గ్రేటర్ హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గం పేరు వినడమేగానీ చూసింది లేదు. ఎలక్షన్ల వేళా పరిశీలన కోసం పోతే అడుగడుగునా ఇటువంటి సన్నివేశాలే సాక్షాత్కరిస్తున్నవి.
- గుడిగ రఘు